
పేదరికం అంటే ఏమిటి.. డబ్బు లేకపోవడమా.. ఆస్తులు అంతస్తులు లేకపోవడమా.. మనసులో మానవత్వం కొరవడడమా.. ఎదుటివారి కష్టం చూడగానే కళ్ళు చెమర్చకపోవడమా అంటే ఎవరి అర్థాలు వారు చెబుతారు.. కొందరి దృష్టిలో సంపద అంటే డబ్బు.. మరికొందరు ఐతే మానవత్వాన్ని మైన మించిన సంపద లేదంటారు.
ఒక మహా నగరంలో ఒక ధనవంతులు ఉండే ప్రాంతం.. పెద్దపెద్ద కార్లు .. ఐదారు బెడ్ రూములు ఉండే ప్లాట్స్ .. అంతా కొట్లమీద జీవించేవాళ్ళు .. వారికి కింది స్థాయి మనుషులు కనిపించరు.. అలాంటి కాలనీలో వీధుల్లో బెలూన్లు అమ్ముకునే ఓ తల్లి చంటిబిడ్డను ఎత్తుకుని బెలూన్లు అమ్ముతూ తిరుగుతోంది. పైన ఎండ దహించేస్తోందో. రోళ్ళు పగిలిపోయే ఎండ.. ఎవరో పుణ్యాత్ములు ఇచ్చిన అన్నం మూటను పట్టుకుని ఓ అపార్ట్‌మెంట్ ముందున్న పెద్ద క్రోటన్ మొక్క వద్ద కూర్చుంది తల్లి.
అన్నం మూట విప్పి బిడ్డకు ముద్ద లోపలకు వెళ్ళబోతున్న ఓ పదవకారునుంచి ఓ మహారాణి కళ్ళజోడు సారించుకుంటూ ఓ సారి బయటకు చూసింది. ఆమెకు పేదలన్నా.. పేదరికం అన్నా అసయ్యం.. అలాంటిది ఓ పేదరాలు తమ ఇంటిముందు భోజనం చేయడమా. ఠాట్ అసలే కుదరదు. అందుకే వెంటనే కారు అద్దం దించి ఏయ్ .. ఏంటి ఇక్కడ కూర్చున్నావ్.. వెళ్ళు ఇంకెక్కడైనా తిను.. అంటూ ఏయ్ రంగయ్యా ఈమెను పంపించేయి అని కేకేసి సర్రున కారులో లోపలి వెళ్ళింది.. ఆ దెబ్బకు భీతిల్లిన ఆ తల్లి ఓ చేత్తో అన్నం మూటను.. ఇంకో చేత్తో బిడ్డను ఎత్తుకుని అక్కణ్ణుంచి కదిలింది..
లోపల్నుంచి వచ్చిన రంగయ్య ఈ ఎండలో ఎక్కడకు వెళ్తావు.. సెల్లార్లో మా రూమ్ ముందు కూర్చుని తినేసి వెళ్ళమ్మా అని పిలిచి బాటిల్లో చల్లని నీళ్లిచ్చాడు.. డబ్బున్న ఆవిడకన్నా తనలాంటి పేదవాడిదే పెద్దమనసు అనుకున్న ఆ బెలూన్లు అమ్మే అమ్మి సెల్లార్లో తినేసి.. ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసి వెళ్ళింది.. ఇప్పుడు చెప్పండి ఆ ఇద్దరిలో ఎవరు గొప్ప..
ఇంకో సందర్భంలో ఒక ధనిక మహిళ చీరల షాప్‌కి వెళ్లింది. “బాబూ, కొన్ని చవక రకం చీరలు యివ్వండి .. మా అమ్మాయి పెళ్లి ఉంది.. మా చుట్టాలు బంధువులకు మంచి చీరలు కోనేసాం కానీ మా పనివాళ్లకు అవి ఇవ్వలేం కదా అందుకే నాసిరకం చీరలు ఇవ్వం డి అని అడిగింది.. కొన్ని చీరలు తీసుకెళ్లింది.
ఆ తరువాత కొద్ది సేపటికే మరో పేద మహిళ చీరాల షోరూం కు వచ్చి “అన్నా, కాస్త ధర ఎక్కువ ఉండే చీరలు చూపించు. మా సేఠ్ బిడ్డ పెళ్లికి నేను ఒక చీరను గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాను. దీనికోసం నెలనెలా కొంత పొదుపు చేశాను.. మా చిన్నమ్మగారికి మంచి చీర ఇవ్వాలి కదా అని ఓ ఖరీదైన చీరను తీసుకెళ్లింది. ఇప్పుడు చెప్పండి ఈ ఇద్దరిలో ఎవరు పేదవారు.. డబ్బు విలువైనదే.. కాదనలేం.. కానీ మానవత్వానికి.. మానవ విలువలకు సైతం అపారమైన విలువ ఉంటుంది.. అది ఆయా సందర్భాల్లో వెలుగులోకి వస్తుంది.. అవతలివారికి అర్థం అవుతుంది.. దేనివిలువ దానికే ఉంటుంది. మానవత్వం మనసులో చెమ్మ లేనపుడు ఎంత సంపాదించినా దానికి పెద్దగా విలువ ఉండదు అని అందుకే పెద్దలు అంటుంటారు
- సిమ్మాదిరప్పన్న