![Students organised massive dharna in front of Visakhapatnam Collectorate: AP](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/FOOD11.jpg.webp?itok=Qlw765dw)
పురుగుల భోజనం పెడుతున్నారంటూ విశాఖ కలెక్టరేట్ ఎదుట నిలబడి నిరసన తెలుపుతున్న విద్యార్థులు
పిల్లల గొంతు దిగని మధ్యాహ్న భోజనం
విశాఖ కలెక్టరేట్ ఎదుట తల్లిదండ్రులతో కలసి విద్యార్థుల ధర్నా
రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు ఫోర్టీఫైడ్ సార్టెక్స్ బియ్యం బంద్
వంట ఏజెన్సీలో 40 వేల మందికిపైగా తొలగింపు
45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వాన్నంగా భోజనం.. సగం మంది పిల్లలు దూరం.. అన్నం నాసిరకంగా ఉన్నా ‘వెరీగుడ్’ అంటూ ఉపాధ్యాయులతో నమోదు
గత ప్రభుత్వంలో ప్రత్యేక శ్రద్ధతో ‘గోరుముద్ద’ పిల్లల ఇష్టానికి అనుగుణంగా వంటలో మార్పులు సగటున 93 శాతం మందికి చేరువైన జగనన్న గోరుముద్ద
తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా లేదని కొద్ది నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో విశాఖ జిల్లా చిన్నగదిలి మండలం వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట తల్లిదండ్రులతో కలసి ధర్నాకు దిగారు.. భోజనంలో వచ్చిన పురుగును చూపిస్తున్న ఓ విద్యార్థి.
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో(Government school) డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని తినలేక పిల్లలు ఆకలి డొక్కలతో నకనకలాడుతున్నారు. డొక్కా సీతమ్మ ఎందరో అన్నార్తులు, బాటసారుల క్షుద్బాధను తీర్చి కడుపు నింపితే.. టీడీపీ కూటమి సర్కారు ఆ మహనీయురాలి పేరుతో నిర్వహిస్తున్న పథకంలో పిల్లలకు పురుగులు పట్టిన ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. మధ్యాహ్న భోజనం పేరు మార్చటంపై ప్రదర్శించిన ఉత్సాహాన్ని పథకం అమలు చేయటంపై మాత్రం చూపడం లేదు. రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడి అత్యంత దారుణంగా తయారైంది.
పిల్లలకు రుచిగా వండి పెట్టే ఏజెన్సీలు, ఆయాలను బలవంతంగా తొలగించి స్థానిక కూటమి నేతలకు ఇష్టమైన వారిని నియమించడంతో వ్యవస్థ గాడి తప్పింది. భోజనంలో నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. భోజనం అనంతరం పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు ఉపాధ్యాయులు నాణ్యతను పరిశీలించే విధానాన్ని నిలిపివేశారు. వంటవారు వండి పెట్టిందే పరమాన్నంగా భావించాలని బలవంతం చేయడంతో ఏ పాఠశాలలోనూ సగం మంది కూడా భోజనం చేసే పరిస్థితి లేదు. కంచంలో వడ్డించిన పురుగుల అన్నం సహించక చెత్తబుట్టలో వేస్తున్న ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సగం మందికి పైగా విద్యార్థులు ఇంటి నుంచే అన్నం బాక్సులు తెచ్చుకునే పరిస్థితిని టీడీపీ కూటమి ప్రభుత్వం కల్పించింది. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పిల్లలకు 16 రకాల వంటకాలతో రోజుకో మెనూ చొప్పున వారంలో ఆరు రోజులు రుచికరమైన పౌష్టికాహారాన్ని ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా అందిస్తే.. ఈ పథకానికి ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం’గా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం నాణ్యతను గాలికి వదిలేసింది. వండిన అన్నాన్ని పిల్లలు పారేస్తుండడంతో ఎలాగైనా తినిపించాలని పాఠశాలల సిబ్బందిపై ఒత్తిడి తెస్తోంది. ఉపాధ్యాయులతో ‘వెరీగుడ్’ అని యాప్‌లో అప్‌లోడ్ చేయిస్తోంది. కొన్ని చోట్ల వంట సరుకులు దారి మళ్లుతున్నాయి. 40 నుంచి 50 శాతం శాతం సరుకులు పక్కదారి పడుతున్నట్టు సమాచారం.
వండేవారు, తినేవారు.. సగం మంది ఔట్!
పాఠశాలల్లో మధ్యాహ్నం వంట చేసేందుకు దాదాపు 80 వేల మంది స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలు నియమితులయ్యారు. వీరిలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా వంట ఏజెన్సీల ఖాళీలు ఏర్పడితే స్వయం సహాయక సంఘాల మహిళలు.. ముఖ్యంగా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివించే తల్లులకు వంట బాధ్యతలు అప్పగించారు. దీంతో వంటలో నాణ్యత పెరిగింది. ఉదయం 9 గంటలకు హాజరు తీసుకునే సమయంలోనే ఎంత మంది గోరుముద్ద భోజనం తీసుకుంటారో విద్యార్థులను అడిగి తెలుసుకునేవారు.
ఆ మేరకు రేషన్ సరుకులు అందించి వంట సిద్ధం చేయించడం వల్ల సరుకుల గోల్‌మాల్‌కు అవకాశం ఉండేది కాదు. ఈ వివరాలు పాఠశాల విద్య కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరేవి. వంట పూర్తయ్యాక ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు భోజనాన్ని స్వయంగా రుచి చూసిన అనంతరం విద్యార్థులకు అందించేవారు. తర్వాత టీచర్ల అభిప్రాయాలను యాప్‌లో అప్‌లోడ్ చేసేవారు. భోజనం ముగిశాక పై తరగతుల విద్యార్థులు ఇద్దరు లేదా నలుగురి నుంచి అభిప్రాయాలను సేకరించేవారు. ఆ రోజు భోజనం ఎలా ఉంది..? నాణ్యతలో ఇంకా ఏమైనా మార్పులు చేయాలా..? అనే అంశాలను పొందుపరిచి, ఆ వివరాలను ఫొటోలతో సహా ఉన్నతాధికారులకు పంపించేవారు.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక నాయకులు ఎక్కడికక్కడ వంట ఏజెన్సీలో 40 వేల మందికి పైగా తొలగించి తమకు నచ్చినవారికి అప్పగించారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల అభిప్రాయాల సేకరణను ప్రభుత్వం నిలిపివేసింది. ఎంత మంది ఆహారం తీసుకుంటారనే లెక్కలు లేవు. తిన్న తర్వాత నాణ్యత వివరాలు నమోదు కావడం లేదు. దీంతో స్కూళ్లలో అన్నం తినే విద్యార్థుల సంఖ్య 50 శాతానికి పైగా పడిపోయింది. 2014–19 మధ్య కూడా మధ్యాహ్న భోజనం తీసుకునే విద్యార్థుల సంఖ్య గరిష్టంగా 52 శాతం దాటలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొనడం గమనార్హం.
మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్‌లో నిలదీసినా..
టీడీపీ కూటమి ప్రభుత్వం గత డిసెంబర్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన తల్లిదండ్రులు పలుచోట్ల టీచర్లను నిలదీశారు. పిల్లలకు రోజూ ఇలాగే పెడుతున్నారా..? అని మండిపడ్డారు. ఈ నెల ఏడో తేదీన కృష్ణా జిల్లా పురిటిగడ్డ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పూర్తిగా మాడిపోవడంతో పిల్లలు తినలేకపోయారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి వంట చేశారు. ఇక్కడ తరచూ నాసికరం భోజనంపై ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడు లేడని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఇదే జిల్లా ఘంటశాల హైస్కూల్‌లో 380 మంది విద్యార్థుల్లో సగం మంది ఇంటి నుంచే అన్నం తెచ్చుకుంటున్నారు. మోపిదేవి హైస్కూల్లో సుమారు 400 మంది విద్యార్థులుండగా హాస్టల్ పిల్లలు మినహా డే స్కాలర్స్ ఎవరూ ముద్ద ముట్టుకోవడం లేదు. ఇక పిల్లల్లో రక్తహీనతను నివారించేందుకు గత ప్రభుత్వం పాఠశాలలకు సరఫరా చేసిన ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిపివేసింది.
పెంచిన వంట చార్జీలు చెల్లించకుండా..
పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న పీఎం పోషణ్ మధ్యాహ్న భోజనం వంట చార్జీలను కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో పెంచింది. బాలవాటిక, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థికి ప్రస్తుతం రూ.5.45 చొప్పున ఇస్తుండగా ఈ మొత్తాన్ని రూ.6.19కి పెంచింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో (8వ తరగతి వరకు) విద్యార్థికి రూ.8.17 చొప్పున ఇస్తుండగా దాన్ని రూ.9.29కి పెంచింది. ఈ పెంపు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని ప్రకటించింది. పీఎం పోషణ్ నిధుల్లో కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో భరించాలి. 9, 10, ఇంటర్ విద్యార్థులకు భోజనం ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. కానీ రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన చార్జీలను వంట ఏజెన్సీలకు చెల్లించలేదు. దీంతో వంట చేసేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యాహ్న భోజనానికి ఏటా ఎంత ఖర్చు?
టీడీపీ హయాంలో రూ.450 కోట్లు
వైఎస్సార్ సీపీ హయాంలో రూ.1,400 కోట్లు
జగన్ హయాంలో గోరుముద్దకు రూ.7,245 కోట్లు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలనే సంకల్పంతో 2020 జనవరి 1న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టింది. గతంలో టీడీపీ హయాంలో రోజూ సాంబారు, అన్నంతో మధ్యాహ్న భోజనాన్ని సరిపెట్టగా.. వైఎస్ జగన్ రోజుకో మెనూ చొప్పున వారానికి 16 రకాల పదార్థాలతో పాటు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో రుచి, శుచితో పోషకాహారాన్ని పిల్లలకు అందచేశారు. ఎదిగే పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఐదేళ్లలో రూ.7,244.60 కోట్లు వ్యయం చేయడం గమనార్హం.
పిల్లల్లో రక్తహీనతను అరికట్టడానికి వారంలో మూడు రోజుల పాటు బెల్లంతో చేసిన రాగి జావ, చిక్కీ, వారంలో ఐదు రోజులు ఉడికించిన కోడిగుడ్డును తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో 45 వేల పాఠశాలల్లో విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి వంటలో మార్పులు చేశారు. రాష్ట్రంలో 1–10 తరగతుల విద్యార్థులు 40.50 లక్షల మంది ఉండగా నిత్యం సగటున 93 శాతం మంది గోరుముద్దను ఇష్టంగా తీసుకునేవారు. మిగిలిన 7 శాతం మందిలో బాలికలు ‘ప్రత్యేక’ పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని కూరలు బడిలోనే తీసుకునేవారు.
ఆ వివరాలను ఉపాధ్యాయులు ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక ప్రతి నెలా స్థానిక ఆస్పత్రి వైద్య సిబ్బందితో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్న వారికి ఫోలిక్ యాసిడ్ (ఐరన్) మాత్రలు, టానిక్‌లు ఇచ్చేవారు. దీంతో పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గింది. కానీ ఇప్పుడు పరిస్థితి దయనీయంగా ఉంది. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. బెల్లం చిక్కీలో నాణ్యత తగ్గిపోయినా కారణాలపై ఆరా తీసిన పాపాన పోలేదు. భోజనం నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలు అడిగే నాధుడు లేరు.
నాడు రోజుకో మెనూతో రుచికరంగా..
⇒ జగనన్న గోరుముద్ద ద్వారా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం 16 రకాల పదార్థాలతో రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టికాహారం. ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామ్యంతో వంటపై మూడంచెల పర్యవేక్షణ
సోమవారం: హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పలావు, గుడ్డు కూర, చిక్కీ
మంగళవారం: ఉదయం 10.20కి రాగిజావ, మధ్యాహ్నం 12.20కి చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు
బుధవారం: వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ
గురువారం : ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు
శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ
శనివారం : ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్
Comments
Please login to add a commentAdd a comment