జూన్ నెలాఖరుతో ముగిసిన వైఎస్సార్ బీమా పథకం
10,500 మందికి రూ.210 కోట్ల క్లెయిమ్‌లు పెండింగ్‌లోనే
మార్చి నెలాఖరు వరకు క్లియర్ చేసిన జగన్ ప్రభుత్వం
నాలుగు నెలలుగా రాష్ట్రంలో పేదలకు బీమా లేదు
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలను నీరుగార్చేసి పేదల పొట్టగొట్టిన కూటమి సర్కారు చివరకు బీమా పథకాల విషయంలోనూ నిర్దయగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటివరకు అమలులో ఉన్న వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమా పథకంగా పేరు మార్చేసింది. అయితే పేదలకు ఇంతవరకు బీమా మాత్రం కల్పించలేదు. రాష్ట్రంలో పేద కుటుంబాల్లో దురదృష్టవశాత్తూ కుటుంబ పెద్ద మరణిస్తే ప్రభుత్వమే ఆదుకుని ఆర్థిక సహాయం అందించేలా గత ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏటా పాలసీని రెన్యువల్ చేయాల్సి ఉండగా ఈ గడువు గత జూన్ నెలాఖరుతో ముగిసింది. కూటమి ప్రభుత్వం బీమా పాలసీని రెన్యువల్ / పునరుద్ధరణ చేయకపోవడంతో పేద కుటుంబాలకు గత నాలుగు నెలలుగా బీమా భరోసాకు దూరమయ్యాయి.
విధివిధానాలెక్కడ?
చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేసి సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణానికి రూ.10 లక్షల చొప్పున బీమా పరిహారం పెంచుతామంటూ ఎన్నికల ముందు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఈ హామీని టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. బీమా పరిహారం పెంపు సహా పథకం కొత్త విధివిధానాలను కార్మిక శాఖ రూపొందించాల్సి ఉండగా.. ఈ కార్యక్రమం సచివాలయాల పరిధిలో కొనసాగించాలా? లేదంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా అమలు చేయాలా? అనేది ఇంతవరకు తేలలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
81,568 కుటుంబాలకు రూ.876.72 కోట్లు..
కుటుంబ పెద్ద సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు చనిపోయినా బీమా పరిహారం నేరుగా ఖాతాల్లో జమ అయ్యేలా వైఎస్సార్ బీమా పథకాన్ని గత ప్రభుత్వం రూపొందించింది. పేదల తరపున ప్రభుత్వమే పాలసీ డబ్బులు చెల్లించింది. మొత్తం 1.21 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకాన్ని వర్తింప చేసింది. 18 నుంచి 50 ఏళ్ల లోపు వారు సహజంగా మరణిస్తే రూ.లక్ష పరిహారం, 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు ప్రమాదంలో మరణించినా, అంగవైలక్యం సంభవించినా రూ.5 లక్షల వరకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంది.
2021 జూలై నుంచి 2024 మార్చి వరకు 81,568 కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ.876.72 కోట్ల మొత్తాన్ని పరిహారంగా అందజేసింది. గత మార్చిలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు 10,500 క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత నాలుగు నెలలుగా ఆయా కుటుంబాలకు చెల్లించాలి్సన దాదాపు రూ.210 కోట్లు బీమా పరిహారం బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment