
రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కీలక నిర్ణయం
ప్రస్తుతం మూడేళ్లలోపు ఉన్న వయసు పరిమితి పెంపు
మూగ, వినికిడి లోపమున్న నిరుపేద చిన్నారులకు మేలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మూగ, వినికిడి లోపమున్న చిన్నారులకు అందించే కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సల విషయంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీదైన ఈ చికిత్స చేయించుకొనే చిన్నారుల వయసు పరిమితిని ప్రస్తుతమున్న మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాల్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మేనేజర్లకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే ఈ వైకల్యం గురించి తల్లిదండ్రులకు స్పష్టత వచ్చేసరికే మూడేళ్లు దాటిపోతోంది. దీంతో సుమారు రూ. 8–10 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను నిరుపేదలు వారి పిల్లలకు చేయించలేకపోతున్నారు. ప్రత్యామ్నాయంగా ఉండే వినికిడి పరికరాలతో నెట్టుకొస్తున్నారు. తాజాగా వయసు పరిమితిని ఐదేళ్లకు పెంచడంతో నిరుపేద చిన్నారులకు ఈ చికిత్స ఉచితంగా అందే అవకాశాలున్నాయి.
ఆరోగ్యశ్రీలో చేర్చిన వైఎస్‌ఆర్..
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించినప్పుడు అందులో కాక్లియర్ ఇంప్లాంటేషన్ చికిత్సను చేర్చలేదు. అయితే దీనిపై ఎందరో తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు రావడంతో స్పందించిన ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఈ చికిత్సను ఆరోగ్యశ్రీలో చే ర్చారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద అందించే వైద్య సాయాన్ని రూ.10 లక్షలకు పెంచిం ది.
ఈ పథకంలో అందించే ఉచిత వైద్య చికిత్సలు, సేవల సంఖ్యను 1,835కు పెంచింది. అయితే కొన్ని నిబంధనల కారణంగా నిరుపేదలకు ఈ ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య ట్రస్ట్ కమిటీ దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
బయటకు కనిపించకుండా..
కాక్లియర్ ఇంప్లాంటేషన్ చికిత్సలో భాగంగా చిన్నారుల చెవికి శస్త్రచికిత్స నిర్వహించి ప్రత్యేక పరికరాన్ని చెవిలో అమరుస్తారు. చెవి వెనుక అమర్చిన సౌండ్ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తారు. ఇది ధ్వని సంకేతాలను మెదడుకు పంపుతుంది. ఈ పరికరం జీవితాంతం చెవి లోపలే ఉంటుంది. ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రి, నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు మరో మూడు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ చికిత్సను అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment