ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కార్మికుల సొమ్మును కాజేసిన పచ్చ నేతల అవినీతి బండారం బట్టబయలైంది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు పనులను నామినేషన్‌పై అప్పగించాలని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సిఫారసు లేఖ ఇచ్చినట్లు ఇప్పటికే విజిలెన్స్ విచారణలో వెలుగులోకి రావడం తెలిసిందే. అనంతరం కార్మిక శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి మంత్రి పితాని సత్యనారాయణకు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు తాజా లేఖలు వెల్లడిస్తున్నాయి. కార్మిక రాజ్య బీమా సంస్థ పరిధిలోని దాదాపు 12.5 లక్షల మంది కార్మికులు, 38 లక్షల మంది కుటుంబ సభ్యులు గత సర్కారు అవినీతి వ్యవహారాల వల్ల సరైన వైద్యం పొందలేకపోయారు.
ఆ ఇద్దరూ.. ఇష్టారాజ్యం
నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నామినేషన్‌పై పనులు కట్టబెట్టాలని లేఖలో సూచించగా అనంతరం ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన పితాని ఇష్టారాజ్యంగా చెల్లింపులు జరిపారు. ఈఎస్‌ఐ నిబంధనల ప్రకారం ముందు సరఫరా చేసిన వారికి ముందస్తు చెల్లింపులు చేయాలి. ఈమేరకు ఓ ఉన్నతాధికారి మెమో కూడా జారీ చేశారు. అయితే పితాని సత్యనారాయణ కార్మికశాఖ బాధ్యతలు చేపట్టగానే మరో మెమో ఇచ్చారు. 2017 నవంబర్ 28న అధికారులు ఇచ్చిన మెమోను అభయెన్స్‌లో పెడుతూ 2018 ఫిబ్రవరిలో మరో మెమో జారీ అయింది.
ఈఎస్‌ఐ ఉన్నతాధికారులకు అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు రాసిన లేఖ
పితాని తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపి కమీషన్లు అందుకున్నారని పేర్కొంటున్నారు. ఆయన కుమారుడు చిన్న కాగితం రాసిచ్చినా ఆర్డర్లు ఇచ్చారు. 2019లో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు జరిగిన చివరి కేబినెట్ సమావేశంలో 500కిపైగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ఫైలు పెట్టారు. దీనిపై ‘సాక్షి’లో కథనం వెలువడటంతో అప్పటి సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా ఈ ప్రతిపాదనను రద్దు చేశారు. ఐదేళ్లలో ఇద్దరు మంత్రులూ కార్మికుల కడుపుకొట్టారని, ఏ ఒక్కరికీ మెరుగైన వైద్యం అందలేదని ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న వైద్యులు పేర్కొంటున్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో పలువురు అధికారులు, సరఫరాదారులు, కాంట్రాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా అదే తరహా చర్యలు తప్పవనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది.
2017లో ముందు సరఫరా చేసిన వారికి ముందస్తు చెల్లింపులు చేయాలని ఇచ్చిన మెమోను నిలుపుదల చేస్తూ ఇష్టారాజ్యంగా చెల్లింపులు చేసుకోవచ్చంటూ అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని ఇచ్చిన మరో మెమో.
అచ్చెన్నకు కొత్త కాదు
అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో నీరు– చెట్టు పనులనూ తన అనుయాయులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, డిజైన్ లేకుండా చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. నీరు చెట్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన గట్టు కాలువ పొడవున రక్షణ గోడలు నిర్మించి నిధులు దుర్వినియోగం చేశారు. నాసిరకంగా కాంక్రీటు పనులు చేపట్టారు. కలెక్టర్‌తో నిమిత్తం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండానే అచ్చెన్నాయుడు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని నియమించేవారు.
ఈఎస్‌ఐలో ప్రధాని మోదీ చెప్పినట్టే చేశా: అచ్చెన్నాయుడు
ఈఎస్‌ఐలో నామినేషన్ కింద వర్క్ ఆర్డర్లు ఇచ్చే విషయంలో ప్రధాని మోదీ చెప్పినట్లే చేశామని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తన హయాంలో ఈఎస్‌ఐలో జరిగిన కుంభకోణంపై శుక్రవారం ఆయన వివరణ ఇచ్చారు. టెలి హెల్త్ సర్వీసెస్‌కి సంబంధించిన పనులను త్వరితగతిన చేపట్టాలన్న ప్రధాని సూచన మేరకు వ్యవహరించామని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. తొలుత తెలంగాణలో దీన్ని ప్రారంభించారని, అక్కడ మాదిరిగానే ఏపీలోనూ చేయాలని నోట్ పంపానన్నారు. నామినేషన్‌పై ఇవ్వడంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. కావాలంటే రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. అప్పటి రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయన్నారు.
సగటున 132 శాతం అధిక ధరకు కొనుగోలు
వైద్య పరికరాలు, ఔషధాలను బేరమాడి తక్కువకు కొనాల్సింది పోయి సగటున 132 శాతం అధికంగా చెల్లించి కొన్నారంటే నాటి మంత్రులు, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య ఎంత భారీ స్థాయిలో లావాదేవీలు నడిచాయో బోధపడుతోంది. 2017–18 మధ్య ఏకంగా 198.66 శాతం అధికంగా చెల్లించారు. ఆ ఏడాది కొన్ని మందుల వాస్తవ విలువ రూ.10.82 కోట్లు కాగా ఏకంగా రూ.32.31 కోట్లు వెచ్చించి కొన్నారు.
విజిలెన్స్ నివేదికలో ముఖ్యాంశాలు
- రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు రూ.293.51 కోట్ల విలువైన మందులకు రూ.698.36 కోట్లు చెల్లించారు.
- టెండర్లు లేకుండా నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వడంతో రూ.కోట్లలో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం.
- ల్యాబొరేటరీ పరికరాలను ఎలాంటి టెండరు లేకుండా లెజెండ్ అనే సంస్థకు ఇచ్చారు.
- శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా 129.32 శాతం అధిక రేట్లకు తమకు నచ్చిన కంపెనీకి ఇచ్చారు.
- ఫర్నీచర్ కొనుగోళ్లకు టెండర్లు లేకుండా రూ.6.62 కోట్లు చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70 శాతం అధికం.
- ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్స్ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో ఇ.రమేష్‌బాబు, కె.ధనలక్ష్మి తదితరులున్నారు
- రాశి ఫార్మా, వీరేష్ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ.15.93 కోట్లు చెల్లించారు.
- రూ.కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించుకోకుండా మూలన పడేశారు.
- జెర్సన్ ఎంటర్‌ప్రైజెస్ అనే బినామీ సంస్థకు ఈఎస్‌ఐ డైరెక్టర్ డా.సీకే రమేష్‌కుమార్ రూ.9.50 కోట్లు చెల్లించారు.
- రూ.16,992 విలువైన బయోమెట్రిక్ యంత్రాలను రూ.70,760 చొప్పున కొనుగోలు చేశారు. అవి ఎక్కడా పనిచేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment