పాలమూరు, న్యూస్‌లైన్ : అనారోగ్యానికి గురై అనారోగ్యానికి గురైతే తక్కువ ధరలకు వారికి మందులు అందజేసేందుకు ఉపకరించిఏ జన ఔషధి దుకాణాలు జిల్లాలో ఎక్కడా కనిపించడంలేదు. అనారోగ్యం బారిన పడ్డ పేదల జేబులకు చిల్లులు పడకుండా ఆయా కంపెనీల జనరిక్ మందుల్ని తక్కువ ధరలకు ఇవ్వాలన్నది ఈ దుకాణాల ఉద్దేశం. అయితే ఇది ఆచరణ రూపం దాల్చక పోవడంతో పేదలు మందుల కొనుగోలుకు భారీ చెల్లించాల్సి వస్తోంది.
అవగాహనా చర్యలే లేవు..
జన ఔషధిల ఏర్పాటుకు జిల్లాలో పలువురు సంసిద్ధంగా ఉన్నప్పటికీ.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వీటి ఏర్పాటులో అవగాహన కల్పించడంలేదు. వాటి ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. జిల్లాలోని కేంద్ర ఆస్పత్రితోపాటు అన్ని ఏరియా ఆసుపత్రుల వద్ద ఈ మందుల దుకాణాలను ఏర్పాటుచేసేందుకు అర్హులైన వారిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికిగాను 14 మార్చి 2011లో ప్రభుత్వం జీవో నంబర్ 54 విడుదల చేసింది. జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కన్వీనర్‌గా ఒక కమిటీ ఏర్పాటుచేసి వీరంతా జన ఔషధి మందుల దుకాణాల ఏర్పాటును పర్యవేక్షించాల్సి ఉంది.
జనరిక్ మందుల గురించి వాటివల్ల కలిగే ప్రయోజనాల గురించి పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రచారం చేసి ప్రజలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు, జిల్లా సమాఖ్యలు, రెడ్‌క్రాస్ సొసైటీ, ఇతర స్వచ్చంద సంస్థలవారు, నిరుపేద వర్గాల మహిళలు ఈ తరహా దుకాణాల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాల్సి ఉంది. తొలుత ఏరియా ఆస్పత్రులు తర్వాత మండల కేంద్రాల్లో వీటి ఏర్పాటుకు నిర్ణయించగా ఇంతవరకు ఏరియా ఆస్పత్రుల్లోనే ఏర్పాటు చేయలేదు.
ఒక్క దుకాణంతో సరి...
జిల్లా కేంద్ర ఆస్పత్రివద్ద మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జీవన్‌ధార పేరిట ఓ మందుల దుకాణాన్ని ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. సామాన్యుడికి తక్కువ ధరల్లో ఎక్కువ రకాల ఔషధాలు వినియోగించుకునేందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన జన సంజీవనిలో ఔషధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి.
ఇక్కడ 252 రకాల మందులు అందుబాటులో ఉండాలి. జిల్లా ఆసుపత్రికి వచ్చేరోగులకు వైద్యులు రాస్తున్న చాలా రకాల మందులు ఇక్కడ లభించడం లేదు. దీంతో వారు బయటి మందుల దుకాణాల్లో తక్కువ ధరలకు వచ్చే మందులను సైతం ఎక్కువ ధరలకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి నిరుపేదల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోని ఈ దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశాం..
జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో ఈ తరహా మందుల దుకాణాన్ని ఏర్పాటు చేశాం. ఇంకా అన్ని ఏరియా ఆస్పత్రులు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిపై ఏరియా ఆస్పత్రుల సమన్వయ అధికారి పర్యవేక్షిస్తారు. విజయవంతంగా నడుస్తుంటే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వాటి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తాం.
- స్వామి, డీఎంఅండ్‌హెచ్‌వో
అమలు ఏదీ..?
Published Sat, May 10 2014 2:52 AM | Last Updated on Tue, Oct 9 2018 7:08 PM
Advertisement
Advertisement