Employees State Insurance Scheme
-
ఈఎస్ఐసీ కిందకు 11.82 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఈఎస్ఐసీ నిర్వహించే సామాజిక భద్రతా పథకం కింద అక్టోబర్ నెలలో కొత్తగా 11.82 లక్షల మంది సభ్యులుగా చేరారు. అక్టోబర్ నెలకు సంబంధించిన గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్సీ) విడుదల చేసింది. 2017 సెప్టెంబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు చేరిన మొత్తం సభ్యుల సంఖ్య 7.49 కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22)లో 1.49 కోట్ల మంది సభ్యులు చేరగా, అంతకుముందు 2020–21లో చేరిన సభ్యుల సంఖ్య 1.15 కోట్లుగాను, 2019–20లో 1.51 కోట్లు, 2018–19లో 1.49 కోట్ల చొప్పున కొత్త సభ్యులు భాగస్వాములు అయ్యారు. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్‌వో పథకాల్లో నెలవారీగా సభ్యుల చేరిక గణాంకాలను ఎన్ఎస్వో విడుదల చేస్తుంటుంది. అక్టోబర్ నెలలో ఈపీఎఫ్‌వోలో కొత్తగా 12.94 లక్షల మంది సభ్యులు చేరినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2017 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ఈపీఎఫ్‌వో కింద చేరిన కొత్త సభ్యులు 5.99 కోట్లుగా ఉన్నారు. -
ఈఎస్ఐసీ కిందకు 13.37 లక్షల మంది
న్యూఢిల్లీ: కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం కిందకు సెప్టెంబర్ నెలలో కొత్తగా 13.37 లక్షల మంది చేరారు. అంతక్రితం నెల ఆగస్ట్‌లో కొత్త సభ్యుల సంఖ్య 13.42 లక్షలుగా ఉండడం గమనార్హం. వ్యవస్థీకృత రంగంలో కొత్తగా ఉపాధి పొందిన వారి డేటాను ఈ రూపంలో తెలుసుకోవచ్చు. జాతీయ గణాంకా ల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో ఈఎస్ఐసీ కిందకు 10.76 లక్షల మంది నికరంగా చేరగా, మేలో 8.90 లక్షల మంది, జూన్‌లో 10.65 లక్షల మంది, జూలైలో 13.40 లక్షల మంది, ఆగస్ట్‌లో 13.42 లక్షల మంది చొప్పున నికరంగా చేరారు. కరోనా లాక్డౌన్లు సడలిపోవడంతో జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో ఎక్కువ మంది చేరినట్టు తెలుస్తోంది. 2020–21లో ఈఎస్ఐసీ కిందకు కొత్తగా 1.15 కోట్ల మంది సభ్యులు కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో కొత్తగా చేరిన వారి సంఖ్య 1.51 కోట్లుగా ఉంది. 2018–19లో 1.49 కోట్లు, 2017–18లో 83.85 లక్షల చొప్పున ఈఎస్ఐసీకి సభ్యులు జతయ్యారు. -
మెరుగుపడుతున్న ఉపాధి అవకాశాలు!
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి ప్రభావిత సవాళ్ల తర్వాత దేశంలో క్రమంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకంలో ఈ ఏడాది ఆగస్టులో స్థూలంగా 13.22 లక్షల మంది కొత్త సభ్యులు చేరారని తాజా గణాంకాలు వివరించయి. అయితే జూలైతో పోల్చితే (13.33 లక్షల మంది) ఈ సంఖ్య కొంచెం తక్కువ కావడం గమనార్హం. దేశంలో సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలకు సంబంధించి సోమవారం జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ)వెలువరించిన అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఈఎస్ఐసీలో ఏప్రిల్‌లో 10.74 లక్షలు, మేలో 8.88 లక్షలు, జూన్‌లో 10.62 లక్షలు, జూలైలో 13.33 లక్షల మంది కొత్తగా చేరారు. ► సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన ఆంక్షల సడలింపు సానుకూల ప్రభావం తాజా గణాంకాల్లో కనిపిస్తోంది. స్థిరరీతిన క్రమంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ► 2018–19లో కొత్త సబ్స్క్రైబర్ల సంఖ్య 1.49 కోట్లు. 2019–20లో ఈ సంఖ్య 1.51 కోట్లకు చేరింది. 2020–21లో కరోనా ప్రభావంతో 1.15 కోట్లకు పడిపోయింది. ► ఈఎస్ఐసీలో 2017 సెప్టెంబర్ నుంచి 2021 మధ్య 5.56 కోట్ల కొత్త చందాదారులు చేరారు. ► ఈఎస్ఐసీ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ద్వారా నిర్వహించబడుతున్న వివిధ సామాజిక భద్రతా పథకాల కొత్త చందాదారుల పేరోల్ డేటా ఆధారంగా ఎన్ఎస్ఓ నివేదికలు రూపొందిస్తుంది. 2017 సెప్టెంబర్ నుంచీ ప్రారంభమైన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ 2018 ఏప్రిల్ నుంచి ఈ గణాంకాలను ఎన్ఎస్ఓ విడుదల చేస్తోంది. ఈపీఎఫ్ఓకు సంబంధించి ఇలా... ఇదిలావుండగా నివేదిక ప్రకారం, రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఈపీఎఫ్ఓలో నికర కొత్త నమోదులు ఆగస్టులో 14.80 లక్షలు. జూలై 2021లో ఈ సంఖ్య 13.15 లక్షలు. 2017 సెప్టెంబర్ నుంచి 2021 ఆగస్టు మధ్య స్థూలంగా కొత్త చందాదారుల సంఖ్య 4.61 కోట్లు. -
ఈఎస్ఐ సభ్యులు నేరుగా ప్రైవేట్ ఆసుపత్రికెళ్లొచ్చు
న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ) సభ్యులు ఇకపై అత్యవసర పరిస్థితుల్లో తమ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి నేరుగా ఆరోగ్య సేవలు పొందవచ్చు. ఈ వెసులుబాటును సంస్థ యాజమాన్యం కల్పించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన ప్రకారం.. ఈఎస్ఐసీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు(లబ్ధిదారులు) తొలుత ఈఎస్ఐసీ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో చేరాల్సి ఉంటుంది. అక్కడి వైద్యుల సిఫార్సు మేరకు ప్రైవ్రేట్ హాస్పిటళ్లలో చేరొచ్చు. ఎమర్జెన్సీ కేసుల విషయంలో ఈఎస్ఐసీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండానే నేరుగా ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లి, సేవలు పొందవచ్చని టీయూసీసీ జనరల్ సెక్రెటరీ ఎస్.పి.తివారీ చెప్పారు. సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని వల్ల ఎంతోమంది లబ్ధిదారులకు మేలు జరుగుతుందని అన్నారు. గుండె పోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉంటుందన్నారు. -
స్వీయ ధ్రువీకరణతో చికిత్సకు పీఎఫ్ సొమ్ము
న్యూఢిల్లీ: వైద్య చికిత్సకు గాని, వైకల్య పరికరాల కొనుగోలుకు గాని పీఎఫ్ సొమ్ము తీసుకోవడానికి ఇకపై వైద్యుడి ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. ఇప్పటివరకూ తమకు, తమపై ఆధారపడ్డ వారి వ్యాధుల చికిత్స కోసం, వైకల్య పరికరాల కొనుగోలు కోసం ఈపీఎఫ్‌వో ఖాతా దారులు పీఎఫ్ అడ్వాన్సు తీసుకోవాలంటే ఉద్యోగ భవిష్యనిధి (ఈపీఎఫ్) పథకం 1952 ప్రకారం పలు పత్రాలు సమర్పిం చాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ పథకానికి సవరణ చేశారు. దీంతో ఇకపై కాంపోజిట్ ఫామ్‌పై స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) చేసి పీఎఫ్ సొమ్ము పొందవచ్చు. ఖాతాదారుడి ఆరు నెలల కనీస వేతనం, కరువు భత్యం లేదా, వడ్డీతో తన పీఎఫ్ వాటా లేదా, పరికరాల విలువ.. వీటిలో ఏది తక్కువుంటే ఆ మేరకే పీఎఫ్ సొమ్ము తీసుకోవచ్చు. అయితే వీరు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలను పొంది ఉండకూడదు. ‘ఈపీఎఫ్ 1952 పథకంలోని 68–జే, 68–ఎన్ క్లాజ్‌లను సవరించారు. దీని ప్రకారం ఖాతాదారులు తమ ఖాతాల నుంచి అడ్వాన్సు తీసుకోవచ్చు. దీన్ని తిరిగి చెల్లించనవసరం లేదు’ అని ఈపీఎఫ్‌వో అధికారి ఒకరు చెప్పారు.