
డాక్టర్ విజయ్ మద్దూరి, డాక్టర్ గౌస్(AINU)
బెంగాలీ వ్యక్తికి సొంత కిడ్నీనే అమర్చి ప్రాణాలు కాపాడిన ఏఐఎన్‌యూ వైద్యులు
హైదరాబాద్: ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రి వైద్యులు అసాధారణ శస్త్రచికిత్స చేసి, పశ్చిమబెంగాల్‌కు చెందిన వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. అతడి సొంత మూత్రపిండాన్నే శరీరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు మార్చడంతోపాటు... పూర్తిగా పాడైపోయిన మూత్రనాళం స్థానంలో అపెండిక్స్ ఉపయోగించి అతడి కిడ్నీల పనితీరును సాధారణ స్థితికి తీసుకొచ్చారు.
ఈ వృద్ధుడికి 2023లో వేరేచోట మూత్రపిండాల్లో రాళ్లు తీయడానికి మామూలు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత అతడి మూత్రనాళాలు పూర్తిగా పూడుకుపోయాయి. దాంతో క్రియాటినైన్ ప్రమాదకరంగా పెరిగిపోయి, విపరీతమైన నొప్పి, తరచు జ్వరంతో ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది.
కిడ్నీలు రెండూ పాడైపోవడంతో తాత్కాలికంగా అతడికి ట్యూబులు (నెఫ్రోస్టమీలు) అమర్చి బయటి నుంచి మూత్రం పంపేవారు. పలు రాష్ట్రాలు తిరిగినా ఏ ఆస్పత్రీ చేర్చుకోకపోవడంతో చివరకు హైదరాబాద్ వచ్చారు. సమగ్ర పరీక్షలు చేసిన తర్వాత.. అతడి మూత్రనాళాలు చాలావరకు పూడుకుపోయినట్లు గుర్తించారు. ఇది చాలా అరుదు, సమస్యాత్మకం కూడా.
కుడివైపు కిడ్నీ కోసం వైద్యులు ముందుగా అతడి సొంత అపెండిక్స్ తీసుకుని, పూడుకుపోయిన మూత్రనాళానికి బదులు దాన్ని అమర్చారు. అపెండిక్స్ కూడా మూత్రనాళం పరిమాణంలోనే ఉంటుంది. రోబోటిక్ శస్త్రచికిత్సతో దీన్ని మార్చారు. ఇది చాలా అరుదుగా చేసే చికిత్స. దీన్ని అపెండిక్స్ ఇంటర్‌పొజిషన్ అంటారు.
“మూత్రనాళం బాగా పూడిపోఉయినప్పుడు దాన్ని బాగుచేయడానికి ఇది అత్యంత సృజనాత్మకమైన, మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి. సాధారణంగా ఇలా చేయరు. కానీ ఈ రోగి కేసులో ఇదే సరైన పరిష్కారం” అని ఏఐఎన్‌యూలోని సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జన్,యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ తెలిపారు. ఈ చికిత్స అనంతరం అతడి కుడి కిడ్నీ బాగుపడింది. దాంతో బయట అమర్చిన ట్యూబులను తీసేశారు.
సొంత కిడ్నీ మార్పిడి ఇలా..
రెండు నెలల తర్వాత అతడి ఎడమవైపు కిడ్నీ ఇంకా అలాగే ఉంది. అపెండిక్స్ కుడివైపే ఉంటుంది కాబట్టి రెండోవైపు పేగులను తీసి అమర్చవచ్చు. కానీ, అందులో ఈ వృద్ధుడికి సమస్యలు ఉండడంతో అత్యంత అరుదైన పరిష్కారాన్ని వైద్యులు ఎంచుకున్నారు. అదే.. సొంత కిడ్నీనే మార్చడం. ఈ సంక్లిష్టమైన చికిత్సలో.. రోగి ఎడమ కిడ్నీని రక్తనాళాలతో కలిపి తీశారు. తర్వాత దాన్ని కొంత కిందభాగంలో అమర్చారు. తద్వారా పాడైన మూత్రనాళాన్ని బైపాస్ చేసి, బాగున్న భాగంలోంచి మూత్రం వెళ్లేలా చేశారు.
“సొంత కిడ్నీ మార్పిడి అనేది చాలా పెద్ద ఆస్పత్రుల్లోనే చేస్తారు. ఇది చిట్టచివరి పరిష్కారం. చాలా కచ్చితత్వంతో చేయాల్సిన శస్త్రచికిత్స. అతడి శరీరంలోనే అతడి కిడ్నీకి వేరే ఇల్లు ఇచ్చాం” అని కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ విజయ్ మద్దూరి తెలిపారు. ఇప్పుడా బెంగాలీ వృద్ధుడు పూర్తి సాధారణ స్థితికి చేరుకున్నారు. కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి, క్రియాటినైన్ స్థాయి సాధారణంగా ఉంది. నొప్పి, ఇతర సమస్యలూ తగ్గిపోయాయి.
“ఈ కేసు వైద్యపరంగా ఓ సరికొత్త విజయం. రెండు కిడ్నీలను కాపాడేందుకు రెండు విభిన్న రకాల, అత్యాధునిక శస్త్రచికిత్సలు చేశాం. ఒకదాంట్లో అపెండిక్స్‌ను ఉపయోగించగా, మరోదాంట్లో సొంత కిడ్నీనే మార్చారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఇలా చేసినవాటిలో విజయవంతం అయినవే చాలా తక్కువ” అని ఏఐఎన్‌యూ ఆస్పత్రి ఎండీ డాక్టర్ సి.మల్లికార్జున తెలిపారు. ఈ శస్త్రచికిత్సల్లో డాక్టర్ తైఫ్ బెండెగెరి కూడా పాల్గొన్నారు. రెసిడెంట్ వైద్యులు డాక్టర్ కార్తీక్, డాక్టర్ ఆసిత్ సాయపడ్డారు.