
2024 నవంబర్‌లో చేరిక
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) నిర్వహించే బీమా పథకం ‘ఈఎస్‌ఐ’ కిందకు 2024 నవంబర్ నెలలో కొత్తగా 16.07 లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారు. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే ఒక శాతం అధికంగా సభ్యులు చేరినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్‌లో కొత్త సభ్యుల నమోదు 15.92 లక్షలుగా ఉంది.
ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో 20,212 సంస్థలు ఈఎస్‌ఐసీలో చేరాయి. తద్వారా ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఈఎస్‌ఐ రక్షణ లభించినట్టయింది. 16.07 లక్షల మందిలో 7.57 లక్షల మంది (47.11 శాతం) 25 ఏళ్లలోపు వయసున్నవారు కావడం గమనార్హం. 3.28 లక్షల మంది మహిళలు కాగా, 44 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా కొత్త సభ్యుల్లో భాగంగా ఉన్నారు.