అచ్చెన్నాయుడిని ఆస్పత్రికి తీసుకువస్తున్న పోలీసులు
సాక్షి, అమరావతి/గుంటూరు: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టైన కార్మిక శాఖ మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడుకు ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. శుక్రవారం ఆయనను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసి శనివారం తెల్లవారుజామున ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స చేయించుకున్న విషయాన్ని ఏసీబీ అధికారులు, ఆయన తరఫు న్యాయవాది ప్రస్తావించడంతో రిమాండ్ విధించిన న్యాయమూర్తి.. వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. దీంతో ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించి రిమాండ్ ఖైదీగా నమోదు చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ 1573 కేటాయించారు.
గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు
– జైలులో రిమాండ్ నమోదు ప్రక్రియ పూర్తయిన అనంతరం శనివారం ఉదయం అచ్చెన్నాయుడిని గుంటూరులోని ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి(జీజీహెచ్)కి వైద్య సేవల నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు.
– ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
– ఇన్ఫెక్షన్ పెద్దదైతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావొచ్చని చెప్పారు. 90 శాతం ఆయనకు మళ్లీ ఆపరేషన్ అవసరం ఉండదని స్పష్టం చేశారు. షుగర్ నార్మల్‌గానే ఉందని, బీపీకి మందులు కొనసాగిస్తున్నామని వివరించారు.
– ఇదిలావుంటే.. అచ్చెన్నాయుడు సోమవారం నాటికి కోలుకుని సబ్‌జైలుకు తరలించే అవకాశం ఉంటే.. విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరే అవకాశం ఉందని చెబుతున్నారు.
– అరెస్ట్ చేసిన వెంటనే అచ్చెన్నాయుడిని కోర్టుకు తరలించినందున ఈఎస్‌ఐ కుంభకోణంలో మరింత లోతైన విచారణ చేసే అవకాశం లేకపోయిందని, అందువల్ల మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని ఏసీబీని కోరనున్నట్టు సమాచారం.
చంద్రబాబుకు అనుమతి నిరాకరణ
అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుంటూరు వచ్చారు. అచ్చెన్నాయుడిని కలిసేందుకు మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని పోలీసులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. జైళ్ల శాఖ సైతం అనుమతి నిరాకరించింది. దీంతో చంద్రబాబు బయటి నుంచే అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఆ కుటుంబంపై బురద చల్లేందుకే..
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కుటుంబం అచ్చెన్నదని, ఆ కుటుంబంపై బురద చల్లేందుకే ఆయనను అరెస్ట్ చేశారని విమర్శించారు. పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని 24 గంటల్లో 500 కిలోమీటర్లు తిప్పడం వల్ల రక్తస్రావం అయ్యిందన్నారు. 300 మంది పోలీసులు అచ్చెన్నాయుడి ఇంటిని చుట్టుముట్టి ఉన్నపళంగా అరెస్ట్ చేసి తీసుకువచ్చారన్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు, విజిలెన్స్ రిపోర్టులతో అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రలోభాలకు గురిచేసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వశపర్చుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర, కొల్లు రవీంద్ర, ఇతర నాయకులు ఉన్నారు.
భౌతిక దూరం మరిచి...
అచ్చెన్నాయుడి పరామర్శ పేరుతో జీజీహెచ్‌కు వచ్చిన టీడీపీ నాయకులు భౌతిక దూరాన్ని మరిచారు. గుంపులు గుంపులుగా చంద్రబాబు చుట్టూ చేరారు. భౌతిక దూరం పాటించాలని పోలీసులు చెబుతున్నా పట్టించుకోకుండా గుమిగూడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో రోగులు, వ్యాధిగ్రస్తులు ఉండే జీజీహెచ్‌లోకి టీడీపీ నాయకులు గుంపులుగా రావడం, భౌతిక దూరం పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment