‘చిరు’ భరోసా..! | By the central government, 'small traders' democracy | Sakshi
Sakshi News home page

‘చిరు’ భరోసా..!

Published Sat, Feb 22 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

By the central government, 'small traders' democracy

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘చిరు వ్యాపారుల’ బిల్లుతో జిల్లాలో సుమారు 8వేలమందికి పైగా మేలు చేకూరనుంది. వారి హక్కులకు రక్షణ లభించనుంది. కొత్త పథకాలు అందుబాటులోకి వచ్చి బతుకుకు భరోసా లభించనుంది. ఈ దిశగా జిల్లాలో చర్యలు ప్రారంభం కావడంతో ఫలితాలకోసం ఆ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.
 
 పాలమూరు, న్యూస్‌లైన్ : పట్టణాలు, మున్సిపాలిటీ వీధుల్లో పొద్దంతా తోపుడు  బండ్లపై వ్యాపారం చేస్తూ, కుటుంబాలను పోషించుకునే చిరు వ్యాపారులకు బాసటగా నిలిచే ప్రత్యేక బిల్లుకు పార్లమెంటు అమోదించడంతో జిల్లాలో ఉన్న సుమారు 8వేలమందికి పైగా ఉన్న వారు లబ్దిపొందనున్నారు . పట్టణంలో ఎక్కడ బండి పెట్టినా స్థానిక పోలీసులు, పురపాలక సంఘ అధికారులు,సమీపంలోని భవన యజమానులతో వారికి ఇబ్బందులు ఉండేవి.  వీరందరినీ నిత్యం అభద్రతాభావం వెంటాడుతోంది. వీరిలో చాలా వరకు పండ్లు అమ్ముకునే బండ్లు, కూరగాయలు, ఇడ్లీ, ఫాస్ట్‌ఫుడ్, ఇతరాలు, ఆయా సామాగ్రిని తోపుడు బళ్లతో విక్రయిస్తుంటారు. వీరంతా పురపాలక సంస్థలకు నిర్ణీత రుసుము రోజువారీ లెక్కన చెల్లిస్తున్నా వారికి సరైన రక్షణ లేదు. ఎప్పుడైనా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైనప్పుడు పోలీసుల ప్రతాపానికి చిరు వ్యాపారులు అవస్థ పడేవారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించి వీధి వ్యాపారులకు సౌకర్యాలు కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది.
 
 వీరికోసం ఉద్దేశించిన బిల్లు కారణంగా  దశాబ్దాల కాలంగా ఒకే ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు యంత్రాంగం చర్యలు చే పట్టింది. ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూలన విభాగం  చర్యలు ప్రారంభించింది. మహబూబ్‌నగర్‌తోపాటు నారాయణపేట, గద్వాల, వనపర్తి, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, జడ్చర్ల, కొల్లాపూర్, అచ్చంపేట, అయిజ మున్సిపాలిటీలు, ఇతర పట్టణాల్లోని వీధి వ్యాపారుల వివరాలను సేకరించి.. వారి వ్యాపారాలకు భరోసా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అర్హులను గుర్తించి, వీరికి రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులతో చర్చించి అనుమతి పొందుతారు. స్వయం సహాయక సంఘాలకు అనుసంధానం చేసి వీరి పురోగతి కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టనున్నారు.
 ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ..
 పురపాలక సంస్థ పరిధిలో ఉన్న వీధి వ్యాపారులు రేషన్, వాటర్, ఆధార్ వంటి గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. దశాబ్దాల కాలానికి మించి ఒకే చోట వ్యాపారం చేస్తున్న వారిని స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేస్తారు. వారికి బీమా సౌకర్యం కల్పిస్తారు. లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో 10 మంది, 1.50 లక్షలలోపు జనాభా ఉన్న చోట 15 మంది, మూడు లక్షలు జనాభా ఉంటే 20 మందితో ప్రత్యేక కమిటీలు వేస్తారు. ఈ బందాలు వీధి వ్యాపారుల హక్కులు, వారి వ్యాపారానికి ఆధారం కల్పించడానికి కషి చేస్తాయి.
 
 మెప్మా  పర్యవేక్షణలో..
 మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలను సిద్ధం చేసింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలోనే ఈ సర్వేను చేపట్టి వీధి వ్యాపారులను లెక్కించారు. వీరంతా ఎన్నేళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారు. తదితర వివరాలను సేకరించారు. గతంతో పోలిస్తే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా సమగ్ర వివరాలను సేకరించేందుకు ఆయా శాఖలు సిద్ధమవుతున్నాయి.
 
 కొత్త బిల్లు ప్రకారం..!
  పట్టణ వ్యాపార సంఘం నుంచి ప్రతీ వీధి వ్యాపారి ఒక ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి.
  ఈ పత్రం ఉన్న వారిని తొలగించడానికి వీలుండదు.
  గుర్తించిన వారిని సమూహాలుగా ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమాలు వ్యక్తిగత సహాయక సమూహం (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) మాదిరిగా నిర్వహణ చేపడతారు.
 
  వీరికి ప్రభుత్వం తరఫున వివిధ పథకాలను వర్తింప చేస్తారు.
  ఇళ్ల నిర్మాణం, స్థలాల కేటాయింపు, రుణాలు, ఇతర సౌకర్యాల కల్పన తదితర చర్యలుంటాయి.
 
  వ్యాపారుల నేపథ్యాలను అనుసరించి సీఆర్పీల ద్వారా సర్వే చేయించి కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగానే వారికి రుణాలు మంజూరు చేస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement