Command and Control Center
-
టీఎస్‌పీఐసీసీసీ చైర్మన్‌గా డీజీపీ మహేందర్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ ‘సూపర్ పోస్టు’ను సృష్టిస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇటీవలే ప్రారంభించిన ‘తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ)’కు ప్రభుత్వం చైర్మన్‌ను నియమించనుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ఎం.మహేందర్‌రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. తర్వాత ఆయననే ఈ పోస్టులో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర పోలీసు విభాగం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైతం ఐసీసీసీ చైర్మన్ ఆధీనంలోనే ఉండనున్నట్టు సమాచారం. రాష్ట్ర పోలీసు చరిత్రలో ఇలాంటి పోస్టు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇప్పటివరకు సలహాదారులే.. రాష్ట్ర పోలీసు విభాగంలో డీజీపీతోపాటు వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన వారి సేవలను వినియోగించుకోవడం కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే వారిని శాంతిభద్రతల విభాగం సలహాదారులుగానో, చట్ట సవరణ, పోలీసు మ్యాన్యువల్‌లలో మార్పుచేర్పులకు సంబంధించిన కమిటీలకు ఇన్చార్జులుగానో నియమింవారు. మాజీ డీజీపీలు ఏకే మహంతి, అనురాగ్శర్మలతోపాటు రిటైర్డ్ ఐజీ గంగాధర్‌ల నియామకాలు ఈ కోవలోకే వస్తాయి. మరికొందరు పదవీ విరమణ చేసిన డీఎస్పీలు, అదనపు ఎస్పీల సేవలనూ వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారు. కొందరైతే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కూడా పనిచేస్తున్నారు. వారంతా గవర్నర్, హోంమంత్రి, డీజీపీ లేదా ఆయా యూనిట్లకు నేతృత్వం వహించే పోలీసు ఉన్నతాధికారి ఆధీనంలో పని చేస్తుంటారు. దీనికి భిన్నంగా ఎం.మహేందర్‌రెడ్డిని ఐసీసీసీ చైర్మన్‌గా కేబినెట్ హోదాలో నియమించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పునర్వ్యవస్థీకరణతో కలిపి.. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మూడింటిలో జోన్లు, డివిజన్లతోపాటు పోలీస్స్టేషన్ల సంఖ్య పెంపునకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించింది. దీనిపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శాంతిభద్రతలు, నేరాలు, ట్రాఫిక్.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేసి పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు రూపొందించింది. హైదరాబాద్‌కు 1,252, సైబరాబాద్‌కు 750, రాచకొండకు 763 మంది అదనపు సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. అయితే ప్రభుత్వం ఐసీసీసీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని నియమించాలని, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆయన ఆధీనంలోకి తీసుకురావాలని నిర్ణయించడంతో మార్పులు జరిగాయి. కేబినెట్ మూడు కమిషనరేట్ల ప్రతిపాదనలకు అదనంగా ఐసీసీసీ కోసం 400, సైబర్ సెక్యూరిటీ వింగ్ కోసం 500 పోస్టులను కూడా జోడించి ఆమోదముద్ర వేసింది. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో కలిపి మొత్తంగా 3,965 పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం పోలీసు విభాగం వినియోగిస్తున్న టెక్నాలజీల నిర్వహణతోపాటు ఐసీసీసీ మొత్తం దాని చైర్మన్ ఆ«ధీనంలోకి వెళుతుంది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కొనసాగుతున్న ఐసీసీసీకి సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లోని ఏడో అంతస్తులో చైర్మన్ కార్యాలయం ఉండనుంది. ఇటీవల ఐసీసీసీకి వెళ్లిన మహేందర్‌రెడ్డి ఆ చాంబర్‌ను పరిశీలించారని.. ఈ వారాంతంలో లేదా వచ్చే నెల మొదటివారంలో ఐసీసీసీ చైర్మన్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. -
TS: ఒకే చోట నుంచి రాష్ట్రమంతా వీక్షణ.. పోలీస్ ట్విన్ టవర్స్ ప్రత్యేకలివే..
సాక్షి, సిటీ బ్యూరో: రాష్ట్రానికే తలమానికంగా దేశానికే ఆదర్శంగా నగరంలో ఏర్పాటైన తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐసీసీసీ) ఆధునిక సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దీన్ని నిర్మించారు. గురువారం జరగనున్న దీని ప్రారంభ వేడుకలను చిరస్థాయిగా నిలిచేలా నిర్వహించాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. చదవండి: టీఆర్ఎస్లో టెన్షన్.. మునుగోడుపై ‘ఐ ప్యాక్’ కీలక నివేదిక! ఈ నేపథ్యంలోనే వీటి కోసం నగర పోలీసు విభాగానికి చెందిన 25 మంది అధికారులను నియమించారు. ఆద్యంతం పర్యవేక్షించే బాధ్యతల్ని అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్‌కు అప్పగించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆహ్వానిస్తున్నారు. టీఎస్‌పీఐసీసీసీ హంగులివే.. పోలీసు సింగిల్ విండో: నగర కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్.. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకువస్తున్నారు. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం అమలుకానుంది. కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ: టీఎస్‌ఐసీసీసీలో విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అని విభాగాల అధిపతులూ ఒకేచోట సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవి తక్కువ సమయంలో అందరికీ చేరడం అదనపు ఆకర్షణలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనికోసం ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం: డయల్– 100, అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ–టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉంటాయి. దీంతో అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణం స్పందించేలా కంప్యూటర్ ప్రొగ్రామింగ్ ఉండనుంది. జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలతో పాటు ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులతో అనుసంధానమైన వ్యవస్థ ఇది. సిటిజన్ పిటిషన్ మేనేజ్మెంట్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని విభాగాల వారీగా కేటాయింపు, సత్వర స్పందన, పరిష్కారం, వీటి మ్యాపింగ్ మొత్తం కంప్యూటర్ ద్వారా జరుగుతుంది. మార్కెట్, సోషల్ మీడియా విశ్లేషణ, మెబైల్ యాప్స్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. రిసెప్షన్ సెంటర్లో కియోస్‌్కలు ఏర్పాటు చేస్తారు. శాంతిభద్రతల విభాగం నగర వ్యాప్తంగా ఉండే సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను భారీ వీడియో వాల్ సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రత్యేక ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్వేర్స్ ద్వారా శాంతిభద్రతల పరిస్థితుల్ని అంచనా వేస్తారు జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలను అవసరమైన చోటుకు మళ్ళిస్తారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం నగరంలో ట్రాఫిక్ నిర్వహణకూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. సెన్సర్ల ద్వారా వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ను అధ్యయనం చేసి మార్పు చేర్పులు సూచిస్తారు. ఆర్టీఏ డేటాబేస్–అనుమానిత వాహనాల డేటాబేస్లను అనుసంధానిస్తారు. తక్షణ స్పందన కోసం ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం: ఎఫ్ఐఆర్ మొదలు కేసు స్థితిగతుల నిశిత పరిశీలన, నేరగాళ్ల డేటాబేస్ నిర్వహణ, నేరాలు జరిగే ప్రాంతాల క్రైమ్ మ్యాపింగ్, అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ లాబ్ ఇతర టూల్స్ నేరాల నిరో«ధం, కేసుల సత్వర పరిష్కారానికి ఉపకరిస్తాయి. బిజినెస్ ఇంటెలిజెన్స్: నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్వేర్ ఎనలటికల్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు డేటా ఎనాలసిస్, అడ్వాన్స్ సెర్చ్‌కూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. అదనంగా ప్రత్యేక వెబ్ డిజైనింగ్ టూల్స్‌తో మెరుగైన సేవలు అందించనున్నారు. అనేక కార్యాలయాల మార్పు.. నగర పోలీసు కమిషనరేట్ ఆగస్టు నెలాఖరు కల్లా టీఎస్‌ఐసీసీసీలోకి తరలనుంది. 18వ అంతస్తులో కొత్వాల్ కార్యాలయం ఉంటుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తదితరాలు సైతం అక్కడకే వెళ్తాయి. ఇవి అయిదో అంతస్తులో ఉండనున్నాయి. ఏడో అంతస్తును ఇతర విభాగాల కోసం కేటాయించారు. ప్రధాన కంట్రోల్ రూమ్‌లోనూ వీరికి భాగస్వామ్యం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ సిటీ ట్రాఫిక్ కమిషనరేట్‌గా మారనుంది. దీంతో పాత కంట్రోల్ రూమ్‌ను పూర్తి స్థాయిలో సీసీఎస్, డిటెక్టివ్ డిపార్ట్మెంట్లతో పాటు మధ్య మండల కార్యాలయానికి అప్పగిస్తారు. ఫలితంగా సిట్ కార్యాలయం కూడా ఇక్కడకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పాతబస్తీలో ఉన్నట్లే బషీర్‌బాగ్‌లోనూ కమిషనర్ కోసం ఓ కార్యాలయం ఉండనుంది. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ తెలంగాణ పోలీసును దేశంలోనే బెస్ట్ పోలీసింగ్‌గా తయారు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సదుపాయాలు కల్పించారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రూపకల్పన చేసినట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం, 14వ అంతస్తులో గ్యాలరీని ప్రారంభిస్తారని తెలిపారు. పకడ్బందీ ఏర్పాట్లు.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రానున్న నేపథ్యంలో పోలీసులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వారం రోజుల నుంచి ఏర్పాట్లలో మునిగిపోయారు. బుధవారం సీఎం కాన్వాయ్ రిహార్సల్స్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణకే తలమానికం.. టీఎస్ఐసీసీసీ (ఫొటోలు)
-
బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపు వెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4న బంజారాహిల్స్‌లో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీసు కార్యాలయం, పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్ మీదుగా వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి రోడ్డు నంబర్–36, 45 మీదుగా మాదాపూర్ వైపునకు మళ్లాలి. మాసబ్‌ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12 వైపు వచ్చే వాహనాలు బంజారాహిల్స్ రోడ్డు నంబర్–1, 10 మీదుగా జహీరానగర్, కేన్సర్ ఆస్పత్రి మీదుగా వెళ్లాలి. ఫిల్మ్‌నగర్ మీదుగా ఒర్సి ఐస్‌ల్యాండ్ మీదుగా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్ఎన్టీ, ఎన్ఎఫ్సీఎల్ మీదుగా పంజగుట్ట వైపు వెళ్లాలి. మాసబ్‌ట్యాంక్ మీదుగా రోడ్డు నంబర్ 12, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనదారులు మెహిదీపట్నం, నానల్‌నగర్, టోలిచౌకి, ఫిల్మ్‌నగర్, జూబ్లిహిల్స్‌కు చేరుకోవాలి. 4న కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించనున్న సీఎం బంజారాహిల్స్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని మంగళవారం ఆయ న హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు నాగేందర్, గోపీనాథ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి పరిశీలించారు. ఈనెల 4న సీఎం కేసీఆర్ చేతుల మీదు గా ప్రారంభం జరుగుతుందని తెలిపారు. (క్లిక్: జీహెచ్ఎంసీ నెత్తిన మరో పిడుగు) -
3 నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనులు తుది దశకు చేరుకున్నాయని, మరో మూడు నెలల్లో దీనిని ప్రారంభిస్తామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి ఆయన పరిశీలించారు. రూ.585 కోట్లతో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95 శాతం పూర్తయ్యాయని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దీనిని నిర్మిస్తున్నామన్నారు. విదేశీ సాంకేతికతతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఇది అందుబాటులోకి వచ్చాక పోలీస్‌వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 9.21 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఈ కెమెరాలన్నింటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్ చేస్తామన్నారు. ఇక్కడ ఒకేసారి లక్ష సీసీ కెమెరాలను చూసే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ విభాగాలను మానిటర్ చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఇక్కడే ప్రారంభిస్తున్నామన్నారు. -
పేరు పెట్టమన్న హైదరాబాద్ సీపీ.. ఆ పోస్టుకు అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికే తలమానికంగా బంజారాహిల్స్‌లో రూపుదిద్దుకుంటున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (సీసీసీ) పేరు సూచించాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నెటిజనులను కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసు అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. రోడ్ నం.12లో 20 అంతస్తుల ఎత్తుతో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని ప్రస్తుతం ట్విన్ టవర్స్‌గా పిలుస్తున్నాయి. అయితే వాస్తవంగా ఇందులో మొత్తం నాలుగు టవర్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు. కేవలం హైదరాబాద్ పోలీసుకే కాకుండా తెలంగాణ పోలీసు విభాగానికే ఇది కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా పనిచేస్తుందని స్పష్టం చేసిన ఆనంద్... ఆ మేరకు సరైన పేరు సూచించాలని కోరారు. చదవండి: మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్ పరిస్థితి ఈ పోస్టుకు నెటిజనుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే 1500 మంది లైక్ చేయగా...1100 మంది వివిధ పేర్లను సూచించారు. కమాండో హిల్స్, 4 లయన్స్, సీ4, ఫెడ రల్ టవర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (ఎఫ్‌టీటీ ఎస్), చార్మినార్ ప్రొటెక్షన్ సెంటర్ (సీపీసీ) తదితర పేర్లను నెటిజనులు సూచించారు. మా ర్చి 31లోగా నిర్మాణం పూర్తి చేసి, సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆనంద్ ఇటీవలే కాంట్రాక్టర్‌కు సూచించిన విషయం విదితమే. -
నేరాలకు ‘కంట్రోల్’ ఏదీ..!
కడప అర్బన్ : జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సక్సెస్‌గా నడిపించేందుకు ‘పోలీస్ బాస్’ తమ వంతుగా కృషి చేస్తున్నారు. కడప నగరంలో శాంతిభద్రతలను గాడిలో పెట్టేందుకు ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ను గత ఏడాదిలో ప్రారంభిం చారు. తాజాగా ప్రొద్దుటూరు పట్టణంలోను కమాండ్ అండ్ కంట్రోల్ సెంట ర్ను రెండవ కేంద్రంగా ప్రారంభించారు. - కడప నగరంలో ప్రారంభించిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా సత్ఫలితాలనిస్తోంది. - వేలాదిమంది ప్రజలు పోలీసుల సేవలను వినియోగించుకుంటున్నారని, నేరాలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. - నేరాల నియంత్రణ బాగున్నా క్షేత్ర స్థాయిలో కొందరు పోలీసుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. - ఇటీవల కాలంలో కొందరు తమ ద్విచక్రవాహనాలను పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సందర్భాల్లో ఫిర్యాదు ఎక్కడ చేశారని ఎదురు ప్రశ్నించడం, తాము ఫిర్యాదు చేసిన సందర్భాలలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇవ్వాలనీ కోరితే... దొరికినప్పుడు ఎలాగు రికవరి చేస్తామని మాట దాటేయడం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. - కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలో గత నెలలో పట్టపగలు గంగాదేవి అనే మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు చైన్‌ను, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంలో వేగంగా వచ్చి లాక్కెళ్లారు. - ఇటీవల నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘చెడ్డీగ్యాంగ్’ చోరీకి యత్నిం చింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీ లకు పాల్పడే లోపే వారిని నిరోధించాల్సిన పోలీసులు ఆ గ్యాంగ్ జాడ ఇక్కడలేదని సరిపెట్టుకుంటున్నట్లు సమాచారం. - పెద్ద దర్గా ఉరుసు సందర్భంగా పాత నేరస్తురాలు ‘షబానా ఆజ్మి’ ఓ మహిళ నుంచి పర్సును దొంగలించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఆమె అంతకు ముందు కొన్ని నెలల క్రితమే పలు నేరాలకు పాల్పడి కటకటాల పాలైంది. ఆమె విడుదలయ్యాక ‘పరివర్తన’ లాంటి కార్యక్రమం ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించి పునరావాసం కల్పిస్తే ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. కొందరు పోలీసుల అత్యుత్సాహం - కడప నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నుంచి ఉత్సాహవంతులైన పోలీసు సిబ్బంది, అధికారులను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధుల కోసం తీసుకున్నారు. - సంక్రాంతి పండుగ సమయంలో పక్కీర్‌పల్లె చెరువు వద్ద గోళీలాట ఆడుకుంటున్న సమయంలో యువకుల గుంపుపై బ్లూకోల్ట్స్ వారు దాడికి ఉపక్రమించారు. ఆ సమయంలో వీరయ్య అలియాస్ వీరు మృతిచెందాడు. ఆ సమయంలో పోలీసుల అత్యుత్సాహం స్పష్టంగా తెలిసినప్పటికీ తన భర్త ప్రమాదవశాత్తు నీళ్లలో జారిపడ్డాడని మృతుని భార్య వద్ద నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. - రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలు, కారు లాంటి వాహనదారులపై అనుమానం పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విభాగంలో పని చేస్తున్న పోలీసు అధికారుల్లో కొందరు కడప నగరంలోని స్థానిక పోలీసు అధికారుల ప్రమేయం కోసం ఎదురు చూడకుండా తమకు సమాచారం వచ్చిన వెంటనే తమంతట తాముగా నేర నియంత్రణకు ప్రయత్నిస్తూ ‘తప్పు’లో కాలేస్తున్నట్లు తెలుస్తోంది. - కడప నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘వ్యభి చార గృహం’పై దాడి చేసిన ఓ ఎస్ఐ వారిలో ‘యువతి’ ని హోంకు పంపి, మరో ఇద్దరి విషయంలో చేతి వాటం ప్రదర్శించి వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. - ఏది ఏమైనా నేరాల నియంత్రణ విషయంలో జిల్లా పోలీసు యంత్రాంగం విమర్శలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. -
కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్
జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆన్లైన్లో మానిటరింగ్‌కు త్వరలో శ్రీకారం బీచ్‌రోడ్: కలెక్టరేట్లో ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ను త్వరలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు అనువైన గదిని గుర్తించారు. అధునాతన కంప్యూటర్లు, సర్వర్లు, నిఘా కెమేరాలతో ఈ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాన్ని అనుసంధానించేందుకు ఏ విధంగా ఓ సెంటర్ పనిచేస్తోందో, అదే తరహాలో జిల్లా కేంద్రం నుంచి క్షేత్ర స్థాయిలో అమలయ్యే పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్ని అన్లైన్లో పర్యవేక్షించేందుకు వీలుగా సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్, సివిల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల వల్ల మంచి ఫలితాలే వచ్చాయన్నారు. విశాఖ నగరంలో నీటి సరఫరా, వీధిదీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర కార్యక్రమాల్ని అన్లైన్ ద్వారా పర్యవేక్షించేందుకు జీవీఎంసీలో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. అదే తరహాలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారి మూర్తి, ఏవో సూర్యప్రకాష్ పాల్గొన్నారు. -
జలమండలి పనులపై కెమెరా కన్ను!
మ్యాన్‌హోళ్లు, మరమ్మతులు, నిర్మాణం పనులపై సీసీటీవీ నిఘా కేంద్ర కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షణ సిటీబ్యూరో: పోలీసు శాఖకే పరిమితమైన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పుడు జలమండలిలోనూ త్వరలో ఏర్పాటు కానుంది. మూతలు లేనివి, దెబ్బతిన్న మ్యాన్‌హోళ్లు, మంచినీరు, మురుగునీటి పైపులైన్ల లీకేజీలు, మరమ్మతులు, రిజర్వాయర్ల నిర్మాణం పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రానికి ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం వేదిక కానుంది. ఈ కేంద్రంలో పోలీసుశాఖ నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీటీవీల నుంచి వీడియో ఫుటేజీని రోజువారీగా సేకరించి అధికారులు విశ్లేషించడం ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు నగరంలో నిర్మాణంలో ఉన్న 56 భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల పురోగతిని పర్యవేక్షించేందుకుసైతం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 4500 కెమెరాల నుంచి ఫుటేజీ స్వీకరణ.. ప్రస్తుతానికి గ్రేటర్‌వ్యాప్తంగా పోలీసు శాఖ ఏర్పాటుచేసిన 4500 సీసీటీవీలతో ప్రధాన రహదారులపై ఉన్న మ్యాన్‌హోళ్లు, పైపులైన్లు, వాల్వ్లపైనా నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఈవిషయంలో పూర్తిగా సహకరించేందుకు పోలీసువిభాగం సూత్రప్రాయంగా అంగీకరించడంతో..ఆయా కెమెరాల నుంచి ఆన్లైన్లోనే నిరంతరం ఫుటేజీ స్వీకరణకు జలమండలికి మార్గం సుగమం అయ్యింది. అంటే ప్రస్తుతం ముఖ్యమైన కూడళ్లు, ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీల నిఘా నేత్రం ఇక నుంచి మ్యాన్‌హోళ్లు, పైపులైన్లు, వాల్వ్లపైకీ మళ్లనుంది. ఈ ఫుటేజీని ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఎండీ దానకిశోర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటుతో వర్షం కురిసిన ప్రతిసారీ వరద, మురుగునీరు కలిసి సుడులు తిరుగుతూ ఉప్పొంగే మూతలు లేని మ్యాన్‌హోళ్లు,పైపులైన్లు, వాల్వ్‌లకు పడుతున్న చిల్లులు వంటి అంశాలన్నీ ఎప్పటికప్పుడు తెరపై వీక్షించి వెంటనే మరమ్మతు పనులకు ఆదేశించవచ్చని బోర్డు ఉన్నతాధికారులు తెలిపారు. స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణం పనులపైనా నిఘా నేత్రం.. ప్రస్తుతం గ్రేటర్లో విలీనమైన 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో హడ్కోసంస్థ మంజూరుచేసిన రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏడాదిలోగా పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఆయా మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో సుమారు 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల మేర నీటిసరఫరా పైపులైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులపై సైతం సీసీటీవీలతో నిఘా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. తద్వారా అక్రమాలకు తావుండదని, నిర్మాణం పనులు వేగం పుంజుకుంటాయని అధికారులు చెబుతున్నారు. -
జంట టవర్ల నిర్మాణానికి ఓకే
నిర్మాణ పనులకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో పోలీసుల కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో చేపట్టదలచిన జంట టవర్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. జంట టవర్ల నిర్మాణ పనులను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జంట టవర్ల నిర్మాణ పనులు చేస్తున్న స్థలంపై ప్రైవేటు వ్యక్తులు యాజమాన్య హక్కులు కోరుతున్న నేపథ్యంలో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు దారుణమైనవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఒక్క నిమిషం కూడా అమల్లో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్లు పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరించడానికి కారణాలు వివరిస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి చెప్పడంతో.. సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్లు అంగీకరించారు. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణ కోసం పిటిషనర్లు పెట్టుకున్న దరఖాస్తు విషయంలో 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం జంట టవర్ల నిర్మాణాన్ని తలపెట్టిన స్థలం తమదని, ఆ స్థలం క్రమబద్ధీకరణకు తాము పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించిందని, ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్‌కు చెందిన మీర్ ఇక్బాల్ ఆలీ, మరో 16 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్రమబద్ధీకరణ కోసం పిటిషనర్ల తల్లి పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరణకు ప్రభుత్వం సరైన కారణాలను చెప్పలేదని సింగిల్ జడ్జి తప్పుపట్టారు. జంట టవర్లు నిర్మిస్తున్న స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు. -
జంట టవర్ల స్థలంపై వివాదం
♦ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ప్రైవేటు వ్యక్తులు ♦ ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో పోలీసుల కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో చేపట్టదలచిన జంట టవర్ల నిర్మాణంపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో షాక్ తగిలింది. ఈ టవర్లు నిర్మించతలపెట్టిన స్థలంపై కొంద రు ప్రైవేటు వ్యక్తులు యాజమాన్యపు హక్కు లు కోరుతున్న నేపథ్యంలో, అందులో నాలు గు వారాల పాటు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ జిల్లా, షేక్‌పేట మండలం బంజారాహిల్స్ సర్వే నంబర్లు 129/103లోని తమ ఐదెకరాల భూమి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుంటే అధికారులు తిరస్కరించారని, అంతేకాక తమ భూమిలో బహుళ అంతస్తుల భారీ భవన నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారని, దీనిని అడ్డుకోవాలంటూ హైదరాబాద్‌కు చెందిన మీర్ ఇక్బాల్ అలీ, మరో 16 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. 1981కి పూర్వం నుంచే తమ తల్లి గౌసియా బేగం స్వాధీనంలో ఆ ఐదెకరాల భూమి ఉందని పిటిషనర్లు తెలిపారు. అయితే దీనిని గుర్తించకుండా ఆ భూమి నుంచి ఖాళీ చేయించేందుకు 1981లో అప్పటి ప్రభుత్వం జీవో 942 జారీ చేసిందని, దీనిని హైకోర్టులో సవాల్ చేస్తే ఆ జీవోను న్యాయస్థానం కొట్టేసిందని వివరించారు. దీనిపై ప్రభుత్వం, మరికొందరు ధర్మాసనాన్ని ఆశ్రయించి అప్పీళ్లు దాఖలు చేశారని, విచారణ జరిపిన ధర్మాసనం అప్పీళ్లను పరిష్కరిస్తూ వివాదం తేలేంత వరకు సదరు భూమి విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా కొట్టేసిందని వివరించారు. యథాతథస్థితి ఉత్తర్వులు ఉండగానే ప్రభుత్వం తమ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించిందని, దీనిపై తాము మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా, తమ భూమిని పోలీసు శాఖకు కేటాయించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపిందన్నారు. వివాదం కొనసాగుతుండగానే తమ స్థలంలో భూమి పూజ చేసి, అక్కడ జంట టవర్లు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారన్నారు. దీంతో గత ఏడాది డిసెంబర్లో తాము హైకోర్టును ఆశ్రయించగా, క్రమబద్ధీకరణ కోసం తమ తల్లి పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ మెమో జారీ చేసినట్లు కోర్టుకు చెప్పారని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రభుత్వ మెమోలో పేర్కొన్న కారణాలు అర్థం లేకుండా, చాలా గోప్యతతో ఉన్నాయని పేర్కొన్నారు. ఆ స్థలంలో 4 వారాల పాటు నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
సీసీసీకి జంట టవర్లు
సాక్షి, హైదరాబాద్: పక్కపక్కనే రెండు టవర్లు.. అంతా అద్దాలతో, మెరిసిపోయే డిజైన్‌తో ఒకదానిలో 16, మరోదానిలో 14 అంతస్తులు.. రెండు టవర్ల మధ్య హైలెవల్ వంతెన.. టవర్లపై హెలిప్యాడ్, సోలార్ రూఫ్... ఏమిటిదని అనుకుంటున్నారా, హైదరాబాద్‌లో నిర్మించనున్న అత్యాధునిక ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)’ కార్యాలయ భవనం నమూనా. సీసీసీ భవన నమూనా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆర్కిటెక్ట్‌ల నుంచి డిజైన్లను ఆహ్వానించగా... 15 కంపెనీలు డిజైన్లు ఇచ్చాయి. వాటిని శనివారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలసి పరిశీలించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఈ డిజైన్, హంగులు ఉన్న ఒక నమూనాను ఖరారు చేశారు. శనివారం సీఎం కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సిటీ పోలీసు కమిషనరేట్‌కు ఇచ్చిన 8 ఎకరాల స్థలంలో సీసీసీ జంట భవంతులను నిర్మించనున్నారు. వీటిపై సోలార్ రూఫ్‌ను ఏర్పాటు చేసి విద్యుతోత్పత్తి చేస్తారు. సందర్శకుల కోసం కింది భాగంలో ప్రత్యేక స్థలం ఉంటుంది. నాలుగో అంతస్తులో సీసీసీ ప్రధాన హాలు ఉంటుంది. దాదాపు వెయ్యి మంది సామర్థ్యంతో ఆడిటోరియం, భవనం చుట్టూ ల్యాండ్ స్కేప్, నీటి ఫౌంటెయిన్లను ఏర్పాటు చేస్తారు. భవనంలో ఇంకా ఏమేం ఉండాలో నిర్ణయించి, తుది మెరుగులు దిద్దాలని సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సీపీ మహేందర్‌రెడ్డిలతో కూడిన బృందానికి సీఎం సూచించారు. డిజైన్‌కు తుది రూపమిచ్చి, టెండర్లు పిలిచి నిర్మాణం ప్రారంభించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉండే లక్ష సీసీ కెమెరాలు సీసీసీకి అనుసంధానమై ఉంటాయని, జిల్లాల్లోని పోలీసు ప్రధాన కార్యాలయాలను కూడా సీసీసీకి అనుసంధానం చేయాలని సూచించారు. పుష్కరాలు, జాతరలు, ప్రకృతి వైపరీత్యాల వంటి సమయంలో పోలీసులే కాక ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా సీసీసీ నుంచి పరిస్థితిని పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పోలీసులు వీధుల్లో ఎక్కువగా తిరగకుండానే.. అణువణువునా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపయోగించే పద్ధతులను అధ్యయనం చేసి హైదరాబాద్‌లో సీసీసీ భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్ అవసరాలకు తగ్గట్లుగా, స్మార్ట్ పోలీసింగ్‌కు సీసీసీ దోహదపడుతుందని చెప్పారు.