అప్పటి మంత్రి మోసం చేశారు
♦ అందుకే పాత గాంధీ ఆస్పత్రి స్థలం లీజు పునరుద్ధరణ
♦ హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: బషీర్‌బాగ్‌లోని పాత గాంధీ ఆసుపత్రి స్థలం లీజును పునరుద్ధరించడంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి, సంబంధిత శాఖాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర విభజనకు కొద్ది రోజుల ముందు దురుద్దేశాలతో లీజును పునరుద్ధరించారని, దీనిపై తాము చట్టపరంగా తగిన నిర్ణయం తీసుకుంటామని వివరించింది. లీజు పొందిన జీఎస్ గుప్తా తదితరుల తరఫు న్యాయవాదులు వాయిదా కోరడంతో హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 5.6 ఎకరాల పాత గాంధీ ఆసుపత్రి స్థలాన్ని భారీ వాణిజ్య సముదాయం నిమిత్తం జీఎస్ గుప్తా తదితరులకు లీజుకివ్వడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన చంద్రకిశోర్ జైశ్వాల్, మరొకరు వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా జీఎస్ గుప్తా తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. దురుద్దేశాలతో ఈ వ్యాజ్యం దాఖలు చేశారని అన్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోవడానికి అధికారులే కారణమని, ఐదేళ్ల పాటు తాము సమర్పించిన ప్లాన్లకు ఆమోదముద్ర వేయలేదన్నారు. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర విభజనకు కొద్ది రోజుల ముందు అంటే రాష్ట్రపతి పాలన ఉండగా అప్పటి పర్యాటక శాఖ అధికారులు, అప్పటి మంత్రి మోసపూరితంగా వ్యవహరించి, ముగిసిన లీజును పునరుద్ధరించారన్నారు. అంతేకాక లీజు బకాయిలను కూడా మాఫీ చేశారని, దీని వల్ల ఖజానాకు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు.