- టీఆర్‌ఎస్ కార్మిక విభాగం సదస్సులో హోం మంత్రి నాయిని
సాక్షి, హైదరాబాద్
భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐ సౌకర్యాన్ని కల్పించే యోచనలో వున్నట్లు రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ కార్మిక విభాగం (టీఆర్‌ఎస్‌కేవీ) నిర్విహంచిన తెలంగాణ భవన నిర్మాణ, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సదస్సు’లో నాయిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయని.. ప్రమాదాలకు గురైనా పట్టించుకోలేదన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని.. వీటిని కార్మికుల్లోకి తీసుకెళ్లాలని నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా వుంటుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని వివరిస్తూ.. కార్మికులు టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలన్నారు. సదస్సు అనంతరం టీఆర్‌ఎస్ కేవీ అనుబంధ భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర, గ్రేటర్ హైదరాబాద్ కమిటీలను ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నత్తి మైసయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎం.విజయకుమార్.. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడుగా కె.చెన్నయ్య, ప్రధాన కార్యదర్శిగా పల్లపు సత్యనారాయణ ఎన్నికయ్యారు. రాష్ట్ర సదస్సులో టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రూప్ సింగ్, నాయకులు రాంబాబు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పి.నారాయణ తదతరులు పాల్గొన్నారు.