అనురాధకే ‘ఓటు’ !
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: పాలమూరు జిల్లా పరిషత్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీనేతలు వ్యూహరచన చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఎలాగైనా జెడ్పీ కుర్చీని కైవసం చేసుకుని స్థానిక సంస్థలను గుప్పిట్లో ఉంచుకోవాలన్న తాపత్రయంతో ఆ పార్టీ నాయకులు ఎత్తుకు, పైఎత్తు లు వేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజార్టీ రావడంతో కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల మనుగడను దెబ్బతీయాలని దూకుడుతో ఉన్న టీఆర్‌ఎస్‌కు కళ్లె వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సతీమణి డాక్టర్ అనూరాధను ఈ పదవికి ఎంపికచేసినట్లు డీసీసీ వర్గాలు తెలిపాయి.
గద్వాలలో తన ఉనికికి భంగం కలిగించడానికి కేసీఆర్‌తో సహా జిల్లా టీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరుపట్ల మాజీమంత్రి డీకే అరుణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మునిసిపాలిటీల్లో టీఆర్‌ఎస్ పాగా వేయకుండా అడ్డుకోవడానికి డీకే వర్గం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
పార్టీల సిద్ధాంతాలు వేరైనప్పటికీ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నందున కాంగ్రెస్, బీజేపీలు జెడ్పీ, మునిసిపాలిటీ పాలకవర్గాలను సాధించుకుని జిల్లాలో అధికార పార్టీని పాలనాపరంగా ఎదుర్కొనేందుకు లోపాయికారీ ఒప్పందం కుదిరిందని ఆ రెండు పార్టీల వర్గాలు వెల్లడిస్తున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పరస్పరం పంచుకుని పట్టును నిలుపుకోవడానికి అన్నిమార్గాలను అన్వేషించే పనిలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉన్నారు.
కాంగ్రెస్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ అనూరాధ
జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేని ఎక్స్‌అఫీషియో సభ్యత్వాలు మాత్రమే ఉండటంతో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఎప్పుడైనా ప్రారంభం కావచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని నిర్ణయించడానికి బుధవారం హైదారాబాద్‌లోని లక్డీకాపూల్‌లో గల ఓ హోటల్‌లో డీసీసీ నేతలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.
అయితే తమకు సహకరించే పార్టీకి వైస్ చైర్మన్ పదివిని వదలిపెట్టాల్సి వస్తుందన్న భావంతో వైస్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయాన్ని సమావేశంలో చర్చించకపోవడం గమనార్హం. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొనగా ఐఏసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, డాక్టర్ వంశీచంద్‌రెడ్డి డీసీసీ నిర్ణయానికి ఫోన్ ద్వారా మద్దతు తెలిపినట్లు కాంగ్రెస్ నేతలు ‘న్యూస్‌లైన్’కు వెల్లడించారు.