అక్కాచెల్లెళ్ల విజయగాథ
ఆ కుటుంబంలో టెన్త్ చదివిన తొలి తరం పిల్లలు వీరే
‘‘నేడు అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం’’
‘బడీడు పిల్లల్ని పనిలో పెట్టుకోవడం నేరం’.. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బాల కార్మిక నిర్మూలన చట్టం ప్రధాన సారం ఇదే. కానీ ఇప్పటికీ పిల్లలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. పిల్లలతో పని చేయిస్తున్న ఘటనలను బాధ్యతగల పౌరులో, సామాజిక కార్యకర్తలో ఇచ్చే ఫిర్యాదులపై అధికారులు స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని పునరావాస కేంద్రాలకు పంపించడం చూస్తూనే ఉంటాం. సరిగ్గా కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా టేకల్ తాలూకాలోని ఓబట్టు గ్రామంలో ఆరేళ్ల క్రితం చేసిన రెస్కూ ఆపరేషన్ ఎంతో మంది పిల్లలను పుస్తకాల బాట పట్టించింది.
ఓ క్వారీలో పది కుటుంబాలను వెట్టిచాకిరీ చేయిస్తున్న దారుణంపై స్పందించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వారికి విముక్తి కలిగించి సొంత రాష్ట్రానికి పంపింది. అలా వచ్చిన కుటుంబాలు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మోతీనగర్‌లో జీవనం సాగిస్తున్నాయి. ఆ ఆపరేషన్ తర్వాత ఆయా కుటుంబాల్లోని పిల్లలను వివిధ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్పించారు. ఆ క్రమంలో చదువును సాగించిన వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు పదోతరగతి పాసై పైచదువుల కోసం ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. వారి కుటుంబంలో పదోతరగతి చదివిన తొలితరం కూడా అదే. బుధవారం అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక కథనం.
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం కర్ణాటక రాష్ట్రం టేకల్ తాలూకా ఓబట్టు గ్రామంలోని ఓ క్వారీలో పనిలో చేరింది అనూష, నందిని కుటుంబం. తల్లిదండ్రులు మంజుల, శ్రీనివాస్ నిరక్షరాస్యులు. వారికి తెలిసిందల్లా కూలి పనిచేయడం. క్వారీ యజమాని చెప్పిన మాయమాటలకు నమ్మి తెల్లకాగితాలపై వేలిముద్రలు పెట్టి అక్కడ బాండెడ్ లేబర్‌గా మారిపోయారు. రోజుకు 14 గంటల పాటు పని చేస్తూ చిత్రవధను అనుభవించారు.
తల్లిదండ్రులకు సహాయంగా పిల్లలు సైతం చేతులు కలిపేవారు. అక్కడ జరుగుతున్న తంతును గుర్తించిన ఓ సామాజిక కార్యకర్త జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో 2018లో యంత్రాంగం చేసిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా విముక్తి పొందారు. ఆ తర్వాత శ్రీనివాస్ కుటుంబం పొట్ట చేతపట్టుకుని మహబూబ్‌నగర్ టౌన్‌కు వచ్చి గుడిసె వేసుకుని కూలి పనితోనే జీవనం సాగిస్తూ వచ్చింది. ఈ సమయంలోనే పిల్లలకు మెరుగైన జీవితం ఇవ్వాలనే ఆలోచనతో బడికి పంపాలని శ్రీనివాస్ నిర్ణయించుకున్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఇతరుల సాయంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అనూష, నందినిలను చేరి్పంచారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పదోతరగతి పాసయ్యారు. పై చదువులు చదువుకుంటాననే ఆసక్తి వెలిబుచ్చుతూ స్పూర్తిదాయకంగా నిలిచారు.
వాళ్లు చదువుకోకున్నా మమ్మల్ని మాత్రం చదివిస్తున్నారు: నందిని
మాకు ఇల్లు లేదు. క్వారీ ప్రాంతంలో పుట్టి, అక్కడే పెళ్లి చేసుకుని ప్రసవించింది మా అమ్మ. ఒక క్వారీ నుండి మరో క్వారీకి మారుతూ జీవించారు. ఎందుకంటే వారికి తెలిసిన ఏకైక జీవితం అదే. వారికి ఆధార్ కార్డు గురించి తెలియదు. ఓటు వేయడం కూడా తెలియదు. అయినప్పటికీ బాండెడ్ లేబర్ నుంచి విముక్తి పొందిన తర్వాత మమ్మల్ని చదివించాలనే ఆలోచన వచ్చింది. పది పూర్తి చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది.
నర్సు ఉద్యోగం చేస్తా: అనూష
కోవిడ్–19 సమయంలో మా ఇబ్బందులు చెప్పుకునేందుకు మాటలు లేవు. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిపోయాక ఏమీ అర్థం కాకపోయేది. ఇల్లు లేకపోవడంతో పుస్తకాల బ్యాగులు ఎక్కడ దాచుకోవాలో అర్థం కాలేదు. చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు పదోతరగతి పాసవడం ఆనందంగా ఉంది. మా చదువు ఇంతటితో ఆగదు. నర్సు కోర్సు పూర్తి చేయాలని మేమిద్దరం లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.
Comments
Please login to add a commentAdd a comment