అన్ని చర్యలు తీసుకున్నాం.. | Telangana Government Submits Report About Corona To High Court | Sakshi
Sakshi News home page

అన్ని చర్యలు తీసుకున్నాం..

Published Fri, Apr 17 2020 1:52 AM | Last Updated on Fri, Apr 17 2020 1:52 AM

Telangana Government Submits Report About Corona To High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులకు వైద్యం అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వైద్య సేవలు అందించే వారందరికీ మాస్క్‌లు, గ్లౌజ్‌లు, దుస్తులు అన్నింటినీ సమకూర్చామని, అతి ప్రమాదకరమైన ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు, అత్యవసర విభాగాలు, అంబులెన్స్‌ల్లో కరోనా రోగిని తరలించేప్పుడు వ్యక్తిగత రక్షణ కిట్‌ (పీపీఈ)లను అందజేస్తున్నామంది. 446 సంక్షేమ హాస్టళ్లలోని వారికి ఆహారం, దుస్తులు, మాస్క్‌లు పంపిణీ చేశామని, మహిళలు, పిల్లలు, వృద్ధులు, నిరాశ్రయులు, వీధి బాలల సంక్షేమానికి చర్యలు తీసుకున్నామని వివరించింది. నిత్యావసర వస్తువులు, మందులు, అత్యవసర వస్తువుల సరఫరాకు అన్ని చర్యలు తీసుకున్నామని, వీటి రవాణాపై ఆంక్షలు ఏమీ లేవని తెలిపింది. ఆలయాలు, మసీదులు, చర్చిలను మూసివేయించామని, సామూహిక సమావేశాలు కాకుండా నిషేధ ఉత్తర్వులను అమలు చేస్తున్నామని తెలిపింది.  

నివేదికలో వెల్లడించిన అంశాలు.. 
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్తి వివరాలతో తుది నివేదికను అందజేశారు. ‘13 ప్రభుత్వాసుపత్రుల్లో 4,497 ఐసోలేషన్‌ బెడ్లు, 361 ఐసీయూ బెడ్లు, 246 వెంటిలేటర్‌ ఉన్న బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. వీటికి అదనంగా 21 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలను గుర్తించి వాటిలో 7 వేల ఐసోలేషన్, 800 ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉంచాం. గచ్చిబౌలి క్రీడా వసతి ప్రాంగణాన్ని కరోనా ఆస్పత్రిగా మార్పు చేశాం. ఆస్పత్రుల్లోనే కాకుండా అనుమానితుల ఇళ్లకు వెళ్లే వారికి కూడా పీపీఈలు అందజేస్తున్నాం. వీటన్నింటినీ రాష్ట్ర మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షణ చేస్తోంది. రాష్ట్రంలో వెంటిలేటర్ల తయారీ లేనందున 600 వెంటిలేటర్ల కోసం ఆర్డర్‌ ఇస్తాం. 3.85 లక్షల కరోనా పరీక్షల కిట్స్‌కు, 4,57,350 వీటీఎం టెస్టింగ్‌ కిట్లకు ఆర్డర్‌ చేశాం. 3.14 లక్షల శానిటైజర్‌ బాటిళ్లకు ఆర్డర్‌ చేశాం. 27,785 లీటర్ల శానిటైజర్‌ను వివిధ సంస్థలు ఉచితంగా ఇచ్చాయి. 3,53,210 పీపీఈ కిట్లు కావాలని ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 51,475 కిట్లు వచ్చాయి. సర్జికల్స్‌ గ్లౌవ్స్‌ 34 లక్షలు ఆర్డర్‌ ఇస్తే 10.34 లక్షలు అందాయి. అయితే ప్రభుత్వం వద్ద 23 లక్షల గ్లౌవ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఎన్‌–95 మాస్క్‌లు 7,72,480 ఆర్డర్‌ ఇస్తే 1,61,980 అందాయి. ప్రస్తుతం 73,227 అందుబాటులో ఉన్నాయి. మూడు పొరల సర్జికల్‌ మాస్క్‌లు 53 లక్షలు కావాలని ఆర్డర్‌ ఇస్తే 25.50 లక్షలు అందాయి. 22.48 లక్షలున్నాయి. నిపుణుల కమిటీ ఆదేశాలకు అనుగుణంగా 53 రకాల మందుల కొనుగోలు జరుగుతోంది. కరోనా అనుమానితుల్లో 80 శాతానికి స్వల్ప లక్షణాలు కనబడి తే 15 శాతానికి మోస్తరు, 5 శాతానికి వైరస్‌ లక్షణాలు తీవ్రంగానూ కనబడుతున్నాయి. వీరందరికీ కూడా వైరస్‌ నివారణ వైద్యం అందజేస్తున్నాం. లాక్‌డౌన్‌ రూల్స్‌కు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన 75,800 వాహనాల్ని సీజ్‌ చేశాం. 4,900 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 33 వేల ఉల్లంఘనల్లో 17 వేల వాహనాల్ని సీజ్‌ చేశాం. జరిమానాగా 3.80 కోట్లు వసూలైంది. రాష్ట్ర సరిహద్దుల్లో 40, రాష్ట్రంలో 230 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశా రు. పోలీసులపై దాడులకు పాల్పడిన వారి పైన, ప్రజల పట్ల దురుసుగా వ్యవహరించి న పోలీసులపై చర్యలు తీసుకుంటున్నాం..’అని నివేదికలో ప్రభుత్వం పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement