Insurance scheme
-
పేర్ల మార్పుపైనే ‘చంద్రన్న’ ఉత్సాహం!
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలను నీరుగార్చేసి పేదల పొట్టగొట్టిన కూటమి సర్కారు చివరకు బీమా పథకాల విషయంలోనూ నిర్దయగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటివరకు అమలులో ఉన్న వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమా పథకంగా పేరు మార్చేసింది. అయితే పేదలకు ఇంతవరకు బీమా మాత్రం కల్పించలేదు. రాష్ట్రంలో పేద కుటుంబాల్లో దురదృష్టవశాత్తూ కుటుంబ పెద్ద మరణిస్తే ప్రభుత్వమే ఆదుకుని ఆర్థిక సహాయం అందించేలా గత ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏటా పాలసీని రెన్యువల్ చేయాల్సి ఉండగా ఈ గడువు గత జూన్ నెలాఖరుతో ముగిసింది. కూటమి ప్రభుత్వం బీమా పాలసీని రెన్యువల్ / పునరుద్ధరణ చేయకపోవడంతో పేద కుటుంబాలకు గత నాలుగు నెలలుగా బీమా భరోసాకు దూరమయ్యాయి.విధివిధానాలెక్కడ?చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేసి సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణానికి రూ.10 లక్షల చొప్పున బీమా పరిహారం పెంచుతామంటూ ఎన్నికల ముందు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఈ హామీని టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. బీమా పరిహారం పెంపు సహా పథకం కొత్త విధివిధానాలను కార్మిక శాఖ రూపొందించాల్సి ఉండగా.. ఈ కార్యక్రమం సచివాలయాల పరిధిలో కొనసాగించాలా? లేదంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా అమలు చేయాలా? అనేది ఇంతవరకు తేలలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.81,568 కుటుంబాలకు రూ.876.72 కోట్లు..కుటుంబ పెద్ద సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు చనిపోయినా బీమా పరిహారం నేరుగా ఖాతాల్లో జమ అయ్యేలా వైఎస్సార్ బీమా పథకాన్ని గత ప్రభుత్వం రూపొందించింది. పేదల తరపున ప్రభుత్వమే పాలసీ డబ్బులు చెల్లించింది. మొత్తం 1.21 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకాన్ని వర్తింప చేసింది. 18 నుంచి 50 ఏళ్ల లోపు వారు సహజంగా మరణిస్తే రూ.లక్ష పరిహారం, 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు ప్రమాదంలో మరణించినా, అంగవైలక్యం సంభవించినా రూ.5 లక్షల వరకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంది. 2021 జూలై నుంచి 2024 మార్చి వరకు 81,568 కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ.876.72 కోట్ల మొత్తాన్ని పరిహారంగా అందజేసింది. గత మార్చిలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు 10,500 క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత నాలుగు నెలలుగా ఆయా కుటుంబాలకు చెల్లించాలి్సన దాదాపు రూ.210 కోట్లు బీమా పరిహారం బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. -
శబరిమల యాత్రికులకు బీమా.. కంపెనీల ఆసక్తి
శబరిమల ఆలయాన్ని సందర్శించే భక్తులకు బీమా కవరేజీని ప్రారంభించాలన్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రణాళికకు బీమా సంస్థల నుంచి సానుకూల స్పందన లభించింది. ఇటీవల కొన్ని బీమా కంపెనీలతో జరిగిన సమావేశాలు మార్కెట్ పై విలువైన అవగాహన కల్పించాయని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.పోటీ, నిష్పాక్షిక ప్రక్రియ ద్వారా బీమా ప్రొవైడర్‌ను ఎంపిక చేస్తామని, ఇందులో భాగంగా కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను (ఈఓఐ) ఆహ్వానించనున్నట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. తక్కువ ప్రీమియంతో గరిష్ట ప్రయోజనాలు అందించే సంస్థను ఎంపిక చేస్తామన్నారు.శబరిమల కొండపై నమోదవుతున్న మరణాల్లో ఎక్కువ శాతం గుండె ఆగిపోవడం, శ్వాసకోశ సమస్యలు వంటి ప్రమాదం కాని కారణాల వల్ల సంభవించినవేనని ఆయన పేర్కొన్నారు. గత సీజన్లోనే దాదాపు 55 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా యాత్రికులకు ప్రమాద మరణ బీమా కవరేజీని టీడీబీ కల్పిస్తోంది. అయితే, ప్రతి సంవత్సరం సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం ప్రమాదం కాని కారణాల వల్ల సంభవిస్తున్నాయి. దీంతో బాధిత కుటుంబాలకు పరిహారం అందడం లేదని ప్రశాంత్ చెప్పారు.గత యాత్రల సీజన్ వరకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ భాగస్వామ్యంతో యాత్రికులకు బీమా కవరేజీని అందించేవారు. పరిమిత ప్రయోజనాలను అందించే పథకానికి బోర్డు వార్షిక ప్రీమియం చెల్లించేది. దీని ద్వారా శబరిమల కొండపై ప్రమాదవశాత్తు మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించేవారు.గరిష్ట ప్రయోజనాలుశబరిమల భక్తులు వర్చువల్ క్యూ విధానం ద్వారా దర్శనం బుక్ చేసేటప్పుడు రూ.10 వరకు వన్ టైమ్ ప్రీమియం చెల్లించి కవరేజీని ఎంచుకునే కొత్త బీమా పథకాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రవేశపెట్టబోతోంది. ఈ కొత్త పథకం కింద సుమారు రూ.5 లక్షల బీమా సౌకర్యంతోపాటు మెరుగైన ప్రయోజనాలు కల్పించాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. -
సింగరేణి ఉద్యోగుల రూ.కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కీలకపాత్ర పోషించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో బీజేపీతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కు అయ్యి సింగరేణి సంస్థ భవిష్యత్‌ను ప్రశ్నార్ధకం చేశారని మండిపడ్డారు. తెలంగాణ సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘నేటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 7 లక్షల కోట్లు. ప్రతీ సంవత్సరం రూ. 70 వేల కోట్ల అప్పు కట్టాల్సిన ఆర్థిక సంక్షోభం కేసీఆర్ తీసుకొచ్చారు. పదేళ్ల లో అన్ని వ్యవస్థ లను విధ్వంసం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిసెంబర్ నుంచి అక్టోబర్ వరకు రైతు బంధు వేశారు. మేము మార్చి 31 లోపు పూర్తి చేస్తామని చెప్పాం. కేటీఆర్, హరీష్‌రావులు అబద్దాలతోనే ఇంకా మోసం చేస్తున్నారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవిత తప్ప ఇంకోకరు మాట్లాడడం లేదు. రోజు వారి ఆదాయాన్ని అంచనా వేసి చెల్లింపులు చేస్తున్నాం. ఉద్యోగ నియామకాలు చేపడుతే.. నియామకపత్రాలు ఎందుకు ఇవ్వలేదు. 70 రోజుల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మార్చి 6 న మరో 6 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ...అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్‌లు కుంగిపోయాక నీళ్లు ఎత్తిపోయడం సాధ్యమయ్యేపనేనా. కృష్ణా నది జలాలు ఎవరు కేంద్రానికి అప్పగించారో ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ ,బీజేపీ పదేళ్ల లో ఇచ్చిన హామీలు, మా గ్యారెంటీలపై అసెంబ్లీ సమావేశాలలో చర్చించేందుకు సిద్దమా. బీఆర్ఎస్ నేతల మాటలనే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు, సంవంత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల సంగతి ఏమైంది. రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిశాం. రాష్ట్ర బీజేపీ నేతలు ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు కలవడం లేదు. పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఢిల్లీలో కాల్చి చంపారు. హైదరాబాద్ వరదలు వస్తే కేంద్రం సహాయం ఎందుకు చేయలేదు. రేపు సాయంత్రం 500లకు గ్యాస్, పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును ప్రారంభించబోతున్నాం. బీజేపీ, బీఆర్ఎస్లకు రాజకీయ స్వార్థం ఉంది . ...రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ,రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్. మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. వడ్డీ కట్టడానికి అప్పు తేవాల్సిన పరిస్థితి ఉంది. నిరుద్యోగులకు విశ్వాసం కల్పించే ప్రయత్నం జరుగుతుంది. ప్రతీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. పోటీ పరిక్షలకు సిద్ధం అయ్యే వారికి డిజిటల్ క్లాసులు నిర్వహిస్తాం. వైట్ రేషన్ కార్డు ప్రమానికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైవేలకు, గుట్టలకు రైతు బంధు ఇచ్చారు. కేటీఆర్ ఔట్ సోర్సింగ్ పర్సన్’అని సీఏం రేవంత్‌రెడ్డి అన్నారు. -
ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ రెండు పథకాలు ఇక ఈజీగా..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) తమ కస్టమర్లకు చక్కని అవకాశాన్ని కల్పించింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పథకాలకు కస్టమర్లు తామంతట తామే ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ప్రకటిచించింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసుకున్న వ్యక్తి ఆకస్మికంగా మరణించిన సందర్భంలో పాలసీదారు కుటుంబానికి రూ. 2,00,000 లభిస్తాయి.ఇది ప్యూర్-టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాబట్టి ఎలాంటి మెచ్యూరిటీ లేదా సరెండర్ ప్రయోజనాన్ని అందించదు. ఇక ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అనేది ప్రమాద బీమా పథకం. ఇది ప్రమాదవశాత్తు మరణం, ప్రమాదం కారణంగా వైకల్యం కలిగినప్పుడు ప్రయోజనం అందిస్తుంది. ఇది ప్రాథమికంగా ఒక సంవత్సరానికి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవచ్చు. అర్హులైన పౌరులందరికీ బీమా కవరేజీని విస్తరించడం, ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత కల్పించడం అనే విస్తృత జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఈ డిజిటల్ ఎన్రోల్మెంట్ ఉంటుందని ఎస్బీఐ బ్యాంక్ పేర్కొంది. స్వీయ-చందా మార్గంలో కస్టమర్లు బ్రాంచ్ లేదా కస్టమర్ సర్వీస్ పాయింట్‌ను సందర్శించకుండానే వారి సౌలభ్యం మేరకు ఆన్లైన్లోనే ఈ స్కీమ్‌ల కింద నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో నమోదు చేసుకునేటప్పుడు కస్టమర్లు తమ ఖాతా నంబర్, పుట్టిన తేదీని జన్ సురక్ష పోర్టల్‌లో ఎంటర్ చేయాలి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను వారి ప్రాధాన్య బ్యాంక్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దశలను పూర్తి చేసి ప్రీమియం చెల్లించిన వెంటనే ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. -
బ్యాంకుల్లో రూ.5 లక్షల బీమాపై అవగాహన అవసరం
ముంబై: డిపాజిట్ బీమా పథకం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఆగస్టు 31లోగా తమ వెబ్సైట్లు అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్లలో తన లోగో, క్యూఆర్ కోడ్‌ను ప్రముఖంగా ప్రదర్శించాలని ఆర్బీఐ అనుబంధ విభాగం– డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) అన్ని బ్యాంకులను కోరింది. బ్యాంకుల్లో రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు డీఐసీజీసీ ద్వారా బీమా కవరేజ్ ఉంటుంది. ఈ బీమా పథకం వాణిజ్య బ్యాంకులుసహా లోకల్ ఏరియా బ్యాంకులు (ఎల్ఏబీ), చెల్లింపుల బ్యాంకులు (పీబీ), చిన్న ఆర్థిక బ్యాంకులు (ఎస్ఎఫ్బీ), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) సహకార బ్యాంకులలో డిపాజిట్లకు వర్తిస్తుంది. ఆర్బీఐ సంప్రదింపులతో తాజా సూచనలు చేస్తున్నట్లు డీఐసీజీసీ సర్కులర్ వివరించింది. ఎందుకంటే... ► చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో, బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసాన్ని పటిష్టం చేయడంలో, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో డిపాజిట్ బీమా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించింది. ► లోగో, క్యూర్ కోడ్ ప్రదర్శన వల్ల డీఐసీజీసీ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పరిధిలోకి వచ్చే బ్యాంకులను కస్టమర్ సులభంగా గుర్తించడానికి వీలవుతుందని, అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సమాచారం సకాలంలో వారు పొందగలుగుతారని తెలిపింది. బీమా కవరేజ్ బ్యాంకులు 2,027 డీఐసీజీసీ నమోదిత బీమా బ్యాంకుల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 2,027. ఇందులో 140 వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. 43 ఆర్ఆర్బీలు, రెండు ఎల్ఏబీలు, ఆరు పీబీలు, 12 ఎస్ఎఫ్బీలు, 1,887 సహకార బ్యాంకులు కూడా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలోని బ్యాంకుల్లో డిపాజిట్ బీమా ప్రస్తుత పరిమితి రూ. 5 లక్షలు. ఇందుకు సంబంధించి కవరవుతున్న ఖాతాల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 294.5 కోట్లు. బీమా కవరవుతున్న డిపాజిట్ల విలువ రూ.83,89,470 కోట్లు. -
పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ పొరపాటు చేస్తే రూ.7 లక్షలు పోయినట్లే!
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మూడు పథకాల్ని ఖాతాదారులకు అందిస్తుంది. వాటిలో ఒకటి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ స్కీమ్ 1995 (ఈపీఎస్), ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, వీటిలో ఈడీఎల్ఐ పథకంలో భాగంగా ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాదారుడు మరణిస్తే సదరు ఉద్యోగి నామినీకి రూ.7 లక్షల వరకు ప్రయోజనాల్ని అందిస్తుంది. ఇవి పొందాలంటే ఈ- నామినేషన్ తప్పనిసరి. ఎంప్లాయీ బెనిఫిట్స్ ప్రాక్టీస్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ డైరెక్టర్, ఆనంద్ రాఠీ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అమ్జద్ ఖాన్ మాట్లాడుతూ, ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు బీమా రక్షణగా ఈపీఎఫ్ అందించే ప్రయోజనాల్లో ఇది ఒకటి. ఉద్యోగుల కోసం 1976లో ప్రారంభించిన ఈ పథకం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 1952 కింద కవర్ చేయబడిన అన్ని సంస్థలు డిఫాల్ట్‌గా ఈడీఎల్ఐ ప్రయోజనాల కోసం నమోదు చేసుకుంటాయని అన్నారు. ఇక, ఈపీఎస్, ఈపీఎఫ్ స్కీమ్‌లలో ఉద్యోగి కొంత మొత్తాన్ని చెల్లిస్తుండగా.. ఈడీఎల్ఐలో మాత్రం ఉద్యోగి తరుపున యాజమాన్యం చెల్లిస్తుంది. ఈ ప్రయోజనాన్ని ఉద్యోగులు పొందాలంటే ఏదైనా సంస్థలో ఏడాది పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఏడాదిలోపు ఉద్యోగులు ఈ స్కీమ్‌లో అనర్హులు. మరింత సమాచారం కోసం సంబంధిత ఈపీఎఫ్‌వో కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. క్లెయిమ్ ప్రాసెస్ : ఉద్యోగి అకాల మరణంతో నామినీలు తప్పనిసరిగా పీఎఫ్ , పెన్షన్ విత్ డ్రాయిల్, ఈడీఎల్ఐలను క్లెయిమ్ ఫారమ్ ద్వారా క్లెయిమ్ చేయాలి. నామినీ తప్పనిసరిగా ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, వారసత్వ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. తప్పని సరిగా బ్లాంక్ చెక్‌లు సైతం అందుబాటులో ఉంచుకోవాలి. చదవండి : ఆకాశంలో ఉండగా.. ఎయిరిండియా విమానంలో కలకలం -
దిగులు తొలగిస్తూ.. ధీమానిస్తూ!
కర్నూలు(అగ్రికల్చర్): అకస్మాత్తుగా జరిగిన ప్రమాదాలు.. ఊహించని విపత్తులు.. పేద కుటుంబాలను శోకసంద్రంలోకి నెడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణంతో ఆయా కుటుంబాల్లో నైరాశ్యం నెలకొంటోంది. అప్పటి వరకు సాఫీగా సాగిన జీవితం తలకిందులవుతోంది. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువులు సైతం ఆగిపోతున్నాయి. పేదల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తూ వారిలో దిగులును తొలగిస్తోంది. ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత అందిస్తూ ధీమా నింపుతోంది. రూపాయి కూడా ప్రీమియం లేకుండా.. రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో ఒకరికి (ఇంటి యజమానికి) రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తోంది. కర్నూలు జిల్లాలో 5,05,094 కుటుంబాలకు, నంద్యాల జిల్లాలో 4,13,498 కుటుంబాలకు వైఎస్సార్ బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. బీమా ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, ప్రమాదంలో రెండు కాళ్లు లేదంటే రెండు చేతులు పోతే రూ.5 లక్షలు, ఒక కాలు, ఒక చేయిపోతే రూ.2.50 లక్షలు, సాధారణంగా మరణిస్తే రూ.లక్ష ప్రకారం పరిహారం లభిస్తుంది. 18 నుంచి 70 ఏళ్లలోపు వారికి ప్రమాద బీమా, 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి సహజ మరణం బీమా వర్తిస్తుంది. ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకొని క్లయిమ్‌లను పరిష్కరిస్తారు. సహజ మరణానికి పరిహారం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అసంఘటిత రంగంలోని రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ప్రీమియం లేకుండా వైఎస్సార్ బీమా సదుపాయం కల్పించడం విశేషం. సహజ మరణం పొందినా, ప్రమాదశాత్తూ మరణించినా వెంటనే సంబంధిత సచివాలంలోని వెల్ఫేర్ అసిస్టెంటుకు సమాచారం ఇస్తే 24 గంటల్లోపు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లిస్తారు. గడువులోపు పరిహారం.. వైఎస్సార్ బీమా కింద క్లయిమ్‌ల పరిష్కారానికి ప్రత్యేక షెడ్యూలు ఉంది. దీని ప్రకారం సహజ మరణం క్లయిమ్‌లను 24 రోజులు, ప్రమాద మరణం క్లయిమ్‌లను 65 రోజుల్లోను పరిష్కరిస్తున్నారు. సచివాలయం స్థాయిలో జరిగే డాక్యుమెంటేషన్‌ను అనుసరించి క్లయిమ్‌లు పరిష్కారం అవుతాయి. సహజ, ప్రమాద మరణాలకు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంటు డాక్యుమెంటేషన్ పూర్తి చేసి కలెక్టరేట్లోని డీఆర్డీఏ– వైకేపీలోని వైఎస్ఆర్ బీమా కాల్ సెంటర్‌కు పంపాల్సి ఉంది. కాల్ సెంటరులో బీమా డీపీఎం, డీఆర్డీఏ–వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్లు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే ఆమోదించి పరిహారం చెల్లింపు కోసం జీఎస్డబ్ల్యూస్ డిపార్టుమెంట్‌కు పంపుతారు. సహజ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రమాద మరణాలకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. సత్వర సాంత్వన వైఎస్సార్ బీమా పరిహారం ప్రొసీడింగ్స్ అందుకుంటున్న ఈమె పేరు జెల్లి జయమ్మ. ఆదోని మండలం ఆరేకల్ గ్రామానికి చెందిన ఈమె భర్త జెల్లి రాఘవేంద్ర ప్రమాదవశాత్తూ్త 2022 సెప్టెంబరు 6వ తేదీన మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరికి వైఎస్సార్ బీమా అండగా నిలిచింది. నాలుగు నెలల్లోనే 2022 డిసెంబరు 1న రాఘవేంద్ర భార్య జెల్లి జయమ్మకు రూ.5 లక్షల పరిహారం మంజూరైంది. సత్వర స్వాంతన చేకూర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని జయమ్మ తెలిపారు. బాధిత కుటుంబానికి ఊరట ఈ చిత్రంలో కనిపించే మహిళ పేరు నాగేశ్వరమ్మ, కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని మాసామసీదు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈమె భర్త కురువ నాగరాజు ప్రమాదవశాత్తు 2022 ఆగస్టు 10న మృతి చెందాడు. ఇద్దరు కుమారుల పోషణ కష్టంగా ఉన్న తరుణంలో ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా ద్వారా చేయూత ఇచ్చింది. నాగేశ్వరమ్మకు రూ. 5 లక్షల పరిహారం లభించింది. పకడ్బందీగా బీమా పథకం అమలు వైఎస్సార్ బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. సచివాలయంలో ఎంత త్వరగా డాక్యుమెంటేషన్ పూర్తి చేసి పంపితే అంత త్వరగా క్లయిమ్ పరిష్కారం అవుతుంది. రైస్ కార్డు కలిగిన కుటుంబాలన్నిటికీ వైఎస్సార్ బీమా లభిస్తుంది. కర్నూలు జిల్లాలో 5 లక్షలకుపైగా కుటుంబాలకు వైఎస్సార్ బీమా సదుపాయం ఉంది. – వెంకటసుబ్బయ్య, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ–వైకేపీ లక్షలాది పేద కుటుంబాలకు భరోసా జాప్యం లేకుండా క్లయిమ్‌లు పరిష్కారమవుతుండడంతో ఆయా కుటుంబాలకు భరోసా లభిస్తోంది. 2021–22లో వైఎస్సార్ బీమా కింద 1,398 కుటుంబాలకు భరోసా దక్కింది. 2022–23లో కర్నూలు జిల్లాలో సహజ మరణం పొందిన 496 కుటుంబాలకు రూ.4.82 కోట్లు, నంద్యాల జిల్లాలో 477 కుటుంబాలకు రూ.4.60 కోట్లు పరిహారం లభించింది. 30 క్లయిమ్‌లకు పరిహారం చెల్లించే ప్రక్రియ ప్రాసెస్‌లో ఉంది. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో ప్రమాద మరణాల క్లయిమ్‌లు 80 రిజిష్టర్ కాగా 35 పరిష్కారం అయ్యాయి. నంద్యాల జిల్లాలో ప్రమాద మరణాల క్లయిమ్‌లు 76 రిజిష్టర్ కాగా 23 పరిష్కారం అయ్యాయి. మిగిలినవి ప్రాసెస్‌లో ఉన్నాయి. -
మత్స్యకారులకూ రూ. 5 లక్షల బీమా కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: రైతుల మాదిరిగానే మత్స్యకారులకూ రూ.5లక్షల బీమా పథకం అమలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత్స్యకారు(ముదిరాజ్)లను బీసీ–ఏలో చేరుస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో ఫిషరీ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వివిధ సామాజిక వర్గాల వారు ఆత్మగౌరవంతో బతకాలని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, కానీ ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో కులవృత్తులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. చేప పిల్లల పంపిణీని ప్రభుత్వం.. ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగిస్తోందని, తెలంగాణలోని మత్స్యకార సంఘాలు చేప పిల్లల పంపిణీకి పనికిరావా? అని ప్రశ్నించారు. నాసిరకం చేప పిల్లలు పంపిణీ చేసి పేదలను దోచుకుంటున్నారని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల సంక్షేమాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ చేపపిల్లల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమేనని, తమ హయాంలో మత్స్యకార సంఘాల ద్వారా డిపార్ట్మెంట్ నుంచే పంపిణీ జరిగేదని గుర్తు చేశారు. ప్రచారం చేసుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదని, కానీ టీఆర్ఎస్ అన్నీ తానే తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూప రూపకర్త పద్మశ్రీ ఎక్కా యాదగిరిరావుని ప్రభుత్వం మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలు ఎక్కా యాదగిరిరావును పిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి పాల్గొన్నారు. -
సొంతంగా పంటల బీమా పథకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే ఇక్కడ కూడా బీమా పథకాన్ని అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ఆ రాష్ట్రానికి అధికారుల బృందాన్ని పంపించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పథకం అమలుకావడంలేదు. దీంతో పంట నష్టం జరిగినా రైతులకు ఎలాంటి పరిహారం అందని పరిస్థితి నెలకొంది. ప్రకృతి విపత్తులతో రైతులు వేల కోట్ల రూపాయల పంటలను నష్టపోవడం.. రైతులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ సొంత పంటల బీమాను ప్రవేశపెట్టడంపై దృష్టిసారించింది. రైతుబంధుతోనే సరి.. రాష్ట్రంలో రైతుబంధు కింద రైతులకు ఆర్థిక సాయం అందుతున్న విషయం తెలిసిందే. ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతులకు ప్రభుత్వం సాయం చేస్తోంది. అందువల్ల ప్రత్యేకంగా పంట నష్టపరిహారం అవసరంలేదన్న భావన వ్యవసాయ శాఖ వర్గాల్లో నెలకొంది. కానీ ఈ వైఖరిపై రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా, కేంద్ర ప్రభుత్వ పథకంలో గ్రామాన్ని యూనిట్‌గా కాకుండా మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో పెద్దగా ప్రయోజనం లేదన్న భావన నెలకొంది. వడగండ్లు, పెనుగాలులకు పంట నష్టపోతే తక్షణం 25 శాతం పరిహారం ఇవ్వాలనే నిబంధనను ప్రైవేటు బీమా కంపెనీలు అమలుచేయక పోవడం, అధిక సంఖ్యలో రైతులకు పరిహారం అందేలా కేంద్ర పథకం లేదన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం దాని నుంచి బయటకు వచ్చింది. ఈ తరుణంలో పశ్చిమబెంగాల్లో అమలు చేస్తున్న పథకంతో ఎక్కువ మందికి పరిహారం అందుతోందని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో బెంగాల్ తరహాలో పంటల బీమా పథకం అమలుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. మూడేళ్లుగా బెంగాల్లో సొంత బీమా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో మార్పులు చేసి బంగ్లా సస్య బీమా యోజన (బీఎస్బీ) పేరుతో సొంత పథకం తీసుకొచ్చింది. మూడేళ్లుగా దీనిని అమలు చేస్తోంది. బెంగాల్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆలుగడ్డ, చెరకు పంట విలువలో 4.85 శాతాన్ని ప్రీమియంగా రైతుల నుంచి వసూలు చేస్తుండగా, ఆహార ధాన్యాలు, వంట నూనెలకు సంబంధించిన పంటలకు రైతుల తరఫున పూర్తి ప్రీమియంను బెంగాల్ ప్రభుత్వమే భరిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ తరహాలో రాష్ట్రంలో కూడా సొంతంగా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోనూ బెంగాల్ తరహాలో పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు సూచించింది. -
బోలెడు బెనిఫిట్స్‌తో ఎల్ఐసీ కొత్త పాలసీ!
హైదరాబాద్: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్తగా ‘ధన్ వర్ష’ బీమా ప్లాన్‌ను (ప్లాన్ నంబర్ 866) ప్రవేశపెట్టింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని), నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్‌పాలసీ అని ఎల్ఐసీ ప్రకటించింది. జీవిత బీమా రక్షణ, పొదుపులను ఈ ప్లాన్‌లో భాగంగా ఆఫర్ చేస్తోంది. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే కుటుంబానికి పరిహారం చెల్లిస్తుంది. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే ఏక మొత్తంలో హామీ మేరకు చెల్లిస్తుంది. ఈ ప్లాన్ 2023 మార్చి వరకే అందుబాటులో ఉంటుంది. 10, 15 ఏళ్ల కాలాన్ని పాలసీ టర్మ్‌గా ఎంపిక చేసుకోవచ్చు. కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.1.25 లక్షలు కాగా, గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. 3 ఏళ్ల వయసున్న చిన్నారి వయసు నుంచి ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్‌లో ఏటా గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఈ ప్లాన్‌కు అనుబంధంగా తీసుకునేందుకు ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ అందుబాటులో ఉన్నాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
కరోనా పోరు: కేంద్రం మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి అధికమౌతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బాధితులకు సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఉద్దేశించిన రూ. 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌ను మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో సెప్టెంబర్ వరకు కోవిడ్ వారియర్స్‌కు బీమా కవరేజీ ఉంటుంది. 22 లక్షల వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఈ బీమా వర్తించనుంది. కాగా, ఈ ఇన్సూరెన్స్‌ను న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ద్వారా అందిస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ మొదలైన గత మార్చి నుంచి ఈ బీమాను వర్తింపజేస్తున్నారు. (చదవండి: రెండో దశ మానవ పరీక్షలు షురూ..) జూన్ 30న ఈ బీమా గడువు ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ దవాఖానలు, హెల్త్ కేర్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లలోని సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్‌కేర్ వర్కర్లు, ఆశ కార్యకర్తలు, శానిటేషన్ వర్కర్లకు ఈ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే వెల్లడించారు. కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బందికి కూడా ఈ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. (చదవండి: ధీటుగా బదులివ్వండి.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ!) -
ఆరోగ్య సిబ్బంది బీమా నిబంధనలు ఇవే..
న్యూఢిల్లీ : లాక్డౌన్ సమయంలో దేశంలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల, పారా మెడికల్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు రూ. 50 లక్షల ఆరోగ్య బీమా ప్రకటించింది. తాజాగా ఆదివారం ఇందుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. కరోనా పేషెంట్లకు నేరుగా సేవలు అందిస్తున్న, వారి బాధ్యతలు పర్యవేక్షిస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో సహా 22.12 లక్షల మంది పబ్లిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్లకు ఈ బీమా వర్తించనుంది. వారు విధుల నిర్వర్తించే క్రమంలో.. ప్రమాదవశాత్తు కరోనా సోకితే ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంటుందని కేంద్రం తెలిపింది. మొత్తం 90 రోజుల పాటు ఈ బీమా అమల్లో ఉండనుందని.. దీని కింద రూ. 50 లక్షలు అందజేయనున్నట్టు చెప్పింది. అలాగే అసాధారణ పరిస్థితుల్లో కరోనా సంబంధింత సేవలు అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల ఉద్యోగులు, రాష్ట్రాలు నియమించుకున్న అవుట్ సోర్స్ సిబ్బందితో పాటు పలు విభాగాలకు ఈ బీమా వర్తించనున్నట్టు పేర్కొంది. అయితే వీరి సంఖ్య కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచనలకు లోబడి ఉంటుందని వెల్లడించింది. ఈ బీమా పొందే లబ్ధిదారులు.. ఇతర ఇన్సురెన్స్ పాలసీ చేయించుకుని ఉంటే వాటిని కూడా పొందవచ్చని తెలిపింది. -
43 లక్షల మందికి ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 43 లక్షల మందికి సాయం అందించామని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతు భరోసా పథకానికి కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవడానికి మరో నెల పొడిగించామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మార్కెటింగ్ సీజన్ ప్రారంభం అయ్యిందని, పత్తి కొనుగోలుకు సీసీఏ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వేరుశనగకు కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ విషయంలో నిరంతరం సమీక్ష చేస్తున్నామన్నారు. పొలంబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామన్నారు. అపరాల బోర్డు ఏర్పాటు చేయబోతున్నామని.. వాటికి కూడా గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన గుడ్లు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారని.. దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో నేరుగా రైతులే పాల్గొనేందుకు చర్యలు చేపడతామన్నారు. బయో ప్రొడక్ట్స్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, దానిపై కూడా చర్యలు చేపట్టేందుకు చర్చిస్తామన్నారు. కౌలు రైతుల విషయంలో రికార్డుల సమస్యలు ఉన్నాయని..వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎంవీఎస్ నాగిరెడ్డి వెల్లడించారు. -
బీమా.. రైతుకు వరం
సాక్షి, కొల్లాపూర్ : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతుల పాలిట వరం లాంటిదని, సన్న, చిన్నకారు రైతులు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారు. గతేడాది ఒక గుంట పట్టా ఉన్న ప్రతి రైతుకు ప్రమాదవశాత్తూ గానీ, సహజంగా మరణించిన రైతులకు బీమా కల్పిస్తూ రైతు కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని రైతులు అంటున్నారు. డిసెంబర్ నుంచి నేటి వరకు ఎంతోమంది రైతులు సహజంగా మరణించారు.వారికి రూ.5లక్షల బీమాను అందజేశారు. షరతులు లేకుండానే ఖాతాలో జమ కొల్లాపూర్ మండల పరిధిలోని చింతలపల్లి, రామాపురం, ముకిడిగుండం, కల్వకోల్, నర్సింగాపురం, నర్సింగరావుపల్లి, ఎన్మన్‌బెట్ల, సింగోటం, చుక్కాయిపల్లి, చెంచుగూడెం, ఎల్లూరు, మొలచింతలపల్లి తదితర గ్రామాలలో మృతిచెందిన రైతు కుటుంబాలకు ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.5లక్షల బీమా బాధిత కుటుంబాల ఖాతాలో జమ చేశారు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి షరతులు లేకుండా బీమాను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. 16 కుటుంబాలకు అందిన బీమా బీమా ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16మంది రైతులు చనిపోయారు. వారందరికీ బీమా డబ్బులు వారి కుటుంబాలకు అందాయి. ఇప్పటి వరకు మృతి చెందిన రైతులు చింతలపల్లిలో చంద్రశేఖర్‌రావు, కుర్మయ్య, రామాపురంలో నాగపురం శ్రీనివాస్, ముకిడిగుండంలో బీమిని బిచ్చన్న, పాత్లావత్ పేట్లానాయక్, లౌడ్యా తిరుపతి, మొలచింతలపల్లిలో శ్రీవాణి బాలమ్మ, చెంచుగూడెంలో మండ్ల ఈశ్వరమ్మ, ఎల్లూరులో బండారి పార్వతమ్మ, సింగోటంలో వాకిటి నర్సింహ, ఎన్మన్‌బెట్లలో మండ్ల చిట్టెమ్మ, నర్సింగరావుపల్లిలో పుల్లాసి శాంతయ్య, నలుపోతుల నాగేంద్రం, చుక్కాయిపల్లిలో చవ్వ రాముడు, చెంచుగూడెంలో మండ్ల ఈశ్వరమ్మ, కల్వకోల్‌లో పెబ్బేటి కుర్మయ్య అనే రైతులు చనిపోయారు. వారి వారి కుటుంబాలకు రైతు బీమా పథకం పూర్తిగా వర్తించి వారికి ప్రభుత్వం అందజేస్తున్న బీమా డబ్బులు అందాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్లయిమ్ రైతులందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడలేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఈవిధంగానే రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తే శాశ్వతంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందని అంటున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో మృతి చెందిన రైతుకు సంబంధించిన ఎల్ఐసీ బాండ్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నఖలు ఇస్తే ఇచ్చిన నెల రోజుల్లోనే తమ కుటుంబీకుల ఖాతాలో రూ.5లక్షలు జమ అయ్యాయన్నారు. నెలలోపే ఖాతాలో డబ్బు జమ చెంచు గూడెంకు చెందిన రైతు ఈశ్వరమ్మ మృతి చెందింది. నెలరోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకంలో భాగంగా రూ.5లక్షలను జమ చేసింది. రైతు బీమా మాకు అందడం ఎంతో ఆసరా అయ్యాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడూ మరువం. – హన్మంతు, చెంచుగూడెం రైతు -
రైతుకు వరం.. బీమా
సాక్షి,మాడుగులపల్లి : వ్యవసాయమే జీవనాధారమైన రైతులకుటుంబాలకు అండగా నిలువాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం వారికి వరంలా మారింది. రైతులు చనిపోయిన తరువాత వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో రూ.5లక్షల బీమా డబ్బును అందజేస్తుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి రూ.638 కోట్ల రూపాయలను రైతుల పేరుమీద ఎల్ఐసి సంస్థలో జమ చేస్తుంది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఏవిధంగా చనిపోయినా వారి కుటుంబానికి ఆసరాగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా కలిపిస్తుంది. బీమా సంస్థకు ఒక్కోరైతు పేర 2271 రూపాయల చొప్పున సంవత్సరానికి ప్రీమియం చెల్లించడంతో రైతులు ఏకారణం చేతనైనా మరణిస్తే రూ. 5లక్షలు నగదు 10రోజుల్లో నామిని ఖాతాలో జమవుతున్నాయి. 2018 ఆగస్టు14 న ప్రవేశ పెట్టిన ఈ పథకం 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల అందరికీ వర్తిస్తుంది. మృతి చెందిన వెంటనే వివరాల సేకరణ రైతు మృతి చెందిన వెంటనే సంబంధిత పరిధిలోని వ్యవసాయ అధికారులు రైతు వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపుతున్నారు. మొదట వ్యవసాయ విస్తరణ అ«ధికారి సదరు రైతు మృతి చెందిన విషయాన్ని వ్యవసాయ అధికారికి అందజేస్తే రైతు బ్యాంకు ఖాతా నంబర్, నామిని వివరాలను రైతు బీమా యాప్‌లో అప్ లోడ్ చేస్తారు. మండల వ్యవసాయ అధికారి వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వెళ్తాయి. వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకొని నేరుగా మరణించిన రైతుకు సంబంధిచిన బీమా ఫైల్‌ను వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులకు చేరవేస్తారు. అక్కడ నుంచి ఎల్ఐసీ కార్యాలయానికి రైతు వివరాలు వెళ్తాయి. ఈ కార్యక్రమం రైతు చనిపోయిన ఒకటి రెండు రోజులలోనే పూర్తవుతుంది. అనంతరం పదిరోజులలోపే నేరుగా నామిని ఖాతాలో డుబ్బలు జమవుతున్నాయి. లబ్ధి పొందిన కుటుం బాలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొంటున్నాయి. నామినీ ఖాతాలో నగదు జమ.. మండలంలో సుమారు 5,530 మంది రైతులు రైతు బీమాకు అర్హులు అవుతున్నారని వ్యవసాయ అధికారులు గుర్తించారు.మండలంలో 21 మంది రైతులు మృతి చెందినట్టు వ్యవసాయ అధికారులు గుర్తించి వారి నామినీ ఖాతాలకు రూ.1.05 కోటి ఐదు లక్షలను జమచేశారు. -
సాగు సంబురం
సాక్షి, హైదరాబాద్ : ‘‘ఇంతకాలం రైతులు మొగులుకు ముఖం పెట్టి చూసేవారు. తెలంగాణ రైతుకు ఇక ఆ కష్టం దూరమైతది. వచ్చే సంవత్సరం జూన్ తర్వాత కాళేశ్వరంతో అనుసంధానం ఏర్పడగానే చెరువులు 365 రోజులు నీటితో కళకళలాడుతై. అవి ఎండకుండా నింపుతనే ఉంటం. అప్పుడు రోహిణి కార్తెలనే నాట్లేస్తం. రోహిణికి ముందొచ్చే కృత్తిక కార్తెలనే మొక్కజొన్న విత్తనాలేస్తం. ఈ అద్భుత దృశ్యాన్ని చల్లగా బతికి కళ్లారా చూడాలనుకుంటున్న..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అటెండరైనా సరే ఉద్యోగితో పెళ్లి సంబంధానికి ఒప్పుకుంటున్నోళ్లు రైతు అనగానే ముఖం తిప్పుకుంటున్నారని, ఈ దుస్థితిని మారుస్తామని ఉద్ఘాటించారు. రైతులు మంచి ఆదాయంతో కాలు మీద కాలు వేసుకుని కూర్చునే పరిస్థితి కల్పిస్తామని చెప్పారు. ‘‘నాణ్యమైన కరెంటు ఇస్తున్నం. నీటి వసతి కల్పిస్తున్నం. అప్పు చేయకుండా పెట్టుబడి సాయం చేస్తున్నం. మెరుగైన సాగుకు రాయితీతో యంత్రాలు సమకూరుస్తున్నం. పంట చేతికొచ్చాక మద్దతు ధర అందేలా చూస్తం. ఇప్పటిదాకా వైకుంఠపాళిలో పెద్దపాము మింగిన తరహాలో నష్టపోతున్న రైతుల బాధలు దూరం చేసేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకొస్తే కొందరు ఈకలు తోకలు పీకే ప్రయత్నం చేస్తున్నరు’’అని విమర్శించారు. టీఆర్ఎస్ను ఎలా ఎదుర్కోవాలో తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో రైతుబంధు, జీవిత బీమా పథకాలపై అవగాహన సదస్సు జరిగింది. ఇందులో రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయకర్తలు, మండల సమన్వయ కర్తలు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల జీవిత బీమా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. సదస్సును ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. రైతు కష్టాలు దూరం చేసేందుకు తమ ప్రభుత్వం నడుం బిగించి, మంచిరోజులు తెచ్చిందన్నారు. ‘‘రెప్పపాటు సేపు కూడా కరెంటు పోవటం లేదు. ఇక మోటార్లు కాలిపోయే పరిస్థితి ఎక్కడిది? అందుకే తెలంగాణలో మోటార్ల మరమ్మతు కేంద్రాలు, జనరేటర్ కేంద్రాలు దివాలా తీసినై. వాటి నిర్వాహకులను వేరే ఉపాధి వెతుక్కోమని చెప్పినం’’అని అన్నారు. సరైన సాగు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం క్రాప్ కాలనీలను ఏర్పాటు చేస్తోందని, ఆ ప్రాంత నేల స్వభావం, వాతావరణ పరిస్థితి, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పంటలు వేయాలో శాస్త్రవేత్తలు సూచిస్తారని, వాటినే సాగు చేయాలని పేర్కొన్నారు. ఒకే రకమైన పంట వేసి రైతుకు రైతే పోటీ అయ్యే పరిస్థితిని నివారించాలన్నారు. డిమాండ్ ఉన్నవాటిని గుర్తించి ఆ పంటలే వేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతులు అనుసరిస్తున్న సొంత మార్కెట్ కమిటీ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ఆ తరహాలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని, అవసరమైతే దాన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖలో ఓ పోస్టును, సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. పంటలకు దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌పై సర్వే చేసి రైతులకు సూచనలిచ్చే బాధ్యత ఆ అధికారి ఆధ్వర్యంలోని బృందానిదేనని చెప్పారు. ఉపాయంతో వ్యవసాయం చేయాలి పాత పద్ధతులు వదిలేసి సాగును యాంత్రీకరించేందుకు నడుం బిగించామని సీఎం చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ సమీపంలోని వీఎన్ఆర్ షీట్స్ ఆధ్వర్యంలో క్లస్టర్ల నిర్వహణ బాగా ఉందని, దాన్ని తాను స్వయంగా పరిశీలించానని చెప్పారు. ఆ తరహాలో యాంత్రీకరణకు అవకాశం కల్పిస్తామని, పంట అమ్మడం కూడా నియంత్రిత విధానంలో ఉండాలని పేర్కొన్నారు. ‘‘నిత్యం ఆ క్లస్టర్ పరిధిలోని మూడు నాలుగు ఊళ్ల నుంచి మాత్రమే ధాన్యం మార్కెట్‌కు వస్తది. కొద్దిసేపట్లో విక్రయం పూర్తయి రైతు డబ్బు జేబులో పెట్టుకుని ఇంటికి పోయే పరిస్థితి ఉంటుంది. ఇలా క్రమ పద్ధతిలో రావాలంటే ఏ గ్రామంలో ఏ పంట వేశారో, ఎప్పుడు మార్కెట్‌కు తెచ్చే అవకాశం ఉందో సమాచారం అంతా సిద్ధంగా ఉండాలి. పట్టణాలకు చేరువగా కూరగాయల సాగు చేస్తే రైతులు ధనవంతులు అవుతారు. ధాన్యం ఎక్కువగా వచ్చి మార్కెట్లో వ్యాపారులు ధర తగ్గిస్తే రైతులు అమ్మొద్దు. ఇలా జరిగితే ఆ విషయాన్ని రైతు సమన్వయ సమితి చైర్మన్ దృష్టికి తేవాలి. ఈ సంఘటితత్వంతో వ్యాపారులే దిగొచ్చి ధర పెట్టేందుకు సిద్ధపడతారు. ఇలా ఉపాయంతో వ్యవసాయం చేసి దేశంలో తెలంగాణ రైతు తెలివైనోడనే పేరు సంపాదించాలి’’అని సూచించారు. కౌలు రైతులకు ‘రైతు బంధు’ఇవ్వం రైతుబంధు పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులకు ఇవ్వబోమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఆ సాయం పొందుతున్నవారిలో 92 శాతం ఐదాకరాలున్న సాధారణ రైతులేనని, 54 లక్షల మంది రైతుల్లో 18 లక్షల మంది ఒక ఎకరం పొలం ఉన్నవారేనని పేర్కొన్నారు. ఇప్పటికి రూ.5 వేల కోట్లు డ్రా చేసుకున్నారని, ఇందులో రూ.4,956 కోట్లు సాధారణ రైతులే పొందారని, ధనవంతులైన పెద్ద రైతుల సంఖ్య అత్యల్పమని, వారిలో కొందరు ఆ సాయాన్ని వెనక్కు ఇచ్చేస్తున్నారని వివరించారు. ఇలా వెనక్కు వచ్చిన మొత్తం కూడా తిరిగి రైతుకే ఉపయోపడేలా రైతు సమన్వయ సమితి వద్దే ఉంచుతామని స్పష్టం చేశారు. ‘‘కొందరు అనారోగ్యం లాంటి కారణాలతో ఓ సంవత్సరం కౌలుకు ఇస్తారు. ఆ తర్వాత మరొకరికి ఇస్తారు. తర్వాత సొంతంగా చేసుకుంటరు. ఇలాంటప్పుడు ఏ కౌలు రైతును గుర్తిస్తం. ఈ వివరాలు తెలుసుకునుడే సర్కారు పనా?’’అని సీఎం అన్నారు. కొందరు పేరుకు పెద్ద రైతులైనా సరైన సాగు లేక వారూ అప్పుల్లోనే ఉన్నారంటూ, ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్‌కు చెందిన 60 ఎకరాల రైతు తనను కలిసి తీరును వివరించారు. అతను హైదరాబాద్‌లో కూలీ పని చేసుకున్నట్టు పేర్కొన్నారు. కొందరు నేతలు కౌలు రైతులకు సాయం చేయడం లేదని విమర్శిస్తున్నారని, వారికి సాయం సాధ్యం కాదని స్పష్టంచేశారు. అద్దె భవనాల్లో ఉండే కిరాయిదారులకు వాటిని రాసివ్వగలుతారా అని ప్రశ్నించారు. రామ, రావణ యుద్ధంలో అర్ధాయుష్షుతో చనిపోయిన రాక్షసులు ఈ జన్మలో ప్రజలను పీక్కుతినే నేతలుగా పుట్టారని, వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ నవ్వులు పూయించారు. కమతాల ఏకీకరణ జరగాలి రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలో ఒకే వ్యక్తికి ఉన్న కమతాలు ఒకేచోటకి చేరేలా చూడాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రైతులు పరస్పరం మాట్లాడుకుని ఆ భూముల »బదలాయింపుతో కమతాలను ఒకేచోటకు మార్చుకోవాలని సూచించారు. పంట దిగుబడి అధికంగా వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థ అవసరమని, ఇందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాలని సూచించారు. రెండేళ్ల కాలంలో వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత వరకు సేంద్రియ పద్ధతులు, పచ్చిరొట్టె వాడకాన్ని ప్రోత్సహించాలని, ఫాస్పేట్ వాడకం తగ్గించాలని సూచించారు. ఎల్ఐసీతో అతిపెద్ద డీల్ అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీతో రైతు బీమా ఒప్పందం చేసుకోవటం ద్వారా దాని పరిధిలో ఇప్పుడు అతిపెద్ద బీమా గ్రూపుగా నిలిచినట్టు ముఖ్యమంత్రి అన్నారు. క్లెయిమ్ చేసిన 10 రోజుల్లో బీమా మొత్తాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎల్ఐసీ చైర్మన్ శర్మ సమక్షంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి–ఎల్ఐసీ ఆర్ఎం శాస్త్రిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రైతు శ్రేయస్సు కోసం రైతుబంధు వంటి గొప్ప పథకం ప్రారంభించిన నేత దేశంలో కేసీఆర్ ఒక్కరేనని ఎల్ఐసీ చైర్మన్ శర్మ కితాబిచ్చారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని పేర్కొన్నారు. రైతుబంధు పథకం చెక్కులు బ్యాంకులో వేశాక నగదు కొరత సాకు చూపితే ఆర్బీఐ ముందు మంత్రులతో కలిసి నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించానని, ఆ భయంతో బ్యాంకర్లు రైతులకు వెంటనే డబ్బులిస్తున్నారని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఆగస్టు 15 నుంచి బీమా అమల్లోకి వస్తున్నందున ఆ లోపే తప్పుల్లేకుండా రైతుల వివరాలు, నామినీ పేరు, సెల్ నంబర్‌తో సహా అందించే బాధ్యత మండల వ్యవసాయ విస్తరణాధికారులదేనని చెప్పారు. సహజ మరణం అయినా 10 రోజుల్లో రూ.5 లక్షల బీమా సొమ్ము రైతు కుటుంబానికి అందుతుందని, డెత్ సర్టిఫికెట్ ఇస్తే చాలని పేర్కొన్నారు. ఇక నుంచి గ్రామపంచాయితీ కార్యాలయాల్లో కూడా మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
మూడు పంటలకు గ్రామం యూనిట్‌గా బీమా
మార్గదర్శకాలతో నోటిఫికేషన్ జారీ చేసిన వ్యవసాయ శాఖ సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్)ను రాష్ట్రంలో అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు పథకాలు సమ్మిళితం చేసి రూపొందించిన ఏకీకృత ప్యాకేజీ బీమా పథకం (యూపీఐఎస్)ను మాత్రం ఈసారి నిజామాబాద్ జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఖరీఫ్‌లో గ్రామం, మండలం యూనిట్‌గా పంటల బీమా అమలు చేస్తారు. ఫసల్ బీమా యోజనను వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, వేరుశనగ (సాగునీటి వసతి ఉన్న ప్రాంతం), వేరుశనగ (సాగునీటి వసతి లేని ప్రాంతం), సోయాబీన్, పసుపు, మిరప (సాగునీటి వసతి ఉన్న), మిరప (సాగునీటి వసతిలేని) పంటలకు వర్తింపజేస్తారు. కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వరిని.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మొక్కజొన్నను.. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్‌ను నోటిఫై చేసి గ్రామం యూనిట్‌గా బీమా సౌకర్యం కల్పించారు. ఫసల్ బీమా యోజనను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ), బజాజ్ అలయంజ్ జీఏసీ లిమిటెడ్ అమలుచేస్తాయి. వాతావరణ ఆథారిత బీమాను రిలయెన్స్ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జీఐసీ లిమిటెడ్‌లు అమలుచేస్తాయి. బీమా అమలుకు రాష్ట్రంలో మూడు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఫసల్ బీమాను మొదటి క్లస్లర్లోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా మూడో క్లస్టర్‌లోని ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వ్యవసాయ బీమా కంపెనీ అమలు చేస్తుంది. రెండో క్లస్టర్‌లోని వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బజాజ్ అలయంజ్ జీఐసీ లిమిటెడ్ అమలు చేయనుంది. వాతావరణ బీమాను మొదటి క్లస్టర్లో రిలయెన్స్, రెండు, మూడు క్లస్టర్లలో ఎస్బీఐ జీఐసీలు అమలు చేస్తాయి. జిల్లాల వారీగా ప్రీమియం ఫసల్ బీమా యోజన కింద వ రి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము, సోయాబీన్, కంది పంటలకు సంబంధించి బీమా మొత్తంలో గరిష్టంగా 2 శాతం ప్రీమియం చెల్లించాలి. మిరప, పసుపు పంటలకు 5 శాతం గరిష్ట ప్రీమియం చెల్లించాలి. బీమా మొత్తం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు సమానంగా ఉంటుంది. ఆ ప్రకారం బీమా మొత్తం, ప్రీమియం చెల్లింపులు జిల్లా జిల్లాకు వేర్వేరుగా ఉంటాయి. ఇక వాతావరణ ఆధారిత పంటల బీమా కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పత్తికి బీమా వర్తింపజేస్తారు. మిరపకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో.. పామాయిల్‌కు ఖమ్మం, బత్తాయికి నల్లగొండ జిల్లాలో బీమా అమలు చేస్తారు. మిరప పంట హెక్టారుకు రూ.85 వేలు, పత్తికి రూ.60 వేలు, పామాయిల్‌కు రూ.70 వేలు, బత్తాయికి రూ.70 వేలుగా బీమా మొత్తాన్ని నిర్ధారించారు. వీటికి బీమా మొత్తంలో గరిష్టంగా 5 శాతం ప్రీమియం చెల్లించాలి. ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లింపునకు జూలై 31 ఆఖరు తేదీ. వరదలు, తీవ్ర కరువు, వర్షాల మధ్య అంతరం తదితర కారణాల వల్ల పంటలు నష్టపోతే సీజన్ మధ్యలోనే తక్షణంగా 50 శాతంలోపు బీమా సొమ్ము చెల్లిస్తారు. వడగళ్లు వచ్చినప్పుడు రైతు యూనిట్‌గా బీమా అమలు చేస్తారు. వ్యక్తిగత ప్రమాద బీమా కూడా.. ఇక ఏకీకృత ప్యాకేజీ బీమా పథకం (యూపీఐఎస్)ను పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ జిల్లాలో అమలుచేస్తారు. ఇందులో వ్యక్తిగత ప్రమాద బీమా అవకాశాన్ని కల్పించారు. రైతులు రూ.12 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాదంలో ఆ రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 2 లక్షల బీమా సొమ్ము అందుతుంది. పూర్తిగా గాయాలపాలై ఒక కన్ను పోవడం, రెండు చేతులు పోగొట్టుకోవడం, కాళ్లు విరగడం వంటివి సంభవించినా రూ.2 లక్షలు అందజేస్తారు. పాక్షికంగా గాయాలపాలైతే రూ.లక్ష చెల్లిస్తారు. ఇక సెక్షన్ మూడు ప్రకారం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)ను వర్తింపజేస్తారు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న రైతులకు వర్తిస్తుంది. దీనికి రూ.330 ప్రీమియంగా చెల్లించాలి. సంబంధిత రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. ఇక సెక్షన్ నాలుగు ప్రకారం బిల్డింగ్, కంటెంట్స్ ఇన్సూరెన్స్ పథకం, సెక్షన్ ఐదు ప్రకారం 10 హెచ్‌పీ వరకున్న వ్యవసాయ పంపుసెట్లకు బీమా అమలు చేస్తారు. సెక్షన్ ఆరు ప్రకారం విద్యార్థి భద్రత బీమా, సెక్షన్ ఏడులో ట్రాక్టర్ బీమా పథకాలు ఉన్నాయి. -
80 లక్షల మంది కస్టమర్లకు బీమా: టెలినార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ ఇటీవల ప్రవేశపెట్టిన ‘సురక్ష’ బీమా పథకానికి మంచి స్పందన లభిస్తోంది. ఆరు సర్కిళ్లలో 1.8 కోట్ల మంది కస్టమర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, సుమారు 80 లక్షల మంది బీమా రక్షణ పొందారని కంపెనీ వెల్లడించింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 20 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 50 శాతం మంది బీమా కవరేజ్ పొందారని టెలినార్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. టెలినార్ సురక్ష కింద కస్టమర్లకు రూ.50 వేల వరకు బీమా కవరేజ్ ఇస్తున్నట్టు చెప్పారు. బీమా కోసం వినియోగదార్లు ఎటువంటి ప్రీమియం చెల్లించక్కర లేదు. ఒక నెలలో చేసిన రిచార్జ్ మొత్తానికి రూ.50 వేలకు మించకుండా తదుపరి నెలకు 100 రెట్లు కవరేజ్ ఉంటుంది. ఉదాహరణకు జనవరిలో మొత్తం రూ.200 రిచార్జ్ చేసిన వినియోగదారుడికి ఫిబ్రవరిలో రూ.20 వేల బీమా కవరేజ్ ఇస్తారు. ఒక నెలలో కనీసం రూ.40 రిచార్జ్ చేయాలి. క్లెయిమ్‌ను వారం లోపే పరిష్కరిస్తారు. కస్టమర్ మృతి చెందితే మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ గుర్తింపు కార్డు, సిమ్ కార్డుతో కంపెనీని సంప్రదించాలి. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక కస్టమర్ చనిపోతే ఆయన కుటుంబానికి రూ.50 వేల చెక్కును కంపెనీ అందజేసింది. దేశవ్యాప్తంగా కంపెనీ చందాదారుల సంఖ్య 5 కోట్లకుపైమాటే. -
ఇవన్నీ చూశాకే జీవిత బీమా..
పట్టణీకరణ వేగంగా జరుగుతుండటంతో సామాన్యుల జీవన ప్రమాణాలు గణనీయంగా మారుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే యువత పనివేళలు, ఆహారపు అలవాట్లు మారడమే కాకుండా వృత్తిపరంగా విపరీతమైన ఒత్తిడిని ఎదర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికి జీవిత బీమా రక్షణ అనేది తప్పనిసరిగా మారింది. మనపై ఆధారపడి జీవించే వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇందుకోసం అనేక బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో దేన్ని ఎంచుకోవాలన్నదే అసలు సమస్య. ప్రతీ బీమా పథకంలో ఉండే లాభ నష్టాలను పరిశీలించడం కష్టమే. కానీ పాలసీ తీసుకునేటప్పుడు కనీసం ఈ ఐదు అంశాలను పరిశీలిస్తే ఆ పాలసీకి మన అవసరాలను తీర్చే శక్తి ఉందా లేదా అన్న విషయంపై స్పష్టత వస్తుంది. జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు తప్పకుండా పరిశీలించాల్సిన అంశాలు ఇవీ.. ఇప్పుడు అనేక బీమా పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఒక పథకంతో మరో పథకానికి పోలిక ఉండదు. కాబట్టి తీసుకునే పాలసీ మీ ఆర్థిక లక్ష్యాలు, ఇతర అవసరాలను తీర్చే విధంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించడం అత్యంత ప్రధానం. అలాగే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు బీమా రక్షణ ఉండే విధంగా చూసుకోండి. బీమా రక్షణ ఎంత కావాలన్న విషయం పరిశీలించేటప్పుడు అప్పటికే ఏమైనా వ్యాధులు ఉంటే వాటిని, అలాగే రుణాలు ఉంటే వాటి మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. కంపెనీ చరిత్ర... పాలసీని ఎంచుకున్న తర్వాత ఆ కంపెనీ చరిత్రను పరిశీలించండి. ఆ కంపెనీ ప్రమోటర్లు, వారి చరిత్రతో పాటు, బీమా కంపెనీ పనితీరును కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఈ వివరాలు ఆన్లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ బీమా కంపెనీ సర్వీసులు ఏ విధంగా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏ విధంగా ఉంది, పాలసీదారుల సమస్యలకు ఎలా స్పందిస్తోంది. ఆ కంపెనీ సేవలపై ఏమైనా ఫిర్యాదులున్నాయా వంటివి చూడండి. క్లెయిమ్స్ ఎలా ఉన్నాయి?... ఒక కంపెనీని ఎంచుకునేటప్పుటు క్లెయిమ్ రేషియో కూడా చాలా ముఖ్యం. వచ్చిన క్లెయిమ్స్‌లో ఎన్నింటిని పరిష్కరించింది, ఎన్నింటిని తిరస్కరించిందన్నది క్లెయిమ్ రేషియో తెలుపుతుంది. క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ పనితీరు బాగుందని లెక్క. మీరు కచ్చితమైన సమాచారం ఇస్తే క్లెయిమ్స్ తిరస్కరించే అవకాశం ఉండదు. ఈ విషయంలో మన నియంత్రణ సంస్థలు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఫండ్ పనితీరు కూడా.. ఒక వేళ మీరు యులిప్ పాలసీని తీసుకుంటే కనుక ఆ పథకంలోని ఫండ్స్ పనితీరును కూడా పరిశీలించండి. మీ రిస్క్ సామర్థ్యం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు అన్ని బీమా కంపెనీలు ఎన్ఏవీలను వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. ఇందులో మంచి పనితీరు కనపరుస్తున్న ఫండ్‌ను మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఎంచుకోండి. పాలసీని అర్థం చేసుకోండి.. ఒకసారి పాలసీని ఎంచుకున్న తర్వాత ఆ పథకంలోని ఇతర ఫీచర్స్‌ను పరిశీలించండి. పాలసీ కాలపరిమితి, ప్రీమియం ఎంత కాలం చెల్లించాలి, మెచ్యూర్టీ తేదీ, మధ్యలో ఏమైనా ఇతర చార్జీలను చెల్లించాల్సి ఉంటుందా అన్న విషయాలను అడిగి తెలుసుకోండి. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత రెండో ఆలోచన వస్తే కనుక పాలసీని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రతీ బీమా కంపెనీ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత 15 రోజుల ‘ఫ్రీ లుక్ పీరియడ్’ను ఇస్తాయి. తీసుకున్న పాలసీ నచ్చకపోతే 15 రోజుల్లోగా రద్దు చేసుకుంటే మీ ప్రీమియం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. - అంజలి మల్హోత్రా చీఫ్ కస్టమర్, మార్కెటింగ్ ఆఫీసర్, అవైవా లైఫ్ -
బీమా పథకాలతో పేదలకు భద్రత
జాతీయ బీమా, పెన్షన్ పథకాల ప్రారంభసభలో సీఎం చంద్రబాబు జన్‌ధన్ యోజన అత్యుత్తమ పథకం: కేంద్రమంత్రి పారికర్ విజయవాడ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మూడు పథకాలు ప్రధానమంత్రి జీవన్ సురక్షా యోజన, జీవన్‌జ్యోతి యోజన, అటల్ పెన్షన్ పథకాలతోపాటు రాష్ట్రంలో డ్రైవర్ల బీమా పథకం అసంఘటిత రంగ కార్మికులు, పేదలకు ఎంతో మేలు చేస్తాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎవరైనా ప్రమాదవశాత్తూ చనిపోయినప్పుడు ఈ పథకాలతో వారి కుటుంబానికి రూ.9 లక్షలు వస్తుందని చెప్పారు. శనివారం సాయంత్రం కోల్‌కతాలో ప్రధానమంత్రి మోదీ ఈ పథకాలను ప్రారంభిస్తున్న సమయంలోనే రాష్ట్రంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అటల్ పెన్షన్ యోజన ద్వారా పేదలు, కార్మికులు, డ్వాక్రా మహిళలు కూడా పెన్షన్ పొందవచ్చని చెప్పారు. కేంద్ర మంత్రి పారికర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఎన్డీఏ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందన్నారు. కేంద్ర అత్యుత్తమ పథకాల్లో జన్‌ధన్ యోజన ఒకటని చెప్పారు. ప్రధాని ప్రసంగాన్ని ఇక్కడి నుంచే సీఎం, కేంద్ర మంత్రి వీక్షించారు. ఎప్పుడూ వ్యతిరేక వార్తలు రాసే మీడియా ఇలాంటి అనుకూల వార్తలు కూడా రాయాలని సమావేశం చివర్లో చంద్రబాబు సూచించారు. కార్యక్రమంలో మంత్రులు డి.ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఆంధ్రా బ్యాంక్ ఈడీ ఎస్ కర్లా, నాబార్డు సీజీఎం,ఆర్బీఐ ఏజీఎం పాల్గొన్నారు. చంద్రబాబుతో ఎమ్మెల్సీ ఆశావహుల భేటీ శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న పలువురు టీడీపీ నేతలు సీఎం, పార్టీ అధ్యక్షుడు చం ద్రబాబుతో శనివారమిక్కడ భేటీ అయ్యారు. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ విన్నవించారు. అయితే, బాబు వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. భూమి ఇస్తే మరో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తాం: టాటా గ్రూప్ ప్రతినిధులు హైదరాబాద్: నిజాంపట్నం లేదా కావలిలో 1,750 ఎకరాల భూమిని కేటాయిస్తే ఆరు వేల మెగావాట్ల సామర్థ్యంతో మరో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వద్ద టాటా గ్రూప్ ప్రతినిధులు ప్రతిపాదించగా కావలి పరిసర ప్రాంతాల్లో భూమిని కేటాయించే అంశాన్ని పరిశీలి స్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు ఆఫీసులో చంద్రబాబుతో అటామిక్ ఎనర్జీ చైర్మన్ ఆర్కే సిన్హా, టాటా గ్రూప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. కొవ్వాడ వద్ద నిర్మిస్తోన్న అణు విద్యుదుత్పత్తి కేంద్రం పనుల పురోగతిపై చర్చించారు. ఏపీ సీం చంద్రబాబుపై కేసు నమోదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై హైదరాబాద్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఏపీలోని కాకినాడ, రాజమండ్రి బహిరంగసభల్లో చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని జనార్దన్‌గౌడ్ అనే న్యాయవాది రంగారెడ్డి కోర్టులో రెండురోజుల క్రితం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబుపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
భరోసా.. కాదు భయం
కడప అగ్రికల్చర్: రైతుకు ధీమా ఇవ్వాల్సిన పంటల బీమా పథకం వివిధ కారణాలతో రైతుకు అందని ద్రాక్ష సామెతలా తయూరైంది. ఎప్పటికప్పుడు ఊరిస్తుందే కాని ఆ పథకం ప్రయోజనాలు రైతుకు దక్కుతున్నది అంతంత మాత్రమే. ఈ ఏడు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో బీమా రైతు చేజారిపోయేలానే ఉంది. అటు ఖరీఫ్‌లోను, ఇటు రబీలోను ప్రధాన పంటలకు జాతీయ వ్యవసాయాధారిత పంటల బీమాను అమలు చేస్తున్నా, దానికి సంబందించి ప్రీమియం చెల్లించే ప్రకటనలు సకాలంలో వెలువడక పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. రెండు సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోక పోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఏటా రబీలో అక్టోబరు నెలలో సాగు చేసే పంటలకు బీమా ప్రీమియం రైతులు చెల్లించేందుకు జాతీయ వ్యవసాయాధారిత పంటల బీమా కంపెనీ అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్రంలో ఉన్న బీమా కంపెనీ శాఖకు ఉత్తర్వులు పంపుతుంది. కానీ పంటల సాగు చేసి నెలరోజలు గడచినా ఇంతవరకు ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటించపోవడంతో పథకం అందే పరిస్థితి కనిపించడంలేదు. జిల్లాలో ఈ రబీలో రైతులు వ్యవసాయాధారంగా బుడ్డశనగ, పొద్దుతిరుగుడు, ధనియాలు, జొన్న, మొక్కజొన్న, పత్తి పంటలతో పాటు పలు రకాల పంటలను సాగు చేశారు. ఈ పంటలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకనో, పురుగుల వల్లనో చలిమంచు అధికంగా కురచడం వల్లనో ఏదో రక ంగా పంట దెబ్బతింటే అందుకు తగ్గ పరిహారం చెల్లించేలా పంటల బీమా అమలులో ఉంది. కానీ రెండు సంవత్సరాలు ఈ బీమా ఉన్నా... లేనట్లేనని రైతులు, రైతు సంఘాలు దుయ్యబడుతున్నాయి. రబీ పంటలు సాగు చేసి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రబీలో పంటలను సాగు చేసిన రైతులు నేరుగా బ్యాంకుల ద్వారా ప్రీమియంను కంపెనీకి చెల్లిస్తారు. పంట దెబ్బతిన్న తరుణంలో రైతులు మండల వ్యవసాయాధికారికి, మండలంలోని గణాంక అధికారికి పిర్యాదు చేస్తే వారు పంటను పరిశీలించి బీమా కంపెనీకి తగిన ఫోటోలు తీసి కంపెనీకి పంపుతారు. దాని ఆధారంగా పంటల బీమా వస్తుంది. కానీ దీనికి సంబందించి విధి విధానాలనే ఇంతవరకు కంపెనీ ప్రకటించలేదు. దీనిపై ప్రభుత్వం కూడా ఏ మాత్రం పట్టించుకోలేదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ రబీలో బుడ్డశనగ సాధారణ సాగు 88964 హెక్టార్లకుగాను, 44612 హెక్టార్లలో సాగైంది. అలాగే పొద్దుతిరుగుడు సాధారణ సాగు 41816 హెక్టార్లకుగాను 3935 హెక్టార్లలో సాగైంది. ఈ పంటలకు బీమా చేసుకునేందుకు అవకాశం ఉంది. గత ఏడాది తీవ్రంగా నష్టపోయిన రైతులు...: గత ఏడాది ఈ సీజన్లో పంట సాగు చేసిన నెలన్నరకు బీమా చేసుకోండని ప్రకటన జారీ చేశారు. అయితే రైతులు పంటసాగు విస్తీర్ణ పత్రాలు, 1-బి, టెన్ ఒన్ అడంగల్‌ను వీఆర్ఏల నుంచి రాయించుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. ఆన్లైన్ సౌకర్యాలు ఉన్నా సమయం తక్కువగా ఉండడంతో మారుమూల గ్రామాల నుంచి రైతులు జిల్లా సరిహద్దుల వరకు పోయి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించే రోజుకు పొలంపై పంట నెలరోజుల లోపు మాత్రమే ఉండాలి. బీమా కంపెనీకి ప్రీమియాన్ని రైతు చెల్లించవచ్చంటూ ఆలస్యంగా ప్రకటన జారీ చేసింది. దీంతో రైతులు అవకాశం వచ్చిందని జిల్లాలో మొత్తం 27825 మంది రైతులు 2,11,14,658 రూపాయలు బీమా కంపెనీకి తమ వాటాగా చెల్లించారు. అయితే ఆలస్యంగా చెల్లించారని, పంట సాగు చేసి నెలన్నర దాటిందని కంపెనీ నిబందనలు ఒప్పుకోవని చావుకబురు పంపడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు. ఇందులో పంటకు సరైన సమయంలో 66 మంది రైతులు రూ.51,240ల ప్రీమియం చెల్లించారని వారే అర్హులని తేల్చి చెప్పింది. దీంతో రైతులకు బీమా కంపెనీపై ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆందోళనలకు దిగిన ఫలితం లేకుండా పోయింది. దీనిపై ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఇప్పటికి దుయ్యబడుతున్నారు. పంట బీమా ప్రీమియం చెల్లించాలని ఎదురు చూస్తున్నాం... శనగ పంటను సాగు చేశాం. పంటల బీమా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అధికారులు ఇంత వరకు చెప్పలేదు. పంటకు నష్టం వచ్చినప్పుడు ఆదుకుంటుందని ఆశిస్తున్నా, ఇప్పటికీ ఏమీ చెప్పలేదు. ఏప్పుడు చెబుతారో ఏం తెలియకుండాది. -ఏకాంబరం,బుడ్ఢశనగ రైతు, చిన్న పసుపుల గ్రామం, పెద్దముడియం మండలం నిరుడు దెబ్బతిన్నాం...ఈసారైనా సక్రమంగా చెబుతారో...లేదో? నిరుడు బుడ్డశనగకు బీమాకు ప్రీమియం చెల్లించాం. తీరా సమయం దాటిపోయాక, మీరు కట్టిన ప్రీమియం ఆలస్యమైందని చెప్పి అటు ప్రభుత్వం, ఇటు కంపెనీవాళ్లు తప్పించుకున్నారు. దీంతో చాలా నష్టపోయినాం. ఇప్పుడైన, ఈసారైన సక్రమంగా కట్టించుకుంటారోలేదో. -గుర్రప్ప, శనగరైతు, ఉప్పలపాడు, పెద్దముడియం మండలం. -
పిల్లలకూ ఆర్థిక భరోసా..
పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఒకవైపు పిల్లలు పుట్టారన్న సంతోషంతో పాటే మరోవైపు బాధ్యతలు కూడా పెరుగుతాయి. పిల్లల ఎదుగుదలలో ఉపాధ్యాయుడి నుంచి, స్నేహితుడి వరకు క్రమశిక్షణను నేర్పే వ్యక్తిగా తల్లిదండ్రులు అనేక పాత్రలు పోషించాల్సి వస్తుంది. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం. అనుకోని సంఘటనలు ఏమి జరిగినా వారి భవిష్యత్తుకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అందుకే చాలామంది తల్లిదండ్రులు ముందుజాగ్రత్తగా పిల్లలకు ఎటువంటి ఆర్థిక కష్టాలు ఎదురవకుండా ఉండేందుకు తగు ప్రణాళికలు రూపొందించుకుంటారు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇలా ప్రణాళిక తయారు చేసుకోవాలి అనుకోగానే ముందుగా ఎదురయ్యే ప్రశ్న... పిల్లల జీవితంలో అతి ముఖ్యమైన దశ ఏమిటని?. పిల్లల అవసరాల గురించి తల్లిదండ్రులు ఎక్కువగా ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారన్న సర్వేలో మొదట చదువు నిలబడగా, వైద్యం రెండో స్థానంలో ఉంది. అలాగే వీటి తర్వాత పిల్లలకు ప్రస్తుత స్థాయికి కంటే మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంపై దృష్టిసారిస్తున్నారు. మరికొంత మంది తల్లిదండ్రులు ఆటలు, సంగీతం, పెయింటింగ్, విదేశీ విద్య కోసం శిక్షణ వంటి వాటికోసం కేటాయింపులు చేస్తున్నారు. ఇలా కావాల్సిన లక్ష్యాలను చేరుకోవడానికి అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.. విద్య: పిల్లల చదువుకు కావల్సిన నిధిని సమకూర్చుకోవడానికి అనేక పథకాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకు డిపాజిట్లు, బీమా పథకాలు వంటి వాటిని వినియోగించుకోవడం ద్వారా ఈ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. ఇందులో ఏ పథకాన్ని ఎంచుకోవాలన్నది తల్లిదండ్రుల రిస్క్ సామర్థ్యం, కాలపరిమితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అదే బీమా పథకాన్ని ఎంచుకుంటే రెండిందాల ప్రయోజనం లభిస్తుంది. పిల్లల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునే అవకాశంతో పాటు, ఊహించడానికే కష్టమైన సంఘటన ఎదురైనప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యానికి ఎటువంటి ఆటంకం ఏర్పడదు. మెచ్యూరిటీ సమయంలో ఈ మొత్తం పిల్లవాడికి ఇవ్వడం జరుగుతుంది. అందుకే పిల్లల ఆర్థిక లక్ష్యంలో బీమా అనేది తప్పకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఆరోగ్యం: రోజురోజుకి ఆరోగ్య చికిత్స వ్యయం పెరుగుతుండటంతో పెద్దలతోపాటు పిల్లలకు కూడా ఆరోగ్య బీమా ఉండే విధంగా చూసుకోవాలి. ఆరోగ్య బీమాలో మెడిక్లెయిమ్, క్రిటికల్ ఇల్నెస్ పేరుతో రెండు రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మెడిక్లెయిమ్ పాలసీ చిన్న చిన్న రోగాల చికిత్స కోసం హాస్పిటల్లో చేరినప్పుడు వినియోగించుకోవడానికి అనువుగా ఉంటుంది. కొన్ని తీవ్రమైన వ్యాధుల చికిత్సకు జరిగే భారీ వ్యయాన్ని తట్టుకోవడానికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు అవసరమవుతాయి. చికిత్స వ్యయంతో సంబంధం లేకుండా పాలసీ తీసుకున్న మొత్తం ఒకేసారి చెల్లించడం క్రిటికల్ ఇల్నెస్ రైడర్లోని ప్రత్యేక ఆకర్షణ. జీవన ప్రమాణాలు చదువు, వైద్యం తర్వాత ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న అంశం పిల్లలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం. తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా వారికి ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు లేకుండా జీవితం గడచిపోయేలా చూసుకోవాలి. అబ్బాయి లేదా అమ్మాయి డ్యాన్స్, స్విమ్మింగ్ నేర్చుకోవాలనే కోరిక నిధులు లేక ఆగిపోయాయి అన్న మాట రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సంపాదించే వ్యక్తి లేకపోయినా పిల్లల లక్ష్యాలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తగు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇందుకు టర్మ్ ఇన్సూరెన్స్ అనువుగా ఉంటుంది. తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ కల్పించడం ఈ పాలసీల ప్రత్యేకత. ఇందులో కేవలం క్లెయిమ్‌లు తప్పిస్తే మెచ్యూరిటీ ఉండదు. పాలసీదారుడు మరణిస్తే బీమా మొత్తం నామినీకి వస్తుంది. వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు కొన్ని టర్మ్ పాలసీలు ఒకేసారిగా కాకుండా ఏటా కొంత మొత్తం చొప్పున గరిష్టంగా 15 ఏళ్లకు వరకు ఇస్తున్నాయి. ఈ విధానం ఎంచుకుంటే పిల్లలకు సురక్షితమైన ఆర్థిక భద్రత ఏర్పాటు చేసిన వాళ్లు అవుతారు. ఇలా ప్లాన్ చేద్దాం... నాలుగు మార్గాలను అనుసరించడం ద్వారా పిల్లల ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. మొదటి దశ: ముందుగా పిల్లల ఉన్నత చదువు లేదా భవిష్యత్తు అవసరాల కోసం ఎంత మొత్తం అవసరమవుతుందో లెక్కించండి. రెండో దశ : ఇక రెండో దశలో ఎంత బీమా రక్షణ అవసరమవుతుందో చూసుకోవాలి. జీవితంలో ఏదైనా ఊహించని సంఘటన జరిగినా పిలల్ల భవిష్యత్తు, ఆర్థిక లక్ష్యాలపై ప్రభావం లేకుండా ఉండే విధంగా బీమా రక్షణ ఎంచుకోవాలి. కొన్ని బీమా కంపెనీలు ఇందుకోసం ప్రత్యేకమైన రైడర్లను కూడా అందిస్తున్నాయి. మూడో దశ : ఈ లక్ష్యం చేరుకోవడానికి ఎంత కాలపరిమితి ఉంది, ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది, దీన్ని ఎంత మొత్తం కేటాయించగలం చూడండి. నాలుగో దశ : చివరగా మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా బీమా పథకాలతో పాటు యులిప్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ డిపాజిట్లు వంటి పథకాలను ఎంచుకోవచ్చు. స్వల్ప కాలిక లక్ష్యాలకు మ్యూచువల్ ఫండ్ వంటి పథకాలు, దీర్ఘకాలానికి బీమా పథకాలు అనువుగా ఉంటాయి. -
మామిడికి బీమా.. రైతుకు ధీమా
బెల్లంపల్లి/చెన్నూర్ : ప్రకృతి వైపరీత్యాలతో ఏటేటా నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రబీలో మామిడి తోటలకు వాతావరణ ఆధారిత బీమా వర్తింపజేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి బీమా సదుపాయం కల్పిస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలకు బీమా సౌకర్యం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. వాతావరణ ఆధారిత బీమా పథకం అమలు తీరు, వర్తింపు తదితర వివరాలను జిల్లా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు పీవీ రమణ వివరించారు. జిల్లా వ్యాప్తంగా 24,928 హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 15,617.7 హెక్టార్లలో మామిడి చెట్లు ఫలసాయాన్ని అందిస్తున్నాయి. 50ఏళ్ల వయస్సు కలిగిన మామిడి చెట్లు 22,311 హెక్టార్లలో, ఐదేళ్ల వయస్సు కలిగిన చెట్లు 2,617 హెక్టార్లలో ఉన్నాయి. మార్కెట్లో అధిక డిమాండ్ కలిగిన దశేరి, బంగెనపల్లి, మల్లిక, తోతపురి తదితర రకాల చెట్లను పెంచుతున్నారు. చెట్టు వయస్సు ఆధారంగా.. రైతులు మామిడిచెట్లకు బీమా చేయిస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో పూర్తి స్తాయి నష్టాన్ని పొందే అవకాశం ఉంది. మామిడి చెట్టు వయస్సు ఆధారంగా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న చెట్టుకు రూ.450 బీమా కోసం రూ.52 ప్రీమియం చెల్లించాలి. ఇందులో రైతు రూ.26 ప్రీమియం చెల్లిస్తే మిగతా రూ.26 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన స్థాయిలో ప్రీమియం భరిస్తాయి. 16 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన చెట్టుకు రూ.800 బీమా కోసం రూ.92 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రైతు రూ.46 ప్రీమియం చెల్లిస్తే మిగతా సగం ప్రభుత్వం సబ్సిడీ రూపేణా బీమా కంపెనీకి చెల్లిస్తుంది. వర్తింపు ఇలా.. మామిడి తోటలకు అగ్రికల్చర్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా బీమా కల్పిస్తుంది. మామిడి సీజన్లో తలెత్తే ప్రకృతి వైపరీత్యాల ఆధారంగా ఇన్స్యూరెన్స్ను బీమా కంపెనీ చెల్లిస్తుంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ మధ్యలో అకాల వర్షాలు కురిసి మామిడి పూత రాలిపోయినా, తెగుళ్లు సోకినా బీమా పరిహారం పొందవచ్చు. జనవరి 1 నుంచి మార్చి 15వ తేదీ మధ్యలో తీవ్రమైన ఎండతో పిందెలు రాలిపోయినా బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. మార్చి 1 నుంచి మే 31వ తేదీ మధ్యలో వాడగాలులు, ఇతర ప్రకృతి ప్రభావంతో చెట్లపై నుంచి కాయలు రాలినా బీమా వర్తిస్తుంది. తుది గడువు.. మామిడి తోటలకు బీమా చేయించుకోవడానికి ప్రభుత్వం తుది గడువు విధించింది. 2014 డిసెంబర్ 15లోపు బీమా చేయించుకోవడానికి అవకాశం కల్పించింది. మామిడి తోటల పెంపకానికి బ్యాంకుల నుంచి రుణం పొందిన, పొందని రైతులు ప్రభుత్వం నిర్దేశించిన తుది గడువు లోపల బీమా ప్రీమియం చెల్లించడానికి వీలుంది. బీమా ప్రీమియాన్ని రైతులు అగ్రికల్చర్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా పేరు మీద డీడీ తీయాల్సి ఉంటుంది. సదరు ఇన్స్యూరెన్స్ కంపెనీకి అనుబంధంగా ఉన్న బ్లెండ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిధులు రైతుల వద్దకు వచ్చి బీమా ప్రీమియం డీడీలను తీసుకుంటారు. ఇతర వివరాలకు బ్లెండ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ హైదరాబాద్ బ్రాంచి మేనేజర్ సాయిబాబా ఫోన్ నం.9705188786లో సంప్రదించవచ్చు. -
పేదలకు ధీమా బీమా
ఊహించని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే అండగా నిలిచేది బీమా పథకం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కల్పించే పాలసీలు అనేకం అందుబాటులో ఉన్నాయి. గతంలో బడుగు, బలహీన వర్గాలకు బీమా సదుపాయం అందుబాటులో ఉండేది కాదు. ప్రభుత్వం పలు పథకాల కింద మహిళలు, వారి కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. నగరవాసులకైతే జీవీఎంసీ యూసీడీ విభాగం, జిల్లా వాసులకైతే డీఆర్డీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇందిరాక్రాంతి పథకం ద్వారా పలు బీమా పథకాలు పొందవచ్చు. ఆ వివరాలు... - ద్వారకానగర్ అమ్ఆద్మీ యోజన... తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 18 నుంచి 59 ఏళ్ల వరకు భూమిలేని నిరుపేద గ్రామీణ వ్యవసాయ కూలీలు రూ.15ల సేవా రుసుం చెల్లిస్తే ప్రభుత్వం రూ. 320 జత చేసి బీమా కంపెనీలకు రూ. 335 చెల్లిస్తుంది. ఏటా రూ.15తో పాలసీని రెన్యూవల్ చేసుకోవాలి. ప్రమాదం లేదా సాధారణ మరణమైనా తక్షణ సహా యంగా రూ.5వేలు అందజేస్తారు. తర్వాత రూ.25 వేలు చెల్లిస్తారు. వైఎస్సార్ అభయ హస్తం గ్రామ సమాఖ్యలో సభ్యత్వంతోపాటు 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉండాలి. వరుసగా రెండేళ్లు వాటా ధనం చెల్లించకపోతే స భ్యుత్వం రద్దవుతుంది. రోజు రూ. రూపాయి చొప్పున ఏడాది పొడవునా అభ్యర్థి రూ.365 జమ చేస్తే అంతే ప్రీమియం ప్రభుత్వం చెల్లించి బీమా సదుపాయం కల్పిస్తుంది. వరుసగా పదేళ్లు వాటాధనం చెల్లిస్తే కనీసం రూ. 500 పింఛను పొందేందుకు అర్హత లభిస్తుంది. వృద్ధాప్యంలో పింఛనుతో పాటు బీమా సదుపాయం ఉంటుంది. సహజ మరణానికి రూ. 30వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలు, అంగవైకల్యానికి పరిహా రం పొం దే అవకాశం ఉంటుంది. సభ్యుత్వం పొందిన కుటుంబంలో 9వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఉంటే ఏటా రూ.1200 ఉపకారం వేతనం అందుతుంది. జనశ్రీ... స్వయం సహాయక సంఘాల సభ్యులు 18 ఏళ్లు పైబడిన వారు ఈ బీమాలో చేరవ చ్చు. ప్రతి ఒక్కరూ ప్రీమియం రూ.17 సేవా రుసుం రూ.15లు చెల్లిస్తే ప్రభుత్వం మరో రూ.360లు కలిపి బీమా చేస్తుంది. అభయహస్తంలో చేరి ఉంటే సర్వీసు చార్జి చెల్లించాల్సిన అవసరం లేదు. అప్పు బీమా.. మహిళ సంఘాల్లో సభ్యత్వం పొందిన మహిళలు బ్యాంకు రుణం పొందిన తర్వాత దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ అప్పు భారాన్ని కు టుంబ సభ్యులు చె ల్లించాల్సి వచ్చేది. ఆ పరిస్థి తి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్పు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. అప్పు తీసుకున్న సభ్యురాలు ప్రతి రూ.1000కి రూ. 4.50 చొప్పున బీమా ప్రీమియం చెల్లించాలి. రుణం తీసుకున్నా తర్వాత మృతిచెందితే ఆమె చెల్లిం చాల్సిన రుణం మాఫీ చేస్తారు. అప్పటి వరకు చెల్లించిన వాయిదాలు కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. కార్మిక బీమా..: భవన నిర్మాణ రంగంలోని కూలీలు, మేస్త్రీలు తక్కువ ప్రీమియంతో బీమా పొందే వీలుంది. మొదటి సంవత్సరం ప్రవేశరుసం రూ.50, అదనంగా మరో రూ.12 చొ ప్పున రూ.62 చెల్లించాలి.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2లక్షల పరిహారం పొందవచ్చు. అయితే ఏటా ప్రీమి యం చెల్లిస్తూ పాలసీని రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉం టుంది. సహజమరణమైతే రూ.30వేలు, పని చేసే చోట చనిపోతే అంత్యక్రియల కోసం రూ.5వేలు అందిస్తారు. -
గొర్రెలకు బీమాతో రైతుకు ధీమా
శామీర్‌పేట్: ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికైనా, పశువుకైనా బీమా తప్పనిసరి అయ్యింది. జీవాలు మృతి చెందితే వచ్చే భీమా సొమ్ముతో రైతులు తమ నష్టాన్ని కొంతమేర భర్తీ చేసుకోవచ్చు. గొర్రెలు, మేకల పెంపకం దారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మూడుచింతలపల్లి పశువైద్యుడు తిరుపతి సూచించారు. భీమా పథకం వివరాలు ఆయన మాటల్లోనే... వ్యవసాయ అనుబంధ రంగంగా పలువురు జీవాలను పోషిస్తున్నారు. కొందరు కేవలం పెంపకాన్నే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. మండలంలో 19,081 గొర్రెలు, 6,844 మేకలు ఉన్నాయి. మేకలు ఆకులు అలుమలు తిని కొద్దిమేరకు రోగాలను తట్టుకుంటాయి. కానీ గొర్రెలు మాత్రం గడ్డి తింటూ చిత్తడి నేలల్లో తిరుగుతూ ఉండటంతో వ్యాధుల బారిన పడి మృతిచెందితే అవకాశాలు ఎక్కువ. దీంతో పెంపకం దారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నష్టం నుంచి పెంపకం దారులను కాస్తై గట్టెక్కించేందుకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ సహకారంతో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ గొర్రెల బీమాపథకాన్ని అమలు చేసింది. బీమా పథకం ఇలా... మూడు నెలల నుంచి సంవత్సరం లోపువయసు ఉండే గొర్రెకు బీమా ప్రీమియం రూ. 118. అయితే ఇందులో రైతు వాటాగా రూ.48 చెల్లిస్తే రాష్ట్ర పశుసంవర్థక శాఖ తన వాటాగా రూ.70 జమ చేస్తుంది. ఒకవేళ బీమా చేసిన గొర్రె మృతిచెందితే రూ.1500 దక్కుతాయి. సంవత్సరం పైబడి ఏడేళ్లలోపు వయసు ఉన్న గొర్రె కు బీమా ప్రీమియం రూ.236 కాగా ఇందులో రైతు తన వాటాగా రూ.96 చెల్లిస్తే, రాష్ట్ర సంవర్థక శాఖ రూ.140 చెల్లిస్తుంది. సదరు గొర్రె మరణిస్తే రూ.3వేల పరిహారం దక్కుతుంది. ప్రీమియం చెల్లించిన నాటి నుంచి ఏడాదిపాటు భీమా అమలులో ఉంటుంది. బీమా చేయించే గొర్రెల కాపరి సమీప పశువుల ఆస్పత్రి వైద్యుడిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. బీమా చేయించే గొర్రెల సంఖ్యకు అనుగుణంగా చెవి పోగులు తెప్పించి నిర్ణీత తేదీన భీమా చేయిస్తారు. రైతు వాటాగా ప్రీమియాన్ని ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పేరు మీద చెల్లింపు అయ్యేలా డీడీ తీయాలి. బీమా దరఖాస్తులను పశువైద్యుడు పూర్తి చేసి బీమా కంపెనీకి పంపుతారు. దరఖాస్తులను కంపెనీకి అందజేసిన వారంలోపు బీమా పత్రాలుపెంపకం దారులకు చేరుతాయి. బీమా కంపెనీ గొర్రె చెవులకు వేసిన చెవి పోగులను పోగుట్టుకోకుండా చూసుకుంటుండాలి. ఒక వేళ చెవి పోగు పోతే వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి, పశువైద్యుడికి సమాచారం అంద జేయాలి. 15 రోజుల్లోగా వివరాలివ్వాలి... వ్యాధులతో చనిపోయినా, ప్రమాదవశాత్తు గొర్రె మృతిచెందినా బీమా వర్తిస్తుంది. ఒకవేళ బీమా చేసిన గొర్రె మృతిచెందితే వెంటనే బీమా కంపెనీకి, పశువైద్యుడికి తెలియజేయాలి. పశువైద్యుడితో పోస్టుమార్టం చేయించి మరణ ధ్రువీకరణ పత్రాన్ని, గొర్రెకు వేసిన చెవిపోగును దరఖాస్తులతోపాటు 15రోజుల్లోగా బీమా కంపెనీకి అందజేయాలి. అనంతరం సదరు కంపెనీ గొర్రెల కాపరి బ్యాంకు ఖాతాకు నేరుగా డబ్బులు జమచేసి సమాచారాన్ని అందజేస్తుంది. ఇవి తప్పని సరిగా చూసుకోవాలి... గొర్రె మరణించిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ వారికి తెలియజేయాలి. అవ సరమైన సందర్భాల్లో కంపెనీ ప్రతినిధులు వివరాలు సేకరణ, ఫొటోలను తీసుకుని వెళేవరకు గొర్రె చనిపోయిన చోటే ఉంచాలి. కదిలించడం పక్కకి తీసుకుపోవడం చేయరాదు. బీమా కంపెనీ వేసే చెవిపోగు లేకపోతే బీమా వర్తించదు. ఒకే సారి ఒకటి కంటే ఎక్కువ గొర్రెలు చనిపోతే చనిపోయిన గొర్రెలతో పాటు కాపరి కూడా ఫొటో తీయించుకుని ఆ ఫొటోలను ఫిర్యాదుకు జతపరిచి బీమా కంపెనీకి పంపాల్సి ఉంటుంది.