కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్
జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్
ఆన్‌లైన్‌లో మానిటరింగ్‌కు త్వరలో శ్రీకారం
బీచ్‌రోడ్: కలెక్టరేట్‌లో ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ను త్వరలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు అనువైన గదిని గుర్తించారు. అధునాతన కంప్యూటర్లు, సర్వర్లు, నిఘా కెమేరాలతో ఈ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాన్ని అనుసంధానించేందుకు ఏ విధంగా ఓ సెంటర్ పనిచేస్తోందో, అదే తరహాలో జిల్లా కేంద్రం నుంచి క్షేత్ర స్థాయిలో అమలయ్యే పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్ని అన్‌లైన్‌లో పర్యవేక్షించేందుకు వీలుగా సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్, సివిల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల వల్ల మంచి ఫలితాలే వచ్చాయన్నారు.
విశాఖ నగరంలో నీటి సరఫరా, వీధిదీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర కార్యక్రమాల్ని అన్‌లైన్ ద్వారా పర్యవేక్షించేందుకు జీవీఎంసీలో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. అదే తరహాలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) అధికారి మూర్తి, ఏవో సూర్యప్రకాష్ పాల్గొన్నారు.