ఈఎస్‌ఐ వైద్య సేవలను విస్తరిస్తాం
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
తిరుపతి మెడికల్/సాక్షి, తిరుమల: రాష్ట్రంలో కార్మిక రాజ్యబీమా (ఈఎస్‌ఐ) ఆస్పత్రుల్లో వైద్యసేవలను విస్తరించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. తిరుపతిలో నిర్మిస్తున్న ఈఎస్‌ఐ వంద పడకల ఆస్పత్రి భవనాలను ఆది వారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జూలై నాటికి ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 6 బెడ్లు, 50 బెడ్లు, 100 బెడ్లతో కూడిన ఆస్పత్రుల్ని అందుబాటు లోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించనున్న డిస్పెన్సరీల్లో 15 రాయలసీమలో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో 85 లక్షలమంది సెక్యూరిటీ కార్మికు లకు కనీస వేతనాలివ్వాలని నోటిఫికేషన్ జా రీచేశామని, దీన్ని ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పారు. మహిళలకు 26 వారాలు ప్రసూతి సెలవులను మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
రుణ మాఫీ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే
అంతకుముందు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న బండారు దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల ప్రకారం రుణాలు మాఫీచేసే అధికారం, స్వేచ్ఛ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని చెప్పారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆ రాష్ట్రంలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందని, అందులో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదని పేర్కొన్నారు. అదే తరహాలోనే ఆంధ్ర ప్రదేశ్‌లోనూ రుణాలు మాఫీచేసే అధి కారం, స్వేచ్ఛ ఇక్కడి తెలుగుదేశం ప్రభు త్వానికి ఉంటుందన్నారు.