visakhapatnam collectorate
-
ఇసుక దోపిడీ దారుణంగా ఉంది
మహారాణిపేట (విశాఖ): శ్రీకాకుళంలోని ఇసుక రీచ్‌లలో దళారుల దోపిడీ దారుణంగా ఉందని, వారి నుంచి తమను కాపాడాలని విశాఖ కలెక్టర్‌కు క్వారీ లారీ ఓనర్స్ మొరపెట్టుకున్నారు. విశాఖ జిల్లా క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కర్రి రమణ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలోనే ఇసుక విధానం పారదర్శకంగా ఉండేదని చెప్పారు. కూటమి నాయకులు ఇసుక రీచ్‌ల వద్ద ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.టన్ను ఇసుకకు అదనంగా రూ.300 వసూలు చేస్తున్నారని, ఎందుకు అదనంగా ఇవ్వాలని అడిగితే వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటే ఉచితంగా వస్తుందనుకున్నామని, కానీ డబ్బులు చెల్లించాలనడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. శ్రీకాకుళంలోని 11 ఇసుక రీచ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. విశాఖలో ఇసుక అమ్మాలంటే టన్ను రూ.వెయ్యి కంటే తక్కువకు విక్రయించలేని పరిస్థితి ఉందన్నారు.సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటే మీరు ఇంత ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అసోసియేషన్ కార్యదర్శి కర్రి రమణ తెలిపారు. గత ప్రభుత్వ ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కూటమి నేతల జేబుల్లోకి వెళుతోందని ఆరోపించారు. -
జనహృదయ స్పందన వింటున్నారు.. విన్నవిద్దాం..
ఇది ఏ ఒక్కరి ఆవేదనో కాదు.. కలెక్టరేట్లో వారం వారం జరుగుతున్న స్పందన కార్యక్రమానికి వస్తున్న వేలాది ఆర్తుల ఆక్రందన. అందరిదీ ఒకటే మాట. గత ప్రభుత్వం గ్రీవెన్స్ పేరుతో హడావుడి చేసి.. ఆనక అందిన దరఖాస్తులను రకరకాల కొర్రీలతో బుట్టదాఖలు చేసేది. ఫలితంగా ఒకటికి పదిసార్లు కాళ్లరిగేలా తిరిగినా బాధితులకు న్యాయం జరిగేది కాదు. కానీ వైఎస్జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జవాబుదారీతనం పెరిగింది. ప్రజల వినతులకు రోజుల వ్యవధిలోనే స్పందన లభిస్తోంది. జూలై నెల పరిస్థితినే పరిశీలిస్తే.. ఈ నెల ఒకటి నుంచి 25వ తేదీ వరకు స్పందన కార్యక్రమానికి మొత్తం 6,719 వినతులు అందితే.. వాటిలో సుమారు 72 శాతం పరిష్కారం సాధించడం ద్వారా విశాఖ జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. కేవలం 179 అర్జీలనే అనర్హమైనవిగా తేల్చి తిరస్కరించారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధిక శాతం అర్జీలు కుంటి సాకులతో తిరస్కరణకు గురయ్యేవి. వైఎస్జగన్ ప్రభుత్వం ప్రతి అర్జీని ఆన్లైన్లో పొందుపర్చి, నెంబరు కేటాయించడం, ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే వీలు కల్పించడంతోపాటు నిర్ధిష్ట గడువు విధించడంతో స్పందన వినతులకు త్వరితగతిన పరిష్కారం లభిస్తోంది. ఇవే కారణాలతో స్పందన ప్రజామన్ననలు చురగొంటోంది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో ప్రజలు వేల సంఖ్యలో వినతులిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఫలితంగా ఏ వారానికావారం వినతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయినా అధికార యంత్రాంగం ఓపికగా వాటిని స్వీకరించి.. పరిష్కారం చూపుతున్నారు. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం జూలై 1–25 మధ్య అందిన వినతులు.. పరిష్కారాలు కేటగిరీ వినతుల పరిష్కార సంఖ్య శాతం రేషన్ కార్డులు 2,619 88.62 భూసమస్యలు 1,831 47.84 పింఛన్లు 1,655 92.27 పురపాలన 1,298 86.06 హౌసింగ్ 654 89.45 పంచాయతీరాజ్ 349 77.36 విద్యుత్తు 331 88.22 సాక్షి, విశాఖపట్నం: ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమానికి వస్తున్న ఆర్జీల సంఖ్య పెరుగుతోంది. తొలిసారిగా ఈనెల 1వ తేదీన జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ‘స్పందన’లోనే 513 ఆర్జీలు వచ్చాయి. రెండో సోమవారం 454 వచ్చాయి. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఆర్జీలు ఇచ్చినా తమ సమస్య పరిష్కారంగాక నిరాశలో ఉన్నవారు ఇప్పుడు ‘స్పందన’ తీరు తెలుసుకొంటున్నారు. తమకొక మార్గం దొరుకుతుందనే కొండంత ఆశతో వస్తున్నారు. దీంతో మూడో వారం నుంచి ఆర్జీల సంఖ్య మరింత పెరిగింది. మూడో సోమవారం 897 ఆర్జీలు రాగా నాలుగో సోమవారానికి ఏకంగా 985 ఆర్జీలు దాఖలయ్యాయి. ఇక ఐదో సోమవారం కూడా అదే రీతిలో పెరుగుతూ 1,062 ఆర్జీలు వచ్చాయి. మరోవైపు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో 19, మహావిశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో 228 వినతులు అందాయి. పరిష్కారానికి పట్టుదల ఈనెల 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ కలెక్టరేట్ సహా జిల్లా వ్యాప్తంగా ‘స్పందన’కు 6,719 అర్జీలు వచ్చాయి. వాటిలో 179 అనర్హమైనవిగా తిరస్కరించారు. మిగిలిన వాటిలో 1,927 అర్జీలు పరిశీలన దశలో ఉన్నాయి. 2,889 అర్జీల పరిశీలన పూర్తి అయింది. వాటిని మంజూరుకు సిద్ధం చేశారు. 1,922 ఆర్జీలను పరిష్కరించారు. ఇలా 72.17 శాతం అర్జీలను పరిష్కరించడంతో జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఏదో మొక్కుబడిగా ఎండార్స్మెంట్ ఇచ్చేయకుండా ప్రతి అర్జీకి సరైన పరిష్కారం చూపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు స్పష్టం చేస్తున్నారు. అందుకు తగినట్లుగా అర్జీల పరిష్కారం ఏవిధంగా చేయాలో ఇప్పటికే ఒకటికి రెండుసార్లు అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ వివరించారు. దీంతో అర్జీల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి అర్జీకి ఒక సంఖ్య... ప్రజలు సమర్పించే ప్రతి అర్జీకి ఒక నంబరు కేటాయిస్తున్నారు. వాటిని ఆన్లైన్ చేసేందుకు జిల్లా కలెక్టరేట్లోనే 16 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాటిని ఉన్నతాధికారులు పరిశీలించి విభాగాల వారీగా ఆయా అర్జీలను విభాగాధిపతులకు పంపిస్తున్నారు. అలా వచ్చిన ప్రతీ అర్జీని సంబంధిత విభాగాధిపతి స్వయంగా పరిశీలించాల్సిందే. దిగువ స్థాయి సిబ్బంది ఇచ్చే ఎండార్స్‌మెంట్‌ను చూడకుండా డిస్పోజ్ చేయవద్దని ఇప్పటికే కలెక్టరు హెచ్చరించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి డిస్పోజ్ చేసినట్లు అప్లోడ్ చేయాలని చెప్పారు. పనిదినాల్లో ప్రతి రోజూ కార్యాలయానికి రాగానే అరగంట సమయాన్ని ఈ అర్జీల పరిష్కారానికి వెచ్చించాలని ఆదేశాలిచ్చారు. ఇలా ‘స్పందన’ దరఖాస్తుల పరిష్కారానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోందని జాయింట్ కలెక్టరు ఎల్.శివశంకర్ చెప్పారు. కొన్ని సమస్యలపైనే అత్యధికం.. ఆర్జీల్లో ఎక్కువగా రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇల్లు, ఇంటిస్థలం మంజూరు కోసమే ఉంటున్నాయి. అలాగే భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ఎక్కువ అర్జీలు వస్తున్నాయి. మొత్తం 64 విభాగాల్లో అర్జీలను అంశాల వారీగా పొందుపర్చుతున్నారు. పోలీస్ కమిషనరేట్‌కు 103 ఫిర్యాదులు ద్వారకానగర్(విశాఖ దక్షిణ): నగర పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం జరిగిన స్పందనకు 103 ఫిర్యాదులు అందాయి. 19 ఫిర్యాదులను సీపీ ఆర్కే మీనా స్వయంగా స్వీకరించారు. ఇతర 84 ఫిర్యాదులు సంబంధింత పోలీస్స్టేషన్లలో సీఐలు స్వీకరించారు. వీటిలో ఆస్తులు, కుటుంబ కలహాలు, ఆర్థిక పరమైన అంశాలు, చీటింగ్‌లకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. జీవీఎంసీకి 228 ఫిర్యాదులు సాక్షి,విశాఖపట్నం: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మొత్తం 228 ఫిర్యాదులు అందాయి. జీవిఎసీ కమిషనర్ జి.సృజన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ఫిర్యాదుల్లో ప్రధాన కార్యాలయానికి 88, ఒకటో జోన్‌కు సంబంధించి 30, మూడో జోన్‌కు సంబంధించి రెండు, నాలుగో జోన్‌కు సంబంధించి 12, ఐదో జోన్‌కు సంబంధించి 72, ఆరో జోన్‌కు సంబంధించి 10, భీమిలి జోన్‌కు సంబంధించి 14 ఫిర్యాదులందాయి. వీటిలో టౌన్‌ప్లానింగ్ విభాగానికి 31, ప్రజారోగ్య విభాగానికి 14, ఇంజనీరింగ్ విభాగానికి 41, ఇ.ఇ విభాగానికి 4, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ విభాగానికి 54, యుసీడీ విభాగానికి 16 ఫిర్యాదులు అందాయి. డయల్ యువర్ కమిషనర్‌కు 23 ఫిర్యాదులు జీవిఎంసీ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 23 ఫిర్యాదులు అందాయి. కమిషనర్ జి.సృజన పలువురి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌కు సమాధానం చెప్పారు. ఇందులో ఒకటో జోన్ నుంచి 2, రెండో జోన్ నుంచి 6, మూడో జోన్ నుంచి రెండు, నాలుగో జోన్ నుంచి 4, ఐదో జోన్ నుంచి 1, ఆరో జోన్ నుంచి 5, అనకాపల్లి జోన్ నుంచి 1, భీమిలి జోన్ నుంచి 2 ఫిర్యాదులు అందాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి మూడు రోజులులోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. -
తొలి ‘స్పందన’కు అర్జీల వెల్లువ
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమానికి అన్ని జిల్లాల్లో అనూహ్య స్పందన లభించింది. సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా వినతులు వెల్లువెత్తాయి. ప్రతిచోటా వచ్చిన ప్రతి అర్జీదారుడినీ పలకరించి.. వారికొచ్చిన సమస్యేమిటో అధికారులు తెలుసుకున్నారు. సమస్యను ఎప్పటిలోగా పరిష్కరించగలమో ఆ తేదీని కూడా పేర్కొంటూ రసీదులు ఇవ్వడంతో అర్జీదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఈ తరహాలో అధికారులు స్పందించే వారు కాదని, తీసుకున్న అర్జీలు ఏం చేసేవారో కూడా తెలిసేది కాదనీ వినతులిచ్చేందుకు వచ్చిన వారు చెప్పారు. తొలిసారి ప్రతి అర్జీకి పరిష్కార గడువు తేదీని కూడా నిర్దేశిస్తూ రసీదు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్లో ముందెన్నడూ లేనివిధంగా 513 అర్జీలు అందగా.. డివిజన్, గ్రామీణ స్థాయిల్లో 1,050కి పైగా దరఖాస్తులు వచ్చాయి. డివిజన్, మండల స్థాయిల్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు వినతులు స్వీకరించారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో స్పందనకు 354 వినతులు వచ్చాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని వినతులు మరో 98 వచ్చాయి. మండలాలు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 720 వరకు అర్జీలు వచ్చాయి. విజయనగరం కలెక్టరేట్, పార్వతీపురం ఐటీడీఏతోపాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌తోపాటు ఆర్డీవో, తహసీల్దార్, ఐటీడీఏ, జిల్లా ఎస్పీ, మండల పోలీస్ స్టేషన్లలో స్పందన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 660 అర్జీలు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో 360 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 120 ఫిర్యాదులు అందాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో నిర్వహించిన ‘స్పందన’కు 253 అర్జీలు వచ్చాయి. గుంటూరు జిల్లాలో స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అచ్చంపేట మండలంలో వృద్ధురాలు పట్టాదార్ పాస్ పుస్తకం కోసం వీఆర్వోకు రూ.50 వేలు లంచం ఇచ్చి ఏడాదైనా ఆమె సమస్య పరిష్కారం కాలేదు. స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు మొరపెట్టుకోవడంతో ఆయన వీఆర్వోను పిలిచి మందలించి రెండు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్‌కు 600 ఫిర్యాదులు, తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో 22 ఫిర్యాదులు అందాయి. రూరల్ ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి 80కు పైగా అర్జీలు వచ్చాయి. ఒంగోలు కలెక్టరేట్లో స్పందన కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. వివిధ సమస్యలపై మొత్తం 375 అర్జీలు స్వీకరించినట్టు అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి 1,293 అర్జీలు వచ్చాయి. జిల్లా కేంద్రంలో 653 అర్జీలు అందాయి. కర్నూలు కలెక్టరేట్లో స్పందనకు 1,127 దరఖాస్తులు రాగా.. నమోదుకు వీలులేని దరఖాస్తులు కూడా భారీగా అందాయి. కడప కలెక్టరేట్లో నిర్వహించిన స్పందనకు దాదాపు 500 మందికి పైగా వచ్చి సమస్యలను విన్నవించుకున్నారు. చిత్తూరు కలెక్టరేట్, తిరుపతి, మదనపల్లిలోని సబ్ కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు అన్ని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమానికి మొత్తం 2,528 వినతులు వచ్చాయి. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయానికి 996 అర్జీలు రాగా.. అందులో 950 మంది నివాస స్థలాల కోసం వచ్చిన వారే ఉన్నారు. అప్పటికప్పుడు ట్రై సైకిల్ అందజేత నెల్లూరు నగరానికి చెందిన దివ్యాంగుడు మోహన్ ట్రై సైకిల్ కోసం నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు స్పందన కార్యక్రమానికి హాజరై కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబుకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. అతడికి అప్పటికప్పుడు ట్రై సైకిల్ అందజేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో ఇంత వేగంగా సమస్య పరిష్కారం అవుతుందని తాను ఊహించలేదని మోహన్ వ్యాఖ్యానించాడు. తక్షణ స్పందనపై హర్షం వ్యక్తం చేశాడు. -
పొస్టల్ బ్యాలెట్ జాప్యంపై కలెక్టర్‌ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
సీనియర్ అకౌంటెంట్ బుక్కయ్యాడు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ట్రెజరీ విభాగంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న జి. శ్రీనివాస్, రూ.6 లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. వివరాలు.. పెందుర్తి కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న యూవీఎన్ శర్మకు జీతం బిల్లు చెల్లించేందుకు శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని జూనియర్ లెక్చరర్ ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. లంచం తీసుకుంటుండగా పథకం ప్రకారం కలెక్టరేట్ ఆఫీసులోనే శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్
జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆన్లైన్లో మానిటరింగ్‌కు త్వరలో శ్రీకారం బీచ్‌రోడ్: కలెక్టరేట్లో ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ను త్వరలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు అనువైన గదిని గుర్తించారు. అధునాతన కంప్యూటర్లు, సర్వర్లు, నిఘా కెమేరాలతో ఈ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాన్ని అనుసంధానించేందుకు ఏ విధంగా ఓ సెంటర్ పనిచేస్తోందో, అదే తరహాలో జిల్లా కేంద్రం నుంచి క్షేత్ర స్థాయిలో అమలయ్యే పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్ని అన్లైన్లో పర్యవేక్షించేందుకు వీలుగా సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్, సివిల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల వల్ల మంచి ఫలితాలే వచ్చాయన్నారు. విశాఖ నగరంలో నీటి సరఫరా, వీధిదీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర కార్యక్రమాల్ని అన్లైన్ ద్వారా పర్యవేక్షించేందుకు జీవీఎంసీలో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. అదే తరహాలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారి మూర్తి, ఏవో సూర్యప్రకాష్ పాల్గొన్నారు. -
విశాఖ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు
విశాఖపట్నంలో భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదివారం వెల్లడించారు. వర్షాల వల్ల ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800- 42500002ను సంప్రదించాలని జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు. అయితే యలమంచిలి కాలువకు గండి పండింది. దాంతో యలమంచిలిలోని పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో స్థానిక ఎమ్మెల్యేలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు.