
ఏలూరు మండలం మాదేపల్లె క్లస్టర్ సమావేశాలకు హాజరైన నలుగురు సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయులు, ఒక ఫిజికల్ డైరెక్టర్
4,034 క్లస్టర్లకుగాను 2,809 చోట్లే టీచర్ల కాంప్లెక్స్ సమావేశాలు
విద్యారంగంలో మార్పుల పేరిట లక్ష్యానికి తూట్లు
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో మార్పుల పేరిట కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు వ్యతిరేక ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల(government schools) విలీనంపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రాగా.. తాజాగా క్లస్టర్ కాంప్లెక్స్‌ల నిర్వహణ తీరుపై ఉపాధ్యాయులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పాఠ్యాంశాలపై చర్చలు లేకుండా కేవలం ఆన్ౖలెన్ లింక్ ద్వారా టీచర్లు పాఠ్యాంశాలు వినేందుకే పరిమితం చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,809 కాంప్లెక్స్ క్లస్టర్లలో శనివారం మధ్యాహ్నం నుంచి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు.
ఇవి గతానికి భిన్నంగా కొనసాగడంపై ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా, సాయంత్రం 5 గంటల వరకే సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ 6 గంటల వరకు నిర్వహించారు. అటెండెన్స్ మాత్రం 5 గంటలకే క్లోజ్ చేశారని, ఆ తర్వాత ముఖ ఆధారిత హాజరు పనిచేయలేదని, ఇది టీచర్లను వేధించడమేనని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలోని పాఠశాల విద్యా శాఖలో కీలకమైన స్కూల్ కాంప్లెక్స్‌ల స్థానంలో క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 4,034 కాంప్లెక్స్‌లను 2,809కి తగ్గించి క్లస్టర్ కాంప్లెక్స్‌లుగా మార్చారు. వీటిలోనే ఉపాధ్యాయ సమావేశాలకు అనుమతించారు. మరో 1,225 కాంప్లెక్స్‌లను డమ్మీలుగా మాత్రమే ఉంచారు.
ప్రతి క్లస్టర్‌కి గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని 10 నుండి 15 పాఠశాలలు, పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 10 కి.మీ పరిధిలోని 8 నుంచి 10 పాఠశాలలు అనుసంధానం చేశారు. ప్రతి క్లస్టర్‌లో 40 నుంచి 50 మంది ఉపాధ్యాయులతో కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు.
ఇందులో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, పాఠశాలల మధ్య విద్య అనుసంధానం, విద్యా వనరుల సామగ్రి తయారీ, తనిఖీలు, విద్యా వ్యవస్థ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలు ప్రత్యక్షంగా నిర్వహించాల్సి ఉంది. కానీ తొలి సమావేశం కేవలం ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో పాఠాలు వినేందుకే పరిమితం చేశారు. గతంలో ఓ సబ్జెక్టుపై ఉపాధ్యాయుల మధ్య లోతైన చర్చ జరిగి, విద్యార్థులకు సరికొత్త బోధన విధానాలను అందించేవారు. నేడు అదే ఉపాధ్యాయ వర్గాన్ని కేవలం కొందరు చెబితే వినేందుకే పరిమితం చేశారు.
ఉపాధ్యాయులపై ఒత్తిడి
ప్రతి నెలా మూడో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి ఉపాధ్యాయుడు హాజరుకావాలని పాఠశాల విద్య డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం మధ్యాహ్నం 2,809 కస్లర్లలో మధ్యాహ్నం ఒంటి పూట స్కూల్ కాంప్లెక్స్ విధానం అమలుల్లోకి వచ్చింది.
ప్రాథమిక, సెకండరీ ఉపాధ్యాయులకు వేర్వేరు అజెండా విడుదల చేశారు. అయితే, శనివారమే 10వ తరగతి ప్రీఫైనల్ గణిత పరీక్ష ఉండటం, ఉదయంపూట మధ్యాహ్న భోజనం విధులు ఉండటంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరిగింది. ఉదయం 8.45 నుంచి 12 వరకు పాఠశాలల్లో పనిచేసిన టీచర్లు మధ్యాహ్నం 15 కిలోమీటర్ల దూరంలోని క్లస్టర్‌కు పరుగులు పెట్టాల్సి వచ్చింది.
నీరుగారిన లక్ష్యం
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లకు కలిపి కొద్దిసేపు, వేర్వేరుగా మరికొద్దిసేపు సమావేశం నిర్వహించడంతో అసలు లక్ష్యం నీరుగారింది. ఒకటి, రెండు తరగతుల టీచర్లకు ప్రత్యేక సమావేశం పెట్టారు. 3, 4, 5 తరగతుల టీచర్లకు వేరొక గదిలో, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు మరొక గదిలో సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్న సమయం ఊపిరి తీశారు. చర్చలకంటే లింకులతోనే సమావేశం మొత్తం పూర్తి చేశారు. గతంలో సబ్జెక్టు టీచర్లకు నియోజకవర్గం స్థాయిలో ఒక్కో సబ్జెక్టుకు ఒక స్కూల్లో సమావేశం జరిగేది. 40 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లు వీటికి హాజరై సబ్జెక్టుపై లోతైన చర్చ చేసేవారు.
ప్రస్తుత సమావేశాలకు సబ్జెక్టు టీచర్లు నలుగురికి మించకపోవడంతో చర్చలకు ఆస్కారమే లేకుండా పోయింది. పైగా నాలుగు గంటల సమావేశంలో ఉన్నతాధికారుల సందేశాలకు గంట ఇచ్చారు.
ఉపాధ్యాయుల బోధనాంశాలపై 30 నుంచి 45 నిమిషాలే కేటాయించారు. బోధనాంశాలపై ఐఎఫ్‌పీలపై క్లిప్పింగ్‌లు చూపించారేగాని, విషయ పరిజ్ఞానంపై లోతైన చర్చకు అవకాశం ఇవ్వలేదు. కొన్ని చోట్ల నెట్ పనిచేయక ఫోన్లలో చూడాల్సిన పరిస్థితి. మోడల్ లెసన్ ప్లాన్స్, టీఎల్‌ఎం, కొత్త పద్ధతులపై చర్చలే లేవు. ఇలా స్కూల్ కాంప్లెక్స్‌లకు నిర్దేశించిన ఆరు సెషన్లు మొక్కుబడిగా ముగిసినట్టు సమాచారం.
ఇంత నిర్బంధమా?
స్కూల్ కాంప్లెక్స్‌లు అంటే ఉపాధ్యాయులు నిర్బంధ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పెళ్లిళ్లు, వివిధ కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉన్నా విద్యా శాఖ సెలవు ఇవ్వకపోవడం దుర్మార్గం. ఉపాధ్యాయులు అంటే ఇంత అలుసా? ఉత్తర్వుల ప్రకారం సాయంత్రం 5 గంటలకు ముగించాల్సిన సమావేశాలు 6 గంటల వరకు కూడా కొనసాగించారు.
టీచర్లు హాజరు వేసుకునేందుకు మాత్రం 5 గంటల వరకే అవకాశం కల్పించారు, ఇదేం విధానం? మధ్యాహ్నం వరకు పాఠశాలలో ఉండి వెంటనే క్లస్టర్ స్కూల్స్ కాంప్లెక్స్‌కు వెళ్లాల్సిరావడంతో టీచర్లు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. ఇది ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడమే. – లెక్కల జమాల్‌రెడ్డి, ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఇవేం కాంప్లెక్స్ సమావేశాలు?
మధ్యాహ్నం వరకు పాఠశాలలో పనిచేసి, మధ్యాహ్న భోజనం తర్వాత సమావేశాలకు హాజరు కావడం ఇబ్బందిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగాల్సిన సమావేశాలను రోజులో సగమే నిర్వహించడం ఏమిటి? క్లస్టర్ పరిధిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండే ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల సబ్జెక్టు టీచర్లకు ఏవిధంగా ఉపయోగకరమో అధికారులు చెప్పాలి. ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేసే ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తున్నాం. – కె.శ్రీనివాసులు, టి.చందనరావు స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టొద్దు
క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల క్లోజింగ్ టైమ్ సాయంత్రం 5 గంటలకే అన్నా 6 గంటల వరకు నిర్వహించారు. అయినా అటెండెన్స్ పడకుండా టీచర్‌లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 6 వరకు దాదావు 10 గంటల పాటు విరామం లేకుండా షెడ్యూల్ ఇచ్చి, పాఠశాలలు, క్లస్టర్ సమావేశాలు నిర్వహించాలనడం దారుణం. రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎంతో ఇబ్బంది తలెత్తింది. – మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు, టీఎన్‌యూఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
Comments
Please login to add a commentAdd a comment