సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల అనంతరం తమ ప్రభుత్వం ఏర్పడితే ఢిల్లీవాసులకు బీమా సదుపాయం కల్పిస్తామని, ఎన్నికల్లో గెలుపుపై తమ ధీమా ఇవ్వాలని బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశంలోనే ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా ఈ బీమా పథకాన్ని రూపొందిస్తామన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పథకానికి సంబంధించిన విధివిధానాలను ఆయన వివరించారు. ఢిల్లీ పౌరులు ప్రతి ఒక్కరూ రోజుకు రూ.ఆరు చొప్పున ఆన్‌లైన్‌లో చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వ బీమా వర్తిస్తుందన్నారు. ఇందుకోసం ఎలాంటి హెల్త్‌కార్డులూ తీసుకెళ్లాల్సిన పనిలేదన్నారు. నేరుగా ఆన్‌లైన్‌లో డబ్బులు జమచేసిన వెంటనే ఓ కోడ్ నంబర్ కేటాయిస్తారని, ఆ నంబర్ చెబితే సరిపోతుందన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్నిసార్లయినా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చని హర్షవర్ధన్ అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకోవాల్సి వస్తే వోచర్లు అందజేస్తామని వివరించారు. అధికారిక, అనధికారిక కాలనీలన్నింటిలో మొబైల్ క్లినిక్కులను అందుబాటులోకి తెస్తామన్నారు. వీటిలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అన్ని వైద్య సదుపాయాలు ఉచితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఆరు నెలలకోసారి పూర్తి చెకప్ చేయించుకునే అవకాశం ఉంటుందని ఈ సీనియర్ నాయకుడు విశదీకరించారు. ఔట్‌పేషెంట్ వైద్య సేవలను అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెట్టింపు చేస్తామని వాగ్దానం చేశారు. ‘అవసరమైన రోగులను ఆస్పత్రులకు చేర్చేందుకు రవాణా సదుపాయాన్ని ఉచితంగా కల్పిస్తాం. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అంబులెన్స్‌లు, ప్రభుత్వ ఆరోగ్యశాఖ వాహనాలను జీపీఎస్‌తో అనుసం ధానిస్తాం. అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌ఎంఎస్ చేసినా వైద్యసహాయం పొందేలా కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేస్తాం’ అని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
‘మోడల్‌టౌన్’ మేనిఫెస్టో విడుదల
స్థానిక సమస్యలు పరిష్కరిస్తాం: విజయ్‌గోయల్
మరో రెండు రోజుల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ వెల్లడించారు. మోడల్‌టౌన్ నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక మేనిఫెస్టోను పండిత్‌పంత్‌మార్గ్‌లోని కార్యాలయంలో బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ నాయకులు విడుదల చేశారు. కార్యక్రమంలో బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్, సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్, మోడల్‌టౌన్ అభ్యర్థి అశోక్‌గోయల్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సమస్యలు ప్రతిబింబించేలా మోడల్‌టౌన్ మేనిఫెస్టోను రూపొందించినట్టు గోయల్ అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో బాధ్యతాయుతంగా మెలిగేందు కు అన్ని నియోజకవర్గాల్లో మేనిఫెస్టోలు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
మరికొన్ని రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల పరిధిలో రూపొందించిన మేనిఫెస్టోలు విడుదల చేస్తామన్నారు. మరో రెండు రోజుల్లో పార్టీమేని ఫెస్టోరాబోతోందని గోయల్ వివరించారు. పార్టీ రాష్ట్రస్థాయి మేనిఫెస్టోలో అన్ని ప్రాంతాల సమస్యలకు స్థానం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే మేనిఫెస్టోలు రూపొందించినందున, వాటిలో సాధారణ సమస్యలనూ చేర్చనున్నట్టు పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న స్థానిక సమస్యలన్నింటిని అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని పార్టీ మోడల్‌టౌన్ అభ్యర్థి అశోక్ గోయల్ తెలిపారు.
బీమా కల్పిస్తాం ధీమా ఇవ్వండి..!
Published Fri, Nov 22 2013 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement