pallamuru
-
పునశ్చరణేదీ..!
పాఠ్యాంశాలు మారాయి. పదో తరగతి విద్యార్థులకు సృజనాత్మక బోధన చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇందుకు ఉపక్రమించింది. వాటిని విద్యార్థులకు చేర్చాల్సిన ‘గురువులకు’ పునశ్చరణ జరగక పోవడంతో అసలు ఉద్దేశ్యం నెరవేరే అవకాశం లేదు. వారు పట్టు సాధిస్తేనే శిష్యులను తీర్చి దిద్దగలరు. ఈ అంశంపై మీన మేషాలు లెక్కిస్తున్న విద్యాశాఖ ఇప్పటి వరకూ శిక్షణపై పెదవి విప్పడం లేదు. విలువైన విద్యాసంవత్సరంలోనే ఇందుకు ఉపక్రమిస్తే బోధనాకాలం కొంత నష్టపోయినట్టే. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. పాలమూరు, న్యూస్‌లైన్ : అసలు సమయం వృథా చేయడం.. ఆ తర్వాత హడావుడి చేయ డం విద్యాశాఖకు అలవాటుగా మారింది. ఈ కారణంగానే ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంపై ఏమాత్రం ఊసెత్తడం లేదు. ఈ విద్యా సంవత్సరానికి పదోతరగతి సిలబస్ పూర్తిగా మారిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా శిక్షణ కార్యక్రమం చేపట్టాల్సి ఉండగా.. కనీసం ఎప్పటి నుంచి ఇవ్వనున్నది జిల్లా స్థాయి అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రతీ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంపొందించడంతోపాటు పాఠ్యాంశాల మార్పుపై పూర్తిస్థాయి అవగాహన వచ్చేందుకు పునశ్చరణ తరగతులు చేపట్టాలి. ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేందుకు కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ శిక్షణపై ఎలాంటి సమాచారం లేదు. ‘వేసవి’లోనే చేపట్టాల్సి ఉన్నా... ప్రాథమిక విద్య బలోపేతంలో భాగంగానే విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి వేసవి సెలవుల్లో అధ్యాపకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా 1-8 తరగతుల్లో బోధించే వారికి విడతల వారీగా గతంలో పాఠ్యాం శాల మార్పు. నైపుణ్యాలపై శిక్షణ అందించారు. గడిచిన ఏడాదిలో జిల్లా నుంచి 80 మంది టీచర్లను ఎంపిక చేసి రాష్ట్ర స్థా యిలో శిక్షణ అందించాక.. తిరిగి జిల్లాలోని అన్ని మండల వనరుల కేంద్రాల వారీగా మిగిలిన వారికి వారి ద్వారా శిక్షణ ఇప్పించారు. ఈ ప్రక్రియ మొత్తం జూన్ తొలి వారంలోగా పూర్తవ్వాలి.ఈ మారు రాష్ట్రంలో గవర్నర్ పాలన ఉండటం, రా ష్ట్ర విభజన ప్రక్రియ జరిగిన నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు దీన్ని పట్టిం చుకోలేదు. వాస్తవానికి మే 28 నుంచి పునశ్చరణ తరగతులు నిర్వహిస్తామని ఆర్వీఎం జిల్లా అధికారులకు ఇదివరకే మౌఖిక ఆదేశాలు అందాయి. ఆ తర్వాత ఆ ప్రస్తావనే లేదు. ఒకవైపు వి ద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండటంతో సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. సిలబస్‌లో ఊహించని మార్పులు పదోతరగతి సిలబస్‌లో ఎస్సీఈఆర్టీ ఊహించని మార్పులు తీసుకొచ్చింది. ఇది విద్యార్థులకు ఎంతో మేలు కలిగే అంశమే అయినప్పటికీ వారికి అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయులకు సిలబస్‌పై పట్టురాలేదు. ఇప్పటికే మారి న పాఠ్య పుస్తకాలు అన్ని పాఠశాలలకు చేరాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కాగానే తరగతులు ప్రారంభించటమే తరువాయి. ఈ సమయంలో కొత్త పాఠ్యాంశంపై ఏమాత్రం అవగాహన లేని ఉపాధ్యాయులు ఏమేరకు బోధిస్తారన్నది ప్రశ్నార్థకమే. మరోవైపు జూన్ నెలాఖరులో శిక్షణ తరగతులు అందించే అవకాశాలు ఉన్నట్లు రాజీవ్ విద్యామిషన్ అధికారులు చెప్తున్నారు. ఆ సమయంలో శిక్షణ అందించినా మొత్తం మీద విద్యా సంవత్సరంలో నెలరోజుల సమయం వృథాకాక తప్పదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనివల్ల పదోతరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రైవేటు పాఠశాలలు ముందస్తుగా తమ ఉపాధ్యాయులను బోధనకు సిద్ధం చేసుకోవటం ప్రభుత్వ పాఠశాలలపై ఉన్నతాధికారులకు ఉన్న శ్రద్ధ ఏమిటో తెలుస్తోంది. ఆదేశాలు వచ్చాక శిక్షణ ఇస్తాం మారిన పదోతరగతి సిలబస్‌కు అనుగుణంగా బోధిం చే లా ఉపాధ్యాయులు శిక్షణ చేపట్టాల్సి ఉంది. తొందరలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. అయితే దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశా లు రావాల్సి ఉంది. ఆ తర్వాతే దీనిపై షెడ్యూల్ సిద్ధం చేసి శిక్షణ ఇస్తాం. - డీఈఓ చంద్రమోహన్ విద్యా సంవత్సరం వృథా అవుతుంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలంటే మారిన సిలబస్‌పై ఉపాధ్యాయులకు మే నెలలోపే శిక్షణ ఇవ్వాల్సి ఉండేది. అధికారులు తర్వాత శిక్షణ చేపట్టడం వల్ల రెగ్యులర్ తరగతులకు ఆటంకం ఏర్పడుతుంది. దీనికి తోడు పదోతరగతి విద్యార్థులకు విద్యాసంవత్సరం వృథా అవుతుంది. - గట్టు వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు. -
అనురాధకే ‘ఓటు’ !
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: పాలమూరు జిల్లా పరిషత్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీనేతలు వ్యూహరచన చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఎలాగైనా జెడ్పీ కుర్చీని కైవసం చేసుకుని స్థానిక సంస్థలను గుప్పిట్లో ఉంచుకోవాలన్న తాపత్రయంతో ఆ పార్టీ నాయకులు ఎత్తుకు, పైఎత్తు లు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజార్టీ రావడంతో కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల మనుగడను దెబ్బతీయాలని దూకుడుతో ఉన్న టీఆర్ఎస్కు కళ్లె వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సతీమణి డాక్టర్ అనూరాధను ఈ పదవికి ఎంపికచేసినట్లు డీసీసీ వర్గాలు తెలిపాయి. గద్వాలలో తన ఉనికికి భంగం కలిగించడానికి కేసీఆర్‌తో సహా జిల్లా టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరుపట్ల మాజీమంత్రి డీకే అరుణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మునిసిపాలిటీల్లో టీఆర్ఎస్ పాగా వేయకుండా అడ్డుకోవడానికి డీకే వర్గం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పార్టీల సిద్ధాంతాలు వేరైనప్పటికీ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నందున కాంగ్రెస్, బీజేపీలు జెడ్పీ, మునిసిపాలిటీ పాలకవర్గాలను సాధించుకుని జిల్లాలో అధికార పార్టీని పాలనాపరంగా ఎదుర్కొనేందుకు లోపాయికారీ ఒప్పందం కుదిరిందని ఆ రెండు పార్టీల వర్గాలు వెల్లడిస్తున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పరస్పరం పంచుకుని పట్టును నిలుపుకోవడానికి అన్నిమార్గాలను అన్వేషించే పనిలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ అనూరాధ జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేని ఎక్స్అఫీషియో సభ్యత్వాలు మాత్రమే ఉండటంతో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఎప్పుడైనా ప్రారంభం కావచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని నిర్ణయించడానికి బుధవారం హైదారాబాద్‌లోని లక్డీకాపూల్‌లో గల ఓ హోటల్లో డీసీసీ నేతలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అయితే తమకు సహకరించే పార్టీకి వైస్ చైర్మన్ పదివిని వదలిపెట్టాల్సి వస్తుందన్న భావంతో వైస్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయాన్ని సమావేశంలో చర్చించకపోవడం గమనార్హం. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొనగా ఐఏసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, డాక్టర్ వంశీచంద్‌రెడ్డి డీసీసీ నిర్ణయానికి ఫోన్ ద్వారా మద్దతు తెలిపినట్లు కాంగ్రెస్ నేతలు ‘న్యూస్‌లైన్’కు వెల్లడించారు. -
అమలు ఏదీ..?
పాలమూరు, న్యూస్‌లైన్ : అనారోగ్యానికి గురై అనారోగ్యానికి గురైతే తక్కువ ధరలకు వారికి మందులు అందజేసేందుకు ఉపకరించిఏ జన ఔషధి దుకాణాలు జిల్లాలో ఎక్కడా కనిపించడంలేదు. అనారోగ్యం బారిన పడ్డ పేదల జేబులకు చిల్లులు పడకుండా ఆయా కంపెనీల జనరిక్ మందుల్ని తక్కువ ధరలకు ఇవ్వాలన్నది ఈ దుకాణాల ఉద్దేశం. అయితే ఇది ఆచరణ రూపం దాల్చక పోవడంతో పేదలు మందుల కొనుగోలుకు భారీ చెల్లించాల్సి వస్తోంది. అవగాహనా చర్యలే లేవు.. జన ఔషధిల ఏర్పాటుకు జిల్లాలో పలువురు సంసిద్ధంగా ఉన్నప్పటికీ.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వీటి ఏర్పాటులో అవగాహన కల్పించడంలేదు. వాటి ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. జిల్లాలోని కేంద్ర ఆస్పత్రితోపాటు అన్ని ఏరియా ఆసుపత్రుల వద్ద ఈ మందుల దుకాణాలను ఏర్పాటుచేసేందుకు అర్హులైన వారిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికిగాను 14 మార్చి 2011లో ప్రభుత్వం జీవో నంబర్ 54 విడుదల చేసింది. జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కన్వీనర్‌గా ఒక కమిటీ ఏర్పాటుచేసి వీరంతా జన ఔషధి మందుల దుకాణాల ఏర్పాటును పర్యవేక్షించాల్సి ఉంది. జనరిక్ మందుల గురించి వాటివల్ల కలిగే ప్రయోజనాల గురించి పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రచారం చేసి ప్రజలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు, జిల్లా సమాఖ్యలు, రెడ్‌క్రాస్ సొసైటీ, ఇతర స్వచ్చంద సంస్థలవారు, నిరుపేద వర్గాల మహిళలు ఈ తరహా దుకాణాల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాల్సి ఉంది. తొలుత ఏరియా ఆస్పత్రులు తర్వాత మండల కేంద్రాల్లో వీటి ఏర్పాటుకు నిర్ణయించగా ఇంతవరకు ఏరియా ఆస్పత్రుల్లోనే ఏర్పాటు చేయలేదు. ఒక్క దుకాణంతో సరి... జిల్లా కేంద్ర ఆస్పత్రివద్ద మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జీవన్‌ధార పేరిట ఓ మందుల దుకాణాన్ని ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. సామాన్యుడికి తక్కువ ధరల్లో ఎక్కువ రకాల ఔషధాలు వినియోగించుకునేందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన జన సంజీవనిలో ఔషధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇక్కడ 252 రకాల మందులు అందుబాటులో ఉండాలి. జిల్లా ఆసుపత్రికి వచ్చేరోగులకు వైద్యులు రాస్తున్న చాలా రకాల మందులు ఇక్కడ లభించడం లేదు. దీంతో వారు బయటి మందుల దుకాణాల్లో తక్కువ ధరలకు వచ్చే మందులను సైతం ఎక్కువ ధరలకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి నిరుపేదల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోని ఈ దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశాం.. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో ఈ తరహా మందుల దుకాణాన్ని ఏర్పాటు చేశాం. ఇంకా అన్ని ఏరియా ఆస్పత్రులు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిపై ఏరియా ఆస్పత్రుల సమన్వయ అధికారి పర్యవేక్షిస్తారు. విజయవంతంగా నడుస్తుంటే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వాటి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తాం. - స్వామి, డీఎంఅండ్‌హెచ్‌వో -
‘ప్రత్యేకం’.. ఫలితమిచ్చేనా..!
ఇప్పటి వరకూ చదువుల్లో వెనుకబడి ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి వారున్న ‘సీ’ గ్రేడునుంచి ముందుకు వెళ్లేలా చేసేందుకు ఆర్వీఎం కసరత్తు ప్రారంభించింది. ఏడాదంతా కష్టించినా రాని ఫలితం కేవలం 25 రోజుల వేసవి శిక్షణలో ఎలా సాధ్యమన్నది కొందరి ప్రశ్న. వాటన్నింటికీ తమ శ్రమతోనే సమాధానం చెప్తామని జిల్లా విద్యాశాఖ అంటోంది. ఈ మేరకు వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులకూ అవగాహన కల్పిస్తోంది. లక్ష్య సాధనకు కృషిచేస్తోంది. పాలమూరు, న్యూస్‌లైన్ : చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను గాడిన పెట్టేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి నిలిపింది. అందులో భాగంగానే.. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు అభ్యసన స్థాయిలో వెనుకబడి ఉన్న విద్యార్థులకు ఈనెల 10 నుంచి వేసవి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఆర్వీఎం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదంతా టీచర్లు సాధించలేని ఫలితాలను ఈ 25 రోజుల్లో ప్రతీరోజు కేవలం 2 గంటల పాటు ఇచ్చే ప్రత్యేక శిక్షణతోనే ఎలా అధిగమిస్తారన్నది ప్రశ్నగా మారింది. జిల్లాలోని ప్రతి క్టస్టర్ (పాఠశాలల సముదాయం) పరిధిలో 50 మంది వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఆటపాటలతో వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న వర్క్ పుస్తకాల ఆధారంగా వారి కృత్యాలను పెంపొందించి సీ గ్రేడ్ విద్యార్థులను ఏ గ్రేడ్‌లోకి మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1, 2 తరగతుల్లో 25 మంది, 3, 4, 5 తరగతుల్లో 25 మంది సి గ్రేడ్ విద్యార్థులను గుర్తించి ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలోని 353 క్లస్టర్లలోని 706 కేంద్రాల్లో సీఆర్పీల ద్వారా శిక్షణ తరగతులు ప్రారంభించనున్నామని, ప్రత్యేకంగా రూపొందించిన వర్క్ బుక్ ద్వారా విద్యార్థులను మెరుగుపర్చేందుకు దృష్టిపెట్టామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు అవగాహన వేసవి శిక్షణ తరగతుల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే వెనుకబడి ఉన్న విద్యార్థుల తల్లి దండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ప్రతీరోజు విద్యార్థులను పాఠశాలకు వచ్చేలా చూడాలని, పిల్లల విద్య పురోగతికి సహకరించాలని తల్లిదండ్రులకు సీఆర్పీలు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల సమ్మతితోనే వేసవి శిక్షణ తరగుతులు ప్రారంభిస్తున్నట్లు ఆర్వీఎం అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 10 లోపు ‘సి’ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులకు గుర్తింపు కార్యక్రమం పూర్తి చేసి 10 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు రెండు గటల పాటు వివిధ నైపుణ్యాలతో విద్యార్థుల స్థాయిని పెంపొందించి జూన్ 10 వరకు అందరు విద్యార్థులతో సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల్లో స్థాయిని పెంచేందుకే : డీఈఓ చంద్రమోహన్ వెనుకబడి ఉన్న విద్యార్థుల్లో స్థాయిని, వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వేసవి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, సీఆర్పీలు సహకరించాలి. అప్పుడే ఈ కార్యక్రమం విజయవంతమై వెనుకబడిన విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది. -
‘ఆరోగ్య’ ఘోరం...!
ఎన్నికల నిబంధనలతో ‘ఆరోగ్యశ్రీ’ శిబిరాలకు చెక్ పడడంతో అవస్థలు ఎదుర్కొంటున్న పేదలు ఇప్పుడు ‘కోడ్’ కష్టాలు తీరి చికిత్సలందుతాయని ఆశగా చూస్తున్నారు. కార్పొరేట్ వైద్యం కొనుగోలు చేయలేని తమకు మహానేత వై.ఎస్. అందించిన ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు. అధికారులూ శషభిషలు లేకుండా వెంటనే రోగుల గుర్తింపు, చికిత్సలకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఆ లబ్ధిదారులు అర్థిస్తున్నారు. పాలమూరు, న్యూస్‌లైన్: పేదలు అనారోగ్యానికి గురైతే.. కార్పోరేట్ ఆస్పత్రుల్లో బాగు చేయించుకోలేక.. నిరుపేదలు కాటికి వెళ్లే పరిస్థితులున్న రోజులవి. సర్కారు ఆసుపత్రుల్లో తగిన వైద్య సేవలందక ప్రాణాలు కోల్పోతున్న బడుగులకు తామున్నామంటూ... ఆపన్న హస్తం అందించేందుకు ప్రభుత్వ పరంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 2007లో ప్రారంభించారు. పేదలకు అండగా ఉంటూ వారికి ఉచితంగా లక్షల ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తొలి రెండేళ్లలో దీని అమలు తీరు బాగానే ఉన్నప్పటికీ ఆయన మరణానంతరం అధ్వాన్నంగా మారింది. అంతంత మాత్రంగా కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ క్యాంపుల నిర్వహణకు ఇప్పుడు నిన్నటికి ముగిసిన సార్వత్రిక ఎన్నికల ‘కోడ్’ కారణమైంది.ఈ 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ క్యాంపులు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని భావించిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో శిబిరాలను నిర్వహించలేక పోయామని అధికారుల కథనం. ఫలితంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ క్యాంపులతోపాటు అన్నీ నిలచిపోయాయి.వాస్తవానికి 2009 ఎన్నికల సమయంలో కూడా ఆరోగ్యశ్రీ క్యాంపులు నిర్వహించారు. కాకపోతే ‘కోడ్’ మాత్రం ప్రచార కరపత్రాలు, వాల్ పోస్టర్లు, బ్యానర్లపై ఉండే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లోగోలలో దివంగత రాజీవ్‌గాంధీ ఫొటో, పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి ఎన్నికల వల్ల శిబిరాలే నిలచిపోయాయి. ఇదే విషయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ నరేశ్ వెల్లడించారు. ఈ కారణంగా ఒక్కో జిల్లాలో నెలకు 4 క్యాంపుల వంతున 23 జిల్లాల్లో దాదాపు 100 ఆరోగ్యశ్రీ క్యాంపులు రద్దయి 1.50 లక్షల మంది పేద రోగులకు వైద్య సేవలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఏటా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్పొరేట్, ప్రై వేటు ఆసుపత్రుల్లో పైసా ఖర్చు లేకుండా వైద్యసేవలు పొందగా, కేవలం జిల్లాలో వైఎస్ బతికున్న కాలంలో 48,432 మంది కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యాన్ని పొందారు. ఆయన మరణానంతరం ఏటా లబ్దిదారుల సంఖ్య తగ్గుతోంది. పలు చోట్ల ఈ పథకాన్ని అమలు పరుస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా నిధులు సకాలంలో విడుదల కావడం లేదు. దీనికి తోడు ఆరోగ్య శ్రీ పథకం కింద సదరు రోగికి శస్త్ర చికిత్స చేసేందుకు సంబంధిత విభాగం నుంచి అనుమతిస్తే గానీ ప్రై వేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించడం లేదు. ఆర్థిక స్థోమత లేని రోగులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. రోగులను శస్త్ర చికిత్సలకోసం గుర్తించేందుకు ఆరోగ్య శ్రీ శిబిరాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి కాబట్టీ ‘కోడ్’ కూడా ఎత్తేయనున్న నేపథ్యంలో తక్షణం అధికారులు ఈ శిబిరాల నిర్వహణపై దృష్టిసారించాలని పేదలు కోరుతున్నారు. అర్థిక స్థితి దారుణంగా ఉన్న తమకు కార్పొ‘రేట్’ వైద్యశాలలకు వెళ్లే పరిస్థితి ఉండదనీ అలాగని అనారోగ్యంతో ప్రాణాలమీదకు తెచ్చుకోలేమని వెంటనే శిబిరాలు నిర్వహిస్తే చికిత్సలు పొందుతామని పేదలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అధికార యంత్రాంగం ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘చిరు’ భరోసా..!
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘చిరు వ్యాపారుల’ బిల్లుతో జిల్లాలో సుమారు 8వేలమందికి పైగా మేలు చేకూరనుంది. వారి హక్కులకు రక్షణ లభించనుంది. కొత్త పథకాలు అందుబాటులోకి వచ్చి బతుకుకు భరోసా లభించనుంది. ఈ దిశగా జిల్లాలో చర్యలు ప్రారంభం కావడంతో ఫలితాలకోసం ఆ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. పాలమూరు, న్యూస్‌లైన్ : పట్టణాలు, మున్సిపాలిటీ వీధుల్లో పొద్దంతా తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తూ, కుటుంబాలను పోషించుకునే చిరు వ్యాపారులకు బాసటగా నిలిచే ప్రత్యేక బిల్లుకు పార్లమెంటు అమోదించడంతో జిల్లాలో ఉన్న సుమారు 8వేలమందికి పైగా ఉన్న వారు లబ్దిపొందనున్నారు . పట్టణంలో ఎక్కడ బండి పెట్టినా స్థానిక పోలీసులు, పురపాలక సంఘ అధికారులు,సమీపంలోని భవన యజమానులతో వారికి ఇబ్బందులు ఉండేవి. వీరందరినీ నిత్యం అభద్రతాభావం వెంటాడుతోంది. వీరిలో చాలా వరకు పండ్లు అమ్ముకునే బండ్లు, కూరగాయలు, ఇడ్లీ, ఫాస్ట్‌ఫుడ్, ఇతరాలు, ఆయా సామాగ్రిని తోపుడు బళ్లతో విక్రయిస్తుంటారు. వీరంతా పురపాలక సంస్థలకు నిర్ణీత రుసుము రోజువారీ లెక్కన చెల్లిస్తున్నా వారికి సరైన రక్షణ లేదు. ఎప్పుడైనా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైనప్పుడు పోలీసుల ప్రతాపానికి చిరు వ్యాపారులు అవస్థ పడేవారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించి వీధి వ్యాపారులకు సౌకర్యాలు కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీరికోసం ఉద్దేశించిన బిల్లు కారణంగా దశాబ్దాల కాలంగా ఒకే ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు యంత్రాంగం చర్యలు చే పట్టింది. ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూలన విభాగం చర్యలు ప్రారంభించింది. మహబూబ్‌నగర్‌తోపాటు నారాయణపేట, గద్వాల, వనపర్తి, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, జడ్చర్ల, కొల్లాపూర్, అచ్చంపేట, అయిజ మున్సిపాలిటీలు, ఇతర పట్టణాల్లోని వీధి వ్యాపారుల వివరాలను సేకరించి.. వారి వ్యాపారాలకు భరోసా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అర్హులను గుర్తించి, వీరికి రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులతో చర్చించి అనుమతి పొందుతారు. స్వయం సహాయక సంఘాలకు అనుసంధానం చేసి వీరి పురోగతి కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టనున్నారు. ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో .. పురపాలక సంస్థ పరిధిలో ఉన్న వీధి వ్యాపారులు రేషన్, వాటర్, ఆధార్ వంటి గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. దశాబ్దాల కాలానికి మించి ఒకే చోట వ్యాపారం చేస్తున్న వారిని స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేస్తారు. వారికి బీమా సౌకర్యం కల్పిస్తారు. లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో 10 మంది, 1.50 లక్షలలోపు జనాభా ఉన్న చోట 15 మంది, మూడు లక్షలు జనాభా ఉంటే 20 మందితో ప్రత్యేక కమిటీలు వేస్తారు. ఈ బందాలు వీధి వ్యాపారుల హక్కులు, వారి వ్యాపారానికి ఆధారం కల్పించడానికి కషి చేస్తాయి. మెప్మా పర్యవేక్షణలో.. మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలను సిద్ధం చేసింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలోనే ఈ సర్వేను చేపట్టి వీధి వ్యాపారులను లెక్కించారు. వీరంతా ఎన్నేళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారు. తదితర వివరాలను సేకరించారు. గతంతో పోలిస్తే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా సమగ్ర వివరాలను సేకరించేందుకు ఆయా శాఖలు సిద్ధమవుతున్నాయి. కొత్త బిల్లు ప్రకారం..! పట్టణ వ్యాపార సంఘం నుంచి ప్రతీ వీధి వ్యాపారి ఒక ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఈ పత్రం ఉన్న వారిని తొలగించడానికి వీలుండదు. గుర్తించిన వారిని సమూహాలుగా ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమాలు వ్యక్తిగత సహాయక సమూహం (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) మాదిరిగా నిర్వహణ చేపడతారు. వీరికి ప్రభుత్వం తరఫున వివిధ పథకాలను వర్తింప చేస్తారు. ఇళ్ల నిర్మాణం, స్థలాల కేటాయింపు, రుణాలు, ఇతర సౌకర్యాల కల్పన తదితర చర్యలుంటాయి. వ్యాపారుల నేపథ్యాలను అనుసరించి సీఆర్పీల ద్వారా సర్వే చేయించి కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగానే వారికి రుణాలు మంజూరు చేస్తారు. -
లెక్కల్లో అన్నీ.. పరికరాలే కొన్ని..!
పాలమూరు, న్యూస్‌లైన్ : ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రవేశపెట్టిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్.. కాకిలెక్కల పథకంలా మారింది. ప్రభుత్వ బడుల్లో గ్రంథాలయ పుస్తకాలు, ప్రయోగశాలల ఏర్పాటు తదితరాలు సమకూర్చి విద్యా ప్రమాణాలను పెంచడం.. రేపటి పౌరులను తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘ఆర్‌ఎంఎస్‌ఏ’ అమలు అధ్వానమవుతోంది. గతంలో ఈ పథకం ద్వారా 6,7,8 తరగతుల విద్యార్థులకోసం ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. వాటిని ఇప్పటికీ చూపడం విశేషం. ఇప్పటి వరకు రూ.6.29 కోట్లు మంజూరై వాటిని వినియోగించినప్పటికీ.. పాఠశాలల్లో ఎక్కడా అంత మొత్తానికి తగ్గా పరికరాలుగాని, వస్తువులుగానీ కనపించడం లేదు. భవనాల నిర్మాణంతోపాటు పరికరాలు, ఇతరత్రా నిధులపై ఆజమాయిషీ లేకపోవడంతో కిందిస్థాయిలో ఆడిందే ఆటగా మారింది. నిధుల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఏటా ఉద్యోగోన్నతులు, బదిలీలు, ఉద్యోగ విరమణ వంటి సమయాల్లో నోడ్యూస్ పత్రాలను తీసుకోక పోవడం, రికార్డుల నిర్వహణలో అవకతవకలు ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిధుల విడుదల ఇలా..! 2009-10లో 590 పాఠశాలలకు రూ.7,425 వంతున రూ.43.80లక్షలు ఇచ్చారు. ఇందులో దాదాపు 25 పాఠశాలల నుంచి వినియోగ ధ్రువీకరణ పత్రాలు ఇంకా ఇవ్వలేదు. 2010-11లో రూ.34,250 వంతున 590 పాఠశాలలకు రూ.2.02కోట్లు విడుదలయ్యాయి. ఆ నిధులను ఖర్చు పెట్టిన 45 పాఠశాలల నుంచి యూసీలు రాలేదు. 2011-12లో 590 పాఠశాలలకు రూ. 50వేల వంతున రూ.2,95 కోట్లు ఇచ్చారు. ఇంకా 60 పాఠశాలల నుంచి నిధులను ఖర్చు పెట్టినట్లు వినియోగతపత్రం ఇవ్వలేదు. 2012-13లో 590 పాఠశాలలకు రూ. 15వేల వంతున రూ. 88.50లక్షలు కేటాయించగా.. 2013-14కు గాను రూ.55 లక్షలు కేటాయించారు. ఇందుకు సంబంధించిన నిధుల వినియోగంపై ఎటువంటి సమాచారం లేదు. ఖర్చులకు లెక్కే లేదు..! ప్రయోగ శాలలకు ఇచ్చిన నిధులతో గణితం, సామాన్య శాస్త్రం పరికరాలు కొనుగోలు చేయడానికి నిర్దేశిత కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సిందే. ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక కిట్ ఉండాలి. వీటిలో రూ.20-30వేల వరకు వెచ్చించారు. ఆర్వీఎంలో 6-8 వరకు ప్రయోగశాలలకు నిధులు ఇచ్చారు. దాదాపుగా రూ. 25వేలను కేటాయించారు. చాలా వరకు కొనుగోలు చేశారు. అయినా ఈ కోటా నిధులు ఇవ్వడంతో వాటిని మళ్లీ చూపించే అవకాశం ఉంది. అలాగే చేస్తున్నారని సమాచారం. పుస్తకాల కొనుగోలులో తెలుగు అకాడమీ సూచించిన 23 రకాల పుస్తకాలు, జాతీయ పుస్తక ప్రచురణ సంస్థ, ఎన్సీఈఆర్టీ సూచించిన ఇరవై రకాల పుస్తకాలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ఆర్వీఎంలో కొనుగోలు చేసిన పుస్తకాలను ఈ పథకంలో చూపించి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కంప్యూటర్ విద్యకు ఐఈజీ (ఈ-గవర్నెన్స్)తో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. అయినా మళ్లీ ఇంటర్ నెట్ పెట్టుకోవడానికి ఈ పథకంలో అవకాశం ఇవ్వడంతో నిధుల దుబారాకు అవకాశం కలిగినటై ్లంది.