పిల్లలకూ ఆర్థిక భరోసా..
పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఒకవైపు పిల్లలు పుట్టారన్న సంతోషంతో పాటే మరోవైపు బాధ్యతలు కూడా పెరుగుతాయి. పిల్లల ఎదుగుదలలో ఉపాధ్యాయుడి నుంచి, స్నేహితుడి వరకు క్రమశిక్షణను నేర్పే వ్యక్తిగా తల్లిదండ్రులు అనేక పాత్రలు పోషించాల్సి వస్తుంది. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం. అనుకోని సంఘటనలు ఏమి జరిగినా వారి భవిష్యత్తుకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అందుకే చాలామంది తల్లిదండ్రులు ముందుజాగ్రత్తగా పిల్లలకు ఎటువంటి ఆర్థిక కష్టాలు ఎదురవకుండా ఉండేందుకు తగు ప్రణాళికలు రూపొందించుకుంటారు.
పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇలా ప్రణాళిక తయారు చేసుకోవాలి అనుకోగానే ముందుగా ఎదురయ్యే ప్రశ్న... పిల్లల జీవితంలో అతి ముఖ్యమైన దశ ఏమిటని?. పిల్లల అవసరాల గురించి తల్లిదండ్రులు ఎక్కువగా ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారన్న సర్వేలో మొదట చదువు నిలబడగా, వైద్యం రెండో స్థానంలో ఉంది. అలాగే వీటి తర్వాత పిల్లలకు ప్రస్తుత స్థాయికి కంటే మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంపై దృష్టిసారిస్తున్నారు. మరికొంత మంది తల్లిదండ్రులు ఆటలు, సంగీతం, పెయింటింగ్, విదేశీ విద్య కోసం శిక్షణ వంటి వాటికోసం కేటాయింపులు చేస్తున్నారు. ఇలా కావాల్సిన లక్ష్యాలను చేరుకోవడానికి అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..
విద్య: పిల్లల చదువుకు కావల్సిన నిధిని సమకూర్చుకోవడానికి అనేక పథకాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకు డిపాజిట్లు, బీమా పథకాలు వంటి వాటిని వినియోగించుకోవడం ద్వారా ఈ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. ఇందులో ఏ పథకాన్ని ఎంచుకోవాలన్నది తల్లిదండ్రుల రిస్క్ సామర్థ్యం, కాలపరిమితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అదే బీమా పథకాన్ని ఎంచుకుంటే రెండిందాల ప్రయోజనం లభిస్తుంది. పిల్లల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునే అవకాశంతో పాటు, ఊహించడానికే కష్టమైన సంఘటన ఎదురైనప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యానికి ఎటువంటి ఆటంకం ఏర్పడదు. మెచ్యూరిటీ సమయంలో ఈ మొత్తం పిల్లవాడికి ఇవ్వడం జరుగుతుంది. అందుకే పిల్లల ఆర్థిక లక్ష్యంలో బీమా అనేది తప్పకుండా ఉండే విధంగా చూసుకోవాలి.
ఆరోగ్యం: రోజురోజుకి ఆరోగ్య చికిత్స వ్యయం పెరుగుతుండటంతో పెద్దలతోపాటు పిల్లలకు కూడా ఆరోగ్య బీమా ఉండే విధంగా చూసుకోవాలి. ఆరోగ్య బీమాలో మెడిక్లెయిమ్, క్రిటికల్ ఇల్‌నెస్ పేరుతో రెండు రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మెడిక్లెయిమ్ పాలసీ చిన్న చిన్న రోగాల చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరినప్పుడు వినియోగించుకోవడానికి అనువుగా ఉంటుంది. కొన్ని తీవ్రమైన వ్యాధుల చికిత్సకు జరిగే భారీ వ్యయాన్ని తట్టుకోవడానికి క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్లు అవసరమవుతాయి. చికిత్స వ్యయంతో సంబంధం లేకుండా పాలసీ తీసుకున్న మొత్తం ఒకేసారి చెల్లించడం క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్‌లోని ప్రత్యేక ఆకర్షణ.
జీవన ప్రమాణాలు
చదువు, వైద్యం తర్వాత ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న అంశం పిల్లలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం. తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా వారికి ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు లేకుండా జీవితం గడచిపోయేలా చూసుకోవాలి. అబ్బాయి లేదా అమ్మాయి డ్యాన్స్, స్విమ్మింగ్ నేర్చుకోవాలనే కోరిక నిధులు లేక ఆగిపోయాయి అన్న మాట రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సంపాదించే వ్యక్తి లేకపోయినా పిల్లల లక్ష్యాలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తగు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
ఇందుకు టర్మ్ ఇన్సూరెన్స్ అనువుగా ఉంటుంది. తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ కల్పించడం ఈ పాలసీల ప్రత్యేకత. ఇందులో కేవలం క్లెయిమ్‌లు తప్పిస్తే మెచ్యూరిటీ ఉండదు. పాలసీదారుడు మరణిస్తే బీమా మొత్తం నామినీకి వస్తుంది. వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు కొన్ని టర్మ్ పాలసీలు ఒకేసారిగా కాకుండా ఏటా కొంత మొత్తం చొప్పున గరిష్టంగా 15 ఏళ్లకు వరకు ఇస్తున్నాయి. ఈ విధానం ఎంచుకుంటే పిల్లలకు సురక్షితమైన ఆర్థిక భద్రత ఏర్పాటు చేసిన వాళ్లు అవుతారు.
ఇలా ప్లాన్ చేద్దాం...
నాలుగు మార్గాలను అనుసరించడం ద్వారా పిల్లల ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు.
మొదటి దశ: ముందుగా పిల్లల ఉన్నత చదువు లేదా భవిష్యత్తు అవసరాల కోసం ఎంత మొత్తం అవసరమవుతుందో లెక్కించండి.
రెండో దశ : ఇక రెండో దశలో ఎంత బీమా రక్షణ అవసరమవుతుందో చూసుకోవాలి. జీవితంలో ఏదైనా ఊహించని సంఘటన జరిగినా పిలల్ల భవిష్యత్తు, ఆర్థిక లక్ష్యాలపై ప్రభావం లేకుండా ఉండే విధంగా బీమా రక్షణ ఎంచుకోవాలి. కొన్ని బీమా కంపెనీలు ఇందుకోసం ప్రత్యేకమైన రైడర్లను కూడా అందిస్తున్నాయి.
మూడో దశ : ఈ లక్ష్యం చేరుకోవడానికి ఎంత కాలపరిమితి ఉంది, ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది, దీన్ని ఎంత మొత్తం కేటాయించగలం చూడండి.
నాలుగో దశ : చివరగా మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా బీమా పథకాలతో పాటు యులిప్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ డిపాజిట్లు వంటి పథకాలను ఎంచుకోవచ్చు. స్వల్ప కాలిక లక్ష్యాలకు మ్యూచువల్ ఫండ్ వంటి పథకాలు, దీర్ఘకాలానికి బీమా పథకాలు అనువుగా ఉంటాయి.