సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో మేనిఫెస్టో రూపకల్పన ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఢిల్లీవాసులతో సంప్రదించి వారి ఆకాంక్షల మేరకు దీనిని రూపొందిస్తామని అంటోంది. నెరవేర్చగల వాగ్దానాలనే మేనిఫెస్టోలో చేరుస్తామని కూడా ఆ పార్టీ చెబుతోంది. ప్రభావపూరిత్తమైన ఎన్నికల మేనిఫెస్టో తయారుచేయడం కోసం బీజేపీ నియమించిన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ శుక్రవారం సమావేశమైంది. మాజీ శాసనసభ్యుడు ఆలోక్‌కుమార్ నేతృత్వంలోని ఈ కమిటీలో 16 మంది సభ్యులున్నారు.ఈ కమిటీ నగరంలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్న అంశాలను గుర్తించి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనుంది. గత విధానసభ ఎన్నికల మాదిరిగానే త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ బీజేపీ... సంపూర్ణ రాష్ట్ర హోదాను ఎన్నికల హామీల్లో చేర్చనుంది. అయితే మూడు మున్సిపల్ కార్పొరేషన్లను మళ్లీ విలీన హామీకి అంత ప్రాధాన్యమిచ్చే అవకాశం లేదు.
అయితే యమునా నదిని కాలుష్య రహితంగా చేస్తామనే హామీని మాత్రం ఇవ్వనుంది. ఎన్నికల మేనిఫెస్టో ట్రాన్స్‌యమునా ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది. విద్యుత్, నీటి సరఫరా,రవాణా, పర్యావరణం, యమునా నది తదితరఅంశాలపై ఢిల్లీవాసుల అభిప్రాయాలను తెలుసుకుని తదనుగుణంగా మేనిఫెస్టోను రూపొందించాలని కమలదళం యోచిస్తోంది, ఇందుకోసం లేఖలతోపాటు ఆన్‌లైన్ ద్వారా ప్రజల నుంచి సూచనలు స్వీకరించనుంది. ప్రజల సూచనలు స్వీకరించడానికి ఢిల్లీ బీజేపీ కార్యాలయంతో పాటు పలుచోట్ల పోస్ట్‌బాక్సులను ఏర్పాటుచేయనున్నారు. దీంతోపాటు విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు శిక్షణా సంస్థలు, మహిళలు, వృద్ధులు, షెడ్యూల్డు కులాలు, గ్రామీణులు, పారిశుధ్య సిబ్బంది, డాక్టర్లు, లాయర్లు, పూర్వాంచలీయులు... ఇలా విభిన్న వర్గాలతో బీజేపీ కార్యాలయంతో పాటు ఇతర చోట్ల సభలు, సమావేశాలు నిర్వహించనుంది .
యువత, ముస్లింలు, మతగురువులపై కమలం గురి
త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో విజయమే లక్ష ్యంగా ముందుకుసాగుతోంది. అధికారం చేపట్టడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 36ను సాధించడానికిగల అన్ని అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు నానాతంటాలూ పడుతోంది. ఇందులోభాగంగా యువత, ముస్లింలతోపాటు మతపెద్దలను తనవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. బహిరంగ సభలు, సభ్యత్వ నమోదుతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2013లో జరిగిన విధానసభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అత్యధికంగా 31 స్థానాలను కైవసం చేసుకుంది. మిత్రపక్షం అకాలీదళ్ తరఫున ఒక అభ్యర్థి విజయం సాధించింది. అయితే మెజారిటీకి నాలుగు స్థానాలు తక్కువగా ఉండడంతో అధికారం చేపట్టలేకపోయింది. అయితే ఈసారి అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని, అత్యధిక స్థానాలను దక్కించుకుని అధికార పగ్గాలు చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది అనుచరులు కలిగిన అన్ని మతాలు, ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సుల కోసం యత్నిస్తోంది.
దీంతోపాటు నగర యువతను వ్యక్తిగతంగా కలుస్తోంది. ఈ విషయమై ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తమ పార్టీకి చెందిన అనేకమంది ఆప్‌వైపు వెళ్లిపోయారన్నారు. అయితే ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ చేపట్టిన తర్వాత అనేకమంది తిరిగి తమపార్టీవైపు వస్తున్నారన్నారు. ఈరోజే ఎన్నికలు నిర్వహించినా తమకు అత్యధిక స్థానాలు గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుచుకోవాలంటూ అధిష్టానం ఆదేశించిదన్నారు. ఇది సాకారం కావాలంటే తమకు అనేకమంది మద్దతు అవసరమన్నారు. అందువల్లనే కొత్త కొత్త వ్యక్తులు,సంస్థలపైనా దృష్టి సారించాల్సిన అవసరం తమకు ఎంతైనా ఉందన్నారు.
డేరా సచ్చాసౌదా సంస్థ అధినేత గుర్మీత్‌సింగ్ రామ్హ్రీం మద్దతుతో హర్యానా శాసనసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ ఇప్పుడు అదే రీతిలో ఢిల్లీలోనూ ముందుకుసాగుతోంది. ఢిల్లీలోని ఆ సంస్థ మత, ఆధ్యాత్మిక గురువులతో సంప్రదింపులు జరుపుతోంది. తద్వారా నగంరలోని ఆ సంస్థ అనుచరులు, మద్దతుదారులను తనవైపు తిప్పుకోనుంది. ఈ విషయమై తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ నాయకుడు మాట్లాడుతూ ఇప్పటికే ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబా మద్దతు ఉందన్నారు. తనను తాను హిందువునని చెప్పుకోవడానికి ఎంతమాత్రం జంకని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మత గురువుల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు.
రూపకల్పనలో కమలదళం
Published Sun, Nov 30 2014 10:32 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement