కోర్టు ఉత్తర్వుల అమలులో అలసత్వం ప్రదర్శించినందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులకు జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన తీ ర్పుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది.
జరిమానా ఉత్తర్వుల అమలును నిలిపివేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఉత్తర్వుల అమలులో అలసత్వం ప్రదర్శించినందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులకు జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన తీ ర్పుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం, పోచంపల్లిలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ చేసిన రోడ్డు ఆక్రమణలను తొలగించాలన ్న ఉత్తర్వులను అమలు చేయనందుకు రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు.
కార్వాన్‌లోని కూరగాయల మార్కెట్‌ను గుడిమల్కాపూర్‌కు మార్చినప్పుడు దుకాణాల కేటాయింపులో జరిగిన అన్యాయంపై కొందరు వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించారు. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఆ శాఖ కమిషనర్ శరత్‌కుమార్‌కు కోర్టు ధిక్కారం కింద సింగిల్ జడ్జి రూ. 5 వేల జరిమానా విధించింది. మరో కేసులో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవికి రూ.1,116 జరిమానా వేశారు. ఈ తీర్పులను సవాల్ చేస్త్తూ శరత్‌కుమార్, శ్రీదేవి వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. శుక్రవారం వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుల అమలును నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.