ఎన్నికల నిబంధనలతో ‘ఆరోగ్యశ్రీ’ శిబిరాలకు చెక్ పడడంతో అవస్థలు ఎదుర్కొంటున్న పేదలు ఇప్పుడు ‘కోడ్’ కష్టాలు తీరి చికిత్సలందుతాయని ఆశగా చూస్తున్నారు. కార్పొరేట్ వైద్యం కొనుగోలు చేయలేని తమకు మహానేత వై.ఎస్. అందించిన ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు. అధికారులూ శషభిషలు లేకుండా వెంటనే రోగుల గుర్తింపు, చికిత్సలకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఆ లబ్ధిదారులు అర్థిస్తున్నారు.
పాలమూరు, న్యూస్‌లైన్: పేదలు అనారోగ్యానికి గురైతే.. కార్పోరేట్ ఆస్పత్రుల్లో బాగు చేయించుకోలేక.. నిరుపేదలు కాటికి వెళ్లే పరిస్థితులున్న రోజులవి. సర్కారు ఆసుపత్రుల్లో తగిన వైద్య సేవలందక ప్రాణాలు కోల్పోతున్న బడుగులకు తామున్నామంటూ... ఆపన్న హస్తం అందించేందుకు ప్రభుత్వ పరంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 2007లో ప్రారంభించారు. పేదలకు అండగా ఉంటూ వారికి ఉచితంగా లక్షల ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తొలి రెండేళ్లలో దీని అమలు తీరు బాగానే ఉన్నప్పటికీ ఆయన మరణానంతరం అధ్వాన్నంగా మారింది. అంతంత మాత్రంగా కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ క్యాంపుల నిర్వహణకు ఇప్పుడు నిన్నటికి ముగిసిన సార్వత్రిక ఎన్నికల ‘కోడ్’ కారణమైంది.ఈ 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ క్యాంపులు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని భావించిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో శిబిరాలను నిర్వహించలేక పోయామని అధికారుల కథనం. ఫలితంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ క్యాంపులతోపాటు అన్నీ నిలచిపోయాయి.వాస్తవానికి 2009 ఎన్నికల సమయంలో కూడా ఆరోగ్యశ్రీ క్యాంపులు నిర్వహించారు.
కాకపోతే ‘కోడ్’ మాత్రం ప్రచార కరపత్రాలు, వాల్ పోస్టర్లు, బ్యానర్లపై ఉండే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లోగోలలో దివంగత రాజీవ్‌గాంధీ ఫొటో, పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి ఎన్నికల వల్ల శిబిరాలే నిలచిపోయాయి. ఇదే విషయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ నరేశ్ వెల్లడించారు. ఈ కారణంగా ఒక్కో జిల్లాలో నెలకు 4 క్యాంపుల వంతున 23 జిల్లాల్లో దాదాపు 100 ఆరోగ్యశ్రీ క్యాంపులు రద్దయి 1.50 లక్షల మంది పేద రోగులకు వైద్య సేవలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
ఏటా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య
ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్పొరేట్, ప్రై వేటు ఆసుపత్రుల్లో పైసా ఖర్చు లేకుండా వైద్యసేవలు పొందగా, కేవలం జిల్లాలో వైఎస్ బతికున్న కాలంలో 48,432 మంది కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యాన్ని పొందారు. ఆయన మరణానంతరం ఏటా లబ్దిదారుల సంఖ్య తగ్గుతోంది. పలు చోట్ల ఈ పథకాన్ని అమలు పరుస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా నిధులు సకాలంలో విడుదల కావడం లేదు. దీనికి తోడు ఆరోగ్య శ్రీ పథకం కింద సదరు రోగికి శస్త్ర చికిత్స చేసేందుకు సంబంధిత విభాగం నుంచి అనుమతిస్తే గానీ ప్రై వేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించడం లేదు.
ఆర్థిక స్థోమత లేని రోగులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. రోగులను శస్త్ర చికిత్సలకోసం గుర్తించేందుకు ఆరోగ్య శ్రీ శిబిరాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి కాబట్టీ ‘కోడ్’ కూడా ఎత్తేయనున్న నేపథ్యంలో తక్షణం అధికారులు ఈ శిబిరాల నిర్వహణపై దృష్టిసారించాలని పేదలు కోరుతున్నారు. అర్థిక స్థితి దారుణంగా ఉన్న తమకు కార్పొ‘రేట్’ వైద్యశాలలకు వెళ్లే పరిస్థితి ఉండదనీ అలాగని అనారోగ్యంతో ప్రాణాలమీదకు తెచ్చుకోలేమని వెంటనే శిబిరాలు నిర్వహిస్తే చికిత్సలు పొందుతామని పేదలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అధికార యంత్రాంగం ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
‘ఆరోగ్య’ ఘోరం...!
Published Fri, May 2 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM
Advertisement
Advertisement