వైద్యం వికటించి విద్యార్థిని మృతి
జగ్గంపేట ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం
టీడీపీ నేతల సెటిల్‌మెంట్!
జగ్గంపేట: ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది మిడిమిడి జ్ఞానం ఓ విద్యార్థిని ఉసురు పోసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 16 ఏళ్ల బాలికకు.. వేరే గ్రూపు రక్తం ఎక్కించి ఆమె ప్రాణాలు పోవడానికి కారకులయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. ప్రకాశం జిల్లాకు చెందిన ఆ బాలిక కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పోలీస్‌స్టేషన్ వెనుక ప్రాంతంలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అనారోగ్యంతో ఆమెను రెండు రోజుల క్రితం జగ్గంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.
ఆమెకు అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అయితే, ఆ సమయానికి ఆస్పత్రి వైద్యుడు రాజమహేంద్రవరంలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన ఇచ్చిన సలహాలతో జగ్గంపేట ఆస్పత్రి సిబ్బంది రక్తం ఎక్కించారు. అయితే బాధిత బాలిక బ్లడ్ గ్రూపు ఒకటి అయితే, సిబ్బంది మరో గ్రూపు రక్తం ఎక్కించడంతో ఆరోగ్యం వికటించింది.
ఈ క్రమంలో మూత్రంలో నుంచి, నోటి నుంచి రక్తం రావడంతో సిబ్బంది కంగారు పడి, రాజమహేంద్రవరంలో ఉన్న డాక్టర్‌కు సమాచారమిచ్చారు. ఆ డాక్టర్ సూచన మేరకు ఆ బాలికను తక్షణం రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మంగళవారం రాత్రి బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఆమె బంధువులు ఆందోళన చేయడంతో రాజమహేంద్రవరానికి చెందిన ఒక టీడీపీ నేత ఎటువంటి కేసులు లేకుండా సెటిల్‌మెంట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment