రాష్ట్ర పరిపాలన ఇకపై పూర్తిస్థాయిలో ‘అమరావతి’ నుంచే కొనసాగనుంది. కార్యదర్శులు సోమవారం లాంఛనంగా పూజలు చేసి వెలగపూడి నుంచి విధులు ఆరంభిస్తారు. ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల ఛాంబర్లను సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ప్రారంభించేందుకు ఉద్యోగులు పూలమాలలు, మామిడి తోరణాలతో అలంకరించారు. సచివాలయ ఉద్యోగులకు సోమవారం ఉదయం ఆత్మీయ స్వాగతం పలికేందుకు విజయవాడ, గుంటూరులోని ఆయా శాఖల సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ సచివాలయం నుంచి 80 శాతానికి పైగా సామాగ్రిని వెలగపూడికి తరలించారు. పంచాయతీరాజ్ శాఖ మాత్రం మరికొన్ని రోజులు హైదరాబాద్‌లోనే కొనసాగనుంది.