Justice Dilip
-
బహిరంగ వేలం ద్వారానే కేటాయింపులు జరగాలి
హౌసింగ్ బోర్డు స్థలాలపై హైకోర్టు వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్ : హౌసింగ్ బోర్డుకు చెందిన స్థలాలను ఎలా పడితే అలా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సాధ్యం కాదని, కేవలం బహిరంగ వేలం ద్వారా మాత్రమే కేటాయించాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో 1,200 చదరపు అడుగుల స్థలాన్ని తమకు కేటాయించేలా హౌసింగ్ బోర్డును ఆదేశించాలని కోరుతూ ఎ.బాలామణి, మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ ఇంటికి వెళ్లేందుకు మరో దారి లేనందున తమకు ఆ 1,200 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాలని బాలామణి తదితరులు 2001లో ప్రభుత్వాన్ని కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం చదరపు గజానికి రూ.5 వేలు చెల్లిస్తే స్థలాన్ని ఇవ్వాలని హౌసింగ్ బోర్డును ఆదేశిస్తూ ఆ మేరకు జీవో జారీ చేసింది. అయితే బాలామణి తదితరులు రూ. 5 వేలు చెల్లించలేదు. ఆ తరువాత ఈ జీవో అమలు కోసం హైకోర్టులో బాలామణి తదితరులు పిటిషన్ దాఖలు చేయగా, సింగిల్ జడ్జి దానిని తోసిపుచ్చారు. దీనిపై ధర్మాసనం ముందు మరోసారి అప్పీల్ చేశారు. దీనిని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించింది. -
‘మీ సేవ’లు అభినందనీయం
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కితాబు సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మీ సేవ ద్వారా ప్రజలకు అందిస్తు న్న సేవలను హైకోర్టు అభినందించింది. మీ సేవల్లో కొన్నింటి ని గ్రామస్థాయికి తీసుకురావాలని సూచించింది. ఏపీలోనూ మీ సేవ ద్వారా ఎటువంటి సేవలు అందిస్తున్నారో వివరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. వాటిని పరిశీలించిన అనంతరం ఈ మొత్తం వ్యవహారంలో తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించుకుని, ఆ మేర రైతుల నుంచి వసూలు చేస్తున్నారంటూ పత్రికల్లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం మరోసారి విచారించింది. మీ సేవ ద్వారా ప్రజలకు అందిస్తున్న 161 సేవల వివరాలను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ ధర్మాసనం ముందుంచారు. మీసేవ వల్ల అవినీ తికి అడ్డుకట్ట పడిందన్నారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం ప్రభుత్వ చర్యలను కొనియాడింది. మీ సేవ ద్వారా అందిస్తున్న సేవల వివరాలతో అఫిడవిట్ వేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వీరాస్వామికి ధర్మాసనం సూచించింది. -
తక్షణమే విధుల్లో చేరండి
న్యాయాధికారులు, ఉద్యోగులకు తేల్చి చెప్పిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఆందోళనలు, సమ్మె చేస్తూ విధులకు దూరంగా ఉన్న తెలంగాణ న్యాయాధికారులు, కింది కోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు విధుల్లో చేరేందుకు హైకోర్టు ఆఖరి అవకాశం ఇచ్చింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆందోళనలు, సమ్మెను తక్షణమే విరమించి విధుల్లో చేరాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, ఇతర న్యాయమూర్తులు కోరారు. లేనిపక్షంలో ఉభయ రాష్ట్రాల్లో న్యాయవ్యవస్థపై ఎన్నో ఆశలతో ఉన్న కక్షిదారులకు న్యాయాన్ని అందించేందుకు, వారికి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తమకున్న ఇతర అవకాశాలను పరిశీలించాల్సి ఉంటుంద ని తేల్చి చెప్పింది. సమస్యను చట్ట ప్రకారం పరిష్కరించే బాధ్యతను హైకోర్టుకు విడిచిపెట్టి తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ పేరిట శుక్రవారం ఓ ప్రకటన విడుదలైంది. చట్ట విరుద్ధం కాదు: న్యాయాధికారుల సంఘం ప్రాథమిక కేటాయింపుల జాబితాలో జరిగిన అన్యాయంపై తాము చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఎంత మాత్రం చట్ట విరుద్ధం కాదని తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి స్పష్టంచేశారు. అన్యాయాన్ని సరిదిద్దాలని మాత్రమే కోరుతున్నామని, ప్రజా ప్రయోజనాల కోసమే నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను రద్దు చేయడంతోపాటు న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తేనే ఆందోళన విరమిస్తామని న్యాయవాదుల సంఘాల నేతలు గండ్ర మోహనరావు, ఎం.రాజేందర్‌రెడ్డి, బి.జితేందర్‌రెడ్డి వెల్లడించారు. సర్వీసు పొడిగింపుపై నిరసనలు: హైకోర్టులో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఇద్దరు అధికారులకు సర్వీసు పొడిగించడంపై శుక్రవారం హైకోర్టు ఉద్యోగులు నిరసనలకు దిగారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ కాంతారెడ్డి, సెక్షన్ ఆఫీసర్ ప్రసాద్‌ల సర్వీసును పొడిగించడాన్ని ఉద్యోగులు తప్పుపట్టారు. ఇలా పొడిగింపులు ఇచ్చుకుంటూ పోతే సర్వీసులో ఉన్న ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలన్నారు. -
ఆ గ్రామాల సరిహద్దులపై సర్వే చేయండి
కృష్ణా, ఖమ్మం కలెక్టర్లకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లాలోని నరికంపాడు, తెలంగాణలోని ఖమ్మం జిల్లా గుంటుపల్లి గోపవరం గ్రామాల మధ్య ఏర్పడిన సరిహద్దు వివాదం విషయంలో సర్వే నిర్వహించి, హద్దులను ఖరారు చేయాలని హైకోర్టు శుక్రవారం ఉభయ జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నరికంపాడు గ్రామంలో తన భూమిలో యూకలిప్టస్ మొక్కలు నాటి, ఆ భూమిని తెలంగాణ అటవీభూమిగా చెబుతున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ బి.రోజా, మరో ఆరుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. -
గర్భిణులను చెట్ల కింద వదిలేస్తారా?
- కోఠి ప్రసూతి ఆస్పత్రిలో వసతులపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ‘ఆస్పత్రికి చికిత్స కోసం ఎంత మంది వచ్చినా వారికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సామర్థ్యానికి మించి రోగులు వస్తే చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించాలే తప్ప, ఇలా చెట్లు, పుట్ల కింద వదిలేస్తే ఎలా’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని కోఠి ప్రసూతి ఆస్పత్రిలో వసతులపై తాము సంతృప్తికరంగా లేమని వ్యాఖ్యానించింది. ఆస్పత్రిలోని పరిస్థితులను పరిశీలించేందుకు మహిళా న్యాయవాదులు జయంతి, పద్మజలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అక్కడున్న సౌకర్యాలపై మూడు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఇద్దరు న్యాయవాదుల ఆస్పత్రి సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోఠి ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసూతి ఆస్పత్రిలో సరైన వసతులు లేక గర్భిణిలు చెట్ల కింద పడుకుంటున్న వైనంపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించాలని కోరుతూ ఏసీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు లేఖ రాశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఏసీజే పత్రిక కథనాలను పిల్‌గా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈమేరకు వ్యాజ్యాన్ని జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా కోఠి ప్రసూతి ఆస్పత్రిలో పరిస్థితులపై తాము ఎంత మాత్రం సంతృప్తికరంగా లేమన్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కోఠి ప్రసూతి ఆస్పత్రిలో పరిస్థితులపై నివేదిక ఇచ్చేందుకు ఇద్దరు మహిళా న్యాయవాదులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఐఏఎస్ అధికారులకు ఊరట
జరిమానా ఉత్తర్వుల అమలును నిలిపివేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: కోర్టు ఉత్తర్వుల అమలులో అలసత్వం ప్రదర్శించినందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులకు జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన తీ ర్పుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం, పోచంపల్లిలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ చేసిన రోడ్డు ఆక్రమణలను తొలగించాలన ్న ఉత్తర్వులను అమలు చేయనందుకు రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. కార్వాన్‌లోని కూరగాయల మార్కెట్‌ను గుడిమల్కాపూర్‌కు మార్చినప్పుడు దుకాణాల కేటాయింపులో జరిగిన అన్యాయంపై కొందరు వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించారు. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఆ శాఖ కమిషనర్ శరత్‌కుమార్‌కు కోర్టు ధిక్కారం కింద సింగిల్ జడ్జి రూ. 5 వేల జరిమానా విధించింది. మరో కేసులో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవికి రూ.1,116 జరిమానా వేశారు. ఈ తీర్పులను సవాల్ చేస్త్తూ శరత్‌కుమార్, శ్రీదేవి వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. శుక్రవారం వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుల అమలును నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
హైకోర్టు ఏసీజేతో చర్చలు విఫలం
- 13న చలో హైకోర్టుకు తరలిరండి - అదే రోజున భవిష్యత్ కార్యాచరణ - న్యాయవాద సంఘాల పిలుపు సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల కేటాయింపులకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను విరమించాలని కోరేందుకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే చర్చలకు ఆహ్వానించారని, అయితే ఆ చర్చలు విఫలమయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు, సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి, న్యాయవాద జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిరావు, రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందంతో ఏసీజే చర్చించారని జితేందర్‌రెడ్డి తెలిపారు. న్యాయాధికారుల ప్రొవిజినల్ జాబితాను రీకాల్ చేయాలని, హైకోర్టు నిబంధనల మేరకు కొత్త జాబితాను రూపొందించాలని తాము కోరామన్నారు. కనీసం తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరామని, అయితే వినతిపత్రాన్ని పరిశీలిస్తామని మాత్రమే ఏసీజే చెప్పడంతో తాము వచ్చేశామని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 13న చలో హైకోర్టు కార్యక్రమం చేపడతామని...రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు భారీ సంఖ్యలో ఇందులో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అదే రోజు న్యాయవాదులతో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన న్యాయాధికారుల కేటాయింపులను రద్దు చేసే వరకూ ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కొనసాగుతున్న విధుల బహిష్కరణ న్యాయాధికారుల ప్రిలిమినరీ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలంటూ తెలంగాణవ్యాప్తంగా న్యాయవాదులు చేపట్టిన విధుల బహిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఐదో రోజూ కొనసాగింది. న్యాయవాదులకు మద్దతుగా భోజన విరామ సమయంలో పెద్ద ఎత్తున న్యాయశాఖ ఉద్యోగులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని అన్ని కోర్టుల్లోనూ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, న్యాయవాదులతో కలసి ఆందోళనల్లో పాల్గొనరాదని న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులను హైకోర్టు హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే కోర్టు విధులకు ఆటంకం కలిగించకుండా శాంతియుతంగా భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేస్తున్నా హైకోర్టు తమను బెదిరించే ప్రయత్నం చేస్తోందని న్యాయశాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు వైఖరి ఇదే తరహాలో ఉంటే సమ్మెకు వెళ్లేందుకూ వెనుకాడబోమని వారు హెచ్చరిస్తున్నారు. ఆప్షన్లను అంగీకరించొద్దు: ఎమ్మెల్యే రవీంద్ర ఆంధ్ర ప్రాంత న్యాయాధికారులు తెలంగాణలో పనిచేయడానికి ఇచ్చిన ఆప్షన్లను అంగీకరించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. అలాగే వారి కేటాయింపులతో కూడిన ప్రాథమిక జాబితాను వెంటనే నిలుపుదల చేయాలని ఒక ప్రకటనలో కోరారు. ఆంధ్ర ప్రాంతం నుంచి ఆప్షన్ల ద్వారా తెలంగాణలో పనిచేసే న్యాయాధికారుల వల్ల తెలంగాణ న్యాయాధికారుల పదోన్నతుల్లో అవరోధాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశంపై న్యాయవాదులు చేపడుతున్న నిరసనలకు సంఘీభావం తెలిపారు. -
అగ్రిగోల్డ్ మొదటిదశ వేలంలో 7.53 కోట్లు
హైకోర్టుకు నివేదించిన పర్యవేక్షణ కమిటీ ♦ మూడో దశ వేలానికి రూ.1100 కోట్ల ఆస్తులను గుర్తించాం ♦ తదుపరి విచారణ 29కి వాయిదా సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో మొదటి దశ ద్వారా రూ. 7.53 కోట్లు వచ్చినట్లు వేలం పర్యవేక్షణ కమిటీ మంగళవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అయితే మొదటి దశలో రూ. 40 కోట్లు వస్తాయని ఆశించామని కమిటీ తరఫు న్యాయవాది రవిప్రసాద్ తెలిపారు. రెండవ దశ వేలం ప్రక్రియ వచ్చే నెల 11, 12 తేదీల్లో మొదలవుతుందని, మూడో దశ వేలానికి రూ. 1,100 కోట్ల విలువ చేసే పలు ఆస్తులను గుర్తించామని ఆయన తెలిపారు. వేలం నిర్వహణ సంస్థలుగా ఉన్న సామిల్, ఎంఎస్‌టీసీల పనితీరు అనుకున్నస్థాయిలో లేదని తెలిపారు. ఎంఎస్టీసీ బ్రాంచ్ మేనేజర్ రాజమాణిక్యం కమిటీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదని కోర్టుకు నివేదించారు. ఈ నివేదికను పరిశీలించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణ సమయంలో కొన్ని నిర్ధిష్టమైన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఎంఎస్టీసీ బ్రాంచ్ మేనేజర్ రాజమాణిక్యంను కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని ఎంఎస్టీసీ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ మోసాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వాటిని మంగళవారం మరోసారి విచారించింది. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి... అక్షయగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంలో ఆ సంస్థ వ్యవస్థాపక వైస్ చైర్మన్‌గా ఉన్న కూకట్ల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశామని సీఐడీ అధికారులు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. మరింత మంది అరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నామని సీఐడీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్ కోర్టుకు వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఈ కేసును పర్యవేక్షిస్తున్న సీఐడీ డీఎస్పీ ఈ మొత్తం వ్యవహారంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అక్షయగోల్డ్ మోసాలపై దాఖలైన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. -
వారసత్వ కట్టడాలను కూల్చొద్దు
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తమ అనుమతి లేకుండా వారసత్వ కట్టడాలను కూల్చడానికి వీల్లేదని హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చారిత్రక, వారసత్వ కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. వారసత్వ కట్టడాల పరిరక్షణ బాధ్యతల నుంచి హెచ్ఎండీఏని తప్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 7న జారీ చేసిన జీవో 183ని సవాలు చేస్తూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్, టి.బుచ్చారెడ్డిలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి, కె.ఎస్.మూర్తి వాదనలు వినిపిస్తూ, వారసత్వ భవనాల రక్షణగా ఉన్న నిబంధనలను ప్రభుత్వం ఇటీవల ఉపసంహరిస్తూ జీవో జారీ చేసిందన్నారు. ఈ జీవో అమల్లో ఉంటే వారసత్వ కట్టడాలేమీ మిగలవని వారు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రస్తుతం ఉన్న నిబంధనలు చట్టానికిఅనుగుణంగా లేవని, అందుకే వాటిని ప్రభుత్వం ఉపసంహరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు కొంత సమయం పడుతుందని ఆయన కోర్టుకు నివేదించారు. వారసత్వ కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తమ అనుమతి లేకుండా వారసత్వ కట్టడాలను కూల్చడానికి వీల్లేదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేంత వరకే ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. -
మధ్యవర్తిత్వానికి మంచి భవిష్యత్తు
జస్టిస్ దిలీప్ బి.బొసాలే హైదరాబాద్: మధ్యవర్తిత్వానికి మంచి భవిష్యత్తు ఉందని, ప్రపంచం మొత్తం ఈ రంగంవైపు ఆసక్తిగా చూస్తోందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే అన్నారు. ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకున్న వారికి మంచి గుర్తింపుతోపాటు న్యాయవాదులతో సమానంగా ఆర్జించే అవకాశం ఉంటుందన్నారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార(ఏడీఆర్), కుటుంబ వివాద పరి ష్కార(ఎఫ్డీఆర్) విభాగాల్లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ (ఐసీఏడీఆర్), నల్సార్ నిర్వహిస్తున్న పీజీ డిప్లొమా ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం ఐసీఏడీఆర్ కార్యాలయంలో జరిగింది. ఇందులో జస్టిస్ బొసాలే మాట్లాడుతూ సీపీసీలోని సెక్షన్ 89 వివాదాలను పరిష్కరించుకునేందుకు నాలుగు ప్రత్యామ్నాయ విధానాలను సూచించిందన్నారు. న్యాయస్థానాలకు చేరే వివాదాల్లో ఏదో ఒక పార్టీ విజయం సాధిస్తుందని, అయితే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ఇరువర్గాలూ విజయం సాధించవచ్చన్నారు. తాలూకా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేయాల్సి వస్తోందని, అయితే తీవ్ర జాప్యం, న్యాయవాదులకు ఇచ్చే ఫీజు తదితర అంశాలతో చివరికి విజయం సాధించామనే ఆనందం కూడా ఉండదన్నారు. ఏడీఆర్ విధానం ద్వారా పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరిస్తున్నారని, దీంతో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని నల్సార్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా పేర్కొన్నారు. ఏడీఆర్ విధానం ద్వారా కేసులను పరిష్కరించడానికి 12 నెలల గడువు నిర్దేశించారని, దీంతో వివాదాలు వీలైనంత త్వరగా పరిష్కారమవుతాయన్నారు. కుటుంబ, కార్మిక, వాహన ప్రమాదాలు, కాంట్రాక్టు వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించవచ్చన్నారు. ఐసీఏడీఆర్ ద్వారా ఇప్పటి వరకు 1,700 మందికి మధ్యవర్తిత్వంపై శిక్షణ ఇచ్చామని ఐసీఏడీఆర్ ప్రాంతీయ విభాగం ఇన్చార్జి జేఎల్ఎన్ మూర్తి తెలిపారు. లీగల్ సర్వీస్ అథారిటీతో కలసి 18 జిల్లాల్లో ఏడీఆర్ విధానాలపై సదస్సులు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన సి.సుబ్రమణ్యం అనే విద్యార్థికి బంగారు పతకాన్ని, మంజుశర్మ అనే విద్యార్థికి రజత పతకాన్ని జస్టిస్ బొసాలే అందజేశారు. అలాగే అధ్యాపక బృందంలోని వై.పద్మావతి, మోహన్‌కృష్ణ, సంధ్యారాణిలను కూడా జస్టిస్ బొసాలే సత్కరించారు. కార్యక్రమంలో నల్సార్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సూరి అప్పారావు పాల్గొన్నారు. -
అప్పటి మంత్రి మోసం చేశారు
♦ అందుకే పాత గాంధీ ఆస్పత్రి స్థలం లీజు పునరుద్ధరణ ♦ హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: బషీర్‌బాగ్‌లోని పాత గాంధీ ఆసుపత్రి స్థలం లీజును పునరుద్ధరించడంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి, సంబంధిత శాఖాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర విభజనకు కొద్ది రోజుల ముందు దురుద్దేశాలతో లీజును పునరుద్ధరించారని, దీనిపై తాము చట్టపరంగా తగిన నిర్ణయం తీసుకుంటామని వివరించింది. లీజు పొందిన జీఎస్ గుప్తా తదితరుల తరఫు న్యాయవాదులు వాయిదా కోరడంతో హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 5.6 ఎకరాల పాత గాంధీ ఆసుపత్రి స్థలాన్ని భారీ వాణిజ్య సముదాయం నిమిత్తం జీఎస్ గుప్తా తదితరులకు లీజుకివ్వడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన చంద్రకిశోర్ జైశ్వాల్, మరొకరు వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా జీఎస్ గుప్తా తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. దురుద్దేశాలతో ఈ వ్యాజ్యం దాఖలు చేశారని అన్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోవడానికి అధికారులే కారణమని, ఐదేళ్ల పాటు తాము సమర్పించిన ప్లాన్లకు ఆమోదముద్ర వేయలేదన్నారు. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర విభజనకు కొద్ది రోజుల ముందు అంటే రాష్ట్రపతి పాలన ఉండగా అప్పటి పర్యాటక శాఖ అధికారులు, అప్పటి మంత్రి మోసపూరితంగా వ్యవహరించి, ముగిసిన లీజును పునరుద్ధరించారన్నారు. అంతేకాక లీజు బకాయిలను కూడా మాఫీ చేశారని, దీని వల్ల ఖజానాకు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు. -
జంట టవర్ల నిర్మాణానికి ఓకే
నిర్మాణ పనులకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో పోలీసుల కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో చేపట్టదలచిన జంట టవర్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. జంట టవర్ల నిర్మాణ పనులను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జంట టవర్ల నిర్మాణ పనులు చేస్తున్న స్థలంపై ప్రైవేటు వ్యక్తులు యాజమాన్య హక్కులు కోరుతున్న నేపథ్యంలో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు దారుణమైనవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఒక్క నిమిషం కూడా అమల్లో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్లు పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరించడానికి కారణాలు వివరిస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి చెప్పడంతో.. సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్లు అంగీకరించారు. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణ కోసం పిటిషనర్లు పెట్టుకున్న దరఖాస్తు విషయంలో 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం జంట టవర్ల నిర్మాణాన్ని తలపెట్టిన స్థలం తమదని, ఆ స్థలం క్రమబద్ధీకరణకు తాము పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించిందని, ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్‌కు చెందిన మీర్ ఇక్బాల్ ఆలీ, మరో 16 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్రమబద్ధీకరణ కోసం పిటిషనర్ల తల్లి పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరణకు ప్రభుత్వం సరైన కారణాలను చెప్పలేదని సింగిల్ జడ్జి తప్పుపట్టారు. జంట టవర్లు నిర్మిస్తున్న స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు. -
ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోండి
♦ అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై హైకోర్టు సూచన సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు తేలిన ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల వివరాలుంటే వాటిని ప్రభుత్వానికి అందచేయాలని పిటిషనర్‌కు సూచించింది. ఆ పాఠశాలలు కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ట్లు తేలితే వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో పలు ప్రైవే టు అన్ ఎయిడెడ్ పాఠశాలలు వన్‌టైం స్పెష ల్ ఫీజు అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని, ఇది ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమంటూ హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.రవికుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని మరోసారి విచారించిన ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ స్పందిస్తూ అధిక ఫీజుల వసూలుపై పిటిషనర్ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారని, దాని ఆధారంగా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. విచారణ జరిపిన కమిటీ నివేదిక సమర్పించిందని, 12 పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేలిందన్నారు. దీంతో ఆ 12 పాఠశాలలకు నోటీసులు జారీ చేశామని, వారు వివరణలు కూడా ఇచ్చారని, ఈ వివరణ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు నివేదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
‘మధ్యవర్తిత్వం’తోనే సత్వర న్యాయం
ఖర్చు అసలే ఉండదు.. సమయం ఆదా: జస్టిస్ చంద్రయ్య సాక్షి, హైదరాబాద్: సత్వర న్యాయం పొందేందుకు మధ్యవర్తిత్వమే అత్యుత్తమ పరిష్కార మార్గమని, దీనిని కక్షిదారులందరూ వినియోగించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య కోరారు. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని ఎన్నో కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అయ్యాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే పేదలపాలిట ఆశాదీపమని, మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించేందుకు ఆయన నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. మంగళవారం హైకోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎ.వెంకటేశ్వరరెడ్డి కూడా పాల్గొన్నారు. మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించేందుకు న్యాయసేవాధికార సంస్థ తీసుకుంటున్న చర్యలను జస్టిస్ చంద్రయ్య వివరించారు. మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులపై ఎటువంటి ఆర్థికభారం పడదని, అంతేకాక పరిష్కారం త్వరతగతిన,సామరస్యపూర్వకంగా లభిస్తుందన్నారు. న్యాయవాదులు లేనప్పుడు కక్షిదారులే స్వయంగా మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చునన్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో మధ్యవర్తిత్వం విజయవంతమైందని వివరించారు. మధ్యవర్తులుగా వ్యవహరించే వ్యక్తులకు మధ్యవర్తిత్వం - రాజీ ప్రాజెక్టు కమిటీ శిక్షణ ఇచ్చిందని, తెలంగాణలో 162 శిక్షణ పొందిన మధ్యవర్తులు, 15 మంది జడ్జీలు ఉన్నారని ఆయన తెలిపారు. మధ్యవర్తులకు శిక్షణ ఇచ్చేందుకు కొందరు వ్యక్తులను ఎంపిక చేసి ఢిల్లీలో శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. అపరిష్కృతంగా ఉన్న కేసులను లోక్ అదాలత్‌ల ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చునని, ఇందుకు కక్షిదారులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.