‘మీ సేవ’లు అభినందనీయం
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కితాబు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మీ సేవ ద్వారా ప్రజలకు అందిస్తు న్న సేవలను హైకోర్టు అభినందించింది. మీ సేవల్లో కొన్నింటి ని గ్రామస్థాయికి తీసుకురావాలని సూచించింది. ఏపీలోనూ మీ సేవ ద్వారా ఎటువంటి సేవలు అందిస్తున్నారో వివరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. వాటిని పరిశీలించిన అనంతరం ఈ మొత్తం వ్యవహారంలో తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించుకుని, ఆ మేర రైతుల నుంచి వసూలు చేస్తున్నారంటూ పత్రికల్లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం మరోసారి విచారించింది. మీ సేవ ద్వారా ప్రజలకు అందిస్తున్న 161 సేవల వివరాలను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ ధర్మాసనం ముందుంచారు. మీసేవ వల్ల అవినీ తికి అడ్డుకట్ట పడిందన్నారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం ప్రభుత్వ చర్యలను కొనియాడింది. మీ సేవ ద్వారా అందిస్తున్న సేవల వివరాలతో అఫిడవిట్ వేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వీరాస్వామికి ధర్మాసనం సూచించింది.