Rajiv Aarogyasri
-
సం‘క్షేమమేనా..’!
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. నిన్నామొన్నటి వరకు సమైక్య రాష్ట్రంలో అమలైన సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుం దా లేదా అని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. సంక్షేమ పథకాలపైనే ఆధారపడిన వేలాది కుటుంబాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ఇందిర మ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉపాధి హామీ పథకం, పింఛన్ల పంపిణీ, బంగారు తల్లి వంటి వివిధ సంక్షేమ పథకాలతో జిల్లాలో వేల సంఖ్యలో లబ్ధిదారులు ఉన్నారు. అయితే.. ఈ పథకాల అమలుపై ఇంతవరకు అధికారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. దీంతో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వ పథకాలనే కొనసాగించి అమలు చేస్తే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి గుర్తింపు ఉండదని.. అందుకే కొత్త పథకాలు ప్రవేశపెట్టి లబ్ధిపొందడమో లేదా ఉన్న పథకాలకు మార్పులు చేర్పులు చేయడమో అనే కోణంలో ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు పలువురు నేతలు, అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలు ఓసారి పరిశీలిస్తే.. రాజీవ్ ఆరోగ్యశ్రీ.. నిరుపేదలతోపాటు ఇతరులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు అండగా నిలిచింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్య చికిత్సలు అందుతాయి. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 45 వేల వివిధ రకాల చికిత్సలు జరిగాయి. చికిత్సలకు సుమారు రూ.125 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకం కింద నమోదైన వారు ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందొచ్చు. ఇందిరమ్మ ఇళ్లు.. జిల్లాలో ఇందిరమ్మ పథకం ద్వారా 2006 నుంచి 2009 వరకు మూడు విడతలుగా ఇళ్లు మంజూరయ్యాయి. 2010 నుంచి 2014 వరకు మూడు విడతలుగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం ద్వారా వీటిని మంజూరు చేశారు. దీంతోపాటు రీ హ్యాబిటేషన్, రీ సెటిల్మెంట్ కింద లబ్ధిదారులకు ఇళ్లు వచ్చాయి. జిల్లాకు 2006 నుంచి 2014 వరకు మొత్తం 3,80,787 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,14,912 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. 1,65,875 ఇళ్లు వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయి. దీంతోపాటు రచ్చబండ కార్యక్రమం ద్వారా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు దాదాపు 50 వేలకు పైగా ఉన్నారు. ఉపాధి హామీ పథకం.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఏటా వేసవిలో ఉపాధి భరోసా కల్పించింది. పథకం ప్రారంభం నుంచి గ్రామీణ ప్రజలు దీనిపై ఆధారపడ్డారు. జిల్లాలో ఈ పథకం కింద 31,613 శ్రమశక్తి సంఘాలు పనిచేస్తున్నాయి. 5,71,130 మంది కూలీలు ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. 739 వికలాంగుల శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి. దీని ద్వారా 5,548 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఈ యేడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఉపాధి హామీ పనులు సక్రమంగా కొనసాగలేదు. గతేడాది వేసవిలో రోజుకు 2 లక్షల 50 వేల మంది కూలీలు పని చేశారు. అయితే వీరికి రోజుకు రూ.3 కోట్ల 12 లక్షల 50 వేలు అధికారులు కూలీ చెల్లించారు. పింఛన్లు, అభయహస్తం.. జిల్లాలో 60 ఏళ్లకు పైబడిన వారికి పింఛన్ సౌకర్యం ఉంది. ప్రస్తుతం 2,62,004 మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. వృద్ధాప్య పింఛన్లు పింఛన్లు 1,35,750 ఉండగా, 537 చేనేత, 26,924 వికలాంగ, 79,921 వితంతు, 283 కల్లుగీత కార్మిక పింఛన్లు ఉన్నాయి. దీంతోపాటు అభయహస్తం కింద ప్రతినెలా 18,528 మంది పింఛన్ పొందుతున్నారు. వృద్ధులకు, వితంతువులకు ప్రతినెలా రూ. 200 చొప్పున, వికలాంగులు, అభయహస్తం పింఛన్‌దారులు రూ.500 చొప్పున పింఛన్ తీసుకుంటున్నారు. ఈ లెక్కన ప్రతినెలా రూ.7.75 కోట్లు పింఛన్ల రూపంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. అభయహస్తంలో 1,49,183 మంది మహిళలు నమోదై ఉన్నారు. పింఛన్ డబ్బులు పక్కదారి పట్టకుండా డబ్బులు అర్హులకు అందించేందుకు బయోమెట్రిక్, యాక్సిస్బ్యాంకు, తదితర పద్ధతులను అనుసరిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్.. నిరుపేద విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన మహోన్నత పథకం ఫీజు రీయింబర్స్మెంట్. ఈ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. జిల్లాలో పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ కింద 64,624 మంది ఎస్సీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉన్నారు. వీరిలోంచి 52,738 మంది విద్యార్థులకు ఈ యేడాది స్కాలర్షిప్లు అందాయి. రూ.36.93 కోట్లు విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో అందజేశారు. మిగతా 8,886 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించాల్సి ఉంది. విద్యార్థులకు ఇంకా రూ.27.55 కోట్లు రావాల్సి ఉంది. ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లో ఎస్సీ విద్యార్థులు 22,227 మంది ఉన్నారు. వీరిలోంచి 14,929 మందికి రూ.1.98 కోట్లు అందజేశారు. ఇం కా రూ.1.44 కోట్లు రావాల్సి ఉంది. బీసీ విద్యార్థులు 15,504 మందికిగాను 5,369 మంది స్కాలర్షిప్ పొందారు. వీరికి రూ.53 లక్షలు స్కాలర్షిప్ రూపం లో అందింది. మిగతా 10,135 మంది విద్యార్థులకు సంబంధించి రూ.49 లక్షలు చెల్లించాల్సి ఉంది. -
‘ఆరోగ్య’ ఘోరం...!
ఎన్నికల నిబంధనలతో ‘ఆరోగ్యశ్రీ’ శిబిరాలకు చెక్ పడడంతో అవస్థలు ఎదుర్కొంటున్న పేదలు ఇప్పుడు ‘కోడ్’ కష్టాలు తీరి చికిత్సలందుతాయని ఆశగా చూస్తున్నారు. కార్పొరేట్ వైద్యం కొనుగోలు చేయలేని తమకు మహానేత వై.ఎస్. అందించిన ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు. అధికారులూ శషభిషలు లేకుండా వెంటనే రోగుల గుర్తింపు, చికిత్సలకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఆ లబ్ధిదారులు అర్థిస్తున్నారు. పాలమూరు, న్యూస్‌లైన్: పేదలు అనారోగ్యానికి గురైతే.. కార్పోరేట్ ఆస్పత్రుల్లో బాగు చేయించుకోలేక.. నిరుపేదలు కాటికి వెళ్లే పరిస్థితులున్న రోజులవి. సర్కారు ఆసుపత్రుల్లో తగిన వైద్య సేవలందక ప్రాణాలు కోల్పోతున్న బడుగులకు తామున్నామంటూ... ఆపన్న హస్తం అందించేందుకు ప్రభుత్వ పరంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 2007లో ప్రారంభించారు. పేదలకు అండగా ఉంటూ వారికి ఉచితంగా లక్షల ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తొలి రెండేళ్లలో దీని అమలు తీరు బాగానే ఉన్నప్పటికీ ఆయన మరణానంతరం అధ్వాన్నంగా మారింది. అంతంత మాత్రంగా కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ క్యాంపుల నిర్వహణకు ఇప్పుడు నిన్నటికి ముగిసిన సార్వత్రిక ఎన్నికల ‘కోడ్’ కారణమైంది.ఈ 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ క్యాంపులు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని భావించిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో శిబిరాలను నిర్వహించలేక పోయామని అధికారుల కథనం. ఫలితంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ క్యాంపులతోపాటు అన్నీ నిలచిపోయాయి.వాస్తవానికి 2009 ఎన్నికల సమయంలో కూడా ఆరోగ్యశ్రీ క్యాంపులు నిర్వహించారు. కాకపోతే ‘కోడ్’ మాత్రం ప్రచార కరపత్రాలు, వాల్ పోస్టర్లు, బ్యానర్లపై ఉండే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లోగోలలో దివంగత రాజీవ్‌గాంధీ ఫొటో, పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి ఎన్నికల వల్ల శిబిరాలే నిలచిపోయాయి. ఇదే విషయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ నరేశ్ వెల్లడించారు. ఈ కారణంగా ఒక్కో జిల్లాలో నెలకు 4 క్యాంపుల వంతున 23 జిల్లాల్లో దాదాపు 100 ఆరోగ్యశ్రీ క్యాంపులు రద్దయి 1.50 లక్షల మంది పేద రోగులకు వైద్య సేవలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఏటా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్పొరేట్, ప్రై వేటు ఆసుపత్రుల్లో పైసా ఖర్చు లేకుండా వైద్యసేవలు పొందగా, కేవలం జిల్లాలో వైఎస్ బతికున్న కాలంలో 48,432 మంది కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యాన్ని పొందారు. ఆయన మరణానంతరం ఏటా లబ్దిదారుల సంఖ్య తగ్గుతోంది. పలు చోట్ల ఈ పథకాన్ని అమలు పరుస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా నిధులు సకాలంలో విడుదల కావడం లేదు. దీనికి తోడు ఆరోగ్య శ్రీ పథకం కింద సదరు రోగికి శస్త్ర చికిత్స చేసేందుకు సంబంధిత విభాగం నుంచి అనుమతిస్తే గానీ ప్రై వేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించడం లేదు. ఆర్థిక స్థోమత లేని రోగులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. రోగులను శస్త్ర చికిత్సలకోసం గుర్తించేందుకు ఆరోగ్య శ్రీ శిబిరాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి కాబట్టీ ‘కోడ్’ కూడా ఎత్తేయనున్న నేపథ్యంలో తక్షణం అధికారులు ఈ శిబిరాల నిర్వహణపై దృష్టిసారించాలని పేదలు కోరుతున్నారు. అర్థిక స్థితి దారుణంగా ఉన్న తమకు కార్పొ‘రేట్’ వైద్యశాలలకు వెళ్లే పరిస్థితి ఉండదనీ అలాగని అనారోగ్యంతో ప్రాణాలమీదకు తెచ్చుకోలేమని వెంటనే శిబిరాలు నిర్వహిస్తే చికిత్సలు పొందుతామని పేదలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అధికార యంత్రాంగం ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కల్పన
కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఆరోగ్యశ్రీ సీఈఓ కె.ధనుంజయరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా గజ్వేల్, నర్సాపూర్ పీహెచ్సీ, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, సదాశివపేటలోని వైద్య శిబిరాన్ని సందర్శించినట్టు తెలిపారు. జిల్లా సమస్యలపై కలెక్టర్‌తో చర్చించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సూచిం చినట్టు చెప్పారు. జిల్లాలో 9 నెట్వర్క్ ఆస్పత్రులు పనిచేస్తున్నాయన్నారు. ఇందులో 8 ప్రభుత్వ ఆస్పత్రులు కాగా ఒకటి ఎంఎన్ఆర్ ప్రైవేటు ఆస్పత్రి ఉందన్నారు. ఆస్పత్రులకు పరికరాలను సమకూర్చడంతోపాటు, వైద్యుల కొరతను తీర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తెల్ల రేషన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలకు అర్హులేనన్నారు. రేషన్‌కార్డు లేనివారికి సీఎం క్యాంపు కార్యాల యంతోపాటు రాష్ట్రంలోని వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూల్, కాకినాడలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన లబ్ధిదారుల కార్డులు జారీ చేస్తారని తెలి పారు. 104 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఆరోగ్యపరమైన సూ చనలు, సలహాలు పొందవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1,474 వైద్య శిబిరాలు నిర్వహించి 3 లక్షల పైచి లుకు వారికి స్క్రీనింగ్ చేసి 9,878 మందికి శస్త్రచికిత్స కోసం రిఫర్ చేశామన్నారు. ఇందులో 2,660 నెట్వర్క్ ఆస్పత్రులు పాల్గొన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 61,391 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించి రూ.167 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆరోగ్యమిత్రలు, గ్రామైక్య సంఘాలు, ప్రజాప్రతినిధుల ద్వారా ఆరోగ్యశ్రీ పథకంపై విస్తృత ప్రకారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో జీఎం డాక్టర్ జైకుమార్, విజిలెన్స్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి.రంగారెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సౌజన్య పాల్గొన్నారు. అంతకుముందు సంగారెడ్డిలోని పాత డీఆర్డీఎ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆరోగ్యమిత్రలతో సమావేశమైన అనంతరం కలెక్టర్‌తో సమావేశమై చర్చించారు. ఆస్పత్రి తనిఖీ.. నర్సాపూర్: స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రిలోని ఆరోగ్యమిత్ర కార్యాలయాన్ని ఆరోగ్యశ్రీ పథకం సీఈఓ ధనుంజయరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్యమిత్రల పనితీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని గజ్వేల్, జహీరాబాద్, సదాశివపేట, జోగిపేట ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేస్తారని చెప్పారు. ఆయా ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలను ఈ పథకం ద్వారానే సమకూరుస్తున్నట్టు తెలిపారు. -
కార్పొ‘రేటు’ వైద్యంతో పేదలు విలవిల
సాక్షి, కొత్తగూడెం: జిల్లాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అంపశయ్యపైకి చేరుకుంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.100 కోట్ల మేర ప్రభుత్వం బకాయి ఉండడంతో.. అక్కడ ప్రధాన శస్త్ర చికిత్సలు చేయడానికి వైద్యులు వెనుకంజ వేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులలో సేవలు లేక, కార్పొ‘రేటు’వైద్యం చేయించుకునే స్థోమత లేక పేద రోగులు విలవిలలాడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు కావడం లేదని గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలో 12 లక్షల కుటుంబాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేశా రు. ఈ పథకం ప్రారంభంలో 948 రోగాలకు కార్పొరేట్ వైద్యం అందించేవారు. కానీ కిరణ్ సర్కారు దీన్ని 133 రకాల వ్యాధులకు కుదించింది. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలను పరిశీలించకుండానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేశారు. జిల్లాలో 9 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉండగా, అందులో 3 ప్రైవేట్, ఆరు ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖమ్మంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, సత్తుపల్లి, పెనుబల్లి ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. మిగిలిన మూడు ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలేవి..? సత్తుపల్లి, పెనుబల్లి ఏరియా ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో చేర్చినప్పటికీ అక్కడ నిపుణులైన వైద్యులు, పరికరాలు లేకపోవడంతో రోగులకు ఈ పథకం కింద ఆపరేషన్లు చేయడం లేదు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, పిడియాట్రీషియన్, గైనకాలజిస్ట్, అనస్తీషియాలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగతా విభాగాల నిపుణులు లేకపోవడంతో ఇక్కడి రోగులను హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి జిల్లాలో ఉన్న నెట్వర్క్ ఆస్పత్రులలో ఎంప్యానల్మెంట్ వింగ్ లేకపోవడంతో ఇక్కడ ఆ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు, ఆపరేషన్లు ఇప్పటి వరకు ఒక్కటి కూడా జరగలేదు. పేరుకుపోయిన బిల్లులు... 2008 జూలై నుంచి 2013 జూన్ 17 వరకు జిల్లాలో 52,581 మందికి ఆరోగ్య శ్రీ పథకం కింద వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహించారు. ఇందుకు గాను జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులకు కలిపి రూ.144.99 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇంకా సుమారు రూ.100 కోట్ల మేర చెల్లించాలి. జిల్లాలో నెలకు 900 మందికి పైగా ఆరోగ్యశ్రీ పథకంలో వివిధ రకాల ఆపరేషన్లు చేయించుకుంటున్నట్లు రికార్డులు చెపుతున్నాయి. భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట ప్రాంతాల్లో చాలా మంది రోగులు ఆరోగ్యశ్రీ కార్డులు చూపించి చికిత్స చేయమని అభ్యర్థిస్తున్నా.. ఇప్పటికే పేరుకుపోయిన బిల్లులు రాకపోవడంతో తమవల్ల కాదని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. దీంతో నిరుపేదలు వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అన్ని వసతులున్నా.. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు అంటేనే ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మొహం చాటేస్తుండడంతో... రాజన్న పెట్టిన ఈపథకం మళ్లీ సవ్యంగా ఎప్పుడు నడుస్తుందో అంటూ పేదలు ఆవేదన చెందుతున్నారు.