‘ప్రత్యేకం’.. ఫలితమిచ్చేనా..! | Government school students should move forward in studies | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేకం’.. ఫలితమిచ్చేనా..!

Published Thu, May 8 2014 3:46 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

Government school students should move forward in studies

ఇప్పటి వరకూ చదువుల్లో వెనుకబడి ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి వారున్న ‘సీ’ గ్రేడునుంచి ముందుకు వెళ్లేలా చేసేందుకు ఆర్‌వీఎం కసరత్తు ప్రారంభించింది. ఏడాదంతా కష్టించినా రాని ఫలితం కేవలం 25 రోజుల వేసవి శిక్షణలో ఎలా సాధ్యమన్నది కొందరి ప్రశ్న. వాటన్నింటికీ తమ శ్రమతోనే సమాధానం చెప్తామని జిల్లా విద్యాశాఖ అంటోంది. ఈ మేరకు వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులకూ అవగాహన కల్పిస్తోంది. లక్ష్య సాధనకు కృషిచేస్తోంది.
 
 పాలమూరు, న్యూస్‌లైన్ : చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను గాడిన పెట్టేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి నిలిపింది. అందులో భాగంగానే.. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు అభ్యసన స్థాయిలో వెనుకబడి ఉన్న విద్యార్థులకు ఈనెల 10 నుంచి వేసవి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఆర్‌వీఎం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదంతా టీచర్లు సాధించలేని ఫలితాలను ఈ 25 రోజుల్లో ప్రతీరోజు కేవలం 2 గంటల పాటు  ఇచ్చే  ప్రత్యేక శిక్షణతోనే ఎలా అధిగమిస్తారన్నది ప్రశ్నగా మారింది. జిల్లాలోని ప్రతి క్టస్టర్ (పాఠశాలల సముదాయం) పరిధిలో 50 మంది వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఆటపాటలతో వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న వర్క్ పుస్తకాల ఆధారంగా వారి కృత్యాలను పెంపొందించి సీ గ్రేడ్ విద్యార్థులను ఏ గ్రేడ్‌లోకి మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1, 2 తరగతుల్లో 25 మంది, 3, 4, 5 తరగతుల్లో 25 మంది సి గ్రేడ్ విద్యార్థులను గుర్తించి ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలోని 353 క్లస్టర్లలోని 706 కేంద్రాల్లో సీఆర్‌పీల ద్వారా శిక్షణ తరగతులు ప్రారంభించనున్నామని, ప్రత్యేకంగా రూపొందించిన వర్క్ బుక్ ద్వారా విద్యార్థులను మెరుగుపర్చేందుకు దృష్టిపెట్టామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
 
 తల్లిదండ్రులకు అవగాహన
 వేసవి శిక్షణ తరగతుల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే వెనుకబడి ఉన్న విద్యార్థుల తల్లి దండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ప్రతీరోజు విద్యార్థులను పాఠశాలకు వచ్చేలా చూడాలని, పిల్లల విద్య పురోగతికి సహకరించాలని తల్లిదండ్రులకు సీఆర్‌పీలు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల సమ్మతితోనే వేసవి శిక్షణ తరగుతులు ప్రారంభిస్తున్నట్లు ఆర్‌వీఎం అధికారులు పేర్కొంటున్నారు.
 ఈనెల 10 లోపు ‘సి’ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులకు గుర్తింపు కార్యక్రమం పూర్తి చేసి 10 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు రెండు గటల పాటు వివిధ నైపుణ్యాలతో విద్యార్థుల స్థాయిని పెంపొందించి జూన్ 10 వరకు అందరు విద్యార్థులతో సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
 
 విద్యార్థుల్లో స్థాయిని పెంచేందుకే : డీఈఓ చంద్రమోహన్
 వెనుకబడి ఉన్న విద్యార్థుల్లో స్థాయిని, వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వేసవి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, సీఆర్‌పీలు సహకరించాలి. అప్పుడే ఈ కార్యక్రమం విజయవంతమై వెనుకబడిన విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement