జంట టవర్ల స్థలంపై వివాదం
♦ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ప్రైవేటు వ్యక్తులు
♦ ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో పోలీసుల కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో చేపట్టదలచిన జంట టవర్ల నిర్మాణంపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో షాక్ తగిలింది. ఈ టవర్లు నిర్మించతలపెట్టిన స్థలంపై కొంద రు ప్రైవేటు వ్యక్తులు యాజమాన్యపు హక్కు లు కోరుతున్న నేపథ్యంలో, అందులో నాలు గు వారాల పాటు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ జిల్లా, షేక్‌పేట మండలం బంజారాహిల్స్ సర్వే నంబర్లు 129/103లోని తమ ఐదెకరాల భూమి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుంటే అధికారులు తిరస్కరించారని, అంతేకాక తమ భూమిలో బహుళ అంతస్తుల భారీ భవన నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారని, దీనిని అడ్డుకోవాలంటూ హైదరాబాద్‌కు చెందిన మీర్ ఇక్బాల్ అలీ, మరో 16 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. 1981కి పూర్వం నుంచే తమ తల్లి గౌసియా బేగం స్వాధీనంలో ఆ ఐదెకరాల భూమి ఉందని పిటిషనర్లు తెలిపారు.
అయితే దీనిని గుర్తించకుండా ఆ భూమి నుంచి ఖాళీ చేయించేందుకు 1981లో అప్పటి ప్రభుత్వం జీవో 942 జారీ చేసిందని, దీనిని హైకోర్టులో సవాల్ చేస్తే ఆ జీవోను న్యాయస్థానం కొట్టేసిందని వివరించారు. దీనిపై ప్రభుత్వం, మరికొందరు ధర్మాసనాన్ని ఆశ్రయించి అప్పీళ్లు దాఖలు చేశారని, విచారణ జరిపిన ధర్మాసనం అప్పీళ్లను పరిష్కరిస్తూ వివాదం తేలేంత వరకు సదరు భూమి విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా కొట్టేసిందని వివరించారు. యథాతథస్థితి ఉత్తర్వులు ఉండగానే ప్రభుత్వం తమ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించిందని, దీనిపై తాము మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా, తమ భూమిని పోలీసు శాఖకు కేటాయించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపిందన్నారు.
వివాదం కొనసాగుతుండగానే తమ స్థలంలో భూమి పూజ చేసి, అక్కడ జంట టవర్లు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారన్నారు. దీంతో గత ఏడాది డిసెంబర్‌లో తాము హైకోర్టును ఆశ్రయించగా, క్రమబద్ధీకరణ కోసం తమ తల్లి పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ మెమో జారీ చేసినట్లు కోర్టుకు చెప్పారని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రభుత్వ మెమోలో పేర్కొన్న కారణాలు అర్థం లేకుండా, చాలా గోప్యతతో ఉన్నాయని పేర్కొన్నారు. ఆ స్థలంలో 4 వారాల పాటు నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు.