
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) తమ కస్టమర్లకు చక్కని అవకాశాన్ని కల్పించింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పథకాలకు కస్టమర్లు తామంతట తామే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని ప్రకటిచించింది.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసుకున్న వ్యక్తి ఆకస్మికంగా మరణించిన సందర్భంలో పాలసీదారు కుటుంబానికి రూ. 2,00,000 లభిస్తాయి.ఇది ప్యూర్-టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాబట్టి ఎలాంటి మెచ్యూరిటీ లేదా సరెండర్ ప్రయోజనాన్ని అందించదు. ఇక ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అనేది ప్రమాద బీమా పథకం. ఇది ప్రమాదవశాత్తు మరణం, ప్రమాదం కారణంగా వైకల్యం కలిగినప్పుడు ప్రయోజనం అందిస్తుంది. ఇది ప్రాథమికంగా ఒక సంవత్సరానికి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవచ్చు.
అర్హులైన పౌరులందరికీ బీమా కవరేజీని విస్తరించడం, ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత కల్పించడం అనే విస్తృత జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఈ డిజిటల్ ఎన్‌రోల్‌మెంట్ ఉంటుందని ఎస్‌బీఐ బ్యాంక్ పేర్కొంది. స్వీయ-చందా మార్గంలో కస్టమర్‌లు బ్రాంచ్ లేదా కస్టమర్ సర్వీస్ పాయింట్‌ను సందర్శించకుండానే వారి సౌలభ్యం మేరకు ఆన్‌లైన్‌లోనే ఈ స్కీమ్‌ల కింద నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేటప్పుడు కస్టమర్‌లు తమ ఖాతా నంబర్, పుట్టిన తేదీని జన్ సురక్ష పోర్టల్‌లో ఎంటర్ చేయాలి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను వారి ప్రాధాన్య బ్యాంక్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దశలను పూర్తి చేసి ప్రీమియం చెల్లించిన వెంటనే ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment