వారసత్వ కట్టడాలను కూల్చొద్దు
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తమ అనుమతి లేకుండా వారసత్వ కట్టడాలను కూల్చడానికి వీల్లేదని హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చారిత్రక, వారసత్వ కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. వారసత్వ కట్టడాల పరిరక్షణ బాధ్యతల నుంచి హెచ్‌ఎండీఏని తప్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 7న జారీ చేసిన జీవో 183ని సవాలు చేస్తూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్, టి.బుచ్చారెడ్డిలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి, కె.ఎస్.మూర్తి వాదనలు వినిపిస్తూ, వారసత్వ భవనాల రక్షణగా ఉన్న నిబంధనలను ప్రభుత్వం ఇటీవల ఉపసంహరిస్తూ జీవో జారీ చేసిందన్నారు. ఈ జీవో అమల్లో ఉంటే వారసత్వ కట్టడాలేమీ మిగలవని వారు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రస్తుతం ఉన్న నిబంధనలు చట్టానికిఅనుగుణంగా లేవని, అందుకే వాటిని ప్రభుత్వం ఉపసంహరించిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు కొంత సమయం పడుతుందని ఆయన కోర్టుకు నివేదించారు. వారసత్వ కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తమ అనుమతి లేకుండా వారసత్వ కట్టడాలను కూల్చడానికి వీల్లేదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేంత వరకే ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.