సాక్షి, కొత్తగూడెం: జిల్లాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అంపశయ్యపైకి చేరుకుంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.100 కోట్ల మేర ప్రభుత్వం బకాయి ఉండడంతో.. అక్కడ ప్రధాన శస్త్ర చికిత్సలు చేయడానికి వైద్యులు వెనుకంజ వేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులలో సేవలు లేక, కార్పొ‘రేటు’వైద్యం చేయించుకునే స్థోమత లేక పేద రోగులు విలవిలలాడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు కావడం లేదని గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
జిల్లాలో 12 లక్షల కుటుంబాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేశా రు. ఈ పథకం ప్రారంభంలో 948 రోగాలకు కార్పొరేట్ వైద్యం అందించేవారు. కానీ కిరణ్ సర్కారు దీన్ని 133 రకాల వ్యాధులకు కుదించింది. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలను పరిశీలించకుండానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేశారు. జిల్లాలో 9 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉండగా, అందులో 3 ప్రైవేట్, ఆరు ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖమ్మంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, సత్తుపల్లి, పెనుబల్లి ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. మిగిలిన మూడు ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలేవి..?
సత్తుపల్లి, పెనుబల్లి ఏరియా ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో చేర్చినప్పటికీ అక్కడ నిపుణులైన వైద్యులు, పరికరాలు లేకపోవడంతో రోగులకు ఈ పథకం కింద ఆపరేషన్లు చేయడం లేదు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, పిడియాట్రీషియన్, గైనకాలజిస్ట్, అనస్తీషియాలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగతా విభాగాల నిపుణులు లేకపోవడంతో ఇక్కడి రోగులను హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి జిల్లాలో ఉన్న నెట్‌వర్క్ ఆస్పత్రులలో ఎంప్యానల్‌మెంట్ వింగ్ లేకపోవడంతో ఇక్కడ ఆ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు, ఆపరేషన్లు ఇప్పటి వరకు ఒక్కటి కూడా జరగలేదు.
పేరుకుపోయిన బిల్లులు...
2008 జూలై నుంచి 2013 జూన్ 17 వరకు జిల్లాలో 52,581 మందికి ఆరోగ్య శ్రీ పథకం కింద వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహించారు. ఇందుకు గాను జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులకు కలిపి రూ.144.99 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇంకా సుమారు రూ.100 కోట్ల మేర చెల్లించాలి. జిల్లాలో నెలకు 900 మందికి పైగా ఆరోగ్యశ్రీ పథకంలో వివిధ రకాల ఆపరేషన్లు చేయించుకుంటున్నట్లు రికార్డులు చెపుతున్నాయి.
భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట ప్రాంతాల్లో చాలా మంది రోగులు ఆరోగ్యశ్రీ కార్డులు చూపించి చికిత్స చేయమని అభ్యర్థిస్తున్నా.. ఇప్పటికే పేరుకుపోయిన బిల్లులు రాకపోవడంతో తమవల్ల కాదని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. దీంతో నిరుపేదలు వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అన్ని వసతులున్నా.. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు అంటేనే ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మొహం చాటేస్తుండడంతో... రాజన్న పెట్టిన ఈపథకం మళ్లీ సవ్యంగా ఎప్పుడు నడుస్తుందో అంటూ పేదలు ఆవేదన చెందుతున్నారు.
కార్పొ‘రేటు’ వైద్యంతో పేదలు విలవిల
Published Wed, Sep 25 2013 4:13 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement