కర్నూలు(అగ్రికల్చర్): అకస్మాత్తుగా జరిగిన ప్రమాదాలు.. ఊహించని విపత్తులు.. పేద కుటుంబాలను శోకసంద్రంలోకి నెడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణంతో ఆయా కుటుంబాల్లో నైరాశ్యం నెలకొంటోంది. అప్పటి వరకు సాఫీగా సాగిన జీవితం తలకిందులవుతోంది. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువులు సైతం ఆగిపోతున్నాయి. పేదల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తూ వారిలో దిగులును తొలగిస్తోంది. ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత అందిస్తూ ధీమా నింపుతోంది.
రూపాయి కూడా ప్రీమియం లేకుండా..
రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో ఒకరికి (ఇంటి యజమానికి) రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తోంది. కర్నూలు జిల్లాలో 5,05,094 కుటుంబాలకు, నంద్యాల జిల్లాలో 4,13,498 కుటుంబాలకు వైఎస్సార్ బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. బీమా ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, ప్రమాదంలో రెండు కాళ్లు లేదంటే రెండు చేతులు పోతే రూ.5 లక్షలు, ఒక కాలు, ఒక చేయిపోతే రూ.2.50 లక్షలు, సాధారణంగా మరణిస్తే రూ.లక్ష ప్రకారం పరిహారం లభిస్తుంది.
18 నుంచి 70 ఏళ్లలోపు వారికి ప్రమాద బీమా, 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి సహజ మరణం బీమా వర్తిస్తుంది. ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకొని క్లయిమ్‌లను పరిష్కరిస్తారు. సహజ మరణానికి పరిహారం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అసంఘటిత రంగంలోని రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ప్రీమియం లేకుండా వైఎస్సార్ బీమా సదుపాయం కల్పించడం విశేషం. సహజ మరణం పొందినా, ప్రమాదశాత్తూ మరణించినా వెంటనే సంబంధిత సచివాలంలోని వెల్ఫేర్ అసిస్టెంటుకు సమాచారం ఇస్తే 24 గంటల్లోపు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లిస్తారు.
గడువులోపు పరిహారం..
వైఎస్సార్ బీమా కింద క్లయిమ్‌ల పరిష్కారానికి ప్రత్యేక షెడ్యూలు ఉంది. దీని ప్రకారం సహజ మరణం క్లయిమ్‌లను 24 రోజులు, ప్రమాద మరణం క్లయిమ్‌లను 65 రోజుల్లోను పరిష్కరిస్తున్నారు. సచివాలయం స్థాయిలో జరిగే డాక్యుమెంటేషన్‌ను అనుసరించి క్లయిమ్‌లు పరిష్కారం అవుతాయి. సహజ, ప్రమాద మరణాలకు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంటు డాక్యుమెంటేషన్ పూర్తి చేసి కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ– వైకేపీలోని వైఎస్‌ఆర్ బీమా కాల్ సెంటర్‌కు పంపాల్సి ఉంది. కాల్ సెంటరులో బీమా డీపీఎం, డీఆర్‌డీఏ–వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్‌లు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే ఆమోదించి పరిహారం చెల్లింపు కోసం జీఎస్‌డబ్ల్యూస్ డిపార్టుమెంట్‌కు పంపుతారు. సహజ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రమాద మరణాలకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తుంది.
సత్వర సాంత్వన
వైఎస్సార్ బీమా పరిహారం ప్రొసీడింగ్స్ అందుకుంటున్న ఈమె పేరు జెల్లి జయమ్మ. ఆదోని మండలం ఆరేకల్ గ్రామానికి చెందిన ఈమె భర్త జెల్లి రాఘవేంద్ర ప్రమాదవశాత్తూ్త 2022 సెప్టెంబరు 6వ తేదీన మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరికి వైఎస్సార్ బీమా అండగా నిలిచింది. నాలుగు నెలల్లోనే 2022 డిసెంబరు 1న రాఘవేంద్ర భార్య జెల్లి జయమ్మకు రూ.5 లక్షల పరిహారం మంజూరైంది. సత్వర స్వాంతన చేకూర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని జయమ్మ తెలిపారు.
బాధిత కుటుంబానికి ఊరట
ఈ చిత్రంలో కనిపించే మహిళ పేరు నాగేశ్వరమ్మ, కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని మాసామసీదు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈమె భర్త కురువ నాగరాజు ప్రమాదవశాత్తు 2022 ఆగస్టు 10న మృతి చెందాడు. ఇద్దరు కుమారుల పోషణ కష్టంగా ఉన్న తరుణంలో ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా ద్వారా చేయూత ఇచ్చింది. నాగేశ్వరమ్మకు రూ. 5 లక్షల పరిహారం లభించింది.
పకడ్బందీగా బీమా పథకం అమలు
వైఎస్సార్ బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. సచివాలయంలో ఎంత త్వరగా డాక్యుమెంటేషన్ పూర్తి చేసి పంపితే అంత త్వరగా క్లయిమ్ పరిష్కారం అవుతుంది. రైస్ కార్డు కలిగిన కుటుంబాలన్నిటికీ వైఎస్సార్ బీమా లభిస్తుంది. కర్నూలు జిల్లాలో 5 లక్షలకుపైగా కుటుంబాలకు వైఎస్సార్ బీమా సదుపాయం ఉంది.
– వెంకటసుబ్బయ్య, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్‌డీఏ–వైకేపీ
లక్షలాది పేద కుటుంబాలకు భరోసా
జాప్యం లేకుండా క్లయిమ్‌లు పరిష్కారమవుతుండడంతో ఆయా కుటుంబాలకు భరోసా లభిస్తోంది. 2021–22లో వైఎస్సార్ బీమా కింద 1,398 కుటుంబాలకు భరోసా దక్కింది. 2022–23లో కర్నూలు జిల్లాలో సహజ మరణం పొందిన 496 కుటుంబాలకు రూ.4.82 కోట్లు, నంద్యాల జిల్లాలో 477 కుటుంబాలకు రూ.4.60 కోట్లు పరిహారం లభించింది. 30 క్లయిమ్‌లకు పరిహారం చెల్లించే ప్రక్రియ ప్రాసెస్‌లో ఉంది. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో ప్రమాద మరణాల క్లయిమ్‌లు 80 రిజిష్టర్ కాగా 35 పరిష్కారం అయ్యాయి. నంద్యాల జిల్లాలో ప్రమాద మరణాల క్లయిమ్‌లు 76 రిజిష్టర్ కాగా 23 పరిష్కారం అయ్యాయి. మిగిలినవి ప్రాసెస్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment