బాబుకది షరా మామూలే! ‘‘చంద్రబాబూ..కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంలో నీకు నీవే సాటి’’ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడిని ఉద్దేశించి తరచూ చేసిన వ్యాఖ్య ఇది. 1999-2004 మధ్యకాలంలో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్ విపక్ష నేత అన్నది తెలిసిన విషయమే. ఆ తర్వాత ఐదేళ్లు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు విపక్ష నేతగా బాబు ఉన్నారు. ఈ సమయంలో ఆయా సందర్భాలలో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలేవి.
వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్నిసార్లు టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను, బాబు చేసిన ప్రకటనల్లోని అబద్ధాలను వేలెత్తి చూపుతూండేవారు. ‘‘అబద్దాలు చెప్పకపోతే తల వెయ్యి ముక్కలవుతుంది అని శాపం ఉంది’’ అని కూడా వైఎస్సార్ ఎద్దేవ చేసేవారు. కానీ చంద్రబాబు మాత్రం తనదైన ధోరణిలోనే ప్రసంగాలు సాగిస్తుండేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అసత్యమైనా తన అవసరానికి తగ్గట్టు మాట్లాడేవారని చెప్పాలి.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అబద్ధాలు చెప్పి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు ఎక్కువసార్లు సఫలమయ్యారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఆ తరువాత ఇంకో మాట మాట్లాడటం విషయంలో ముప్పై ఏళ్ల క్రితం మాదిరిగానే ఇప్పుడూ బాబు ఉన్నారు. అబద్దాల విషయంలో స్థిరత్వం పాటించిన నేత అన్నమాట! చంద్రబాబు తాజా ప్రసంగం ఒకటి వింటే ఔరా అనిపిస్తుంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను తెగ ఊరించిన ఆయన వీటితోపాటు మేనిఫెస్టోలో మరో 175 హామీలు ఇచ్చారు. అధికారంలోకి రావడంతోనే అమలు చేస్తామని, సంపద సృష్టించడం తనకు తెలుసు అంటూ నమ్మబలికారు. లోకేష్, పవన్‌కళ్యాణలు కూడా బాబు వాగ్ధానాలను ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చారు.
సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు అవుతాయా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రబాబు... ‘‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’’ అని ప్రకటించేశారు. అరె... తమకు తెలియకుండా అన్ని హామీలెప్పుడు అమలు చేశారబ్బా అని ముక్కున వేలేసుకోవడం ప్రజల వంతైంది. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలు బాగా పనిచేశాయంటే అర్థం చేసుకోవచ్చు. అవి ఉత్తుతివే అని అందరూ అనుకుంటున్నప్పుడు ఎన్నికల సంగతి ఎవరూ ప్రస్తావించరు. అందుకే హామీలన్నీ అమలు చేసేశామన్న భ్రమ కల్పించేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారని అనుకోవాలి. అయితే వృద్ధుల ఫించన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం మినహా మరే ఇతర హామీ అమలు కాలేదన్నది వాస్తవం. పైగా... లక్షల మంది ఫించన్లకు కోత పెట్టిన తరువాత కానీ మొత్తం పెంపు జరగలేదు.
ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. ఎంతమందికి నిజంగా అందిందన్నది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారనుకున్నా, మరో నాలుగు నెలల వరకు ఆ ఊసే ఎత్తడానికి వీలు లేదు. అంటే నెలకు రూ. 200ల చొప్పున రాయితీ మాత్రమే ఇచ్చారన్నమాట. ఇతర వాగ్దానాలు అమలు చేయకుండానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందని అడిగితే సమాధానం మాత్రం బాబూ అండ్ కో నుంచి ఉండదు. ఇదేం న్యాయమని అడిగితే వారి గొంతు నొక్కేందుకు పోలీసులు కేసులు బనాయించేస్తారు. కేసులు వస్తాయి. జైలుపాలు కావాల్సి ఉంటుంది. మహిళా శక్తి పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికీ రూ.1500 చొప్పున ఇస్తామని అప్పట్లో ప్రచారమైతే చేశారు కానీ.. ఇచ్చింది సున్నా! తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని.. గతంలో జగన్ కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఇస్తే తాము ఎంతమంది ఉంటే అంతమందికీ ఇస్తామని ఊదరగొట్టారు.
ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు వస్తాయని, ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని కూడా చంద్రబాబు ఉచిత సలహా ఇచ్చిన విషయం ఎవరూ మరచిపోలేదు కానీ అధికారంలోకి వచ్చాక ఒక విద్యార్ధికి ఈ పథకం అంది ఉంటే ఒట్టు! రైతు భరోసా కింద ప్రతి రైతుకు జగన్ హయాంలో ఇచ్చిన రూ.13500 కాకుండా రూ.20 వేల చొప్పున ఇస్తామన్న హామీ గురించి అసలు మాట్లాడటమే లేదిప్పుడు. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ప్రజలు బిత్తరపోవడం తప్ప చేసేది ఏముంటుంది. ఇక నిరుద్యోగుల సంగతి సరేసరి.ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని, అంతవరకు నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామన్న భృతి కూడా ఇప్పటివరకూ అమలు కాలేదు. ఇవి కాకుండా మానిఫెస్టోలో వలంటీర్ల కొనసాగింపు, వారి జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం, బీసీ, ఎస్సీఎస్టీ వర్గాల వారికి యాభై ఏళ్లకే రూ.4 వేల చొప్పున ఫించన్, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్న హామీ కూడా అమలు కాకపోగా.. అసలుకే మోసం వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.
వలంటీర్ల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలు పోగా.. ప్రజలపై రూ.15 వేల కోట్ల కరెంటు ఛార్జీల భారం పడింది. బహుశా చంద్రబాబు సృష్టిస్తానన్న సంపద ఇలా జనాలపై బాదడం ద్వారానే అనుకోవడం ప్రజల వంతైంది. ఒకపక్క ప్రజలకు పైసా విదల్చని ప్రభుత్వం ఇంకోపక్క వారానికి వారం కొత్త కొత్త అప్పులు తెచ్చుకుంటున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏడు నెలల వ్యవధిలోనే లక్ష కోట్ల రూపాయల అప్పులు తేవడం ఆర్థిక వేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 1996 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఇలాగే అలివికానీ హామీలు బోలెడన్ని చేసి ఎన్నికల తరువాత అన్నీ తూచ్ అనేశారు.
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని 2014లో హామీ ఇచ్చిన బాబు తరువాత ఎన్ని పిల్లిమొగ్గలు వేసింది ఇటీవలి అనుభవమే. ప్రత్యేక తెలంగాణ అంశంలో చూసుకున్నా, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్‌ఎస్, బీజేపీలతో జత కట్టే అంశంలో గమనించినా, ఎన్నికల పొత్తులలో పలు భిన్నమైన విధానాలు కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా, అన్ని అవకాశవాద రాజకీయాలు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు.
కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment