అతివృష్టి.. అనావృష్టితో పంటకు నష్టం వాటిల్లితే వాతావరణ, పంటల బీమా పథకం కింద నష్టపరిహారం మంజూరవుతుందన్న ధీమా ఈ ఏడాది రైతులకు లేకుండా పోయింది. పంట రుణాల మాఫీ, రుణాల రీషెడ్యూలులో చంద్రబాబు ప్రభుత్వం వేసిన పిల్లిమొగ్గలు బీమాపై రైతుల ఆశలను ఆవిరి చేశాయి. చంద్రబాబు ప్రభుత్వం రుణాల మాఫీపై ఎటూ తేల్చకపోవడంతో కొత్తగా పంట రుణాలను బ్యాంకర్లు మంజూరు చేయలేదు. రుణం ఇవ్వకపోవడంతో రైతులు ప్రీమియం చెల్లించలేదు. గురువారంతో ప్రీమియం చెల్లింపు గడువు పూర్తవనుండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: దుర్భిక్ష జిల్లాలో పంట సాగు చేసిన రైతుకు అతివృష్టి వల్లో అనావృష్టివల్లో నష్టపోయే పరిస్థితి రాకూడదని ప్రభుత్వం భావించింది. ఆ క్రమంలోనే ప్రధాన పంటలైన వేరుశెనగ, కంది, వరి వంటి వాటికి బీమా పథకాన్ని వర్తింపజేసింది. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 ఖరీఫ్‌లో మండలం యూనిట్‌గా ఉన్న పంటల బీమా పథకాన్ని గ్రామం యూనిట్‌గా వేరుశెనగ పం టకు వర్తింపజేశారు. పంటల బీమా స్థానంలో వాతావరణ బీమా పథకాన్ని 2010 ఖరీఫ్ నుంచి వేరుశెనగ పంటకు వర్తింపజేస్తున్నారు.
వరి, కందికి సైతం పంటల బీమా పథకాన్ని అమ లు చేస్తున్నారు. వర్షాధారంగా జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు 1.35 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశెనగ సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వరుణుడు కరుణించకపోయినా అరకొర పదునులోనే 1.06 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశెనగ సాగుచేశారు. వర్షాభావం వల్ల వేరుశెనగ పంట అప్పుడే ఎండిపోతోంది. ఎండిపోతున్న పంటను చూసి రైతు ఆందోళన చెందుతున్నాడు. వాతావరణ బీమా పథకం కింద ప్రీమియం చెల్లించి ఉంటే.. నష్టపరిహారమైనా వచ్చేదన్న భావన రైతుల్లో నెలకొంది. తీవ్ర కరవు పరిస్థితుల వల్ల అప్పుల పాలైన రైతు ప్రీమియం చెల్లించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఈనెల 21న ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షల వంతున పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త రుణాలు కూడా ఇప్పిస్తామని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లు కొత్తగా రుణాలు మంజూరు చేస్తే.. బీమా ప్రీమియం చెల్లించవచ్చునని రైతులు భావించారు. కానీ.. పంట రుణాల మాఫీపైన.. రుణాల రీషెడ్యూలుపైనా చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. దీంతో బ్యాంకర్లు 2013-14లో కరవు ప్రభావిత 33 మండలాల్లో 1.69 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,438 కోట్ల రుణాలను రీషెడ్యూలు చేయలేదు.
ఇక తక్కిన 7.5 లక్షల మంది రైతులు పంట రుణాల రూపంలో తీసుకున్న రూ.9,642.25 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ధన రూపంలో అందిస్తే ఆ రుణాలను మాఫీ చేస్తామని బ్యాంకర్లు స్పష్టీకరిస్తున్నారు. రుణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు సైతం జారీచేస్తున్నారు. కొత్త రుణాలు పంపిణీ చేయాల్సింది పోయి.. పాత రుణాలు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తోండటంతో రైతులు నిర్ఘాంతపోతున్నారు. ఈ ఏడాది రూ.2,793 కోట్లను పంట రుణాలుగా పంపిణీ చేయాలని బ్యాంకర్లు నిర్ణయించగా ఇప్పటికి ఒక్క రైతుకు కూడా కొత్తగా పంట రుణం ఇవ్వలేదు.
బీమా ప్రీమియం చెల్లింపునకు జాతీయ వ్యవసాయ బీమా సంస్థ ఈనెల 31ని గడువుగా విధించింది. బ్యాంకర్లు పం ట రుణం ఇచ్చే సమయంలోనే రైతుల నుంచి బీమా ప్రీమియం కట్టించుకోవడం రివాజు. ఈ ఏడాది పంట రుణాలు మంజూరు చేయకపోవడంతో ఏ ఒక్క రైతు బీమా ప్రీమియం చెల్లించలేకపోయారు. దీంతో వాతావరణ బీ మా పథకం రైతులకు అందకుండా పోయింది. కరవు ఉరుముతుండటంతో పంట నష్ట పరిహారం చెల్లించేదెవరని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆశలన్నీ ఆవిరి
Published Thu, Jul 31 2014 3:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement