జంట టవర్ల నిర్మాణానికి ఓకే | Okay for the construction of twin towers | Sakshi
Sakshi News home page

జంట టవర్ల నిర్మాణానికి ఓకే

Published Thu, Apr 7 2016 3:20 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

Okay for the construction of twin towers

నిర్మాణ పనులకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

 సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో పోలీసుల కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో చేపట్టదలచిన జంట టవర్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. జంట టవర్ల నిర్మాణ పనులను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

జంట టవర్ల నిర్మాణ పనులు చేస్తున్న స్థలంపై ప్రైవేటు వ్యక్తులు యాజమాన్య హక్కులు కోరుతున్న నేపథ్యంలో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు దారుణమైనవని ధర్మాసనం  వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఒక్క నిమిషం కూడా అమల్లో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్లు పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరించడానికి కారణాలు వివరిస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి చెప్పడంతో.. సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్లు అంగీకరించారు.

ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణ కోసం పిటిషనర్లు పెట్టుకున్న దరఖాస్తు విషయంలో 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం జంట టవర్ల నిర్మాణాన్ని తలపెట్టిన స్థలం తమదని, ఆ స్థలం క్రమబద్ధీకరణకు తాము పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించిందని, ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్‌కు చెందిన మీర్ ఇక్బాల్ ఆలీ, మరో 16 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్రమబద్ధీకరణ కోసం పిటిషనర్ల తల్లి పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరణకు ప్రభుత్వం సరైన కారణాలను చెప్పలేదని సింగిల్ జడ్జి తప్పుపట్టారు. జంట టవర్లు నిర్మిస్తున్న స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement