స్వీయ ధ్రువీకరణతో చికిత్సకు పీఎఫ్ సొమ్ము
న్యూఢిల్లీ: వైద్య చికిత్సకు గాని, వైకల్య పరికరాల కొనుగోలుకు గాని పీఎఫ్ సొమ్ము తీసుకోవడానికి ఇకపై వైద్యుడి ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. ఇప్పటివరకూ తమకు, తమపై ఆధారపడ్డ వారి వ్యాధుల చికిత్స కోసం, వైకల్య పరికరాల కొనుగోలు కోసం ఈపీఎఫ్‌వో ఖాతా దారులు పీఎఫ్ అడ్వాన్సు తీసుకోవాలంటే ఉద్యోగ భవిష్యనిధి (ఈపీఎఫ్) పథకం 1952 ప్రకారం పలు పత్రాలు సమర్పిం చాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ పథకానికి సవరణ చేశారు. దీంతో ఇకపై కాంపోజిట్ ఫామ్‌పై స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) చేసి పీఎఫ్ సొమ్ము పొందవచ్చు.
ఖాతాదారుడి ఆరు నెలల కనీస వేతనం, కరువు భత్యం లేదా, వడ్డీతో తన పీఎఫ్ వాటా లేదా, పరికరాల విలువ.. వీటిలో ఏది తక్కువుంటే ఆ మేరకే పీఎఫ్ సొమ్ము తీసుకోవచ్చు. అయితే వీరు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలను పొంది ఉండకూడదు. ‘ఈపీఎఫ్ 1952 పథకంలోని 68–జే, 68–ఎన్ క్లాజ్‌లను సవరించారు. దీని ప్రకారం ఖాతాదారులు తమ ఖాతాల నుంచి అడ్వాన్సు తీసుకోవచ్చు. దీన్ని తిరిగి చెల్లించనవసరం లేదు’ అని ఈపీఎఫ్‌వో అధికారి ఒకరు చెప్పారు.