సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఏకీకృతం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉపాధ్యాయులతోపాటు ఒకే కేడర్‌గా పరిగణిస్తూ 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేస్తూ గతేడాది జూన్ 23న జారీ అయిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. పంచాయతీరాజ్ టీచర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఏకీకరణ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులకు చేసిన సవరణలు రాజ్యాంగంలోని అధికరణ 371–డీకి విరుద్ధమని స్పష్టం చేసింది. పలు రకాల పోస్టుల నిర్వహణకు అధికరణ 371–డీ అధికారం కల్పిస్తుందే తప్ప కేడర్ ఏకీకరణకు, విలీనానికి అధికారం ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. ప్రతి జిల్లాలోని మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ప్రభుత్వ పాఠశాలల్లోని నాన్ గెజిటెడ్ టీచర్లను ప్రత్యేక సమీకృత కేడర్‌గా పేర్కొంటూ 1975 ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఉత్తర్వుల్లో పొందుపరిచిన 2–ఏ పేరాను హైకోర్టు కొట్టేసింది. అలాగే ఈ సవరణలు 1998 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంటూ రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని మూడో షెడ్యూల్‌లో చేర్చిన 23–ఏలో మండల విద్యాధికారి, ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను పొందుపరచడాన్ని కూడా కొట్టేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను తమతోపాటు ఒకే కేడర్‌గా పరిగణించి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేస్తూ గతేడాది జూన్ 23న జారీ అయిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ)లో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే తెలంగాణకు పరిపాలన ట్రిబ్యునల్ లేకపోవడంతో తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు, మరో ఇద్దరు టీచర్లు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేస్తూ అందులో చేర్చిన పేరా 2–ఏను, మూడో షెడ్యూల్‌లో చేర్చిన 23–ఏను వారు సవాల్ చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు వెలువరించింది.
371–డీలో ఏకీకరణ ప్రస్తావనే లేదు...
‘అధికరణ 371–డీ అమల్లో ఉన్నంత వరకు రాష్ట్రపతి కేవలం లోకల్ కేడర్, లోకల్ ఏరియా, లోకల్ అభ్యర్థికి సంబంధించిన వ్యవహారాల్లోనే ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుంది. అయితే ప్రస్తుత ఉత్తర్వుల విషయంలో రాష్ట్రపతి అధికరణ 371–డీలో నిర్దేశించిన అంశాలకే పరిమితమవకుండా ప్రభుత్వ టీచర్లతో స్థానిక సంస్థల్లో పనిచేసే టీచర్లను ఏకీకృతం చేశారు. ఇలా రెండు వేర్వేరు కేడర్‌లను ఏకీకృతం చేసే అధికారం రాష్ట్రపతికి ఉందా? అనే విషయంలో మాకు సందేహాలున్నాయి. కేడర్ ఏకీకరణ గురించి 371–డీలో ఎటువంటి ప్రస్తావనా లేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 3 ప్రకారం రకరకాల పోస్టులను ఏకీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఓ యజమానిగా రకరకాల పోస్టులను, రకరకాల కేడర్‌లను ఏకీకృత చేయవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అదే పనిని అధికరణ 371–డీ కింద చేయవచ్చా? తదానుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయవచ్చా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఇందుకు స్పష్టమైన సమాధానం కూడా ఉంది.
రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 3ను పరిశీలిస్తే అందులో వివిధ రకాల కేటగిరీ పోస్టుల నిర్వహణ గురించి ఉంది తప్ప వివిధ కేటగిరీల పోస్టుల ఏకీకరణ, విలీనం గురించి ప్రస్తావన లేదు. ఏకీకరణ, విలీనం విషయంలో అధికరణ 371–డీ, రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 3 ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాయంటే ప్రాంతీయ అసమానతలు తొలగించి ఉద్యోగాల్లో సమానావకాశాల కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా అధికరణ 371–డీని తీసుకురావడం జరిగింది. ఈ ప్రధాన ఉద్దేశానికి, కేడర్‌ల ఏకీకరణకు ఎటువంటి సంబంధం లేదు. అయితే కేశవులు, పి. వేమారెడ్డి కేసుల విషయంలో తలెత్తిన న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయించింది. అయితే రాష్ట్రపతి ఈ తాజా సవరణ ఉత్తర్వులు అధికరణ 371–డీకి విరుద్ధంగా ఉన్నాయి. ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు సిక్స్ పాయింట్ ఫార్ములా తీసుకొచ్చారు. ఇందులో కేడర్ల ఏకీకరణకు సంబంధించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
ఏ కోర్టు కూడా అటువంటి గ్లేమ్‌ప్లాన్‌ను ఆమోదించదు...
‘రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని మూడో పేరాలో కొత్తగా చేర్చిన 2–ఏలో ప్రతి జిల్లాలోని మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాఠశాలల్లోని నాన్ గెజిటెడ్ టీచర్లను ప్రత్యేక సమీకృత కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తున్నట్లు పేర్కొని ఉంటే అందులో తప్పుబట్టడానికి ఏమీ ఉండేది కాదు. అయితే ఇందులో మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాఠశాలతోపాటు ప్రభుత్వ పాఠశాలలు అని, ఏకీకరణ అని చేర్చారు. ఈ పదాలను చేర్చకుండా ఉండి ఉంటే 2–ఏ పేరా 371–డీకి అనుగుణంగా ఉండేది. అధికరణ 371–డీలో ఎక్కడా వేర్వేరు కేడర్‌ల ఏకీకరణ గురించి లేనే లేదు. కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని మూడో పేరాలో చేర్చిన 2–ఏ అధికరణ 371–డీకి విరుద్ధం. అలాగే చేర్చిన 23–ఏ కూడా అధికరణ 371–డీకి విరుద్ధం. రాష్ట్రపతి ఉత్తర్వులకు చేసిన సవరణలు 1998 నవంబర్ 20 నుంచి వర్తిస్తాయని పేర్కొనడం కూడా సరికాదు. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు తెచ్చుకుని, దాన్ని 1998 నుంచి వర్తింపజేసుకోవడం తగదు. ఇది వక్ర మార్గాన్ని అనుసరించడమే. ఏ న్యాయస్థానం కూడా ఇటువంటి గేమ్‌ప్లాన్‌ను ఆమోదించదు’అని ధర్మాసనం తీర్పులో తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment