
నేడు ప్రపంచ ఆటిజం అవగాహన దినం
కోపగించుకోవద్దు.. వేరుగా చూడొద్దు
బుద్ధి మాంద్యం కాదు.. మానసిక వైకల్యం అని అనలేం
చిన్నారుల్ని పీడించే, తల్లిదండ్రులను వేధించే ఓ రుగ్మత
ఎందుకొస్తుందో చెప్పలేం.. మందులూ లేవు: నిపుణులు
దేశంలోని 0–9 ఏళ్ల చిన్నారుల్లో 1 నుంచి 1.5 శాతం మందిలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్.. తెలంగాణలో 60 వేల నుంచి 90 వేల మందిలో ఈ రుగ్మత!
బాధితుల్లో బాలురే అధికం.. 2 ఏళ్ల వయస్సు లోపు గనుక గమనిస్తే సులభంగా బయటపడే చాన్స్
థెరపీలే పరిష్కారం.. పుట్టగొడుగుల్లా చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్లు.. ప్రభుత్వ నియంత్రణ లేక భారీగా వసూళ్లు
సుధ (పేరు మార్చాం) ఇద్దరు పిల్లల తల్లి. పిల్లలకు ఏడాదిన్నర వయసు నుంచి మారాం చేసినా, అన్నం తినకపోయినా సెల్‌ఫోన్‌లో వీడియోలు పెట్టి చూపించడం అలవాటు చేసింది. ఐదేళ్ల వయసుకు వచ్చినా ఇద్దరు పిల్లలకు మాటలు సరిగా రాలేదు. ఎవరు ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. వైద్యులను సంప్రదిస్తే ఆటిజం అని చెప్పారు.
రాజ్యలక్ష్మికి నెలలు నిండకుండానే ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇద్దరు కుమారుల్లో ఒకరికి రెండేళ్లు వచ్చే వరకు నడక రాలేదు. వైద్యుల వద్దకు వెళ్లగా ఆటిజం ఉన్నట్టు తేల్చారు. రెండో బాబుకు సమస్య పాక్షికంగా ఉన్నట్టు చెప్పారు.
ఇదో జబ్బు అని చెప్పలేం. బుద్ధి మాంద్యతా అంటే అదీ కాదు. మానసిక వైకల్యం అనీ అనలేం. ఏదో పెద్ద లోపంగా పరిగణించలేం. ప్రత్యేకంగా మందులంటూ ఏమీ లేవు. ఎందువల్ల దీని బారిన పడతారనే దానికి స్పష్టమైన కారణాలూ ఇప్పటివరకు తెలియవు. థెరపీలు, తల్లిదండ్రులకు అవసరమైన కౌన్సెలింగ్ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం. అదే ఆటిజం (సాధారణ పిల్లల్లా లేకపోవడం). ఇది చిన్న పిల్లల్ని పీడించే ఓ రుగ్మత..ఓ సమస్య అని మాత్రమే చెప్పగలమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే ఈ ఆటిజంతో బాధ పడుతున్న కొందరిలో తెలివితేటలు (ఇంటెలిజెన్స్ కోషియంట్– ఐక్యూ) ఒకింత ఎక్కువగా ఉండటం గమనార్హం. కాగా ఇలాంటివారిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోపగించుకోవడం కానీ వేరుగా చూడడం కానీ చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లల్లో ఉండాల్సిన సహజ చురుకుదనం లేమి కారణంగా తల్లిదండ్రులను ఎంతో వేదనకు గురిచేసే ఆటిజంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం మీ కోసం..
ఏంటీ ఆటిజం.. ?
ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మత. అంటే న్యూరలాజికల్ డిజార్డర్‌గా భావించవచ్చు. అంతేగానీ ఓ జబ్బుగా పరిగణించడానికి వీల్లేదు. ఒకే రకమైన/నిర్దిష్ట లక్షణాలుండవు. ఏ ఇద్దరు పిల్లల్లోనూ ఒకేలా ఉండవు. లక్షణాల విస్తృతి చాలా ఎక్కువ. అందుకే దీనిని స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన రుగ్మత) లేదా ఆటిజమ్ స్పెక్ట్రమ్ అని చెబుతుంటారు.
ఎలాంటి లక్షణాలుంటాయి?
» చూడటానికి సాధారణ పిల్లల్లాగే కన్పిస్తుంటారు. కానీ..
» వయసుకు తగిన వికాసం లోపించిందా? అన్పించవచ్చు.
» సాధారణ చిన్నారుల్లా ప్రతిస్పందించకపోవచ్చు. పేరు పెట్టి పిలుస్తున్నా పలుకకపోవచ్చు.
» ఇతరులతో సమాచారం పంచుకోవడం (కమ్యూనికేషన్‌లో ఇబ్బంది), సంభాషిoచడంలో ఇబ్బంది పడుతుండొచ్చు. ఎదుటివారి కళ్లలో కళ్లు కలిపి చూస్తూ మాట్లాడలేరు. ఎంత పిలిచినా పలకకుండా వినికిడి లోపం ఏదైనా ఉందేమో అనిపించేలా ప్రవర్తిస్తారు.
» దాదాపు 25 శాతం మంది చిన్నారులు మాటల్ని సరిగా పలుకలేరు. మాటలు రావడంలో ఆలస్యం అవుతుంది.
» ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంటుండొచ్చు లేదా పలికిన మాటే పదే పదే పలుకుతూ ఉండవచ్చు.
» యాస్పర్జస్ డిజార్డర్ ఉన్న పిల్లల్లో తెలివితేటలు ఒకింత ఎక్కువగా ఉండి, కొన్ని పనుల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.
» కుదురుగా ఉండకుండా ఎప్పుడూ పరుగెడుతూ, గెంతుతూ ఉంటారు.
» నీట్‌గా ఉండకపోవడం. చక్కగా డ్రస్ చేసుకోడానికి,సమయానికి హెయిర్ కట్ చేయించుకోడానికి నిరాకరించడం.
» చేసిన పనులే పదే పదే చేస్తుండటం (రిపిటేటివ్ బిహేవియర్). కొత్త పనులపై ఆసక్తి చూపకపోవడం. ఎప్పుడూ తమకు ఇష్టమైన ఆట వస్తువునో మరొకటో పట్టుకుని ఉండటం.
» గోడలపై ఉన్న సున్నం నాకడం లేదా తినడానికి యోగ్యం కాని పదార్థాలను తినడానికి యత్నించడం (పేపర్లు, షర్ట్ కాలర్ వంటి వాటిని నోట్లో పెట్టుకుని తినడానికి ప్రయత్నించడం లాంటి డిజార్డర్లు).
» పిల్లలు సాధారణంగా చేసే గీతలు గీయడం, రాయడం, కత్తెర వంటి పనిముట్లను ఉపయోగించడం, నమలడం కూడా సరిగా చేయకపోవడం
» సంతోషం, బాధ వంటి భావనలను త్వరగా అర్థం చేసుకోలేరు. వాటిని అర్థమయ్యేలా చెప్పలేరు.
» తలను గోడకు లేదా నేలకేసి బాదుకోవడం, ఇతరులను బలంగా ఢీకొట్టడం,వస్తువులను విసిరేయడం వంటి దురుసు ప్రవర్తనలు కనబరచడం.
రకరకాల థెరపీలతోనే చికిత్స
చిన్నారుల వ్యక్తిగత లక్షణాలూ, భావోద్వేగ పరమైన అంశాలను బట్టి న్యూరో స్పెషలిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, బిహేవియరల్ థెరపిస్టులు ఇలా అనేక మంది స్పెషలిస్టుల సహాయంతో, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ వంటి ప్రక్రియలతో సమీకృత చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు అవసరమైన విద్య అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సికింద్రాబాద్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’(ఎన్‌ఐఈపీఐడీ) వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి.
ఈ చిన్నారుల కనీస స్వావలంబన కోసం పలు సామాజిక సంస్థలు, ఎన్జీవోలు కూడా పనిచేస్తున్నాయి. అటిజమ్ ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, పిల్లలతో గడిపే తీరిక లేకపోవడం, ఎక్కువగా స్క్రీన్‌కు అడిక్ట్ కావడం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.
చదవండి: టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా?