న్యూఢిల్లీ: కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం కిందకు సెప్టెంబర్ నెలలో కొత్తగా 13.37 లక్షల మంది చేరారు. అంతక్రితం నెల ఆగస్ట్‌లో కొత్త సభ్యుల సంఖ్య 13.42 లక్షలుగా ఉండడం గమనార్హం. వ్యవస్థీకృత రంగంలో కొత్తగా ఉపాధి పొందిన వారి డేటాను ఈ రూపంలో తెలుసుకోవచ్చు. జాతీయ గణాంకా ల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో ఈఎస్‌ఐసీ కిందకు 10.76 లక్షల మంది నికరంగా చేరగా, మేలో 8.90 లక్షల మంది, జూన్‌లో 10.65 లక్షల మంది, జూలైలో 13.40 లక్షల మంది, ఆగస్ట్‌లో 13.42 లక్షల మంది చొప్పున నికరంగా చేరారు. కరోనా లాక్‌డౌన్‌లు సడలిపోవడంతో జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో ఎక్కువ మంది చేరినట్టు తెలుస్తోంది. 2020–21లో ఈఎస్‌ఐసీ కిందకు కొత్తగా 1.15 కోట్ల మంది సభ్యులు కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో కొత్తగా చేరిన వారి సంఖ్య 1.51 కోట్లుగా ఉంది. 2018–19లో 1.49 కోట్లు, 2017–18లో 83.85 లక్షల చొప్పున ఈఎస్‌ఐసీకి సభ్యులు జతయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment