ఈ నెలాఖరుకు హైదరాబాద్‌లోని సచివాలయం ఖాళీ అవనుంది. వచ్చేనెల 3వ తేదీ నుంచి రాజధాని ప్రాంతం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం
తరలింపుపై జీఏడీ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరుకు హైదరాబాద్‌లోని సచివాలయం ఖాళీ అవనుంది. వచ్చేనెల 3వ తేదీ నుంచి రాజధాని ప్రాంతం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే పూర్తి కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. సోమవారం నుంచి వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లేందుకు అన్ని శాఖలు సన్నాహకాలు ప్రారంభించనున్నాయి. దీంతో వచ్చే నెల 2వ తేదీ వరకూ సచివాలయంలోని పాలనా వ్యవహారాలు స్తంభించనున్నాయి.
వెలగపూడిలోని సచివాలయంలోనే మళ్లీ కార్యకలాపాలు మొదలవుతాయి. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శనివారం కార్యాచరణతో కూడిన ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు, ఏపీ ట్రిబ్యునల్, ఆర్‌టీఐ, లోకాయుక్త వంటి అంశాలకు అవసరమైన ఒకరిద్దరు ఉద్యోగులు మాత్రమే హైదరాబాద్ సచివాలయంలో ఉండాలని, మిగతా అధికారులు, ఉద్యోగులంతా 3వ తేదీ నుంచి వెలగపూడిలో పనిచేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.