Interim Secretariat
-
6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
6 నుంచి అసెంబ్లీ
⇒ సోమవారం ఉ. 11.06 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ⇒ 26వ తేదీతో నోటిఫికేషన్ జారీ చేసిన శాసనసభ సచివాలయం సాక్షి, అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రాంగణంలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో శాసన సభ, మండలి సమావేశాలు సోమవారం (6వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 11.06 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సచివాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే, గత నెల 26వ తేదీతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేయడం వివాదంగా మారింది. పాత తేదీతో నోటిఫికేషన్ జారీ చేయడాన్ని అధికార యంత్రాంగం తప్పుపడుతోంది. 13న బడ్జెట్: సోమవారం గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. వాయిదా పడిన తరువాత లేదా మంగళవారం శాసన సభా వ్యవహారాల కమిటీ సమావేశమవుతుంది. సమావేశాలు ఎప్పటివరకు నిర్వహించాలి, ఏ ఏ అంశాలను చర్చకు చేపట్టాలో ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017–18) వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 13వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. -
ఇక బయోమెట్రిక్ ఆధారిత వేతనాలు!
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సాక్షి, అమరావతి: కార్పొరేట్ కార్యాలయాల తరహాలో ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు నమోదు విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ఆసుపత్రులు, విద్యాలయాలన్నింటి లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తేనుంది. ఇప్పటికే తాత్కాలిక సచివాలయంలో ఈ విధానం కొనసాగుతుండగా.. త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య ఆరోగ్య కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. తొలిదశలో చిత్తూరు జిల్లాలో వైద్య ఆర్యోగ శాఖ ఉద్యోగులందరికీ ఫిబ్రవరి 1వ తేదీన వేతనాలను బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మెమో జారీ చేశారు. -
అవస్థల నడుమ విధులు..
తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగుల కష్టాలు సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయానికి తరలివచ్చిన ఉద్యోగులు నానా తిప్పలు పడుతున్నారు. సచివాలయ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండడం, అరకొర వసతులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సోమవారం నుంచి 30 శాఖల ఉద్యోగులు విధులు చేపట్టడం తెలిసిందే. మంగళవారం ఉద్యోగుల హాజరు పలుచబడగా.. వచ్చిన ప్రతిఒక్కరూ అవస్థల నడుమ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి ఉద్యోగుల రాక మొదలైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరుకు రైలు, బస్సుల్లో చేరుకున్నవారు తాత్కాలిక సచివాలయానికి చేరుకోవడానికి అవస్థలు పడ్డారు. స్థానికంగా వసతి సౌకర్యం లేక విజయవాడ, గుంటూరుల్లో బంధువులు, మిత్రులు, లాడ్జిల్లో ఉంటున్న ఉద్యోగు లు సచివాలయానికి చేరుకోవడానికీ ప్రయా ణ ఇబ్బందులు తప్పలేదు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి బస్సులు ఏర్పాటు చేసినా.. వాటి సమాచారం తెలియకపోవడంతో ఇబ్బందిపడ్డారు. మహిళలకు ‘మరుగు’ తిప్పలు సచివాలయంలో పనిచేసే వేలమంది ఉద్యోగులకు సరిపడా వసతుల్లేని పరిస్థితి. ము ఖ్యంగా మహిళలు తగినన్ని మరుగుదొడ్లు లేక ఇక్కట్లు పడుతున్నారు. అరకొరగా మ రుగు సౌకర్యాలుండగా.. అవీ పురుషుల మ రుగుదొడ్లు పక్కన, ఎదురుగా నిర్మించడం తో మహిళా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం తమకు పండ్లు, కుంకుమ, లలితా సహస్రనామ పుస్తకాలందించి అభినందించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారికి పలువురు మహిళా ఉద్యోగులు తమ గోడు వినిపించారు. దీంతో వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతానని, వారంలోగా పరిష్కరిస్తానని ఆమె హామీఇచ్చారు. -
నేటి నుంచి ‘అమరావతి’ పాలన
-
నేటి నుంచి ‘అమరావతి’ పాలన
- హైదరాబాద్ నుంచి వెలగపూడికి చేరిన ఫైళ్లు, కంప్యూటర్లు - దసరా రోజున సీఎం,సీఎస్ పేషీలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్/అమరావతి బ్యూరో: రాష్ట్ర పరిపాలన ఇకపై పూర్తిస్థాయిలో ‘అమరావతి’ నుంచే కొనసాగనుంది. కార్యదర్శులు సోమవారం లాంఛనంగా పూజలు చేసి వెలగపూడి నుంచి విధులు ఆరంభిస్తారు. ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల ఛాంబర్లను సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ప్రారంభించేందుకు ఉద్యోగులు పూలమాలలు, మామిడి తోరణాలతో అలంకరించారు. సచివాలయ ఉద్యోగులకు సోమవారం ఉదయం ఆత్మీయ స్వాగతం పలికేందుకు విజయవాడ, గుంటూరులోని ఆయా శాఖల సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ సచివాలయం నుంచి 80 శాతానికి పైగా సామాగ్రిని వెలగపూడికి తరలించారు. పంచాయతీరాజ్ శాఖ మాత్రం మరికొన్ని రోజులు హైదరాబాద్‌లోనే కొనసాగనుంది. దసరా నుంచి సీఎం, సీఎస్.. దసరా పర్వదినం సందర్భంగా(అక్టోబర్ 11)న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ పేషీలను పూజాదికాలతో ప్రారంభిస్తారు. ఆ రోజు నుంచి పూర్తిస్థాయిలో సీఎం, సీఎస్ పేషీలు వెలగపూడి సచివాలయ కేంద్రంగానే పనిచేయనున్నాయి. వారానికి ఐదు రోజులే పని హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లిన సచివాలయ, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు ఏడాది పాటు వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉంటాయి. నేడు ప్రారంభమయ్యేనా?! వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఏర్పాట్లు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. భవనాల్లో పనులు ఇంకాకొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల హడావుడి కనిపిస్తుందే గానీ పాలనకు సంబంధించి పనులేవీ పూర్తి కాలేదు. ప్రభుత్వం చెబుతున్నట్లు సోమవారం నుంచే ఏపీ పరిపాలన వెలగపూడిలో పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
అక్టోబర్ 3.. వెలగపూడి నుంచే పరిపాలన
* అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు * ఫైళ్లు, కంప్యూటర్ల తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని సూచన సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన సాగించాలని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) మంగళవారం అన్ని శాఖల కు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అక్టోబర్ 3వ తేదీని ముహూర్తంగా ఖరారు చేసిం ది. సచివాలయ ఉద్యోగులంతా అక్టోబర్ 3 నుంచి వెలగపూడిలో పనిచేయాల్సి ఉన్నం దున ఫైళ్లు, కంప్యూటర్లను హైదరాబాద్ నుంచి తరలించేందుకు ప్యాకింగ్ చేయాలని జీఏడీ సూచించింది. ఈ నెల 21వ తేదీ నుంచే తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.. హా ఈ నెల 30వ తేదీకల్లా హైదరాబాద్ సచివాలయంలోని ఫైళ్లు, కంప్యూటర్లను వెలగపూడికి తరలించాలి. హా వచ్చే నెల 1, 2 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలైనందున 3 నుంచి పూర్తిస్థాయిలో వెలగపూడి నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు గడువులోగా ఏర్పాట్లను పూర్తిచేసుకోవాలి. హా హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులకు బదిలీ రవాణా భత్యం(టీటీఏ) వర్తిస్తుంది. హా తాత్కాలిక సచివాలయంలో సెంట్రల్ రికార్డ్ సిస్టమ్ (సీఆర్ఎస్)ను ఏర్పాటు చేసిన తర్వాతే హైదరాబాద్‌లో ఉన్న సీఆర్ఎస్ను వెలగపూడికి తరలిస్తారు. ఇందుకు సంబంధించిన పర్యవేక్షణ కోసం జీఏడీ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటవుతుంది. హా హైకోర్టు, లోకాయుక్త, ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) వంటి చట్టబద్ధ సంస్థల వ్యవహారాలను చూసేందుకు ఒక్కో విభాగం నుంచి అవసరాన్ని బట్టి ఒకరిద్దర్ని ఇక్కడే ఉంచేలా జీఏడీ కార్యదర్శి చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు సచివాలయ తరలింపు షెడ్యూల్, మార్గదర్శకాలతో ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
వెలగపూడిలో కమాండ్ కంట్రోల్ కేంద్రం!
సీఎం కార్యాలయానికి సమీపంలోనే ఏర్పాటు: సీఎం సాక్షి, అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవన సముదాయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు పక్కాగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన అసెంబ్లీ, సచివాలయ భవనాల నిర్మాణం గురించి సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఒకటో బ్లాకు మొదటి అంతస్తులో తన కార్యాలయానికి సమీపంలోనే కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటుకు ఆయన ఆమోదం తెలిపారు. అసెంబ్లీ భవనాన్ని సచివాలయంలోని మిగిలిన ఐదు భవనాల నుంచి విడదీసే ప్రణాళికపై చర్చించి సూచనలు చేశారు. అసెంబ్లీ చుట్టూ ఎత్తై ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. సచివాలయం కంటే అసెంబ్లీ భవనం ప్రత్యేకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఆర్డీఏ అధికారులు తయారు చేసిన ప్రణాళికను ఆమోదించారు. రాజధాని గ్రామాల్లో ప్లాట్ల పంపిణీపైనా చర్చించారు. ఈ నెల 21న శాఖమూరులో చేసే ప్లాట్ల కేటాయింపు గురించి అధికారులు ఆయనకు వివరించారు. డ్రోన్లతో రియల్‌టైమ్ గవర్నెన్స్ : రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా రియల్‌టైమ్ గవర్నెన్స్ కింద డ్రోన్లు, సర్వైలెన్సు కెమేరాల పర్యవేక్షణ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆదివారం ఫైబర్ నెట్వర్క్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో డ్రోన్ల వినియోగం గురించి ఆయన చర్చించారు. గృహ నిర్మాణాలు, కాలువల నిర్వహణతోపాటు అన్ని రంగాల్లోనూ డ్రోన్లు వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
3 నుంచి వెలగపూడిలోనే విధులు
-
3 నుంచి వెలగపూడిలోనే విధులు
తరలింపుపై జీఏడీ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరుకు హైదరాబాద్‌లోని సచివాలయం ఖాళీ అవనుంది. వచ్చేనెల 3వ తేదీ నుంచి రాజధాని ప్రాంతం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే పూర్తి కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. సోమవారం నుంచి వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లేందుకు అన్ని శాఖలు సన్నాహకాలు ప్రారంభించనున్నాయి. దీంతో వచ్చే నెల 2వ తేదీ వరకూ సచివాలయంలోని పాలనా వ్యవహారాలు స్తంభించనున్నాయి. వెలగపూడిలోని సచివాలయంలోనే మళ్లీ కార్యకలాపాలు మొదలవుతాయి. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శనివారం కార్యాచరణతో కూడిన ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు, ఏపీ ట్రిబ్యునల్, ఆర్టీఐ, లోకాయుక్త వంటి అంశాలకు అవసరమైన ఒకరిద్దరు ఉద్యోగులు మాత్రమే హైదరాబాద్ సచివాలయంలో ఉండాలని, మిగతా అధికారులు, ఉద్యోగులంతా 3వ తేదీ నుంచి వెలగపూడిలో పనిచేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. -
నెలాఖరు కల్లా ఏపీ సచివాలయం ఖాళీ
ఒకటి నుంచి వెలగపూడిలోనే విధులు సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరు కల్లా హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం ఖాళీ కానుంది. వచ్చే నెల ఒకటి నుంచి వెలగపూడి సచివాలయం నుంచి విధులు నిర్వర్తించేందుకు సచివాలయ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గురువారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే మంత్రులందరూ పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో వీరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నెల 19న సచివాలయ మున్సిపల్ శాఖ ఉద్యోగులు, అధికారులు వెలగపూడి తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే మిగతా శాఖలు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వచ్చే నెల దసరా రోజున సీఎం చంద్రబాబు కూడా వెలగపూడిలోని కార్యాలయం నుంచే పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు కల్లా హైదరాబాద్‌లోని సచివాలయం ఖాళీ కానుంది. ఒక్కో శాఖలో అవసరానికి అనుగుణంగా ఒకరిద్దరిని మాత్రమే హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
జనవరి నుంచి ‘ రాజధాని’ పనులు
డిసెంబర్ ఆఖరుకు డిజైన్లు పూర్తి: నారాయణ సాక్షి, అమరావతి బ్యూరో: వచ్చే జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు మున్సిపల్ మంత్రి పి.నారాయణ చెప్పారు. డిసెంబర్ చివరినాటికి డిజైన్లు పూర్తవుతాయన్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే వారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన ప్రారంభం అవుతుందని తెలిపారు. సచివాలయం పరిధిలోని 49 ఎకరాల విస్తీర్ణంలో గ్రీనరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఆ పనులను మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. వచ్చే శుక్రవారం నుంచి ఎనిమిది గ్రామాల రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
కూల్చేద్దాం.. కట్టేద్దాం..!
* నేడు కొట్టేది యనమల టెంకాయ్ ఒక్కటే... * సచివాలయంలో ప్రవేశానికి మిగతా మంత్రులు ససేమిరా.. * ఇరుకు చాంబర్లలో పని చేయలేం * మార్పులు చేసేదాకా అడుగుపెట్టబోమని స్పష్టీకరణ * చాంబర్లను కూల్చి, పునర్నిర్మించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులంతా సొంత రాష్ట్రంలోనే పని చేయాలంటూ ప్రభుత్వం గుంటూరు జిల్లా వెలగపూడిలో హడావుడిగా నిర్మించిన తాత్కాలిక సచివాలయంపై ఉద్యోగులే కాదు, మంత్రులూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో తమకు కేటాయించిన చాంబర్లు ఇరుకిరుగ్గా ఉన్నాయని, అందులో పనిచేయలేమని పలువురు మంత్రులు తేల్చిచెప్పారు. ఆ చాంబర్లలో కనీసం ఐదుగురు కూడా కూర్చునే పరిస్థితి లేదని మండిపడుతున్నారు. తమకు పెద్ద చాంబర్లను కేటాయించే వరకూ సచివాలయంలో అడుగుపెట్టబోమని స్పష్టంచేశారు. బుధవారం జరగాల్సిన సచివాలయ ప్రవేశ ముహూర్తాలను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల చాంబర్లను కూల్చివేసి, మరింత పెద్దగా పునర్నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఆర్థిక మంత్రి యనమల కు కేటాయించిన చాంబర్ మాత్రమే కాస్త విశాలంగా ఉన్నట్లు సమాచారం. బుధవారం ఆయన ఒక్కరే సచివాలయ ప్రవేశం చేయనున్నారు. యనమల కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తారని అధికారులు తెలిపారు. నేడే చివరి ముహూర్తం: సచివాలయంలో ప్రవేశానికి ప్రభుత్వం బుధవారాన్ని చివరి ముహూర్తంగా నిర్ణయిం చింది. హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ఉద్యోగులంతా ప్రభుత్వ ఆదే శాల మేరకు వెలగపూడి సచివాలయంలో కొబ్బరికాయలు కొట్టి వచ్చేందుకు మంగళవారం బయల్దేరి వెళ్లారు. అదే ముహూర్తంలో ఆయా శాఖల మంత్రులూ సచివాలయంలోని తమ చాంబర్లలో ప్రవేశించాల్సి ఉంది. అయితే, సచివాలయంలో తమకు కేటాయించిన చాంబర్లను చూసి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు గంటా, ప్రత్తిపాటి, కొల్లు రవీంద్ర తదితరులు అసంతృప్తికి గురయ్యారు. మంత్రుల ఫిర్యాదుపై మున్సిపల్ మంత్రి పి.నారాయణ స్పందించారు. మంత్రుల చాంబర్లను మరింతగా విస్తరించాలని మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త ఆర్కిటెక్చర్ ప్రకారం మంత్రుల చాంబర్లను పెద్దవిగా చేయాలని అధికారులు నిర్ణయించారు. మార్పులకు రెండు నెలల సమయం ప్రస్తుతం ఒక్కో భవనంలో ఐదుగురు మంత్రుల చాంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ చాంబర్లను కూల్చివేసి, మరింత ఎక్కువ చదరపు గజాల్లో పునర్నిర్మించనున్నారు. ఐదు చాంబర్లను కలిపేసి మూడేసి చాంబర్లుగా మార్చనున్నారు. ఈ మార్పులు చేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కృష్ణా పుష్కరాలు ముగిసిన తరువాత చాంబర్లలో మార్పుల అనంతరమే వెలగపూడి సచివాలయంలో అడుగుపెట్టాలని మంత్రులు నిర్ణయించారు. సర్కారు ఉద్యోగుల విముఖత తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులు పూర్తికాక ముందే హైదరాబాద్ నుంచి శాఖల తరలింపునకు ప్రభుత్వం జూన్ 29వ తేదీ నుంచి పలు ముహూర్తాలు నిర్ణయించింది. గత ముహూర్తాల్లో వెళ్లిన ఉద్యోగులు వెలగపూడి సచివాలయంలో కనీసం టాయిలెట్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, కూర్చొని పనిచేసే వాతావరణం లేకపోవడంతో కొబ్బరికాయ కొట్టి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. ఆర్థిక, రెవెన్యూతోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు బుధవారం వెలగపూడి సచివాలయంలోకి ప్రవేశించనున్నారు. వారు అక్కడ కొబ్బరికాయ కొట్టి తిరిగి హైదరాబాద్‌కు చేరకుంటారు. -
వెలగపూడి వెళ్లేందుకు వాయిదా పడ్డ ముహూర్తం
-
వెలగపూడి వెళ్లేందుకు వాయిదా పడ్డ ముహూర్తం
- 29 నాటి ముహూర్తాన్ని వాయిదా వేసిన సర్కారు - తాజాగా వచ్చే నెల 4, 7, 10 తేదీలు ఖరారు - ఉద్యోగులు ఏదో ఒక తేదీ ఎంచుకోవాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్ : వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి ఉద్యోగులు తరలివెళ్లే ముహూర్తం వాయిదాపడింది. తాజా ముహూర్తాలుగా ఆగస్టు 4, 7, 10వ తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మూడు ముహూర్తాల్లో ఏదో ఒక ముహూర్తాన్ని ఎంచుకుని హైదరాబాద్ సచివాలయం నుంచి వెలగపూడికి శాఖలు తరలివెళ్లాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. తమ శాఖల మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సూచించారు. కృష్ణా పుష్కరాల ముందు హడావుడిగా మరోసారి ముహూర్తాలు నిర్ణయించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. గత నెల 29వ తేదీన వెలగపూడి వెళ్లి కొబ్బరికాయ కొట్టి వచ్చేసిన శాఖల ఉద్యోగులు.. ఇంకా హైదరాబాద్ సచివాలయం నుంచే పనిచేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో మిగతా శాఖలు వచ్చే నెలలో తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేయడం ఏమిటని అంటున్నారు. అప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టి వచ్చేయడం తప్ప ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. సచివాలయ నిర్మాణం పూర్తిచేసి, పనిచేసే వాతావరణం కల్పిస్తే వెళ్లడానికి సిద్ధమేనని, అలా కాకుండా కొబ్బరికాయ కొట్టి వచ్చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్ల వంటి సౌక ర్యాలన్నీ కల్పించిన తర్వాత ముహూర్తం పెడితే వెళ్లి అక్కడినుంచే పనిచేస్తామని అంటున్నారు. డిసెంబర్ నెలాఖరుకు గానీ అక్కడ పనిచేసే వాతావరణం ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. తాత్కాలిక సచివాలయానికి శాఖలు, ఉద్యోగుల తరలింపు ఇప్పటికి పలుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అఖరికి ఈ నెల 29వ తేదీ చివరి ముహూర్తం అని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు 29 కూడా కాదని వచ్చే నెలలో ముహూర్తాలు ఖరారు చేసింది. సచివాలయ నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడమే వాయిదాకు కారణమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
‘తరలింపు’ ముహూర్తం మళ్లీ వాయిదా
వచ్చే నెల 4 -10వ తేదీ మధ్యలో ముహూర్తం! సాక్షి, హైదరాబాద్ : వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయానికి శాఖల తరలింపు చివరి ముహూర్తం మరోసారి వాయిదా పడింది. ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన మేరకు ఈ నెల 29న సచివాలయ మిగతా శాఖలన్నీ ఉద్యోగులు, అధికారులతో సహా హైదరాబాద్ నుంచి వెలగపూడికి వెళ్లాల్సి ఉంది. అయితే ఆషాడ మాసంలో వెలగపూడి సచివాలయానికి వెళ్లేందుకు మంత్రులు ససేమిరా అన్నారు. దీనికితోడు అక్కడ కూర్చుని పనిచేసే వాతావరణమే లేకుండా వెళ్లి వెనక్కు వచ్చేయడం ప్రహసనంగా మారుతోందని, ఇప్పటికే రెండు ముహూర్తాల్లో అదే పరిస్థితి అయ్యిందనే భావనను అధికారులు వ్యక్తం చేశారు. కొన్ని రోజుల ఆలస్యం అయినా పరవాలేదని, హడావిడిగా వెళ్లి అభాసుపాలవడం మంచిది కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4 నుంచి 10వ తేదీ మధ్యలో మళ్లీ ముహూర్తాలు నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఈనెల 29లోగా తాత్కాలిక సచివాలయం పూర్తి
-
సచివాలయంపై సర్కారు ఆందోళన
- తాత్కాలిక నిర్మాణాల్లో వరుస ప్రమాదాలు - ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ సమీక్ష సాక్షి, అమరావతి : తాత్కాలిక సచివాలయంలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. నిర్మాణాల్లో జరుగుతున్న లోపాలను తెలుసుకునే పనిలో పడింది. అందులో భాగంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మంగళవారం సమావేశమయ్యారు. నిర్మాణాల్లో జరుగుతున్న తప్పొప్పులపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒకరు, మే 10న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర ప్రమాదవశాత్తు మరణించారు. గతనెలలో తాత్కాలిక సచివాలయం రెండో భవనంలో ఓ చోట గ్రౌండ్‌ఫ్లోర్ కుంగింది. సోమవారం సాయంత్రం మొదటి భవనం మొదటి అంతస్తులో సైడ్‌వాల్ నిర్మిస్తుండగా జోరుగా వీచిన గాలికి పై భాగంలో నిర్మించిన సిమెంట్ రాళ్లు ఒక్కసారిగా కిందపడ్డాయి. అక్కడే పనిచేస్తున్న ఐదుగురు కూలీలపై ఆ రాళ్లు విరిగిపడటంతో రామచంద్ర, ధర్మేంద్ర తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండో ముచ్చట మళ్లీ వాయిదా వరుస సంఘటనల నేపథ్యం.. పనులు పూర్తి కాకపోవటంతో బుధవారం జరగాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మంత్రి నారాయణ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రకటించారు. ఈ నెల 21న తాత్కాలిక సచివాలయంలోని ఐదవ భవనం మొదటి అంతస్తులో రోడ్లు, భవనాలు, రవాణా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
మళ్లీ ‘ఒక్కరోజు’ ముచ్చట
తాత్కాలిక సచివాలయానికి నేడు మరో నాలుగు శాఖలు సాక్షి, అమరావతి : తాత్కాలిక సచివాలయంలో మారోమారు ఒక్కరోజు ముచ్చటకు ముహూర్తం ఖరారైంది. ఐదో భవనం మొదటి అంతస్తులో సోమవారం రోడ్లు, భవనాలు, రవాణా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇది కూడా ఒక్కరోజు ముచ్చటేనని తెలుస్తోంది. గత నెల 27 నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పరిపాలన అంతా సాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న ప్రాంతం లూజ్‌సాయిల్ కావడంతో నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. రెండో ముచ్చట.. తాత్కాలిక సచివాలయ ప్రారంభం తొలుత జూన్ 27 అనుకుని.. తర్వాత 29కి వాయిదా వేసి ఆరోజు మొక్కుబడిగా ప్రారంభించి చేతులు దులుపుకున్నారు. నేటికీ ఏ ఒక్క భవనం పూర్తి కాలేదు. గత నెల 29న ప్రారంభించిన కార్యాలయంలోకి ఇప్పటికీ అధికారులు ఎవరూ రాలేదు. ఇటీవల తుళ్లూరులో నిర్వహించిన ప్లాట్ల కేటాయింపు సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జూలై 20 నాటికి తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని, నెలాఖరుకు అన్ని శాఖలు వెలగపూడి నుంచే పరిపాలన కొనసాగిస్తాయని గట్టిగా చెప్పారు. భవనాలు అసంపూర్తిగా ఉన్నా ప్రారంభాలతో హడావుడి చేయాలని భావించి నేడు నాలుగు శాఖలను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుత నిర్మాణాల తీరు పరిశీలిస్తే ఆగస్టు చివరకు కూడా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే విషయాన్ని తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న ఓ ఇంజినీర్ స్పష్టం చేశారు. -
‘బురద’ సౌకర్యాలు!
- తాత్కాలిక సచివాలయానికి వెళ్లే రోడ్లన్నీ బురదమయం - వసతులు కల్పించాకే కార్యాలయాల తరలింపు - ఉన్నతాధికారుల స్పష్టీకరణ సాక్షి, అమరావతి/హైదరాబాద్: పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో పని చేసే ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అయితే, వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో పని చేయబోయే ఉద్యోగులకు భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి ప్రాథమిక, అత్యవసర సౌకర్యాలు కూడా కల్పించకుండానే ఉద్యోగులను సర్కారు హడావుడిగా తరలించి కొబ్బరికాయ కొట్టి ‘మమ’ అనిపించింది. కార్యాలయాలేవీ సిద్ధం చేయకుండానే అన్నీ సగం పనులు చేసి ఆర్భాటం ప్రదర్శిస్తోంది. తాత్కాలిక సచివాలయానికి వెళ్లే రోడ్లన్నీ బురదమయంగా దర్శనమిస్తున్నాయని, సౌకర్యాలు లేకుండా కార్యాలయాలు అమరావతికి తరలించేది లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. మరుగుదొడ్లు లేకుంటే ఎక్కడికెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేటు అద్దె భవనాల్లోకి పలు శాఖలను తరలించారు. ఆ భవనాలూ పూర్తిస్థాయిలో వినియోగానికి సిద్ధంగా లేవు. తాత్కాలిక సచివాలయంలో ఐదో బ్లాక్‌లో రెండు గదులను తాత్కాలికంగా సిద్ధం చేశారు. ఐదో బ్లాక్‌కు దారి తీసే రోడ్లన్నీ బురదమయం. ఇంకో ఐదు నెలలు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాగునీరు, టాయిలెట్లు లేవు..: ఉద్యోగులకు తాగునీరూ కరువే. ఉద్యోగులు తాగునీటి సీసాలు కొనుక్కోవడానికి కూడా బురదలో నడుచుకుంటూ బయటకు రావాల్సిందే. మధ్యాహ్నం భోజనం తెచ్చుకోకపోతే.. అన్న క్యాంటీన్లో భోజనం చేయడం తప్ప మరో మార్గం లేదు. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించకుండా.. తరలింపు ప్రక్రియను కానిచ్చేశారు. ‘కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన వెంటనే అక్కడికి వెళతాం. ఇంతకంటే ప్రత్యామ్నాయం లేదు’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. -
ఒక్కరోజు ముచ్చటేనా?
టెంకాయ కొట్టి వెళ్లిపోయారు - రాజధానికి తరలింపు అంతా తూతూ మంత్రం - ప్రారంభం కోసం వెలగపూడిలో తొలిరోజు హడావుడి - శాఖాధిపతులు, ఉద్యోగులూ హైదరాబాద్‌లోనే - కనీస సౌకర్యాలు, రహదారి లేదంటున్న ఉద్యోగులు - పూర్తిస్థాయి తరలింపునకు మరో నెలరోజులు సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధాని అమరావతికి ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపు ప్రక్రియ ప్రహసనంగా మారిపోయింది. జూన్ 27వ తేదీకల్లా విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు శాఖాధిపతుల కార్యాలయాలు తరలివెళ్లాల్సిందేనని సర్కారు ఆదేశించడంతో ఆ తరలింపులు తూతూ మంత్రంగా ముగిశాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో అద్దెకు భవనాలను తీసుకుని అక్కడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి మరుసటి రోజు ఉదయమే ఉద్యోగులు హైదరాబాద్ వచ్చేశారు. అద్దెకు కార్యాలయాలు తీసుకున్నప్పటికీ ఆ భవనాల్లో పనిచేసేందుకు వీలుగా మార్పులు, చేర్పులు చేయడానికి చాలా సమయం పడుతుందని శాఖాధిపతులు చెబుతున్నారు. అక్కడ పనిచేసే వాతావరణమే లేకుండా ఎలాపనిచేస్తామని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం హడావిడిగా తేదీలను ప్రకటించడంతోనే ఈ తంటాలు వచ్చాయనేది ఉద్యోగుల అభిప్రాయంగా ఉంది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ముహూర్తం పేరుతో బుధవారం(జూన్ 29) వెలగపూడి వెళ్లిన ఉద్యోగులు గురువారం ఉదయానికి హైదరాబాద్ వచ్చేశారు. అక్కడ పనిచేయడానికి మరో నెల పడుతుంది. మరో నెలరోజులు హైదరాబాద్‌లోనే... ప్రధాన భూ పరిపాలన కార్యాలయం కోసం గొల్లపూడిలో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. సీసీఎల్ఎ మరికొందరు అధికారులు కలసి బుధవారం ఆ భవనంలోకి ప్రవేశించి కొబ్బరికాయ కొట్టి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. అక్కడ ఆఫీసుగా మార్పులు చేయడానికి నెల పడుతుంది. దీంతో ఇద్దరు ఉద్యోగులను అక్కడ ఉంచి మిగతా వారు హైదరాబాద్‌లో సీసీఎల్ఏ ఆఫీసులోనే ఉంటున్నారు. ► స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానిదీ ఇదే పరిస్థితి. అధికారులు ఈడుపుగల్లులోని భవనాన్ని ప్రారంభించి హైదరాబాద్ వచ్చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కంప్యూటరీకరణ, ఆన్లైన్ వ్యవహారాలుండాలి. ఈ మార్పుల కోసం మరో నెల రోజులు అవసరం. ► డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం కోసం విజయవాడలోని పాత బో ధనాసుపత్రిలో రోగులుంటే రెండు వార్డులను ఖాళీచేయిస్తున్నారు. రోగుల వార్డుల ను ఖాళీ చేయించడంతో పాటు మార్పులు చేర్పులు చేయడానికి సమయం పడుతుం ది. అయితే గత నెల 24న కొబ్బరికాయ కొట్టి తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ► జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్, కమిషనరేట్ కార్యాలయాల కోసం గొల్లపూడిలో ప్రైవేట్ భవనం అద్దెకు తీసుకున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఆ భవనం సిద్ధం కాలేదు. దీంతో వెయ్యి మంది ఉద్యోగుల్లో విజయవాడకు వెళ్లింది నలుగురే. ► పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యాలయాల కోసం విజయవాడలోని సూర్యారావుపేటలో ఒక పాత ఆసుప్రతి భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. అక్కడా అదే స్థితి. గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో 115 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా విజయవాడలో ఇద్దరు ఉద్యోగులను ఉంచి, మిగతా వారందరూ హైదరాబాద్ వచ్చేశారు. పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ► గ్రామీణ మంచినీటి సరఫరా కార్యాలయం కోసం గొల్లపూడిలో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. మొత్తం 80 మంది ఉద్యోగులకు గాను పది మందే గొల్లపూడిలో ఉండగా మిగతా వారు హైదరాబాద్‌లో ఉన్నారు. ► వాణిజ్య పన్నుల కార్యాలయంకోసం ఈడ్పుగల్లులో అద్దెకు తీసుకున్న భవనం ఆఫీసులా తయారు కావడానికి నెల సమ యం పడుతుంది. స ఒక్క వ్యవసాయ, సహకార, రహదారులు-భవనాల ఇంజనీరింగ్, ఆర్టీసీ, ఎక్సైజ్ కార్యాలయాలు మా త్రం పూర్తి స్థాయిలో విజయవాడ ప్రాంతానికి తరలివెళ్లాయి. ఆ కార్యాలయాల ఉద్యోగులూ అక్కడే పనిచేస్తున్నారు. ప్రారంభం కోసమే హడావుడి సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయానికి రెండో రోజు ఉద్యోగులెవరూ రాలేదు. పాలనాపరమైన కార్యక్రమాలేవీ నిర్వహించలేదు. సచివాలయం దగ్గరకు వెళ్లడానికి కనీస రహదారి సౌకర్యం కూడా లేదని, మంచినీటి, డ్రైనేజీ, టాయిలెట్ల సౌకర్యం కూడా కల్పించలేదని, ఇవన్నీ కల్పించడానికి మరో నెల సమయం పడుతుందని పేర్కొంటున్నారు. ఆ తర్వాతే ఇక్కడినుంచి పని చేయగలమని తెలిపారు. తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద నిర్మించిన తాత్కాలిక సచివాలయాన్ని బుధవారం రాష్ట్ర మంత్రులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభ వేడుకలకు హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను ఐదు ప్రత్యేక బస్సుల్లో వెలగపూడి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పినట్లు బుధవారం నుంచే పాలనాపరమైన కార్యక్రమాలు తాత్కాలిక సచివాలయం నుంచే నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ముహూర్తం పేరుతో బుధవారం వచ్చిన ఉద్యోగులు అదే రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ వెంటనే ఐదో భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో కూలీలు యథావిధిగా పనులు చేపట్టడం కనిపించింది. అనుకున్న ముహూర్తానికి ప్రారంభించి మాట నిలబెట్టుకున్నామని చెప్పుకునేందుకు హడావుడి చేశారనే ప్రచారం జరుగుతోంది. గురువారం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భవన నిర్మాణాలను పరిశీలించేందుకు రాగా... ద్వితీయ విఘ్నం ఉండకూడదని గృహనిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని తన చాంబర్లో కూర్చొని వెళ్లారు. హైదరాబాద్ నుంచి సైకిల్‌పై పయనమైన ఏసీటీవో పద్మాచౌదరి గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి చేరుకున్నారు. -
తాత్కాలిక సచివాలయం ప్రారంభం
- మధ్యాహ్నం 2.51 గంటలకు ప్రారంభించిన మంత్రి అయ్యన్నపాత్రుడు - ప్రత్యేక బస్సుల్లో సచివాలయానికి తరలివచ్చిన ఉద్యోగులు - విజయవాడలో, వెలగపూడిలో ఘనస్వాగతం సాక్షి, అమరావతి/ తుళ్లూరు/ హైదరాబాద్: తాత్కాలిక సచివాలయం బుధవారం మధ్యాహ్నం 2.51 గంటలకు తుళ్లూరు మండలం వెలగపూడిలో ప్రారంభమైంది. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు ఐదవ బ్లాక్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్ టక్కర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.59 గంటలకు మహిళా స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి కిమిడి మృణాళిని తాత్కాలిక సచివాలయంలోకి అడుగుపెట్టారు. ఇద్దరు మంత్రులు వారి చాంబర్లలో ప్రత్యేక పూజలు జరిపి పాలనాపరమైన పత్రాలపై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాల ప్రారంభం వాయిదాపడింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర పాలన వ్యవహారాలకు కీలకమైన సచివాలయాన్ని అమరావతికి తరలించేందుకు వెలగపూడిలో సుమారు 45 ఎకరాల్లో రూ.600 కోట్లతో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆరు భవనాలకుగాను బుధవారం ఐదవ భవనంలోని గ్రౌండ్ఫ్లోర్ని ప్రారంభించారు. ప్లైవుడ్‌తో ఏర్పాటు చేసిన గదుల్లో బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటియాజమాన్య, గృహనిర్మాణశాఖ కార్యాలయాలను మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. 15 వేలమందీ వస్తారు: అయ్యన్న ఏపీ సచివాలయంలోని మొత్తం 15వేల మంది ఉద్యోగులు త్వరలోనే అమరావతి వచ్చేస్తారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. తాత్కాలిక సచివాలయంలోని ఐదో నెంబరు బ్లాక్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ... ఈ సందర్భంగా నాలుగు శాఖలకు సంబంధించి 1500 మంది ఉద్యోగులు వచ్చారని, ఆరో తేదీలోపు ఐదువేల మంది వస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్య, లేబర్ అండ్ ఎంప్లాయిస్, హౌసింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు తమ విధులు ప్రారంభించాయని చెప్పారు. సచివాలయం నుంచి విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే అన్ని శాఖలు సచివాలయానికి చేరుకుంటాయని ప్రధాన కార్యదర్శి టక్కర్ వివరించారు. కార్యక్రమంలో హోం శాఖ మంత్రి చినరాజప్ప , మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, మృణాళిని, రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌లు పాల్గొన్నారు. మరోవైపు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక బస్సుల్లో వైద్య ఆరోగ్య, కార్మిక, పంచాయితీరాజ్, గృహనిర్మాణ శాఖల మంత్రుల కార్యాలయాల ఉద్యోగులు అమరావతికి తరలివచ్చారు. అమరావతి వస్తున్న ఉద్యోగులకు కనకదుర్గ వారధి వద్ద ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, సచివాలయ ఉద్యోగుల ప్రెసిడెంట్ మురళీకృష్ణ, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు, కృష్ణా జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు సాగర్ స్వాగతం పలికారు. విజయవాడ నుంచి వెలగపూడి సచివాలయానికి వ స్తున్న ఉద్యోగులకు రాజధాని గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. పరస్పర అభినందలతో పండుగ వాతావరణం ఏర్పడింది. ప్రారంభ కార్యక్రమం పూర్తయ్యాక సాయంత్రం 4.30 గంటలకు ఎవరి వాహనాల్లో వారు హైదరాబాద్‌కు బయలుదేరారు. మౌలిక వసతులూ కరువు... సొంత రాష్ట్రంలో పనిచేయటానికి ఎంతో ఉత్సాహంగా వెలగపూడికి వచ్చిన ఉద్యోగులకు కష్టాలు స్వాగతం పలికాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఉద్యోగులు తాత్కాలిక సచివాలయానికి సుమారు కిలోమీటరు దూరంలో దిగారు. అక్కడినుంచి ఐదవ భవనం వరకు వెళ్లే మార్గం బురదతో నిండిపోయి ఉండటంతో అతికష్టంతో చేరుకున్నారు. అక్కడ ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రారంభమైన మూడుశాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో పనులింకా జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు అవసరమైన మౌలిక వసతులు అస్సలు కనిపించలేదు. ముఖ్యంగా మంచినీటి సౌకర్యం, బాత్రూంలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ‘పనులు పూర్తి కాకపోయినా.. ఎందుకింత హడావుడిగా బురదలో తీసుకురావటం’ అని ఉద్యోగులు మాట్లాడుకోవడం కనిపించింది. ఇబ్బందులు ఉంటాయని తెలుసు నిర్మాణంలో ఉన్న భవనంలో విధులు నిర్వహించడం ఇబ్బందని తెలుసు. అయినా సహకరించాల్సిన బాధ్యత మా పై వుంది. అలాగే ప్రభుత్వం కూడా త్వరగా పనులు పూర్తిచేసి భవనాన్ని ఉద్యోగులకు అప్పగిస్తే మేలైన పాలన నిర్వహించే అకాశం వుంటుంది. -మురళీకృష్ణ,రాష్ట్ర ఉద్యోగ సంఘం నాయకుడు త్వరగా పూర్తికావాలి ఎల్అండ్టీ సంస్థ నిర్దేశించిన వ్యవధిలో భవననిర్మాణాలు పూర్తి చేసి ఇస్తే బాగుం టుంది. నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో చాలా ఇబ్బందులు వస్తాయి. వాటిని తట్టుకుని సేవ చేసేందుకు ఉద్యోగులు సిద్ధపడి వచ్చారు. వారిని అందరూ ఆదరించాలని కోరుతున్నాను. -అశోక్‌బాబు,రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థానికులు సహకరించాలి దూరాభారంతో మహిళాఉద్యోగులు విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది. స్థానికులు పెయింగ్ గెస్ట్లుగా మహిళా ఉద్యోగులకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది. పరిస్థితులు చక్కబడేవరకు సచివాలయం దగ్గరలోని గ్రామాల ప్రజలు ఉద్యోగులకు సహకరించాలని కోరుతున్నాను. -ఎన్.సత్యసునీత,మహిళా ఉద్యోగుల సంఘాధ్యక్షురాలు -
ముహూర్తం నేడే
నత్తనడకన ‘తాత్కాలిక’o - మూడు గదులు..మూడు శాఖలతో సరి - వెలగపూడిలో పూర్తికాని రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం - బురదమయంగా తాత్కాలిక సచివాలయం - హడావుడిగా ఐదో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో పనులు - నేడు మధ్యాహ్నం ప్రారంభించనున్న సీఎస్ సాక్షి, విజయవాడ బ్యూరో/అమరావతి: ప్రారంభానికి ముహుర్తం ముంచుకొచ్చేస్తోంది... ఉద్యోగుల ప్రవేశానికి కొద్ది గంటల సమయమే మిగిలి ఉంది... వేలాదిమంది కార్మికులను మోహరించినా పనులు పూర్తికాలేదు. దీంతో ముచ్చటగా మూడు గదులను అరకొరగానైనా పూర్తిచేసి, ఉద్యోగులతో అడుగు పెట్టించేసి ‘మమ’ అనిపించాలని అధికారులు కుస్తీ పడుతున్నారు. తాత్కాలిక సచివాలయానికే ఇన్ని ఆపసోపాలు పడుతుం టే.. అంతర్జాతీయ సచివాలయం నిర్మించా లంటే ఇంకెన్ని పాట్లు పడతారోనన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం భవన సముదాయంలోని ఐదో బ్లాకులోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వారం నుంచి ఆగమేఘాల మీద పనులు చేస్తున్నా కొలిక్కి రాలేదు. అయినా బుధవారం మధ్యాహ్నం 2.59 గంట లకు సీఎస్ ఎస్పీ టక్కర్ ఈ ఫ్లోర్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతోపాటు పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, కార్మిక శాఖల్ని ప్రారంభించాలని భావించినా పనులు పూర్తికాలేదు. దీంతో అనుకున్న ముహూర్తానికి ప్రారంభించాలని ప్లైవుడ్‌తో హడావుడిగా పనులు పూర్తి చేస్తున్నారు. అయినా మంగళవారం రాత్రి వరకు ఆ మూడు గదులు కూడా పూర్తికాకపోవడం గమనార్హం. అన్నీ హడావుడి పనులే... వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ ఐదవ బ్లాక్ అనుకున్న ముహూర్తానికి పూర్తయిఉంటే ఈనెల 27న ప్రారంభించేవారు. పనులు పూర్తి కాకపోవటంతో ప్రారంభ తేదీని నేటికి వాయిదా వేశారు. అందులో భాగంగానే ప్లైవుడ్‌తో పనులు చకచకా కానిచ్చేస్తున్నారు. మంగళవారం రాత్రికి కూడా ఐదవ బ్లాక్‌లో గ్రౌండ్‌ఫ్లోర్ పూర్తయ్యే పరిస్థితి లేదు. రేయింబవళ్లు చేస్తే కానీ ముహూర్త సమయానికి ఆ మూడు గదులను అందివ్వలేమని ఇంజనీర్లు తేల్చిచెప్పారు. ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్ పనులు జరుగుతూనే ఉండగా ఏసీలు, ఫ్యాన్లు, తలుపులు, కిటికీలను ఇంకా పలు గదుల్లో బిగించలేదు. బుధవారం మధ్యాహ్నానికి ఈ పనులు పూర్తి చేశామనిపించి 3 శాఖలకు కేటాయించిన గదులను ఏదోలా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని బ్లాకుల్లో పనిచేస్తున్న కార్మికులను తీసుకొచ్చి అక్కడే పనిచేస్తుండడంతోపాటు ప్లాస్టింగ్, సీలింగ్, ఫ్లోరింగ్ తదితర అన్ని పనులూ ఒకేసారి జరుగుతున్నాయి. దీంతో ఈ బ్లాకంతా సిమెంటు, బురదమయంగా మారింది. నేడు ప్రారంభించనున్న భవనానికి 1000 కిలోవాట్ల ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తున్నారు. అసంపూర్తిగా ఆ పనులు తాత్కాలిక సచివాలయంలో బుధవారం ప్రారంభించనున్న ఐదవ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో మంచినీరు, మురుగునీటి పైపులైన్ల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. తాత్కాలికంగా ఇందులోని మురుగునీరు బయటకు పోయే ఏర్పాట్లు చేస్తున్నారు. తుళ్లూరు ఎత్తిపోతల పథకం నుంచి తాగునీటి పైపులు వేస్తున్నా ఆ పని ఇంకా సగం కూడా పూర్తికాలేదు. పైపులైను ద్వారా వచ్చిన నీటిని ఫిల్టర్ చేసి బ్లాకులోకి అందించే పనులు ఇంకా మొదలుపెట్టనేలేదు. దీంతో ఐదో బ్లాకు వరకూ ఏదోలా నీటి సరఫరా చేయాలని చూస్తున్నారు. బ్లాకులోకి వచ్చేందుకు నిర్మించిన గ్రావెల్ రోడ్డు చిన్నపాటి వర్షానికే బురదతో నిండిపోయి ఉంది. వెలగపూడి గ్రామం నుంచి సచివాలయానికి వచ్చే సింగిల్ రోడ్డు బురదమయంగా దర్శనమిస్తోంది. దీంతోప్రతిరోజూ ట్రాఫిక్ స్తంభిస్తోంది. నిర్మాణ పనులకు సంబంధించిన లారీలు, ఇతర వాహనాలు ఎదురెదురుగా వస్తే దాటుకుని వెళ్లే పరిస్థితి లేదు. గమనించకుండా వాహనాలు నడిపితే పక్కనున్న పంట బోదెలోకి జారిపోతున్నాయి. సచివాలయం ప్రారంభమైన తర్వాత భారీగా వాహనాలు వచ్చినా ఇదే పరిస్థితి తప్పదు. ప్రభుత్వం గందరగోళం నడుమ తాత్కాలిక సచివాలయాన్ని ఎలాగైనా ప్రారంభించేందుకు ఆపసోపాలు పడుతోంది. వాయిదాల మీద వాయిదాలు ముఖ్యమంత్రి చెప్పినట్లు ఈ నెల 27వ తేదీన సచివాలయాన్ని ప్రారంభించాల్సివున్నా పనులు పూర్తికాకపోవడం వల్ల రెండు రోజులు వాయిదా వేశారు. వాస్తవానికి భవనాలు నిర్మిస్తున్న ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ కంపెనీలకు సెప్టెంబర్ వరకూ సమయం ఇచ్చారు. టెండర్లలో ఆరు నెలల సమయం ఇచ్చి మౌఖికంగా ఆగమేఘాల మీద పూర్తి చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తుండటంతో అంతా అయోమయంగా మారిపోయింది. చివరికి ఈ పనుల నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా ప్రభుత్వం లెక్కచేయకుండా రికార్డు స్థాయిలో సచివాలయాన్ని పూర్తి చేశామని చెప్పుకునేందుకు అటు సీఆర్డీఏ అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది. -
తరలిన 75 మంది ఉద్యోగులు
- నూతన సచివాలయంలో వసతులు లేవ న్న ఉద్యోగులు - 27న సచివాలయానికి నలుగురు మంత్రులు హాజరు - నేడు ప్రకటించనున్న సీఎం సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో ఈ నెల 27 నుంచి పనిచేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం 75 మంది ఉద్యోగులు హైదరాబాద్ నుంచి తరలివెళ్లారు. భవన నిర్మాణాలు పూర్తికాకుండానే అక్కడ ఎలా పనిచేయాలంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు సచివాలయంలో కాకుండా ప్రస్తుతానికి రాజధాని ప్రాంతంలోని స్థానిక కార్యాలయాల్లో పనిచేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం అర్జెంట్ నోట్ జారీ చేశారు. ఈ 75 మంది ఉద్యోగులకు విజయవాడ ప్రాంతంలోని సంబంధిత శాఖల స్థానిక కార్యాలయాల్లో కూర్చుని పనిచేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. వీరినే ఆయా శాఖల్లోనే రిపోర్ట్ చేయాలని సూచించారు. అవసరమైన పక్షంలో హైదరాబాద్ వచ్చి పనిచేసే వెళ్లాలని కూడా ఆ ఆదేశాల్లో సూచించారు. వారందరూ కూడా సొంత శాఖల్లోనే పనిచేస్తున్నట్లు భావించాలని పేర్కొన్నారు. గతంలో జీతాలు ఎలా డ్రా చేస్తున్నారో అదే తరహాలో వేతనాలు కూడా డ్రా చేసుకోవాలని పేర్కొన్నారు. అంతే కాకుండా ఉద్యోగులు తమ శాఖలకు చెందిన ఫైళ్లు హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలింపు బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లిన వారిలో 41 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, 16 మంది సెక్షన్ ఆఫీసర్లతో పాటు సీనియర్, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, అసిస్టెంట్ కార్యదర్శులు తదితరులున్నారు. 27న నలుగురు మంత్రులు, అధికారులు వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయం నుంచి ఈ నెల 27వ తేదీన నలుగురు మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పని ప్రారంభించనున్నారు. వారు ఎవరనేది శనివారం ముఖ్యమంత్రి ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. -
అమరావతిలో డీజీపీ కార్యాలయానికి నో బ్లాక్!
తాత్కాలిక సచివాలయంలో ప్రత్యేక బ్లాక్ కోరిన డీజీపీ 2.80 లక్షల చదరపు అడుగులు కావాలని ప్రభుత్వానికి వినతి విజయవాడ: అమరావతిలో డీజీపీ కార్యాలయం ఏర్పాటు సందిగ్ధంలో పడింది. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేకంగా ఒక బ్లాక్ కోరింది. సచివాలయం ఉద్యోగుల తరలింపు, కార్యాలయాల ఏర్పాటుపై పూర్తిగా స్పష్టత రాకపోవడంతో పోలీసుల ప్రతిపాదన పెండింగ్‌లో పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పోలీసు అధికారులు నిమగ్నమయ్యా రు. ఈ క్రమంలో విజయవాడలో డీజీపీ కార్యాలయం ఏర్పాటుచేయడానికి అనువుగా ఉండే భారీ భవన సముదాయాల కోసం అన్వేషిస్తున్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల తరలింపుతోపాటు డీజీపీ కార్యాలయం తరలించాలని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. పోలీసు శాఖ పరంగా విభజన పూర్తికాకపోవడంతో డీజీపీసహా ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోనే కొనసాగుతున్నారు. ఈ పరిణామాల క్రమం లో ముఖ్యమంత్రి విజయవాడలో ఉండడంతో ఉన్నతాధికారులు అందరూ ఎక్కువ రోజులు విజయవాడలోనే కొనసాగుతున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగానే తాత్కాలికంగా డీజీపీ కార్యాలయం విజయవాడలో ఏర్పాటుచేయాలని డీజీపీ జె.వి.రాముడు నిర్ణయిం చా రు. ఈక్రమంలో తాత్కాలిక సచివాల యంలో ఒక బ్లాక్‌ను పూర్తిగా పోలీసులకు కేటాయించాలని నెలకిందట ప్రభుత్వానికి విన్నవించారు. పోలీసుశాఖకు 2.80 లక్షల చదరపు విస్తీర్ణం కేటాయించాలని రాతపూర్వకంగా ప్రభుత్వాన్ని కోరారు. డీజీపీ కార్యాలయంతోపాటు దీనికి అనుబంధంగా ఉండే సుమారు పది విభాగాలను అక్కడ ఏర్పాటుచేయాలని భావించారు. డీజీపీ కార్యాలయంలో అన్ని విభాగాలు కలిపి ఉన్నతాధికారులు, మినిస్టీరియల్ స్టాఫ్ సుమారు 800 మంది వరకు ఉంటారు. డీజీపీ కాకుండా అదనపు డీజీపీలు ఐదుగురు, ఐజీస్థాయి అధికారులు ఆరుగురు, ఎస్సీ, డీఐజీ స్థాయి అధికారులు ఏడుగురు ఉంటారు. కార్యాలయంలో ఏ నుంచి ఈ వరకు సెక్షన్లు, సీఐడీ విభాగం, ఇంటెలిజెన్స్ విభాగం, డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విభాగం, ఏపీఎస్పీ కార్యాలయం, పోలీ సు హౌసింగ్ కార్పొరేషన్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, పోలీసు కమ్యూనికేషన్, కౌంటర్ ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఐఎస్‌డబ్ల్యూ ఇంటెలిజెన్స్, పోలీసు ట్రాన్స్‌పోర్టు, ఫోరెన్సిక్, ప్రింటింగ్, స్టోర్స్ ఇలా పలువిభాగాలు ఉన్నాయి. కార్యాల యా న్ని డీజీపీ కార్యాలయానికి అనుబంధంగా హైదరాబాద్ లో ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. తాత్కాలికంగా డీజీపీ కార్యాలయాన్ని సచివాలయంలో ఏర్పాటుచేస్తే డీజీపీతోపాటు ఈ శాఖలన్నీ తరలివచ్చేలా ఏర్పాటుచేశారు. ప్ర భుత్వం నుంచి స్పష్టత రాకపోవడం, నిర్మిస్తు న్న తాత్కాలిక సచివాలయం పూర్తిగా సచివాల య ఉద్యోగులకు సరిపోనుండటంతో పోలీసులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. ప్రత్యామ్నాయఅన్వేషణలోనిమగ్నమయ్యారు. విజయవాడలో అన్వేషణ విజయవాడలో ఎకరంపైగా విస్తీర్ణంలో ఉన్న అద్దె భవనాన్ని పోలీసు అధికారులు అన్వేషిస్తున్నారు. కొద్దిరోజుల్లో పుష్కరాలు రానుం డటం, విజయవాడలోనే సీఎం కార్యకలాపాలు ఉండటంతో అద్దె భవనంలో అయి నా కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. విజయవాడతోపాటు భవానీపురం, శివారు ప్రాంతాలైన పోరంకి, పెనమలూరు, రామవరప్పాడుల్లో అన్వేషిస్తున్నారు. -
గడువు గండం
ఈ నెల 27 నాటికి ఉద్యోగులు తరలిరావాలని సీఎం ఆదేశం మిగిలింది ఆరు రోజులే ఒక్క భవనం కూడా పూర్తికాని తాత్కాలిక సచివాలయం మరో రెండు నెలలు పడుతుందంటున్న ఇంజనీరింగ్ అధికారులు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి వెలగపూడిలో ప్రభుత్వం రూ.600 కోట్ల వ్యయంతో 45 ఎకరాల్లో నిర్మిస్తున్న తాత్కాలిక సచివా లయ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రధానమైన ఆరు బ్లాకుల నిర్మాణంలో ఒక్కటీ ఇప్పటివరకూ పూర్తికాలేదు. ఆరో బ్లాకు నిర్మాణం ఇంకా పునాదుల్లోనే ఉంది. తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రెయిన్ల పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరో రెండు నెలల వరకు పనులు పూర్తయ్యే అవకాశం లేదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. సీఎం కార్యాలయం, సీఎస్, సాధారణ పరిపాలన విభాగం, న్యాయశాఖ, సీఎం హామీల పరిష్కారం కోసం ఈ బ్లాక్‌ను కేటాయించారు. ప్రస్తుతం ఆరు బ్లాకులు పూర్తిచేయలేమని ఇంజినీర్లు చెప్పడంతో మొదటి బ్లాక్ అయినా పూర్తిచేసి ఈనెల 27 నాటికి కార్యక్రమాలు నిర్వహిం చాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే, మొదటి బ్లాకు కూడా 27 నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం 50శాతం పనే అయ్యింది. లోపల పూర్తిస్థాయిలో గదుల నిర్మాణం జరగలేదు. ఓపక్క ఫ్లోరింగ్, మరోపక్క సీలింగ్, ఇంకోవైపు వైట్‌వాష్, వైరింగ్ పనులు చేస్తున్నారు. అదేవిధంగా.. రెండో అంతస్తులో గోడలు కాకుండా ఫైబర్ ప్లేట్స్‌తో చిన్నచిన్న గదులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే గానీ ఫ్యాన్లు, సెంట్రల్ ఏసీ పనులు ప్రారంభించే అవకాశమే లేదు. రహదారులు ఛిద్రం తాత్కాలిక సచివాలయానికి వెళ్లడానికి ఇప్పటివరకు సరైన రహదారి లేదు. ప్రస్తుతం మందడం నుంచి సింగిల్ లైన్ రోడ్డు ఉంది. అది కూడా గుంతలు పడి దర్శనమిస్తోంది. ఒక వాహనం వస్తే.. ఎదురుగా వస్తున్న వాహనం తప్పించుకు వెళ్లడానికి ఇబ్బందికర పరిస్థితి. వర్షం వస్తే రోడ్డుకిరువైపులా వాహనం ఇరుక్కునే అవకాశం ఉంది. ఈ ఒక్క రోడ్డు తప్ప సచివాలయానికి వెళ్లటానికి మరో మార్గం లేదు. మంగళగిరి నుంచి ఐనవోలు మీదుగా సచివాలయానికి రహదారి ఉన్నా ఛిద్రమై కనిపిస్తోంది. ఇటీవల ప్యాచ్ వర్క్ పనులు చేపట్టినా ప్రయోజనం లేదు. సచివాలయ ప్రాంగణంలో గ్రావెల్ రోడ్లు శరవేగంగా చేస్తున్నారు. గ్రావెల్ పనులు తాత్కాలిక సచివాలయ పనులు పూర్తయ్యాక తారురోడ్డు లేదా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఆ పనులు ప్రారంభం కావడానికి మరి కొన్నిరోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కురిసిన వర్షాలకు సచివాలయ ప్రాంగణమంతా బురదగా మారింది. హోంశాఖ, విద్యుత్, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మిస్ట్రేషన్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వశాఖ కార్యాలయాలు, ఆర్థికశాఖ, ప్రణాళికా విభాగం ఇందులో ఉంటాయి. ఈ బ్లాక్‌లో పిల్లర్లు, శ్లాబ్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనుల్లో ఇప్పుడిప్పుడే గదుల నిర్మాణం ప్రారంభించారు. మిగిలిన ఏ పనీ ప్రారంభం కాలేదు. ఇప్పుడే పనులు ప్రారంభించినా నెలరోజులు పడుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. టెలికం, బీఎస్ఎన్ఎల్ సర్వర్, ఏపీ టీఎస్ సచివాలయ సపోర్ట్ యూనిట్, పే అండ్ అకౌంట్స్, మీసేవ, ఈసేవ, రైల్వే, బస్ రిజర్వేషన్ కౌంటర్లు, పోస్టాఫీసు, బ్యాంక్, రెండు ఏటీఎంలు, షాపులు, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయం, ప్లే స్కూల్, మూడు పడకల డిస్పెన్సరీ, రిక్రియేషన్, లైబ్రరీ, రెస్టారెంట్, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమం, స్కిల్ డెవలప్మెంట్, యువజన సంక్షేమం, టూరిజం, సాంస్కృతిక శాఖలు ఇందులో ఉంటాయి. ఇప్పటివరకు ఈ బ్లాక్‌లో పిల్లర్లు, శ్లాబులు మాత్రమే పూర్తిచేశారు. గోడల నిర్మాణం ప్రారంభించారు. గదుల నిర్మాణం పూర్తిచేయాలి. పూత, ఫ్లోరింగ్, సీలింగ్, వైరింగ్, వైట్‌వాష్, వాష్‌రూమ్‌లు పూర్తి చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తికావాలన్నా నెలరోజులు పడుతుంది. రెవెన్యూ, రెవెన్యూ విపత్తుల శాఖ, ఎన్విరాన్మెంట్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం, సహకార శాఖ, పశుసంవర్థక, డెయిరీ, మత్స్య, పౌరసరఫరాల శాఖతో పాటు ఐదుగురు మంత్రులు, ఇద్దరు సలహాదారు కార్యాలయాలు ఇందులో ఉంటాయి. వాటర్ రిసోర్సెస్, రెయిన్ షాడో ఏరియా డెవలప్మెంట్, పాఠశాల, ఉన్నత విద్య, ఐటీ డేటా సెంటర్ ఏర్పాటుచేస్తారు. ఈ నాల్గో బ్లాక్‌లో గదుల నిర్మాణం జరుగుతోంది. మిగిలిన పనులన్నీ పూర్తికావాలంటే సుమారు నెలరోజులు పట్టే అవకాశం ఉంది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, కార్మిక, ఉపాధి, గృహ నిర్మాణ శాఖలు, ట్రాన్స్పోర్ట్, రోడ్లు భవనాల శాఖ, విజిలెన్స్ కమిషన్, కాన్ఫరెన్స్ హాలు ఉంటాయి. బ్లాక్‌లో గదుల నిర్మాణం 60 శాతం పూర్తయ్యింది. మిగిలిన సగంలో ఓవైపు పనులను రెండురోజుల కిందటే ప్రారంభించారు. ఈ బ్లాక్‌లో మొత్తం పనులన్నీ పూర్తిచేసి జులై చివరినాటికి అందజేయగలమని ఇంజినీర్లు చెబుతున్నారు. అసెంబ్లీ, స్పీకర్ కార్యాలయాలకు వారం కిందటే పునాదులు వేశారు. ఐదు బ్లాకులు పూర్తయితే తప్ప ఆరో బ్లాక్ పనులుచేసే అవకాశం లేదని ఇంజినీర్లు స్పష్టం చేశారు. నత్తనడకన విద్యుత్ ఏర్పాట్లు తాత్కాలిక సచివాలయం పనులు పూర్తయ్యాక రోజుకు 6 ఎంవీఏ విద్యుత్ అవసరం అవుతుందని అంచనా. ఇందుకోసం విద్యుత్‌శాఖ తాడికొండ, తాడేపల్లి నుంచి విద్యుత్ లైన్ పనులు ప్రారంభించింది. మొత్తం 42 కిలోమీటర్ల దూరం పూర్తిచేయాల్సి ఉంది. ఈ పనులు 50 శాతం మాత్రం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. రాత్రింబవళ్లూ కష్టపడుతున్నా 27 నాటికి పనులు పూర్తయ్యేలా లేవు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రతి బ్లాక్‌లో పవర్ స్విచ్చింగ్ యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందుకు అవసరమైన పనులు ఇంకా ప్రారంభం కాలేదు. భూగర్భ డ్రెయినేజీ ఎక్కడ? హైదరాబాద్ నుంచి తాత్కాలిక సచివాలయానికి వచ్చే అధికారులు మొత్తం సుమారు 2వేల మంది వరకు ఉండొచ్చని సమాచారం. వీరందరూ వినియోగించి వదలివేసే వృథానీరు, మురుగు వెళ్లటానికి భూగర్భ డ్రెయినేజీ, సెప్టిక్ ట్యాంక్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటికి సంబంధించిన పనులేవీ ప్రారంభం కాలేదు. వర్షపు నీరు వచ్చినా వెలుపలకు వెళ్లే అవకాశం లేదు. ఈ పనులు పూర్తి చేయాలంటే సుమారు నెలరోజులకుపైనే పడుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. నీళ్లెప్పుడొస్తాయి? ఆంధ్రప్రదేశ్ సచివాలయ సిబ్బంది, కార్యాలయ అవసరాల కోసం రోజుకు 7 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంది. ఈ నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలనే విషయంపై ఇంతవరకు అధికారుల్లో స్పష్టత లేదు. కొందరు అధికారులు తుళ్లూరు ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ ద్వారా తాత్కాలిక సచివాలయానికి తీసుకొస్తామని చెబుతున్నారు. మరికొందరు అధికారులు శాఖమూరు పెలైట్ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. నీటి విషయంపై అధికారులు ఇప్పటివరకు స్పష్టత లేకపోతే సచివాలయ పనులు పూర్తయినా ప్రయోజనం శూన్యమే. -
కుంగిన భవనం.. వెలగపూడిలో కలకలం
సచివాలయానికి కూతవేటు దూరంలో నేలలోకి దిగబడిన మూడంతస్తుల భవనం సాక్షి, విజయవాడ బ్యూరో: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతానికి కూతవేటు దూరంలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కుంగిపోవడం కలకలం రేపింది. మందడంలో ఆదినేని గోపిరాజు అనే వ్యక్తి గతంలో నిర్మించిన భవనం(గ్రౌండ్ ఫ్లోర్)పై ఇటీవల కొత్తగా రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టారు. భవన నిర్మాణం పూర్తయ్యే దశలో పది రోజుల నుంచి భూమిలోకి కుంగిపోతున్న విషయాన్ని గమనించారు. ఆ భవనం రెండు అడుగులు మేర నేలలోకి దిగబడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన భవన యజమాని నష్ట నివారణ చర్యలు చేపట్టారు. చెన్నై నుంచి జె అండ్ జె కంపెనీకి చెందిన నిపుణులను రప్పించారు. ప్రత్యేకంగా తీసుకొచ్చిన సామాగ్రితో టెక్నాలజీ ఉపయోగించి ఆ భవనాన్ని జాకీలతో పైకిలేపారు. ఈ ప్రాంతంలో నేల స్వభావం మెతకగా ఉండటం వల్లే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బహుళ అంతస్తులకు పనికొచ్చేనా? రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో నేల స్వభావం మెతక అనే విషయం గత సర్వేల్లో తేలింది. ఇక్కడి నేల బహుళ అంతస్తులకు పనికిరాదని అప్పట్లోనే సర్వే సంస్థలు నిర్ధారించాయి. తాజాగా తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న వెలగపూడి ప్రాంతానికి అర కిలోమీటరు దూరంలోనే మూడు అంతస్తుల భవనం కుంగిపోవడం తీవ్ర చర్చకు తావిచ్చింది. -
5 భవంతులు.. 41 శాఖలు
- 1వ భవనంలో సీఎం, సీఎస్ కార్యాలయాలు - 4 భవనాల్లో 25 మంది మంత్రుల ఆఫీసులు - ఇద్దరు సలహాదారుల కార్యాలయాలు - తాత్కాలిక సచివాలయ సమగ్ర స్వరూపమిది - ఏ శాఖ ఎక్కడో స్పష్టం చేసిన సర్కారు సాక్షి, హైదరాబాద్: ఐదు భవంతులు.. అన్నింటిలో గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్.. సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలతో పాటు 25 మంది మంత్రులకు కార్యాలయాలు.. 41 ప్రభుత్వ శాఖలకు తాత్కాలిక సచివాలయంలో చోటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ప్రభుత్వ శాఖకు ఏ భవనంలో కేటాయించేదీ తెలిపింది. ► భవనం-1 మొదటి అంతస్తులో సీఎం కార్యాలయం (సీఎంవో), సీఎస్ కార్యాలయం, గ్రౌండ్ ఫ్లోర్లో సాధారణ పరిపాలన విభాగం (2,307 చదరపు అడుగులు), న్యాయశాఖ (6,850 చ.అ.), సీఎం హామీల పరిష్కారాల కోసం ఒక హాల్ ఉంటాయి. ► భవనం-2 గ్రౌండ్ ఫ్లోర్లో ఐదుగురు మంత్రుల కార్యాలయాలు, హోం శాఖ (7,400 చ.అ.) విద్యుత్తు శాఖ (2,590), పరిశ్రమల శాఖ (5,310), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (808), పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (2,970), మొదటి అంతస్తులో ఐదుగురు మంత్రుల కార్యాలయాలు, ఆర్థికశాఖ (18,470 చ.అ.), ప్రణాళిక విభాగం (13,200) ఉంటాయి. ► భవనం-3 గ్రౌండ్ ఫ్లోర్లో టెలికాం ఆఫీసు, బీఎస్ఎన్ఎల్ సర్వర్ (1,000 చ.అ.), ఏపీటీఎస్ సచివాలయ సపోర్ట్ యూనిట్ (1,000), పే అండ్ అకౌంట్స్ (1,000), సాధారణ సౌకర్యాలైన మీ సేవ, ఈ సేవ కౌంటర్లు, రైలు/బస్ రిజర్వేషన్ కౌంటర్లు, పోస్ట్ ఆఫీసు, బ్యాంకు, రెండు ఏటీఎంలు, షాపులు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆఫీసులు (27,500), ప్లే స్కూల్ (1,000), మూడు పడకల డిస్పెన్సరీ (2,000), రిక్రియేషన్ (3,000), లైబ్రరీ (1,000), రెస్టారెంట్ (12,000) ఏర్పాటు చేస్తారు. మొదటి అంతస్తులో ఐదుగురు మంత్రుల కార్యాలయాలు, సాంఘిక, గిరిజన సంక్షేమశాఖలు (7,950 చ.అ.), బీసీ సంక్షేమం (3,770 ), మైనార్టీ సంక్షేమం (2,870), మహిళా శిశు సంక్షేమం (3,450), స్కిల్ డెవలప్మెంట్ (2,500), యువజన సంక్షేమం, టూరిజం, కల్చర్ (3,600) ఉంటాయి. ► భవనం-4 గ్రౌండ్ ఫ్లోర్లో ఐదుగురు మంత్రుల కార్యాలయాలు, రెవెన్యూ (11,910 చ.అ.), రెవెన్యూ విపత్తుల శాఖ (1,070), ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ (3,910), వ్యవసాయ, సహకారశాఖ (6,780), పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, మత్య్సశాఖ (2,870), పౌరసరఫరాలశాఖ (2,820) ఉంటాయి. మొదటి అంతస్తులో ఐదుగురు మంత్రులు, ఇద్దరు సలహాదారుల కార్యాలయాలు, వాటర్ రిసోర్సెస్ (10,550 చ.అ.), రెయిన్ షాడో ఏరియా డెవలప్మెంట్ (1,400), పాఠశాల విద్య (4,310), ఉన్నత విద్య (4,720), ఐటీ, డేటా సెంటర్ (8,450) ఏర్పాటు చేస్తారు. ► భవనం-5 గ్రౌండ్ ఫ్లోర్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (11,320 చ.అ.), వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ (7,510), కార్మిక, ఉపాధిశాఖ (3,770), గృహ నిర్మాణశాఖ (3,570), మొదటి అంతస్తులో ట్రాన్స్‌పోర్టు, రోడ్లు, భవనాలశాఖ (5,750), విజిలెన్స్ కమిషన్ (3,700), కాన్ఫరెన్స్ హాలు (400 చదరపు అడుగులు) ఉంటాయి. -
అమరావతిలో డ్రోన్లతో నిఘా
- అమరావతిలో పటిష్ట భద్రత: సీఎం వెల్లడి - తాత్కాలిక సచివాలయ పనుల్ని పరిశీలించిన బాబు అమరావతి/విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం సీసీటీవీ కెమెరాలను విస్తృతంగా వినియోగిస్తామన్నారు. అంతేగాక నాలుగు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అధికారులు, ఇంజనీర్లనడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేయించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. తాత్కాలిక సచివాలయం నుంచి అత్యాధునిక టెక్నాలజీతో పాలన కొనసాగిస్తామని చెప్పారు. ప్రస్తుతం స్మార్ట్‌పల్స్ సర్వే చేస్తున్నట్టు, అది పూర్తై ఎటువంటి సర్టిఫికెట్లు కావాలన్నా వెంటనే పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఉద్యోగులు తరలిరావాల్సిందే.. ‘‘రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండి పనిచేస్తామంటే కుదరదు. అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతిలోని తాత్కాలిక రాజధానికి తరలిరావాల్సిందే. ఇక్కడినుంచే పాలన జరగాలి’ అని సీఎం అన్నారు. ఈనెల 27 నుంచి అమరావతి నుంచే మొత్తం పాలన సాగాలని చెబుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. అందులో భాగంగా పనులు వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. 22న మరోసారి తాత్కాలిక సచివాలయ పనుల్ని పరిశీలించి యాక్షన్‌ప్లాన్ ప్రకటిస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్ వచ్చేంతవరకు అమరావతి ప్రాంతంలో ఉన్నరోడ్లనే అభివృద్ధి చేస్తామని చెప్పారు. వెంటనే నిధులివ్వకపోతే కష్టం :శ్రీధరన్ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు వెంటనే నిధులివ్వకపోతే కష్టమని రాష్ట్ర మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు. నిధులు విడుదల చేస్తే పనులు మొదలు పెడతామని అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని మెట్రో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో శ్రీధరన్ నిధుల సమస్యను లేవనెత్తినట్లు సమాచారం. దీంతో సీఎం తొలి విడతగా రూ.150 కోట్లు విడుదల చేస్తామని, భూసేకరణ చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబును ఆదేశించారు. 26 నుంచి చంద్రబాబు చైనా పర్యటన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలకు హాజరు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 30 వరకూ చైనాలో పర్యటించనున్నారు. చైనాలోని తియాన్జిన్ నగరంలో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొంటారు. 25వ తేదీ రాత్రి ఢిల్లీ మీదుగా చైనా వెళతారు. తిరిగి 30న విజయవాడకుచేరుకుంటారు. చైనాలో పర్యటించే బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, సీఎంవో ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, వ్యక్తిగత కార్యదర్శి పి. శ్రీనివాస్, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, సమాచార కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, పలు పత్రికలు, చానళ్ల ప్రతినిధులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. చైనా పర్యటనలో పలువురు వ్యాపార, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. -
ఉద్యోగులు రావాల్సిందే
- సీఎం చంద్రబాబు - 27 నాటికి తాత్కాలిక సచివాలయంలో చాలా నిర్మాణాలు పూర్తవుతాయి సాక్షి, విజయవాడ, అమరావతి: ‘ఇక్కడ సౌకర్యాలు లేవని, ఉద్యోగులు హైదరాబాద్‌లోనే ఉంటామంటే కుదరదు. తొలుత కొన్ని ఇబ్బందులు తప్పవు. నేను బస్సులో ఉంటూ పరిపాలన సాగించాను. ఉద్యోగులు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి అమరావతికి రావాల్సిందే’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.గుంటూరు జిల్లా వెలగపూడిలో కొత్తగా నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఆ తర్వాత విజయవాడ ఏ-1 కన్వెన్షన్ ప్రాంగణంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నెల 27 నాటికి చాలా నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. తొలుత కొందరు ఉద్యోగులు, ఆ తర్వాత మిగతా వారంతా రావాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రాజధానికి అప్రోచ్ రోడ్లు వేస్తామన్నారు. రాష్ట్ర పాలనలో ఇబ్బందులు రాకూడదనే తాను సైతం బస్సుల్లో ప్రయాణిస్తున్నానన్నారు. ఇల్లు నిర్మించుకునే వారికి అన్ని సౌకర్యాలు ఏకకాలంలో ఉండవని, ఒకదాని తరువాత ఒకటి ఏర్పాటు చేసుకుంటారని చెప్పారు. ఆ దిశగానే సచివాలయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ మేరకు షాపూర్జీ పల్లోంజి, ఎల్ అండ్ టి నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చర్చించామన్నారు. ‘రాజధాని’ ఆర్టీసీలో ఐదు రోజుల పని విజయవాడ ప్రధాన కార్యాలయానికి తరలివచ్చే ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు వారంలో ఐదు రోజులే పనిదినాలుగా నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ పండిట్ నెహ్రు బస్‌స్టేషన్(పీఎన్బీఎస్)పై అంతస్తులో రూ.10 కోట్లతో నందమూరి తారక రామారావు పేరుతో నిర్మించిన ఆర్టీసీ ప్రధాన పరిపాలన కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ బస్‌భవన్ నుంచి విజయవాడకు వచ్చే సుమారు 325 మంది ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలు అమలు చేస్తామని చెప్పారు. విజయవాడ బస్‌స్టేషన్‌ను ఎయిర్‌పోర్టు తరహాలో ఆధునికీకరించడం మంచి పరిణామం అన్నారు. రాష్ట్రంలోని అన్ని బస్స్టేషన్లను బస్పోర్టులుగా తీర్చిదిద్దుతామని, ఇందుకు సహకరించే దాతల పేర్లను పెట్టేందుకు అభ్యంతరం లేదన్నారు. భవిష్యత్‌లో బ్యాటరీ బస్సులు రానున్న కాలంలో కాలుష్య రహిత రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ సీఎన్జీ, కరెంటు చార్జింగ్పెట్టి బ్యాటరీతో నడిచే బస్సులను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం ఆర్టీసీ కార్మికుల ఒక రోజు వేతనం రూ.కోటి 36 లక్షల చెక్కును ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా చంద్రయ్య, శ్రీనివాసరావు, ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్‌లు సీఎంకు అందించారు. అంతకు ముందు.. ఆధునికీకరించిన సిటీ బస్సు టెర్మినల్, వై్ర స్కీన్స్ సంస్థ నిర్మించిన మినీ థియేటర్లను, ఆర్టీసీ కొత్త యాప్‌లను సీఎం ప్రారంభించారు. -
ఎన్నాళ్లీ ‘బొమ్మల కొలువు’
ఒక్క అడుగైనా కదలని నూతన రాజధాని నిర్మాణం సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు రెండేళ్లు పూర్తయ్యింది. అమరావతిని నూతన రాజధానిగా ప్రకటించి ఏడాదిన్నర అవుతోంది. రాజధాని నిర్మాణం మాత్రం ఒక్క అడుగైనా ముందుకు కదలడం లేదు. మాస్టర్ప్లాన్లు, డిజైన్లు అంటూ అప్పుడప్పుడూ ప్రజలకు రంగురంగుల బొమ్మల కొలువులను చూపించడం మినహా ఇప్పటిదాకా ఒక్క నిర్మాణాన్ని కూడా ప్రారంభించిన దాఖలు లేవు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నాన్చుడు ధోరణే అవలంభిస్తోంది. సింగపూర్ ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌లోని ఆకాశహార్మ్యాలు, ఫ్లైఓవర్లు, ఐకానిక్ టవర్ల బొమ్మలతో ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. అదిగో రాజధాని.. ఇదిగో రాజధాని అంటూ ప్రజానీకాన్ని ఏమారుస్తోంది. నెలకోసారి బొమ్మల డిజైన్లను ప్రణాళికల పేరుతో విడుదల చేసి హంగామా చేయడం తప్ప క్షేత్రస్థాయిలో పనులు మొదలే కావడం లేదు. ప్రయోజనాలు దక్కించుకోవడంలో రాజీ వద్దు రాజధాని పేరుతో రైతులను మభ్యపెట్టి సేకరించిన వేలాది ఎకరాలను ఎవరికి కట్టబెట్టాలనే అంశంలో ప్రభుత్వ పెద్దలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు సమాచారం. ఎవరికి కట్టబెడితే తమకు ఎక్కువ లబ్ధి కలుగుతుందనే విషయంలో వారు లోపాయికారీగా తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించాలని యోచిస్తున్నారు. రాజధాని నిర్మాణం ఎంత ఆలస్యమైనా ఫర్వాలేదు, తమకు దక్కాల్సిన ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీపడకూడదని సర్కారు పెద్దలు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. వివాదాస్పదం స్విస్ ఛాలెంజ్ విధానం రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు ఇచ్చిన మాస్టర్ప్లాన్లను ఆరు నెలల క్రితమే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 55 మండలాల రాజధాని రీజియన్, గుంటూరు జిల్లాలోని 29 గ్రామాల రాజధాని నగరం, 16 చదరపు కిలోమీటర్ల సీడ్ క్యాపిటల్‌కు సింగపూర్ కంపెనీలు వేర్వేరుగా మాస్టర్ప్లాన్లు రూపొందించాయి. ఇందుకోసం సీఆర్డీఏ, ప్రభుత్వ ఉన్నతాధికారులు పలుమార్లు సింగపూర్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండుసార్లు అక్కడికెళ్లి చర్చలు జరిపారు. ఇక సింగపూర్ కంపెనీల ప్రతినిధులు ఇక్కడ తాత్కాలిక డెస్క్‌లు ఏర్పాటు చేసుకుని మరీ ప్లాన్లు రూపొందించారు. కొన్ని లోపాలున్నా చివరికి ప్రభుత్వం మూడు ప్లాన్లను ఆమోదించింది. రాజధాని నగరం, సీడ్ క్యాపిటల్ నిర్మాణ కార్యకలాపాల కోసం స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. మాస్టర్‌ప్లాన్ తయారు చేసిన సింగపూర్ కంపెనీలకే కాంట్రాక్టు కట్టబెట్టేందుకు వ్యూహ రచన చేసింది. సింగపూర్ కంపెనీల కన్సార్టియం అసెండాస్-సిన్బ్రిడ్జ్-సెంబ్‌కార్ప్‌కు ఈ విధానం కింద 1,600 ఎకరాలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే, ఇందుకు సంబంధించిన విధివిధానాలు, ఆ కంపెనీల నిబంధనలపై చాలారోజుల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సింగపూర్ ప్లాన్లు, స్విస్ ఛాలెంజ్ విధానం, వారి మధ్య ఒప్పందాలపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయాన్ని ప్రకటించేందుకు వెనుకాడుతోంది. లోపాయికారీగా సింగపూర్ కంపెనీల కన్సార్టియంనే మాస్టర్డెవలపర్గా ఎంపిక చేయాలనే నిర్ణయం జరిగినా దాన్ని ఎలా బయట పెట్టాలనే దానిపై చాలారోజుల నుంచి తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తాత్కాలిక సచివాలయం పూర్తికాకుండానే ప్రారంభోత్సవం రాజధాని ప్లాన్లు, డిజైన్ల పేరుతో కాలక్షేపం చేస్తూనే గతేడాది జూన్ ఆరో తేదీన తాళ్లాయపాలెంలో రాజధాని నిర్మాణానికి భూ మి పూజ చేశారు. అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీసుకొచ్చి రూ. వందల కోట్లు కుమ్మరించి ఆర్భాటంగా రాజధానికి శంకుస్థాపన చేయించారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం 20 శాతం కూడా పూర్తికాకుండా నే రెండు నెలల క్రితం దానికి ప్రారంభోత్స వం చేశారు. ఇలా ఏడాదిన్నరపాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్లాన్లు, డిజైన్లు, సర్వేల పేరుతో హడావుడి చేసినా ఒక్క పనీ రాజధానిలో మొదలుపెట్టలేదు. దేశీయ ఆర్కిటెక్ట్‌ల డిజైన్ల ఖరారులో జాప్యం మరోవైపు రాజధాని భవన సముదాయం కోసం అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్‌ల మధ్య డిజైన్ల పోటీ పేరుతో ప్రభుత్వం కొద్దిరోజులు హడావుడి చేసింది. చివరికి జపాన్‌కు చెందిన మకీ అసోసియేట్స్ డిజైన్‌ను ఖరారు చేసి దానికి విస్తృతంగా ప్రచారం చేసింది. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా అది రూపొందించిన అసెంబ్లీ భవన డిజైన్ చండీగఢ్ అసెంబ్లీని పోలి ఉండడం, హైకోర్టు డిజైన్ తీసికట్టుగా ఉండడంతో మళ్లీ కొత్త డిజైన్ల బాధ్యతను దేశీయ ఆర్కిటెక్ట్‌లకు అప్పగించింది. వారు తయారు చేసిన వాటిని ఇంకాఖరారు చేయలేదు. రాజధాని మౌలిక వసతుల కల్పన మాస్టర్‌ప్లాన్ బాధ్యతను చైనాకు చెందిన జీఐఐసీ కంపెనీకి, కొండవీటి వాగు ముంపు నివారణ సర్వేను ఆర్వీ అసోసియేట్స్‌కు అప్పగించి ఇంకా నాన్చుతోంది. -
నెలరోజుల్లో రావాల్సిందే
- నవనిర్మాణదీక్ష రెండవ రోజు కార్యక్రమంలో సీఎం - ఎవ్వరికీ మినహాయింపుల్లేవ్ - అమరావతి నుంచే పాలన జరగాలి సాక్షి, అమరావతి: ‘‘తాత్కాలిక సచివాలయం నెలరోజుల్లో పూర్తవుతుంది. ఎవ్వరికీ మినహాయింపుల్లేవు. తప్పకుండా అమరావతికి రావాల్సిందే. ఇక్కడి నుంచే పాలన జరగాలి. తప్పదు. అత్యవసర పరిస్థితుల్లో ఒకరిద్దరికి మినహాయింపు ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల గురించి తేల్చిచెప్పారు. రాష్ట్రం విభజన జరిగి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా విజయవాడ ఏ-1 కన్వెన్షన్ ప్రాంగణంలో శుక్రవారం చేపట్టిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆస్తులు, అప్పుల పంపకంలో హేతుబద్ధంగా జరగలేదన్నారు. ఆదాయం వచ్చే ఆస్తులపై తెలంగాణకు హక్కు కల్పించారని ఆక్షేపించారు. రాయితీతోపాటు రైల్వే జోన్, ట్రైబల్ యూనివర్సిటీ, మెట్రో, దుగరాజపట్నం, కడపలో స్టీల్‌ప్లాంట్ ఇస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి రూ.700 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. పోలవరం నిర్మాణం కోసం ఇప్పటివరకు కేంద్రం రూ.850 కోట్లు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల వరకు ఖర్చుచేసినట్లు వివరించారు. అనంతపురంలో అనవసర కార్యక్రమం రాష్ట్రమంతా నవనిర్మాణ దీక్ష చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు అనంతపురంలో అనవసర కార్యక్రమం చేపట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. పరిటాల రవిని హత్యచేసినప్పుడు కూడా తాను అదుపు తప్పలేదని చెప్పుకొచ్చారు.కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది తానేనని, అందులో భాగంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యికోట్లు ఇచ్చిన ఘనత తమదేనని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 కేసులు పెట్టినా.. నిప్పులాంటి వాడినని నిరూపించుకున్నట్లు చెప్పుకొచ్చారు. -
తాత్కాలిక ఉద్యోగులకు హాస్టల్ లైఫే!
వసతుల కల్పనలో చేతులెత్తేసిన సర్కారు దీంతో హాస్టళ్ల వైపు ఉద్యోగుల మొగ్గు హైదరాబాద్‌లో కుటుంబాలు.. హాస్టల్స్‌లో ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడ బ్యూరో : తాత్కాలిక సచివాలయ విధులకు రావాల్సిందేనని చెబుతున్న సర్కారు ఉద్యోగులకు వసతి సౌకర్యాల కల్పనలో చేతులెత్తేసింది. విధులకు రాక తప్పని పరిస్థితి, వసతి లేని ఇబ్బందికర పరిస్థితి వెరసి ప్రైవేటు హాస్టళ్ల కాన్సెప్ట్‌కు తెరలేచింది. ముంబయి, ఢిల్లీ, కర్ణాటక, చెన్నై, హైదరాబాద్ తరహాలో వర్కింగ్ ఎంప్లాయీస్ కోసం హాస్టళ్లు తెరుచుకుంటున్నాయి. తాడేపల్లి, ఉండవల్లి, మందడం ప్రాంతాల్లో ఇప్పటికే మూడు హాస్టళ్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మరో నాలుగు హాస్టళ్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. జూన్ 27 నుంచి తాత్కాలిక సచివాలయానికి హైదరాబాద్ నుంచి ఉద్యోగులు తరలిరావాలని ప్రభుత్వం ఇప్పటికే అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. కొందరు ఉద్యోగులు ఇప్పటికే వచ్చి రాజధాని ప్రాంతాన్ని చూసుకుని విజయవాడ, గుంటూరు నగరాల్లో అద్దె ఇళ్లు చూసుకున్నారు. తొలి దశలో కనీసం రెండు వేల మంది ఉద్యోగులు వస్తారని భావిస్తున్నారు. మరో రెండు, మూడేళ్లలో దశలవారీగా మొత్తం పదివేల మంది సచివాలయ ఉద్యోగులు వస్తారని చెబుతున్నారు. తొలినాళ్లలో వచ్చే ఉద్యోగులకు ప్రభుత్వం వసతి సౌకర్యాలు కల్పించలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం జీతాలతో పాటు హెచ్ఆర్ఏ (ఇంటి అద్దె అలవెన్సు) ఇస్తుండటంతో ఉద్యోగులు సొంతంగా అద్దె ఇళ్లు సమకూర్చుకోవాల్సిందేనని నిర్దేశించింది. ఇంటి కంటే హాస్టలే పదిలం! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విధులు నిర్వహించే ఉద్యోగులకు ప్రభుత్వం ఐదు రోజులే పని దినాలుగా ప్రకటించడంతో ఇంటి కంటే హాస్టలే పదిలమని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో ప్రైవేటు హాస్టళ్లకు గిరాకీ ఏర్పడింది. సొంత కారు, బస్సు, రైళ్లలో హైదరాబాద్ నుంచి విజయవాడకు సోమవారం ఉదయం చేరుకుని శుక్రవారం వరకు పనిచేసుకుని హైదరాబాద్ వెళ్లేందుకే ఎక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. భార్యాభర్తల్లో ఒకరు ఏపీలోను, మరొకరు తెలంగాణ సర్వీసుల్లో ఉండటం, కేంద్ర ప్రభుత్వం వారికి ఆప్షన్లు ఇవ్వకపోవడంతో హైదరాబాద్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పలువురి పిల్లల ఉన్నత చదువులు మధ్యలో ఉండటంతో వారి కుటుంబాలను అమరావతికి తీసుకురాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏదో ఒకలా వారంలో ఐదు రోజులు ఇక్కడే ఫోర్సుడ్ బ్యాచ్‌లర్‌గా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు హాస్టళ్ల కాన్సెప్ట్‌పై వారు ఆసక్తి చూపుతున్నారు. కొత్త ట్రెండ్.. మెట్రోపాలిటన్ నగరాలు, గ్రేటర్ సిటీలకు పరిమితమైన ఉద్యోగుల హాస్టళ్ల సంస్కృతి అమరావతికి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఈవెంట్ మేనేజ్మెంట్లు నిర్వహించే రాయలసీమకు చెందిన అర్జునరెడ్డి, పి.రామాంజనేయులు, ఆదినారాయణ కలిసి ఈ కొత్త ట్రెండ్‌ను చేపట్టారు. పెద్ద పెద్ద అపార్టుమెంట్లు రెండేళ్లకు కాంట్రాక్టుగా అగ్రిమెంట్ రాయించుకుని ఒక్కో రూమ్‌కు నలుగురు నుంచి ఆరుగురు ఉద్యోగులు ఉండేలా సౌకర్యాలను కల్పిస్తున్నారు. వసతి, టిఫిన్, భోజనం సహా ఒక్కొక్కరి నుంచి నెలకు నాన్ ఏసీ రూమ్‌కు రూ.6 వేలు, ఏసీ రూమ్‌కు రూ.7,500 చొప్పున రుసుం వసూలు చేసేలా నిర్ణయించారు. వారంలో రెండు రోజులు మాంసాహారం పెట్టనున్నారు. డార్మెట్రీ తరహాలోనూ... నెలవారీగా రూమ్‌లు అద్దెకు ఇవ్వడం, భోజన వసతి కల్పించడమే కాకుండా అంత ఖర్చు అనవసరం అనుకునేవారికి ప్రత్యామ్నాయ సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకు గాను డార్మెట్రీకి రోజుకు రూ.100, రూ.150 చొప్పున, లాకర్‌కు రూ.30, ఫ్రెషప్ అవడానికి రూ.50 చొప్పున రుసుం వసూలు చేసే ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వెలగపూడి సచివాలయ పనుల నిమిత్తం వచ్చిన 25 మంది ఎల్అండ్టీ ఉద్యోగులు సమీపంలోని మందడం హాస్టల్లో ఉంటున్నారు. త్వరలో రానున్న సచివాలయ ఉద్యోగులను ప్రైవేటు హాస్టళ్లకు తీసుకొచ్చేలా జూన్ రెండున హైదరాబాద్‌లో హాస్టల్ రూమ్‌ల బుకింగ్‌ను ప్రారంభించనుండటం విశేషం. మొత్తానికి కొత్త రాజధానిలో సర్కారు తీరుతో ప్రైవేటు హాస్టళ్ల వాత పడక తప్పనిసరి అయ్యింది. -
రాజధానిలో ఐదు రోజులే పనిదినాలు
- తరలింపునకు ఇక 35 రోజులే గడువు - ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనివేళలు - ఏడాదిపాటు అమలు.. ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి వెళ్లి పనిచేసేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇక 35 రోజులే గడువు ఉంది. జూన్ 27వ తేదీన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి వెళ్లి ఉద్యోగులు పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన రాజధాని ప్రాంతంలో పనిచేయనున్న ఉద్యోగులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పనిదినాలను తొలుత ఏడాది పాటు అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ సోమవారం జీవో జారీ చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనివేళలుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదు రోజుల పనిదినాలు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్కు వర్తిస్తాయన్నారు. హైదరాబాద్ నుంచి నూతన రాజధాని ప్రాంతానికి తరలివెళ్లి పనిచేయడం వల్ల కుటుంబాలు ఒత్తిడికి గురవుతాయని, ఈ నేపథ్యంలో ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాల్సిందిగా ఉద్యోగ సంఘాలు కోరినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యా సంస్థలు, జిల్లా, ప్రాంతీయ, స్థానిక సంస్థల, జ్యుడీషియల్ ఇన్స్టిట్యూషన్స్కు ఐదు రోజులు పనిదినాలు వర్తించవని స్పష్టం చేశారు. ఐదు రోజుల పనిదినాలు, పని వేళలు అమలు ఎప్పటి నుంచి అనేది తరువాత నోటిఫై చేస్తామని తెలిపారు. దీంతో సచివాలయ ఉద్యోగులు నూతన రాజధాని ప్రాంతంలో అద్దెకు ఇళ్లు చూసుకోవడం, పిల్లలకు విద్యా సంస్థల్లో అడ్మిషన్లను చూసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. సీఎస్ టక్కర్ కూడా జూన్ 27న వెలగపూడికి సీఎస్ కార్యాలయాన్ని తరలించాలని పేషీలోని సిబ్బందికి ఆదేశించారు. -
అమరావతికి తరలింపుపై స్పష్టత ఇవ్వండి
సీఎస్‌ను కలసి కోరాలని ఐఏఎస్‌ల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి ప్రాంతమైన వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి తరలివెళ్లడంపై స్పష్టత ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ను కలసి కోరాలని ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల సమావేశంలో నిర్ణయించారు. జూన్ 27వ తేదీన తాత్కాలిక సచివాలయానికి తరలి వెళ్లాల్సిందేనని మంత్రి నారాయణ ప్రకటిస్తున్నారు. అయితే వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయం డిసెంబర్‌కు గానీ పూర్తి కాదని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌ల సంఘం ఇటీవల లేక్‌వ్యూ అతిథిగృహంలో సమావేశమై సచివాలయానికి తరలివెళ్లడంపై చర్చించారు. ఈ సమావేశానికి 12 మంది ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. భవనం పూర్తి కాకుండా అక్కడకి వెళ్లి ఎలా పనిచేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. తాత్కాలిక సచివాలయానికి నీటి సరఫరా ఎక్కడి నుంచి చేస్తారో ఇప్పటి వరకు స్పష్టత లేదని, అలాగే విద్యుత్ సౌకర్యం కూడా లేదనే విషయాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఈ విషయాలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్తే.. నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని, జనరేటర్లు ద్వారా విద్యుత్ అందిస్తామని చెప్పినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాజధానికి వెళితే.. నివాస వసతి కల్పనపై కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, ఈ విషయాలన్నింటినీ సీఎస్‌కు విన్నవించాలని ఐఏఎస్‌ల సమావేశం నిర్ణయించింది. ఐటీ శాఖది అదేం తీరు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ శాఖను చూస్తున్న సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న ఉన్న పళంగా ఆదేశాలు జారీ చేసి ఐటీ శాఖ ఉద్యోగులను విజయవాడకు తరలించడంపైనా సమావేశం చర్చించింది. ఐటీ శాఖ మంత్రికి కూడా కనీస సమాచారం ఇవ్వకుండా ఆ శాఖ ఉద్యోగులను విజయవాడకు తరలించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ శాఖను చూస్తున్న అధికారినే అదే శాఖ ఇంచార్జి కార్యదర్శిగా నియమించడంపై ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది. అంతేకాకుండా సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న ప్రద్యుమ్న ఐటీ శాఖ కార్యదర్శి అంటూ జీవోలు జారీ చేయడాన్ని ఉన్నతాధికారులు తప్పుపడుతున్నారు. 18న రోడ్ మ్యాప్‌పై సీఎం సమీక్ష తాత్కాలిక సచివాలయానికి తరలి వెళ్లడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 18న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సచివాలయంలో ఏ శాఖల్లోని ఏ విభాగాలను హైదరాబాద్‌లోనే ఉంచాలి, ఏ విభాగాలను వెలగపూడి సచివాలయానికి తరలించాలనే మార్గదర్శకాలను ఖరారు చేశారు. అలాగే ఏ రంగాల ఉద్యోగులకు తరలింపులో మినహాయింపు ఇవ్వాలో కూడా నిర్ధారించారు. ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షలో ఈ విషయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ వివరించనున్నారు. ఆ సమావేశంలో రోడ్ మ్యాప్‌ను ఖరారు చేయనున్నట్లు సాధారణ పరిపాలన శాఖ ఉన్నతాధికారి తెలిపారు. -
జూన్ 25 తర్వాత వెలగపూడి నుంచే పాలన
తుళ్లూరు: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మాణమవుతున్న తాత్కాలిక సచివాలయం నుంచి జూన్ 25 తర్వాత పాలన కొనసాగుతుందని, దీనికి సంబంధించి 11,500 మంది ఉద్యోగులను తరలిస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. శనివారం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలి సచివాలయ పనులను ఆయన పరిశీలించారు. ఇటీవల జరిగిన ఓ కార్మికుడి మృతి ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. సచివాలయం పనులు నిలిచిపోయాయని ప్రచారం జోరుగా చేస్తున్నారన్నారు. ఇది ప్రతిపక్షాలకు ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాజకీయం చేస్తుందని, దీనికి పూర్తి బాధ్యత ఆ పార్టీదేనని తెలిపారు. గతంలో హామీ ఇచ్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంపై ఎద్దేవా చేయడం సరైంది కాదన్నారు. -
ఫైళ్ల తరలింపునకు త్వరలో టెండర్లు
♦ లక్షల సంఖ్యలో నూతన రాజధానికి తరలించాల్సిన ఫైళ్లు ♦ పూర్తి నిఘాతో తీసుకెళ్లేందుకు సన్నాహాలు ♦ 32 శాఖలు, 350 సెక్షన్లకు చెందిన ఫైళ్లు గుర్తింపు సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి ఫైళ్ల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ దృష్టి సారించారు. ఫైళ్లతో పాటు కంప్యూటర్లను కూడా తరలించేందుకు త్వరలో టెండర్లను ఆహ్వానిస్తామని సీఎస్ పేర్కొన్నారు. 32 శాఖల్లో 350 సెక్షన్లకు చెందిన ఫైళ్లు లక్షల సంఖ్యలో ఉంటాయని, వీటి తరలింపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నందున ప్రత్యేక టెండర్లు ఆహ్వానించాలని సీఎస్ అభిప్రాయపడ్డారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, సాధారణ పరి పాలన, మున్సిపల్, హోం శాఖల్లో ఫైళ్లు అధికమని అధికారులు తేల్చారు. ఫైళ్లతో పాటు కంప్యూటర్లు, సర్వర్లు తరలింపు అనేది ఏ శాఖకు చెందినవి ఆ శాఖకు కేటాయించిన బ్లాక్‌కు చేర్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఫర్నిచర్‌ను మాత్రం ఇక్కడే వదిలేయాలని నిర్ణయించారు. వెలగపూడిలో కార్యాలయాలకు కొత్త ఫర్నిచర్‌ను సమకూర్చుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బ్యాచిలర్ వసతి ఎంత మందికి కావాలి ఇలా ఉండగా వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లే అఖిల భారత సర్వీసు అధికారులు ఎంత మంది కుటుంబాలు సహా తరలివెళ్తారు. ఎంత మందికి బ్యాచిలర్ వసతి కావాలనే వివరాలను సేకరించాలని సాధారణ పరిపాలన శాఖ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బ్యాచిలర్లకు వసతి కల్పించాలని, అలాగే కుటుంబాలతో తరలివెళ్లే వారికి అందుకు అనుగుణంగా వసతి కల్పించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఏడాదిలోగా పదవీ విరమణ చేసే అఖిల భారత సర్వీసు అధికారులు కుటుంబాలతో తరలివెళ్లేందుకు ఇష్టపడటం లేదు. బ్యాచిలర్ వసతిని పర్యాటక శాఖ హోటల్లో కల్పిస్తే సరిపోతుందని సీనియర్ ఐఏఎస్ అధికారులు కోరుతున్నారు. -
రాజధాని ఉద్యోగులకు 5 రోజులే పనిదినాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు లేవు, ఆదాయము లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం తెల్లవారుజామున ఏపీ సచివాలయ భవన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం విడిపోవాలని మనం కోరుకోలేదని.. విభజన చేయాలంటే ఏపీకి న్యాయం చేయాలని చెప్పానన్నారు. రాజధాని అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉంటాయని చెప్పారు. ఉద్యోగులకు 30 శాతం హెచ్ ఆర్ ఏ ప్రకటించారు. ఉద్యోగులకు రాజధాని ప్రాంతంలో 5 వేల గృహాల సముదాయం నిర్మిస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.2,400 కోట్లు మంజూరు చేస్తూ ఫైలుపై సంతకం చేశారు. రుణ ఉపశమనంలో బ్యాలెన్స్ రూ. 178 కోట్ల విడుదల ఫైలుపై సంతకం చేశారు. 'అమరావతికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నా. రైతులు, రాజధాని ప్రాంత పేదలు బాగుండాలి. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు జూన్ 15 నాటికి పూర్తవుతాయి. నాపై నమ్మకముంచి 33,500 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రపంచంలో 10 ఉత్తమమైన రాజధానుల్లో మన రాజధానుంటుంది. సీఎం అయిన వెంటనే సింగపూర్ వెళ్లి రాజధాని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని కోరాను. 6 నెలల్లో సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. జూన్‌లో మంచి రోజులు లేనందున ఇవాళే సచివాలయాన్ని ప్రారంభించాం. రెండో విడత రైతు రుణమాఫీపై సంతకం చేస్తున్నట్లు' చంద్రబాబు చెప్పారు. -
ఏపీ తాత్కాలిక సచివాలయం ప్రారంభం
తెల్లవారు జామున 4.01 నిమిషాలకు ప్రారంభం సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ భవనానికి వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేశారు. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల ఒక్క నిమిషానికి భవనంలోకి ప్రవేశించి తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ నెల తరువాత సరైన ముహూర్తాలు లేవనే కారణంతో హడావుడిగా ఈ ముందస్తు ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్ అండ్ టీ నిర్మిస్తున్న నాలుగో బ్లాకులో ఇందుకోసం ఒక గది(33 566 సైజులో)ని ఆగమేఘాల మీద సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడితో ఎల్ అండ్ టీ యుద్ధప్రాతిపదికన ఆ పనులు చేస్తోంది. మొదట రెండు గదులు సిద్ధం చేయాలని చూసినా.. రెండు రోజుల్లో అది సాధ్యమయ్యే పనికాకపోవడంతో ఒకదాన్నే అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు అధికారులు హాజరయ్యారు. -
ఏపీ తాత్కాలిక సచివాలయంగా నాగార్జున వర్సిటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంగా గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీని ఎంపిక చేశారు. కొత్త రాజధాని కోసం భూ సేకరణ జరిపే గ్రామాలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారుల కమిటీ యూనివర్సిటీలోని భవనాలను పరిశీలించింది. యూనివర్సిటీలోని కొన్ని శాఖలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని గుంటూరు జిల్లాలోనే నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారులు, నాయకులు ఇప్పటికే భూ సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.