తక్షణమే విధుల్లో చేరండి
న్యాయాధికారులు, ఉద్యోగులకు తేల్చి చెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆందోళనలు, సమ్మె చేస్తూ విధులకు దూరంగా ఉన్న తెలంగాణ న్యాయాధికారులు, కింది కోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు విధుల్లో చేరేందుకు హైకోర్టు ఆఖరి అవకాశం ఇచ్చింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆందోళనలు, సమ్మెను తక్షణమే విరమించి విధుల్లో చేరాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, ఇతర న్యాయమూర్తులు కోరారు. లేనిపక్షంలో ఉభయ రాష్ట్రాల్లో న్యాయవ్యవస్థపై ఎన్నో ఆశలతో ఉన్న కక్షిదారులకు న్యాయాన్ని అందించేందుకు, వారికి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తమకున్న ఇతర అవకాశాలను పరిశీలించాల్సి ఉంటుంద ని తేల్చి చెప్పింది. సమస్యను చట్ట ప్రకారం పరిష్కరించే బాధ్యతను హైకోర్టుకు విడిచిపెట్టి తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ పేరిట శుక్రవారం ఓ ప్రకటన విడుదలైంది.
చట్ట విరుద్ధం కాదు: న్యాయాధికారుల సంఘం ప్రాథమిక కేటాయింపుల జాబితాలో జరిగిన అన్యాయంపై తాము చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఎంత మాత్రం చట్ట విరుద్ధం కాదని తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి స్పష్టంచేశారు. అన్యాయాన్ని సరిదిద్దాలని మాత్రమే కోరుతున్నామని, ప్రజా ప్రయోజనాల కోసమే నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను రద్దు చేయడంతోపాటు న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తేనే ఆందోళన విరమిస్తామని న్యాయవాదుల సంఘాల నేతలు గండ్ర మోహనరావు, ఎం.రాజేందర్‌రెడ్డి, బి.జితేందర్‌రెడ్డి వెల్లడించారు.
సర్వీసు పొడిగింపుపై నిరసనలు: హైకోర్టులో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఇద్దరు అధికారులకు సర్వీసు పొడిగించడంపై శుక్రవారం హైకోర్టు ఉద్యోగులు నిరసనలకు దిగారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ కాంతారెడ్డి, సెక్షన్ ఆఫీసర్ ప్రసాద్‌ల సర్వీసును పొడిగించడాన్ని ఉద్యోగులు తప్పుపట్టారు. ఇలా పొడిగింపులు ఇచ్చుకుంటూ పోతే సర్వీసులో ఉన్న ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలన్నారు.