Panchayati Raj Department
-
పల్లె ముంగిట కొత్త ‘పద్దు’
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల తరహాలోనే పంచాయతీల స్థాయిలోనూ గ్రామ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) పేరుతో బడ్జెట్లను పకడ్బందీగా రూపొందించే ప్రక్రియ మొదలైంది. ఈమేరకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో అంచనాల తయారీ ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచనల మేరకు ఇక పంచాయతీలకు అందే 15వ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా ఆ గ్రామ జీపీడీపీలో పేర్కొన్న పనులకే కేటాయించాల్సి రావడంతో ఈ బడ్జెట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. ఫలితంగా గ్రామస్థాయిలో పాలకవర్గం గుర్తించిన పనులను బడ్జెట్లో పొందుపరుచుకునే వెసులుబాటు లభించింది. సప్లిమెంటరీ ప్రణాళిక పేరుతో సవరణ చేసుకునే అవకాశమూ లభించింది. వచ్చే 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 1,3326 గ్రామ పంచాయతీలతోపాటు 660 మండల పరిషత్‌లు, 13 ఉమ్మడి జిల్లాల పరిషత్‌లకు కలిపి మొత్తంగా రూ.2,152 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిని గ్రామ బడ్జెట్లో పెట్టిన పనులకే వాడుకోవాలి. ఏడాది మొదట్లో గానీ లేదంటే మధ్యలో సప్లిమెంటరీగాగానీ ఆ గ్రామ బడ్జెట్లో పేర్కొనని పనులకు ఆర్థిక సంఘ నిధులను వాడుకునే అవకాశమే ఉండదు. ఇంటి పన్ను రూపంలో అందజేసే జనరల్ ఫండ్స్ తదితర ఇతర నిధులను మాత్రం బడ్జెట్ ప్రకారం ఖర్చుపెట్టాలన్న నియమేమీ లేదు. అయితే వీలైనంత మేర బడ్జెట్ ప్రణాళికల ఆధారంగానే ఖర్చు చేసేలా ప్రోత్సహించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపు ప్రక్రియలో సర్పంచులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కార్యదర్శులకు మండలస్థాయి అధికారుల సహకారం గ్రామ బడ్జెట్ రూపకల్పన, అమలులో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రతి మండలంలో ఆరుగురు మండల స్థాయి అధికారులతో కమిటీలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉండే నిధులకు, ఇతర పథకాల వచ్చే నిధులనూ అవసరమైన మేర అనుసంధానం చేసుకునేలా ఈ ఆరుగురు మండల స్ఙాయి అధికారులు తోడ్పాటు అందిస్తారని వివరించారు. కమిటీల్లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీ, పంచాయతీరాజ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఉపాధి పథకం ఏపీఓ, సెర్ప్ ఏపీఎంలు ఉంటారు. మూడొంతుల పంచాయతీల్లో పూర్తి ఇప్పటికే దాదాపు మూడోంతులకుపైగా అంటే 11,403 గ్రామ పంచాయతీల్లో 2024–25 సంవత్సరపు గ్రామ బడ్జెట్ ప్రణాళికల రూపకల్పన పూర్తయినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అన్ని పంచాయతీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 660 మండలాలు, 13 ఉమ్మడి జిల్లాల స్థాయిలోనూ మండల, జిల్లా పరిషత్‌ల వారీగా బడ్జెట్ ప్రణాళికలను మార్చి నెలలో రూపొందించే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వివరించారు. -
తెలంగాణలో ఇతర ఆసరా పింఛన్లూ పెంపు?
హైదరాబాద్: రాష్ట్రంలో ఆసరా పింఛను మొత్తాన్ని వెయ్యి రూపాయల మేర పెంచేందుకు పంచాయతీరాజ్ శాఖ నివేదిక సిద్ధం చేసింది. ఆసరా పథకంలో దివ్యాంగుల పింఛన్‌ను గత నెలలో రూ.3,016 నుంచి రూ.4,016కు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకూ పెంచాలని ఇతర ఆసరా పింఛనుదారులు కోరుతున్నారు. ప్రస్తుతం వివిధ విభాగాల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,016 పింఛను ఇస్తోంది. వీరికి సైతం వెయ్యి పెంచి రూ.3,016 ఇచ్చేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం అనంతరం దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇతర లబ్ధిదారులకూ త్వరలో పింఛను మొత్తాన్ని పెంచుతామని ఆదివారం సూర్యాపేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 44,82,254 మందికి పింఛన్లు ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులతో పాటు పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు; గీత, చేనేత, బీడీ కార్మికులు; ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ రోగులకు కలిపి మొత్తం 44,82,254 మందికి పింఛను ఇస్తోంది. ఇందుకు ఏటా రూ.11,628 కోట్లు ఖర్చు చేస్తోంది. లబ్ధిదారుల్లో 5,16,890 మంది దివ్యాంగులకు గత నెల నుంచి వెయ్యి పెంచింది. వీరిని మినహాయిస్తే.. ఇతర పింఛనుదారులు 39 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1,000 పెంపుతో ఖజానాపై మరో రూ.450 కోట్ల మేర అదనపు భారం పడుతుందని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. -
రేపటి నుంచి పంచాయతీల్లో నగదు రహిత చెల్లింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో మంగళవారం నుంచి నగదు లావాదేవీలు నిలిచిపోనున్నాయి. ఇంటిపన్ను సహా ఏ అవసరానికి పంచాయతీకి డబ్బు చెల్లించాలన్నా.. కేవలం నగదు రహిత విధానంలోనే చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఆగస్టు 15 నుంచి నగదు రహిత లావాదేవీల నిర్వహణను తప్పనిసరి చేస్తూ రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోను ఈ విధానం అమలుకు పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ప్రత్యేక విధివిధానాలను ఖరారు చేసింది. సాధారణంగా ఆన్లైన్ విధానంలో నగదు చెల్లింపులు.. నెట్ బ్యాంకింగ్ విధానంలోగానీ, పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసే పీవోఎస్ మిషన్లలో డెబిట్ కార్డులను ఉపయోగించడం ద్వారాగానీ, ఫోన్‌పే, పేటీఎం వంటి విధానాల్లో మొబైల్ ఫోన్లతో క్యూఆర్ కోడ్లను స్కాన్‌చేయడం ద్వారాగానీ చేయాల్సి ఉంటుంది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌బ్యాంకింగ్, డెబిట్ కార్డులను ఎక్కువమంది వినియోగించకపోవచ్చన్న అంచనాతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ పంచాయతీల్లో రెండురకాల విధానాల్లో నగదు రహిత ఆన్లైన్ చెల్లింపుల విధానం అమలుకు ఏర్పాట్లు చేసింది. మూడువేలకు తక్కువగా జనాభా ఉండే చిన్న గ్రామాల్లో కేవలం మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానం, మూడువేలకు పైగా జనాభా ఉండే గ్రామాలకు వివిధ రకాల కార్డుల ద్వారా చెల్లింపులకు వీలుగా పీవోఎస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నాలుగు బ్యాంకుల్లో పంచాయతీల పేరిట ప్రత్యేక ఖాతాలు ఆగస్టు 15 నుంచి పంచాయతీల్లో నగదు రహిత చెల్లింపుల నిర్వహణకు వీలుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఇందుకు నాలుగు ప్రముఖ బ్యాంకులతో పంచాయతీరాజ్ శాఖ ఒప్పందం చేసుకుంది. 11 జిల్లాల్లో యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా (యూబీఐ)లో, తొమ్మిది జిల్లాల్లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో, ఐదు జిల్లాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో, ఒక జిల్లాలో ఐడీఎఫ్సీ బ్యాంకులో పంచాయతీల వారీగా ఖాతాలు తెరిచారు. ♦ రాష్ట్రంలో మొత్తం 13,325 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో మూడువేలకన్నా తక్కువ జనాభా ఉన్నవి 10,003. ఈ పంచాయతీలకు సంబంధిత బ్యాంకులు మొబైల్ ఫోన్ల చెల్లింపులకు వీలుగా ప్రత్యేక క్యూఆర్ కోడ్లను ఇప్పటికే కేటాయించాయి. ♦ మూడువేలకు పైగా జనాభా ఉన్న 3,322 పంచాయతీల్లో కార్డుల ద్వారా నగదు చెల్లించేందుకు పీవోఎస్ మిషన్లను ఆయా పంచాయతీలకు సంబంధిత బ్యాంకులు ఉచితంగా ఇస్తున్నాయి. ఒక్కో పంచాయతీకి ఒకటి చొప్పున, ఏదైనా పెద్ద పంచాయతీలో ఒకటి కంటే ఎక్కువ గ్రామ సచివాలయాలున్న చోట, అదనంగా ప్రతి గ్రామ సచివాలయానికి ఒకటి చొప్పున మొత్తం 5,032 పీవోఎస్ మిషన్లను అందజేస్తున్నాయి. ♦ గ్రామ పంచాయతీలకు కేటాయించిన ఎల్జీడీ కోడ్ నంబరు ఆధారంగా బ్యాంకులు ఆయా పంచాయతీలకు ఆన్లైన్ చెల్లింపుల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) కోడ్లను కేటాయిస్తున్నాయి. ♦ బ్యాంకులో పంచాయతీ ఖాతాకు జమ అయిన సొమ్మును ఆ పంచాయతీ కార్యదర్శి ట్రెజరీ అకౌంట్లో జమచేస్తారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ.. పంచాయతీ కార్యదర్శులకు విధివిధానాలతో ఆదేశాలు జారీచేసింది. -
‘స్థానిక’ ఖాళీలపై ఎన్నికల కమిషన్ కదలిక
సాక్షి, హైదరాబాద్: వివిధ స్థానిక సంస్థల్లో ఖాళీలు ఏర్పడిన పలు ప్రజాప్రతినిధుల స్థానాల ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్(ఎస్ఈసీ) వర్గాలు వెల్లడించాయి. పలు సర్పంచ్, ఎంపీటీసీ, వార్డుసభ్యులు, ఇతర పోస్టులకు ఎన్నికలెందుకు నిర్వహించడం లేదంటూ తాజాగా ఎస్ఈసీకి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ఎన్ని రోజుల్లోగా నిర్వహిస్తారో వెల్లడించాలని, అందుకు నెల రోజుల సమయం కూడా కోర్టు ఇచ్చిన నేప థ్యంలో ప్రభుత్వానికి ఎస్ఈసీ విజ్ఞప్తి చేయను న్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు కోర్టు నోటీస్ జారీకి సంబంధించిన ఆర్డర్ కాపీ ఎస్ఈసీకి, పీఆర్ శాఖకు చేరేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ లోగా ఖాళీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. పీఆర్ శాఖ కమిషనర్‌కు కూడా కోర్టు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా అంశాల ప్రాతిపదికన సమా« దానం పంపేందుకు సిద్ధమ వుతున్నట్టు తెలుస్తోంది. నూతన పీఆర్ చట్టం ప్రకారం... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలకు సంబంధించి ప్రభుత్వ సమ్మతి, ఆమోదంపొందాకే ఎస్ఈసీ వాటిని ఖరారు చేయాల్సి ఉంటుందనే నిబంధన విధించారు. వివిధ గ్రామీణ స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం 2024 జనవరిలో ముగియనుంది. ఖాళీలు ఏర్పడిన స్థానాలకు ఇంకా 9 నెలల పదవీ కాలం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఏదైనా కారణంతో స్థానిక సంస్థల పోస్టులు ఖాళీ అయితే ఆరునెలల్లో భర్తీ చేయాల్సి ఉండగా, వీటి ఎన్నిక మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. మినీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత వివిధ గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని ప్రజా ప్రతినిధుల పోస్టులు ఆరువేలకుపైగా ఖాళీలు ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా వాటికి ఎన్నికలు నిర్వహించకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయ వాతావరణంలో ఈ ‘మినీ పంచాయతీ’ఎన్నికలు జరుగుతాయో, లేదోననే చర్చ ఆసక్తికరంగా మారింది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాక ఎన్నికల వ్యయం వెల్లడించకపోవడం, విధుల నిర్వహణలో అలస త్వం ప్రదర్శించడం, అక్రమాలు, పీఆర్ చట్ట ఉల్లంఘనకు పాల్పడటం వంటి కారణాలతో కొన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు సభ్యులు, మున్సిపల్ వార్డు సభ్యుల పోస్టులు ఖాళీ అయ్యా యి. వీటికి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది భాస్కర్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఎస్ఈసీకి, పీఆర్ కమిషనర్లకు తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
AP: మరో 875 రోడ్ల పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 875 రోడ్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గంలో కీలకమైన ఐదురోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. ఈ 875 రోడ్లలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో 442, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 300, మున్సిపల్ శాఖ పరిధిలో 133 ఉన్నాయి. రోడ్లను ఎంపికచేసి ప్రతిపాదనలు పంపాలని ఆర్ అండ్ బి, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ రోడ్ల పనులను మార్చిలో ప్రారంభించి జూన్ నాటికి పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రోడ్ల పునరుద్ధరణ నిధులను కూడా 2019 ఎన్నికల ముందు పసుపు–కుంకుమ వంటి పథకాలకు మళ్లించింది. దీంతో రాష్ట్రంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి ఏడాది భారీవర్షాలతో రోడ్ల పనులు చేపట్టడం సాధ్యం కాలేదు. అనంతరం రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను పెద్ద ఎత్తున చేపట్టింది. మొదటిదశ కింద రూ.2,205 కోట్లతో 6,150 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఆ పనులు 95 శాతం పూర్తయ్యాయి. రెండోదశ కింద రూ.1,700 కోట్లతో 6,150 కిలోమీటర్ల మేర రహదారుల పునరుద్ధరణ ప్రణాళికను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 953 రోడ్లను రెండోదశలో పునరుద్ధరించాలని నిర్ణయించింది. వాటిలో రాష్ట్ర ప్రధాన రహదారులు 292, జిల్లా ప్రధాన రహదారులు 661 ఉన్నాయి. ఈ పనులను ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతలో యుద్ధప్రాతిపదికన నియోజకవర్గానికి ఐదు రోడ్ల చొప్పున పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విధానంలో 875 రోడ్ల పునరుద్ధరణ పనులు మొదట పూర్తిచేయనున్నారు. అనంతరం రెండోదశ రోడ్ల పునరుద్ధరణ పనులను చేపట్టి డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ప్రణాళిక రూపొందించారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో రోడ్ల కోతకు చెక్ నదీపరివాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న రోడ్ల కోతకు రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలకనుంది. అందుకోసం ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎఫ్డీఆర్ టెక్నాలజీతో వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆదేశించారు. మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా.. వర్షాలు పడినా, వరదలు వచ్చినా నదీతీర ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురవుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ సమస్య వేధిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఎఫ్డీఆర్ సాంకేతికతతో రోడ్లు నిర్మించనుంది. ఆర్ అండ్ బి శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లను ఈ సాంకేతికతతో నిర్మిస్తారు. పైలట్ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో గజ్జరం నుంచి హుకుంపేట వరకు 7.50 కిలోమీటర్ల మేర ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డును పరిశీలించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ (సీఐఆర్) నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మెత్తటి నేలలున్న ప్రాంతాల్లో అదే టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. -
‘పంచాయతీరాజ్’లో భారీగా పదోన్నతులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖలో ప్రస్తుతం ఈవోపీఆర్డీలుగా పనిచేస్తున్న వారితోపాటు జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (ఏవో)గా పనిచేస్తున్న వారికి ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాతికేళ్ల తర్వాత 237 మంది ఎంపీడీవోలకు ఇటీవల ఒకేసారి పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఎంపీడీవోల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉండడంతో కిందిస్థాయి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇక సాధారణ నిబంధనల ప్రకారం మండలాల్లో ఎంపీడీవో పోస్టుల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు మూడు మార్గాల్లో వాటిని భర్తీచేస్తుంటారు. మొత్తం ఖాళీల్లో 30 శాతం పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేస్తారు. మిగిలిన పోస్టులను ఈవోపీఆర్డీలు.. జెడ్పీలు, ఎంపీడీవో ఆఫీసుల్లో ఏవోలుగా పనిచేసే వారికి పదోన్నతుల ద్వారా భర్తీచేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, 20 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తీర్ణులైన 45 మందిని నేరుగా ఎంపీడీవోలుగా నియమించింది. మిగిలిన వాటిలో సుమారు 220 ఎంపీడీవో పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు ఇప్పుడు అధికారులు చర్యలు చేపట్టారు. నెలాఖరుకల్లా సీనియారిటీ జాబితాలు.. ఇక సెప్టెంబరు మొదటి వారానికల్లా ఈ పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసేందుకు పంచాయతీరాజ్ శాఖాధికారులు కార్యాచరణను సిద్ధంచేసుకున్నారు. ఇందులో భాగంగా.. జోన్ల వారీగా ఈఓపీఆర్డీలు, ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైంది. సెప్టెంబరు నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తయితే, అక్టోబరులో డిపార్ట్మెంటల్ పదోన్నతుల కమిటీ ద్వారా పదోన్నతులు పొందే వారి తుది జాబితాలను అధికారులు రూపొందిస్తారు. నవంబరు ఐదో తేదీ కల్లా పదోన్నతులు పొందిన అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కూడా ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. -
ఇటు పరిశుభ్రం.. అటు రాబడి
దాదాపు రెండు వేల జనాభా ఉండే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 15 రోజుల నుంచి వర్మీ కంపోస్టు తయారీ మొదలైంది. మే నుంచి ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తను 45 రోజుల పాటు కుళ్లబెట్టి వర్మీ కంపోస్టును తయారు చేస్తున్నారు. సేకరించిన చెత్తలో అట్టముక్కలు, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు వస్తువులు వంటి పొడి చెత్తను వేరు చేసి 217 కిలోలు విక్రయించారు. వీటిపై వచ్చిన రూ.2,800ను గ్రామ పంచాయతీకి జమ చేశారు. పల్నాడు జిల్లాలో గ్రామ పంచాయతీలు తయారు చేసే వర్మీని ‘పల్నాడు వర్మీ’ అనే బ్రాండ్ నేమ్‌తో మార్కెటింగ్ చేసేందుకు జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల అనుమతి కోరారు. పల్నాడు జిల్లాలో 527 గ్రామ పంచాయతీలు ఉండగా 83 గ్రామాల్లో పూర్తి స్థాయిలో వర్మీ కంపోస్టు తయారీ ప్రారంభమైంది. అలాగే 186 గ్రామాల్లో తయారీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. సాక్షి, అమరావతి: ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 2న ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాలు పరిశుభత్రతో కళకళలాడుతున్నాయి. మరోవైపు సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ చేయడం ద్వారా మంచి ఆదాయం కూడా పొందుతున్నాయి. జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభించాక రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తతో దాదాపు 1,314 టన్నుల వర్మీ కంపోస్టును తయారుచేశాయి. అంతేకాకుండా ఇందులో 742 టన్నులను విక్రయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. 4,043 గ్రామాల్లో సేకరించిన చెత్తను.. అవే గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తలను వేరు చేసి.. తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ చేస్తున్నారు. అలాగే పొడి చెత్తను నేరుగా విక్రయిస్తున్నారు. ఆయా గ్రామాల్లో సేకరించిన చెత్తలో ఇప్పటిదాకా 1290.544 టన్నుల పొడి చెత్తను అమ్మారు. వర్మీ కంపోస్టు, పొడి చెత్త అమ్మకం ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు రూ.1.41 కోట్ల ఆదాయం సమకూరిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెటింగ్ వ్యూహాలపై అధికారుల కసరత్తు.. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వర్మీకంపోస్టు తయారీ ప్రారంభమైతే ఒకట్రెండు సంవత్సరాల్లోనే 20–30 రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మీ కంపోస్టును సకాలంలో అమ్మడానికి ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహం అవసరమని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కొన్ని మార్కెటింగ్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో తయారుచేస్తున్న వర్మీ కంపోస్టును పల్నాడు బ్రాండ్ పేరుతో విక్రయించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ స్థాయిలోనే స్థానిక రైతులు వర్మీ కంపోస్టును కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటల సాగులో వర్మీ కంపోస్టు వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై మరింత అవగాహన కల్పించనున్నారు. అలాగే భవిష్యత్‌లో ప్లాస్టిక్, గాజు వ్యర్థాలను రోడ్ల తయారీలో, సిమెంట్ పరిశ్రమలో వినియోగించేలా చర్యలు మొదలుపెట్టారు. ప్రతివారం సమీక్ష ఒకప్పుడు అపరిశ్రుభ వాతావరణం కారణంగా గ్రామాల్లో మలేరియా, టైఫాయిడ్ వంటివి సంభవించేవి. ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో వీటికి అడ్డుకట్ట పడింది. వారంలో ఒక రోజు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో ఈ కార్యక్రమ పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో చెత్తను సేకరించే ప్రక్రియ ప్రారంభం కావడంతో.. సేకరించిన చెత్తను తుది దశకు చేర్చడంపై దృష్టిసారిస్తున్నారు. అక్టోబర్ 2 నాటికి అన్ని గ్రామాల్లో వర్మీ తయారీ.. అక్టోబర్ 2 నాటికి అన్ని గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం.. ఆ చెత్తను ఆ గ్రామంలో నిర్మించిన షెడ్లకు తరలించి వర్మీ తయారు చేయడం.. వేరు చేసిన పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. తర్వాత వర్మీ కంపోస్టు కామన్ బ్రాండ్ నేమ్ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. – కోన శశిధర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ -
గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరుగా ఆస్తి పన్ను!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరు ఇంటి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది. పట్టణాలు, నగరాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి వేర్వేరు పన్ను విధానం అమలులో ఉంది. గ్రామాల్లో ప్రస్తుతం ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు ఒకే రకమైన ఇంటి పన్నును వసూలు చేస్తున్నారు. అయితే, గ్రామ పంచాయతీలు తమ అవసరాలకు సరిపడా ఆదాయాన్ని అవే సమకూర్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పలుమార్లు రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సామాన్య ప్రజలపై ఏ మాత్రం అదనపు భారం పడకుండా నివాసిత ఇళ్లకు ఇప్పుడు అమలులో ఉన్న ఇంటి పన్ను విధానాన్నే కొనసాగించనున్నారు. వ్యాపార అవసరాలకు ఉపయోగించే ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు మాత్రం కొత్త ఇంటి పన్ను విధానం అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. అయితే, వ్యాపార దుకాణాలకు ఎంత ఇంటి పన్ను విధించాలన్న దానిపై పంచాయతీరాజ్ శాఖే ఒక ప్రాతిపదికను నిర్ధారించనుంది. దీని ఆధారంగా సంబంధిత గ్రామ పంచాయతీలు వ్యాపార దుకాణాలకు పన్ను నిర్ణయించుకునేలా కార్యాచరణను సిద్ధం చేశారు. ముందుగా సర్వే.. గ్రామాలవారీగా ఎన్ని వ్యాపార దుకాణాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏప్రిల్ మొదటి వారంలో అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించనుంది. పంచాయతీ, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది. వ్యాపార అవసరాలకు నిర్మించిన షాపులతోపాటు నివాసిత ఇళ్లకు అనుబంధంగా ఆ ఇంటిలోనే నిర్వహిస్తున్న దుకాణాల వివరాలను వేర్వేరుగా సేకరించనున్నారు. సర్వే అనంతరం తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో భారీ వడ్డన నిబంధనల ప్రకారం.. గ్రామాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇంటి పన్నును సవరించాల్సి ఉంది. అయితే, 1996 తర్వాత ఇప్పటివరకు పన్ను సవరణ జరగలేదు. దీనికి బదులుగా 2001 నుంచి ఏటా పాత పన్నుపై ఐదు శాతం చొప్పున పెంచే విధానం అమలవుతోంది. కాగా, గత ప్రభుత్వ హయాంలో 2017–18 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో అప్పటి ఇళ్ల విలువ ఆధారంగా కొత్త ఇంటి పన్నును నిర్ధారించే ప్రక్రియను చేపట్టారు. దీంతో ఆ జిల్లాలో ఒక్కో యజమాని చెల్లించాల్సిన పన్ను అంతకు ముందున్న ఇంటి పన్నుకు ఐదారు రెట్లు పెరిగిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పశ్చిమ గోదావరి జిల్లాలో మాదిరిగా రాష్ట్రమంతా అన్ని గ్రామాల్లో ఇంటి పన్ను పెంపునకు కసరత్తు చేపట్టారు. ఇందుకుగాను 2018లో ప్రిస్ సర్వే పేరిట ప్రతి ఇంటి కొలతలు తీసుకున్నారు. వాటికి ఆ గ్రామంలోని మార్కెట్ ధరను కలిపి ఆ వివరాలన్నింటినీ అన్లైన్లో నమోదు చేశారు. అయితే, 2018 ఆగస్టులో సర్పంచుల పదవీ కాలం ముగియడం, సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ఇంటి పన్ను అమలును టీడీపీ ప్రభుత్వం వాయిదా వేసింది. -
నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ చైర్మన్లు
సాక్షి, అమరావతి: జిల్లాల పునర్విభజన పూర్తయిన వెంటనే ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్ (జెడ్పీ)లను 26 జెడ్పీలుగా విభజించి, కొత్తగా ఏర్పాట య్యే జిల్లాలకు వేరుగా జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ దిశగా కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగి ఐదు నెలలైంది. 13 జిల్లాల్లో ఒక్కో జెడ్పీ చైర్మన్, ఇద్దరేసి వైస్ చైర్మన్ల చొప్పున గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా పదవులకు ఎన్నికైన వారు మరో నాలుగున్నర ఏళ్లకు పైనే ఆ పదవుల్లో కొనసాగాల్సి ఉంది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా సుదీర్ఘ కాలం పాటు పాత జిల్లా ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్లను కొనసాగించడం మంచిది కాదనే అభిప్రాయంతో ప్రభుత్వం కొత్త జెడ్పీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అప్పట్లో తెలంగాణలో భిన్న పరిస్థితులు మన పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా అప్పటికే ఉన్న జెడ్పీ చైర్మన్లే పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. ఆ రాష్ట్రంలో 2016 దసరా రోజున కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అంతకు ముందు 10 జిల్లాలుగా ఉండే తెలంగాణ రాష్ట్రం జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాలుగా మారిపోయింది. 2014లో ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్లే 2019లో వారి పూర్తి పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. అయితే రాజకీయంగా ఆ రాష్ట్రానికి, మన రాష్ట్రానికి మధ్య చాలా తేడా ఉందని, ఈ దృష్ట్యా కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో తెలంగాణలో కొత్త జిల్లాలకు అనుగుణంగా వెంటనే జెడ్పీల విభజన చేపట్టడానికి పలు చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేదనేది ఒక కారణం అని తెలుస్తోంది. అప్పట్లో తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్ల కచ్చితంగా అధికార టీఆర్ఎస్ వారే చైర్మన్లుగా గెలుస్తారో లేదో అన్న సంశయంతో పాత జెడ్పీలనే కొనసాగించారని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తోడు జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం అప్పటికి మరో రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండడం వల్ల కూడా జెడ్పీల విభజన జోలికి పోలేదని సమాచారం. అయితే మన రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా 26 జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలను విభజిస్తే అన్ని చోట్ల అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉందనే విషయాన్ని గమనించాలని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఈ దృష్ట్యా కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఏజీకి లేఖ.. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం మధ్యలో కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియలో న్యాయ పరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా.. అని నిర్ధారించుకోవడానికి పంచాయతీ రాజ్ శాఖ న్యాయ సలహాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాశారు. మరోవైపు జిల్లాల పునర్విభజన జరిగిన వెంటనే కొత్త జిల్లాల వారీగా జెడ్పీలను విభజిస్తే.. జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి వంటి అదనపు పోస్టుల కల్పనకు కూడా పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
‘రియల్’ మోసాలకిక కళ్లెం
సొంతిల్లు కట్టుకోవడానికి తొలుత కాసింత స్థలం సమకూర్చుకోవాలన్నది సగటు మధ్యతరగతి కుటుంబం కల. ఈ కలను ఆసరాగా తీసుకుని కొందరు అక్రమార్కులు అక్రమ లే అవుట్లతో అందినకాడికి దోచుకుని, అమాయక ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి నగరాలు, పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సరైన అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు అందులో ఇల్లు కట్టుకోలేక, ఆ స్థలాన్ని తిరిగి అమ్ముకోలేక పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కష్టాలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోనూ కొన్నేళ్లుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏ సౌకర్యం లేని చోట ప్లాట్ కొని ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అక్రమ లే అవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా కట్టడికి ఉపక్రమించింది. కనీసం రోడ్డు, కరెంటు లైన్, మంచి నీటి వసతి కూడా లేని అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొని సామాన్య ప్రజలు మోసపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధిస్తూ తాజాగా ఆదేశాలుగా జారీ చేసింది. మరోవైపు ఒక వేళ ఇప్పటికే ఆ అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొన్న వారు సైతం నష్టపోకుండా.. ఈ అంశంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ లే అవుట్లను నియంత్రించడంతో పాటు వాటిలో ఇళ్ల ప్లాట్లను కొనుగోలు చేసే వారు మోసపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో తగిన సూచనలు చేయాలంటూ ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూముల్లో ఇళ్ల ప్లాట్ల లే అవుట్లు వేయడం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. గత పదేళ్ల కాలంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 431 మండలాల పరిధిలోని 3,716 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 78,303 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఇళ్ల నిర్మాణం కోసం 15,783 లే అవుట్లు కొత్తగా వెలిశాయి. అందులో 37,684 ఎకరాల్లో వేసిన 10,169 లే అవుట్లు అక్రమంగా వేసినవని పంచాయతీరాజ్ శాఖ ఇటీవల నిర్ధారించింది. ఇలాంటి అక్రమ లే అవుట్లలో 2,54,854 ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి. 2015 నాటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 6,049 అక్రమ లే అవుట్లు ఉన్నాయని అప్పటి అధికారులు గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోకుంటే ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నష్టపోయే ప్రమాదం ఉందని నివేదికలు ఇచ్చినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ తర్వాత కూడా గ్రామాల్లో అక్రమ లే అవుట్ల దందా యధావిధిగా కొనుసాగింది. పర్యవసానంగా 2019 నాటికి అక్రమ లే అవుట్ల సంఖ్య 9,422కు పెరిగింది. 90 శాతం వాటిలో కరెంటు లైను కరువు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,169 అక్రమ లే అవుట్లలో కేవలం 4,179 లే అవుట్లకు మాత్రమే రోడ్డు వసతి ఉంది. కేవలం 362 లేఅవుట్లకు మాత్రం మంచి నీటి సరఫరా సౌకర్యం అందుబాటులో ఉంది. 814 లే అవుట్లకు కరెంటు లైను వసతి ఉన్నట్టు అధికారులు తేల్చారు. అంటే 9,355 అక్రమ లే అవుట్లకు కరెంటు లైను కూడా లేదు. నిబంధనల ప్రకారం.. అనుమతులు పొందిన లే అవుట్లకు మాత్రమే కొత్తగా రోడ్డు వసతితోపాటు కరెంటు లైను, మంచి నీటి పైపులైను ఏర్పాటుకు ప్రభుత్వం, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలు, గ్రామ పంచాయతీలు ముందుకొస్తాయి. అనుమతులు పొందని వాటికి ఆ వసతుల కల్పనకు ఆటంకాలు ఉంటాయి. ఇళ్ల కోసం కొత్తగా ఎలాంటి లే అవుటు ఏర్పాటు చేయాలన్నా, ముందుగా సంబంధిత గ్రామ పంచాయతీ అనుమతి పొందడంతో పాటు లే అవుటు ప్లానింగ్‌కు సంబంధించి డీటీసీపీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమిలో లే అవుటు ఏర్పాటు చేస్తుంటే దానికీ వేరుగా అనుమతులు తీసుకోవాలి. ఈ సమయంలో లే అవుట్ల విస్తీర్ణం ప్రకారం నిబంధనల మేరకు వెడల్పైన అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలి. మొత్తం లే అవుట్ల విస్తీర్ణంలో పది శాతం భూమిని సంబంధిత గ్రామ పంచాయతీకి బదలాయించాల్సి ఉంటుంది. ఆ ప్రాంత స్థానికుల అవసరాల మేరకు భవిష్యత్‌లో అక్కడ పాఠశాల, పార్కు, మంచి నీటి ట్యాంకు వంటి వాటి ఏర్పాటుకు వీలుంటుంది. నగరాలు, పట్టణాల పక్కన ఉండే గ్రామాల్లోనే.. నగరాలు, పెద్ద పట్టణాలను ఆనుకొని ఉండే గ్రామాల్లోనే అక్రమ లే అవుట్ల దందా పెద్ద ఎత్తున సాగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 37,684 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు విస్తరించి ఉండగా, అందులో నగరాలు, పెద్ద పట్టణాలు ఆనుకొని ఉన్న గ్రామాల్లోనే 29,075 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు ఉన్నాయని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన గ్రామాల్లో కేవలం 8,609 ఎకరాల్లో ఈ అక్రమ లే అవుట్లు ఉన్నాయి. -
‘పంచాయతీరాజ్’లో పదోన్నతులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శుల నుంచి ఎంపీడీవోల వరకు పదోన్నతులు దక్కనున్నాయి. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 52 డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పోస్టులతో పాటు జిల్లాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న డిప్యూటీ జెడ్పీ సీఈవో పోస్టులలో ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించనున్నారు. ఇందుకోసం సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 128 ఎంపీడీవో పోస్టుల్లో మండల స్థాయిలో పనిచేసే ఈవోపీఆర్డీలతో పాటు జెడ్పీ, ఎంపీపీ కార్యాలయాల్లోని అడ్మినిస్ట్రేటివ్ అధికారుల(సూపరిండెంట్లు)కు పదోన్నతి కల్పిస్తున్నారు. ప్రస్తుతం 4 జోన్ల పరిధిలో 45 ఈవోపీఆర్డీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా ఈవోపీఆర్డీలకు పదోన్నతుల ద్వారా అదనంగా చేరే పోస్టుల్లో గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులతో పాటు జెడ్పీ, ఎంపీపీ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేసే వారికి పదోన్నతి కల్పించనున్నారు. ఏపీలోని 4 జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లోకి గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శులు.. గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లోకి గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ దక్కనుంది. -
చెత్త నుంచి సంపద సృష్టించిన గ్రామాలు
సాక్షి, అమరావతి: చెత్తే కదాని తేలిగ్గా తీసి పడేయకండి.. ఎందుకంటే ఇప్పుడది సంపదను సృష్టించే వనరుగా మారింది. దాని నుంచి వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తూ ఆయా గ్రామ పంచాయతీలు ఆదాయార్జనకు బాటలు వేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ పంచాయతీ గడిచిన మూడు నెలల్లో ఇలా రూ.1,62,800 ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను వర్మీ కంపోస్ట్‌గా మారుస్తూ.. దానిని రైతులకు అమ్ముతూ ఆ డబ్బును కూడబెట్టాయి. ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 198 గ్రామ పంచాయతీలు ఇలా చెత్త నుంచి వర్మీ కంపోస్ట్, అమ్మకం ద్వారా రూ.14,06,994ను సంపాదించాయి. క్లీన్ ఆంధ్రప్రదేశే లక్ష్యంగా గతేడాది అక్టోబర్ రెండో తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించాక.. పట్టణాల తరహాలో గ్రామాల్లోనూ చెత్త సేకరణ ప్రక్రియ మొదలైంది. గ్రామాల్లో చెత్త సేకరణకు అవసరమైన ఆటో రిక్షాలు, ఇతర సామగ్రిని ప్రభుత్వమే సమకూర్చడంతో పాటు చెత్త సేకరణలో పనిచేసే క్లాప్ మిత్రలకు గౌరవ వేతనాలనూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 98.73 లక్షల ఇళ్లు ఉన్నట్టు అంచనాకాగా, వాటిలో 95.63 లక్షల ఇళ్ల నుంచి ఇప్పటికే రోజు వారీ చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బంది సేకరిస్తున్నారు. ఇక ఆ చెత్త నుంచి వర్మీ తయారీపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. 198 గ్రామాల్లో ఇప్పటికే వర్మీ తయారీ అమ్మకాలు మొదలు కాగా.. రానున్న వారం రోజుల్లో మరో 656 గ్రామాల్లో వర్మీ తయారీ, అమ్మకాల ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 40 రోజుల్లో వర్మీ రెడీ చెత్తను వర్మీగా తయారు చేసేందుకు కనీసం 40 రోజులు పడుతుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను గ్రామాల్లో ప్రభుత్మం నిర్మించిన సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లకు తరలిస్తారు. ఇప్పటికే ఉన్న షెడ్లకు తోడు ప్రభుత్వం కొత్తగా మరో 1,794 గ్రామాల్లో షెడ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ షెడ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొట్టెల్లో ఆ చెత్తను వేసి, దానిపై వాన పాములను ఉంచుతారు. ఆ తర్వాత వాటిపై గోనె పట్టలను ఉంచి ఎప్పటికప్పుడు వాటిని తడిచేస్తూ నిర్ణీత ఉష్ణోగత్ర కొనసాగేలా జాగ్రత్తలు చేపడతారు. 40 రోజుల తర్వాత వాన పాములు ఉంచిన ఆ చెత్త మిశ్రమం వర్మీగా మారుతుందని అధకారులు చెబుతున్నారు. కిలో వర్మీ రూ.10 చెత్త నుంచి తయారు చేసిన వర్మీని కిలో రూ.10 చొప్పన అమ్మాలని పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సూచనలిచ్చింది. ప్రస్తుతం చాలా తక్కువ గ్రామాల్లో వర్మీ తయారీ ప్రక్రియ మొదలవడంతో.. తయారైన కొద్దిపాటి వర్మీ అమ్మకానికి పెద్దగా ఇబ్బందుల్లేవని అధికారులంటున్నారు. స్థానిక రైతులతో పాటు ఇళ్లల్లో మొక్కలు పెంచుకునే వారు కూడా వర్మీని కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వర్మీ తయారీ ప్రక్రియ ఊపందుకుని, పెద్ద మొత్తంలో అందుబాటులోకొస్తే.. అప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్మేందుకు ఇప్పటికే వ్యవసాయ శాఖ అనుమతి కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. అన్ని గ్రామాల్లో మొదలైతే రూ.300 కోట్ల వరకూ ఆదాయం పంచాయతీరాజ్ శాఖ ముందస్తుగా తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి వర్మీ తయారీ ప్రక్రియ మొదలైతే గ్రామ పంచాయతీల ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ తరహా వర్మీ తయారీ ద్వారానే గ్రామాలకు ఏటా రూ.300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. -
లేఅవుట్లపై ‘అక్రమ’ రాతలు!! ‘ఈనాడు’ మార్కు రాతలకు పరాకాష్ట
సాక్షి, అమరావతి: అదేంటో!! చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోతే... రామోజీకి, ఆయన ‘ఈనాడు’ పత్రిక చూపులు భలే పదునెక్కిపోతాయి. అప్పటిదాకా మూసుకుపోయినా... ఒక్కసారిగా తెరుచుకుంటాయి. పాపం చూపు బాగయితే ఇబ్బందేమీ లేదు!. కానీ... అప్పుడు చూసినవన్నీ అంతకు ముందు లేవనుకోవటంతోనే చిక్కంతా!!. ‘అక్రమ లేఅవుట్లకు రాజకీయ అండ’ అని ఆదివారం నాడు మొదటి పేజీలో వండేసి అచ్చోసిన కథనం కూడా ఇలాంటిదే. పోనీ ఆ అంకెలైనా సరిగా వేశారా అంటే... అవీ తప్పులే. మన ప్రభుత్వం కాదు కాబట్టి ఎంత బురదయినా చల్లొచ్చనుకునే దుర్మార్గపు రాతలకు పరాకాష్ట ఆ అంకెలు. ‘ఈనాడు’ మరీ దిగజారిపోయి రాసిన ఈ రాతల్లో ఏ కొంచెమైనా నిజముందా? అసలేది నిజం? ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడి హయాంలో విచ్చలవిడిగా వెలసిన అక్రమ లే అవుట్లతో కలిపి... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనుమతుల్లేని లేఅవుట్ల సంఖ్య సాక్షాత్తూ 10,160. వీటిలో 3,551 వరకూ గ్రామాల్లో ఉండగా... మిగిలినవి అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం లే అవుట్లు 37,684 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయని... వీటిలో దాదాపు 2.54 లక్షల ప్లాట్లున్నాయని ఇటీవల ప్రభుత్వాధికారులే ఓ నివేదికను తయారు చేశారు. అక్రమ లే అవుట్లకు మంచినీరు, కరెంటు వంటి సదుపాయాలుండవు కాబట్టి... అక్కడి ప్లాట్ల యజమానులకు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేస్తే బాగుంటుందనే అంశాన్ని ఇటీవల మంత్రుల బృందం సమగ్రంగా చర్చించింది. అధికారుల నివేదిక మొత్తాన్ని పరిశీలించింది. మరి ఇదే నివేదికలోని అంశాలను ‘ఈనాడు’ తప్పులెందుకు రాసింది? మొత్తం లే అవుట్ల సంఖ్యను 10వేలకు బదులు 13,711గా... 37వేల ఎకరాలకు బదులు 47వేల ఎకరాలుగా ఎందుకు రాసింది? ఎందుకంటే ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు కాబట్టి ఎంత బురదయినా చల్లొచ్చనేది దాని సిద్ధాంతం. ఇంకో చిత్రమేంటంటే... ఈ లే అవుట్లన్నీ ఇప్పుడే వెలసినట్లు... వాటన్నిటినీ అధికార పార్టీకి చెందిన నాయకులు కాపాడుతున్నట్లు ఇష్టం వచ్చినట్లు రాసి పారేసింది. ఈ అక్రమ లే అవుట్లపై కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారని, వీటివల్ల పంచాయితీలు, నగరాభివృద్ధి సంస్థలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని కూడా శోకాలు పెట్టింది. చంద్రబాబు నివేదికను ప్రస్తావించరేం? నిజానికి చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక అక్రమ లే అవుట్లు ఇష్టానుసారం వెలిశాయి. పెద్ద సంఖ్యలో నేతల అండతో అనుమతుల్లేని లే అవుట్లు పుట్టుకొచ్చాయి. దీనిపై 2015లో అప్పటి అధికారులు నాటి సీఎం చంద్రబాబునాయుడికి నివేదిక ఇస్తూ... రాష్ట్రంలో అప్పటికి 6,049 అక్రమ లే అవుట్లున్నాయని పేర్కొన్నారు. వాటిపై చర్యలు తీసుకోకుంటే కొనుగోలుదారులు నష్టపోతారని కూడా తెలిపారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న పాపానే పోలేదు. ఆ తరవాతైనా అక్రమ లే అవుట్లకు అడ్డుకట్ట పడిందా అంటే... దాదాపు శూన్యం. దీంతో 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి ఈ సంఖ్య ఏకంగా 9.422 వరకూ చేరింది. పాపం రామోజీకి, ‘ఈనాడు’కు అప్పట్లో చూపు మందగించి ఇవేవీ కనిపించలేదు. వీటిపై వార్తలు వస్తే ఒట్టు!!. మంత్రుల బృందం చర్యలు... కొత్తగా వచ్చే లే అవుట్లకు రోడ్డు, కరెంటు, మంచినీరు వంటి వసతుల కల్పన అంశంలో గ్రామ పంచాయతీల నుంచి ఆ శాఖ కమిషనర్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులొచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టిపెట్టింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు కొద్దినెలల క్రితం గ్రామాల్లో అక్రమ లేఅవుట్లను జల్లెడపట్టే ప్రక్రియ ప్రారంభించారు. దీనికోసం గ్రామాల వారీగా ఆయా మండల ఈఓపీఆర్డీ, సదరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఓ జూనియర్ అసిస్టెంట్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 37,684 ఎకరాల్లో వేసిన 10,169 లేఅవుట్లు అనుమతులు లేనివేనని పంచాయతీరాజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. ఈ అక్రమ లేఅవుట్లలో మొత్తం 2,54,854 ప్లాట్లు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ ప్లాట్లు చాలావరకూ ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయన్నది అధికారుల మాట. ఈ 10,169 అక్రమ లే అవుట్లలో 4,179 లేఅవుట్లకు రోడ్డు వసతి ఉండగా, 362 లేఅవుట్లకే మంచినీటి సరఫరా వసతి ఉంది. 814 లేఅవుట్లకు మాత్రమే కరెంటు లైను ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ లే అవుట్ల విషయంలో ఎలా ముందుకెళ్లాలి? వీటిని నియంత్రించటంతో పాటు ప్లాట్ల కొనుగోలుదారులు మోసపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాన్ని పెద్దిరెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ చర్చించింది కూడా. త్వరలో వీరు సీఎంకు నివేదించాక తదుపరి చర్యలేంటన్నది తెలిసే అవకాశముంది. కాకపోతే ‘ఈనాడు’ మాత్రం ఈ వాస్తవాలన్నిటికీ ముసుగేసి... ఇవన్నీ ఇప్పుడే వెలసినట్లు... అధికార పార్టీ అండదండలతో పెరిగిపోతున్నట్లు పాఠకులను తప్పుదోవ పట్టించేలా వార్తలు రాయటాన్ని ఏమనుకోవాలి? ఇది ఏ మార్కు జర్నలిజం రామోజీ? -
గ్రామాల్లో పారిశుధ్యంపై ‘యాప్’
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ సిద్ధం చేసింది. తమ ఇళ్ల పరిసరాల్లో అపరిశుభ్రతపై స్థానికులు మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా సర్పంచ్ ఆధ్వర్యం లో సంబంధిత పంచాయతీ కార్యదర్శి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టింది. గ్రామాలను పరి శుభ్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకునే చర్యల ఆధా రంగా పంచాయతీ కార్యదర్శుల పనితీరుకు రేటింగ్ ఇవ్వనున్నారు. యాప్ ద్వారా అందే ఫిర్యాదుల పరి ష్కారంపై పర్యవేక్షణకు జిల్లా డీపీవో కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూంలతో పాటు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయంలో మరొకటి ఇప్పటికే ఏర్పాటయ్యాయి. ఫిర్యాదు అందిన తర్వాత 72 గంటలపాటు కంట్రోల్ రూం ద్వారా పర్య వేక్షిస్తారు. పరిష్కరించిన తర్వాత ఫిర్యాదుదారుడికి ఎస్ఎంఎస్ ద్వారా వివరాలు తెలియజేస్తారు. ఒకవే ళ సంతృప్తి చెందకున్నా, పంచాయతీ కార్యదర్శి ఉన్నతాధికారులకు సరైన సమాచారం ఇవ్వకున్నా మరోసారి ఫిర్యాదు చేసే వీలుంది. ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వచ్చే పంచాయతీ కార్యదర్శి పనితీరుపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటారు. అతి త్వరలో అందుబాటులోకి యాప్.. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ‘జేఎస్ఎస్’ పేరుతో ఇప్పటికే మొబైల్ యాప్ సిద్ధమైంది. రెండు మూడు రోజుల్లో ప్లే స్టోర్ ద్వారా యాప్ అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. తప్పుడు ఫిర్యాదులకు అవకాశం లేకుండా అప్పటికప్పుడు తీసిన ఫోటో లేదా చిన్నపాటి వీడియోను మాత్రమే ఫిర్యాదుతో జోడించేలా యాప్‌ను రూపొందించారు. యాప్ ద్వారా పంపిన ఫిర్యాదు వెంటనే సంబంధిత గ్రామ కార్యదర్శికి చేరుతుంది. 24 గంటల తర్వాత మండల స్థాయి ఈవోపీఆర్డీకి, 48 గంటల తర్వాత జిల్లా డీపీవో కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం వద్దకు ఆటోమెటిక్‌గా సమాచారం అందుతుంది. ఏ అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు? క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా గ్రామాలను సైతం పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభించిన విషయం తెలిసిం దే. పల్లెల్లోనూ ప్రతి ఇంటినుంచి చెత్తసేకరణ కార్య క్రమాన్ని చేపడుతున్నారు. తమ ఇళ్ల నుంచి నిర్ణీత గడువు ప్రకారం రోజువారీ చెత్తను సేకరించక పో యినా, రోడ్లపక్కన ఒకేచోట పెద్దమొత్తంలో పేరుకు పోయినా, మురుగు కాల్వలు సక్రమంగా లేకున్నా, మురుగునీటి గుంతలున్నా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వీలుంది. ఫిర్యాదులో వివరాలు నమోదు చేసేలా వీలు కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతో.. గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీలకు అవసరమైన సామగ్రిని ప్రభుత్వ మే అందజేస్తోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరణకు ట్రై సైకిళ్లు, ఆటో రిక్షాలు లాంటివి అన్ని గ్రామాలకు సరఫరా చేసింది. అక్టోబరు 2న జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభమైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 55.41 లక్షల ఇళ్ల నుంచి రోజువారీ చెత్త సేకరణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరుగుదొడ్లను శుభ్రం చేసే హై ప్రెజర్ క్లీనర్స్, దోమల నివారణకు ప్రతి గ్రామానికి ఒక ఫాగింగ్ మిషన్, ఇతర యంత్రాల సరఫరాకు చర్యలు చేపట్టారు. 2022 డిసెంబరు వరకు పంచాయతీరాజ్‌శాఖ పర్యవేక్షించే ఈ కార్యక్రమాలు తర్వాత పంచాయతీ, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతాయి. -
ఫోన్ కొట్టు.. అవినీతి ఆటకట్టు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. అవినీతికి ఆస్కారం లేని, పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రెండేళ్లుగా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. బాధితులు టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫోన్ చేస్తే చాలు క్షణాల్లోనే యాక్షన్‌లోకి దిగిపోతోంది. ఫిర్యాదుల తీరును బట్టి తగిన చర్యలు తీసుకుంటోంది. అవినీతి ఆరోపణలు వాస్తవమని తేలితే కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల అవినీతిపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏసీబీ ‘స్పందన’ వ్యవస్థను విజయవంతంగా నిర్వహిస్తోంది. 97 శాతం కేసులు నిర్ణీత వ్యవధిలో పరిష్కారం బాధితుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించడంపై ఏసీబీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అందుకోసం విశాఖపట్నంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్ 14400 కేటాయించింది. బాధితులు ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే విజయవాడలోని ఏసీబీ ప్రధాన కా ర్యాలయానికి వెంటనే సమాచారమిస్తారు. ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆరోపణల తీరును బట్టి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరిస్తున్నారు. సాధారణ ఫిర్యాదులైతే 10 రోజులు, లోతుగా దర్యాప్తు చేయాల్సిన ఫిర్యాదులైతే నెల రోజుల్లో పరిష్కరించాలన్నది గడువు. 2019 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ 4 వరకు 97% ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం విశేషం. ఇప్పటివరకు 5,155 ఫిర్యాదులు రాగా.. వాటిలో నిర్ణీత గడువులోగా ఏకంగా 5,037 ఫిర్యాదులను ఏసీబీ పరిష్కరించింది. కేవలం 118 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి కూడా ఇంకా గడువు ఉంది. ఏసీబీకి ఫిర్యాదు చేశారని తెలియగానే చాలా వరకు కేసులు పరిష్కారమైపోతున్నాయి. ప్రభుత్వం కఠినంగా ఉండటంతో సంబంధిత అధికారులు, ఉద్యోగులు తక్షణం బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నారు. కాగా, వచ్చిన ఫిర్యాదులను విచారించి అవినీతి ఆరోపణలు వాస్తవమని గుర్తించిన కేసుల్లో తదనుగుణంగా తక్షణం చర్యలు తీసుకుంటోంది. అత్యధిక ఫిర్యాదులు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల పైనే.. రెండేళ్లలో అధికారులు, ఉద్యోగుల అవినీతికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుల విషయంలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో, పంచాయతీరాజ్ శాఖ రెండో స్థానంలో ఉన్నాయి. రెవెన్యూ శాఖలో పట్టాదార్ పాస్ పుస్తకాలు, భూ రికార్డుల్లో తప్పుల సవరణ, సర్టిఫికెట్ల మంజూరు, భూముల సర్వేకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. పంచాయతీరాజ్ శాఖలో సర్టిఫికెట్ల జారీ, రుణాలు/పింఛన్లు/ఇళ్లపట్టాల మంజూరు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అంశాల్లో ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. -
వెలగబెట్టేశారు!
ఒక్క గ్రామంలోనే ఏటా రూ.25 వేలు ఆదా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని మాల్యవంతం గ్రామంలో ఐదు నెలల కిత్రం వరకు ఎల్ఈడీ వీధి దీపాలు 24 గంటలూ వెలుగుతుండేవి. గ్రామంలో 325 విద్యుత్ స్తంభాలుంటే ప్రతి నెలా 650 యూనిట్ల వరకు కరెంట్ వినియోగం అయ్యేది. 2018 జూలై నుంచి అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రైవేట్ కాంట్రాక్టర్ల అధీనంలో ఉన్న వీధి దీపాల నిర్వహణ బాధ్యతను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించడంతో గత జూలైలో వినియోగం 310 యూనిట్లకు తగ్గిపోయింది. అంటే ఒక్క గ్రామంలోనే నెలకు 340 యూనిట్లు ఆదా అవుతోంది. యూనిట్ రూ.6.05 చొప్పున పంచాయతీపై కరెంట్ బిల్లు భారం ప్రతి నెలా రూ.2,057 తగ్గింది. ఇలా ఒక్క పంచాయతీలోనే ఏడాదికి దాదాపు రూ.25 వేల వరకు ఆదా కానుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించినప్పటికీ ఏళ్ల తరబడి వీధి దీపాల కరెంట్ వృథా కారణంగా ఇంకా రూ.లక్షల్లో బకాయిలున్నట్లు పంచాయతీకి ప్రతి నెలా నోటీసులు అందుతున్నాయి. – సాక్షి, అమరావతి ఏం చేస్తున్నావురా వెంకన్నా...? మా అయ్య చేసిన అప్పులు తీరుస్తున్నా..! రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు ఇదే మాదిరిగా ఉంది. గత సర్కారు మోపిన అవినీతి గుదిబండ భారాన్ని మోయలేక గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ శాఖ సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలుండగా దాదాపుగా అన్ని గ్రామాల పరిస్థితి ‘మాల్యవంతం’ మాదిరిగానే ఉంది. 2018 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 9 నుంచి 13 లక్షల దాకా వీధి దీపాలు పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతూనే ఉండటమే దీనికి కారణం. వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం టీడీపీ సర్కారు నియమించిన కాంట్రాక్టర్లు నిర్వహణ బాధ్యతలను గాలికి వదిలేశారు. కనీసం పంచాయతీలకైనా అప్పగించకుండా నానా ఇబ్బందులకు గురి చేశారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వీధి దీపాల నిర్వహణ బాధ్యత నుంచి కాంట్రాక్టర్లను తప్పించి తిరిగి పంచాయతీలకు అప్పగించింది. పగటి పూట వృథాను నివారిస్తూ ప్రతి 20–30 వీధి దీపాలకు ఒక స్విచ్ బాక్స్ ఏర్పాటు చేసి పంచాయతీ సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యతలు కేటాయించారు. గత రెండు నెలలుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్విచ్ బాక్స్‌ల ఏర్పాటు చేపట్టారు. కర్నూలు మినహా మిగిలిన 12 జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో స్విచ్ బాక్స్‌ల ఏర్పాటు పూర్తైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రూ.వందల కోట్లు ఆదా.. వీధి దీపాలు రాత్రి 6.30 నుంచి తెల్లవారుజాము వరకు సగటున 11 గంటల పాటు వెలిగితే సరిపోతుంది. రోజంతా 24 వాట్ల ఎల్ఈడీ బల్బు అనవసరంగా వెలగడం వల్ల ఏడాదికి 114 యూనిట్లు అదనంగా వినియోగం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదంతా విద్యుత్తు వృథానే. వీధి దీపాల కరెంట్‌కు యూనిట్ రూ.6.05 చొప్పున బిల్లు చెల్లించాలి. పగలు కూడా వెలగడంతో ఒక్కో బల్బుకు ఏటా దాదాపు రూ.700 అదనంగా బిల్లు కట్టాల్సి వస్తోంది. 200 వీధి దీపాలుండే చిన్న పంచాయతీపై ఏటా రూ.1.40 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. పగటి పూట వెలిగే వీధి దీపాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలపై ఏటా రూ.70 కోట్ల మేర అదనపు భారం పడినట్లు అంచనా. 15 మంది ప్రైవేట్ కాంట్రాక్టర్లకు.. ఎల్ఈడీ బల్బుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ నెడ్‌క్యాప్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్టు గత సర్కారు పేర్కొంది. అయితే ఆ తర్వాత టీడీపీ పెద్దల అనుయాయులే కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఒప్పందాలు చేసుకున్నారు. 15 మంది కాంట్రాక్టర్లు జిల్లాలవారీగా పంచుకొని రాష్ట్రవ్యాప్తంగా 24.86 లక్షల ఎల్ఈడీ బల్బులు మార్పిడి చేశారు. వాటి పర్యవేక్షణ, మరమ్మతుల బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్‌దేనని ఒప్పందంలో ఉన్నప్పటికీ నిర్వహణను గాలికి వదిలేశారు. 13 లక్షల వీధి దీపాలకు స్విచ్ బాక్స్‌లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో నిరంతరం వెలిగి పెద్ద ఎత్తున విద్యుత్తు వృథా జరిగినట్లు అధికారులు తెలిపారు. రూ.3,800 కోట్లకు చేరిన బకాయిలు.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిన కరెంట్ బిల్లుల బకాయిలు రూ.3,800 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. కాంట్రాక్టర్ల నిర్వాకంతో వీధి దీపాలు నిరంతరం వెలగడం, ప్రతి నెలా అపరాధ రుసుము పేరుకుపోవడం భారీ బకాయిలకు కారణం. 2018 ఆగస్టు నుంచి పంచాయతీల్లో సర్పంచుల పాలన ముగిసి ప్రత్యేకాధికారుల కొనసాగిన సమయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రూ.వెయ్యి బల్బుకు రూ.6,000 పంచాయతీల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ట్యూబ్‌లైట్ వీధి దీపాలను అధిక విద్యుత్తు వినియోగం జరుగుతోందంటూ గత సర్కారు 2017లో తొలగించి ఎల్డీఈ బల్బులు ఏర్పాటు చేసింది. పంచాయతీలపై రూపాయి భారం పడకుండా వీటిని సమకూరస్తున్నట్లు నాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఎల్ఈడీ బల్బుల వల్ల ఆదా అయ్యే విద్యుత్ బిల్లులో 80 శాతాన్ని సంబంధిత పంచాయతీలు కాంట్రాక్టర్లకు చెల్లించాలంటూ మెలిక పెట్టారు. ఒక్కో బల్బుకు మూడు నెలలకు ఒకసారి రూ.150 చొప్పున ఏడాదికి రూ.600 పదేళ్ల పాటు కాంట్రాక్టర్‌కు చెల్లించాలని ప్రభుత్వం షరతు విధించింది. రూ.1,000 విలువైన ఎల్ఈడీ బల్బుకు గ్రామ పంచాయతీ పదేళ్ల పాటు దాదాపు రూ.6,000 కాంట్రాక్టర్లకు చెల్లించేలా గత సర్కారు ఒప్పందం చేసుకుంది. -
సీఎంకు పంచాయతీరాజ్ శాఖ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం వారు సీఎం జగన్‌ను కలిశారు. -
Andhra Pradesh: ఆ ఊళ్లన్నీ ఏకతాటిపై..
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల కేంద్రంలో అత్యధికంగా మత్స్యకార కుటుంబాలే నివశిస్తుంటాయి. ఆ గ్రామంలో దాదాపు 19 వేల జనాభా ఉంది. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామంలో ఉండే 18 వార్డు సభ్యులతో పాటు సర్పంచి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. ఎవరెన్ని చెప్పి చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా, ఈ ఊళ్లో వారి పప్పులు ఉడకలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య వివిధ రూపాల్లో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవడంలేదని మొన్నటి స్థానికసంస్థల ఎన్నికల్లో తేటతెల్లమైంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు ఈ పరిణామం అద్దం పట్టింది. పదివేలకుపైగా జనాభా ఉండే 11 పెద్ద గ్రామాల్లో సైతం ప్రజలు ఒకే పక్షా న ఉంటూ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మొ త్తం వార్డు సభ్యులతోపాటు సర్పంచిని ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 13,095 పంచాయతీల్లో సర్పంచుల పదవులతోపాటు దాదాపు 1.31 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే.. అందులో 2,199 సర్పంచి పదవులకు, 48,022 వార్డు సభ్యులకు ఏకగ్రీవం గా ఎన్నికలు జరిగాయి. అయితే 2001 గ్రామాల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీ వంగా ఎన్నికలు ముగిశాయి. బీసీల జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లోనే ఎక్కువశాతం పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండు వేల లోపు జనాభా ఉండే గ్రామాల్లో అత్యధికం రెండు వేలు, అంతకంటే తక్కువ జనాభా ఉన్న చిన్న గ్రామాల్లో అత్యధికంగా సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ తాజాగా జిల్లాల వారీగా వివరాలను సేకరించి ఒక నివేదికను సిద్ధం చేసింది. రెండు వేలు, అంతకు తక్కువ జనాభా ఉండే గ్రామాల్లో 1,401 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్టు నిర్ధారించారు. -
పంచాయతీ పటిష్టం!
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో కొత్తగా స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు తదితర గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులను ఈ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా నియమిస్తూ.. ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం ఆరు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ స్థాయిలో అదనంగా ఎన్ని కమిటీలైనా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీలో ఉండే వార్డు సభ్యులందరినీ ఏదో ఒక స్టాండింగ్ కమిటీలో తప్పనిసరిగా సభ్యునిగా నియమించాల్సి ఉంటుంది. ఒక్కో వార్డు సభ్యుడు రెండుకు మించి స్టాండింగ్ కమిటీలలో ఉండకూడదు. ప్రభుత్వ అధికారులు, సంబంధిత అంశంలో గ్రామ స్థాయి నిపుణత ఉన్న పౌరులను ఈ కమిటీలలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవచ్చు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుగుణంగా తమ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ చట్టానికి తగిన సవరణలు తీసుకు రావడంతో పాటు, సంబంధిత శాఖ ఆదేశాలు ఇవ్వాలంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తాజాగా లేఖ రాశారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రభుత్వాలలో స్టాండింగ్ కమిటీల విధానం ఇప్పటికే అమలులో ఉంది. అయితే నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్‌లలో మాత్రమే ప్రస్తుతం స్టాండింగ్ కమిటీల విధానం కొనసాగుతోంది. మండల పరిషత్‌లలో, గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ తరహా ప్రక్రియ అమలులో లేదు. చట్ట సవరణ ద్వారా కొత్తగా గ్రామ పంచాయతీలలో కూడా స్టాండింగ్ కమిటీల ఏర్పాటు వల్ల సుస్థిర అభివృద్ధితో పాటు పనుల్లో వేగం, పారదర్శకత పెరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. ఆస్తుల పరిరక్షణ, వివిధ కార్యక్రమాల అమలు సులువవుతుందన్నారు. గ్రామ పంచాయతీల్లో స్టాండింగ్ కమిటీల బాధ్యతలు 1.జనరల్ స్టాండింగ్ కమిటీ : పంచాయతీ పాలన, గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణ, గ్రామ పంచాయతీ ఆస్తుల నిర్వహణ, గ్రామంలో రేషన్‌షాపుల పర్యవేక్షణ– కార్డుదారుల ప్రయోజనాలను కాపాడడం తదితర అంశాలు. 2.గ్రామ వైద్య, పారిశుధ్య, పోషకాహార స్టాండింగ్ కమిటీ : గ్రామ పరిధిలో వైద్య సంబంధిత, పారిశుధ్య సంబంధిత అంశాల అమలు. ఎక్కువ షోషకాలు ఉండే వాటినే ఆహారంగా తీసుకునేలా స్థానిక ప్రజలలో అవగాహన కల్పించడం. 3.ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ : గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడం. పంచాయతీ నిధుల పర్యవేక్షణ, ఆడిట్, ఇతర పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలు. 4. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ : అంగన్ వాడీ కేంద్రాలతో పాటు గ్రామ పరిధిలో విద్యా సంస్థలపై పర్యవేక్షణ, ఆయా విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు తీరుపై పర్యవేక్షించడం. 5.సోషల్ జస్టిస్ కమిటీ : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వృద్ధులు, పిల్లలు, మహిళల భద్రతకు సంబంధించిన అంశాల పర్యవేక్షణ. 6.మంచినీటి సరఫరా, పర్యావరణ కమిటీ : గ్రామంలో మంచినీటి సరఫరా, వర్షపునీటిని ఆదా చేసేందుకు తగిన చర్యలు చేపట్టడం, వ్యవసాయానికి సాగునీటి సరఫరా వ్యవస్థ పర్యవేక్షణ, మొక్కల పెంపకం తదితర అంశాలు. -
ఉపాధి హామీ బిల్లులు రెండు వారాల్లో చెల్లించండి
సాక్షి, అమరావతి: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించిన బకాయిలను రెండు వారాల్లో పిటిషనర్లందరికీ చెల్లించాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బకాయిలు చెల్లించకపోవడం పౌరులు హుందాగా జీవించే హక్కును హరించే విధంగా ఉందంది. కొందరికి బకాయిలు చెల్లించామని, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధి హామీ పనుల బిల్లులను చెల్లించడంలేదంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం మరోసారి విచారణ జరిగింది. బకాయిల డబ్బు పిటిషనర్ల ఖాతాల్లో జమ కాలేదని వారి తరఫు న్యాయవాదులు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ న్యాయవాది వడ్లమూడి కిరణ్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖర్చు చేయని నిధులు ఉన్నాయన్న కేంద్రం వాదన సరికాదన్నారు. రాష్ట్రం అడ్వాన్స్‌గా చెల్లించిన మొత్తాన్ని కేంద్రం నిధుల విడుదల సమయంలో సర్దుబాటు చేసుకుందని తెలిపారు. ఇప్పటికే బకాయిలను ఆయా పంచాయతీల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. బకాయిలను గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేసిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ, పిటిషనర్లకు బకాయిలను మాత్రం రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశించారు. -
ఏపీ: స్వయం ఉపాధిలో ‘చేయూత’ మహిళలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45–60 ఏళ్లలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత పథకం తొలి విడతలో 78 వేల రిటైల్ షాపులను మహిళలు ఏర్పాటుచేశారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తొలి విడత చేయూత లబ్ధిదారులు 1,19,000 పశువులను, 70,955 గొర్రెలు, మేకలను కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 12న వైఎస్సార్ చేయూత మొదటి విడత కార్యక్రమాన్ని అమలు చేశామని, దీనిలో మొత్తం 24,00,111 మంది లబ్ధిదారులకు రూ.4,500.20 కోట్ల మేర లబ్ధి జరిగిందన్నారు. రెండో ఏడాది 23.44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ.4,400 కోట్ల అర్థిక సాయం అందించామని మంత్రి తెలిపారు. మంచి ఆశయంతో ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ పథకాన్ని అమలుచేయడం, పర్యవేక్షించడంలో అధికారులు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన ప్రశంసించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న మార్కెటింగ్ అంశాలను అధ్యయనం చేయాలని.. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గురువారం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లపై సంబంధిత అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ఇప్పటికే రిలయన్స్, ఏజియో, మహేంద్ర అండ్ ఖేధీ వంటి ప్రముఖ సంస్థలు మహిళల వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన మార్కెటింగ్‌లో శిక్షణకు ముందుకు వచ్చాయన్నారు. వీధి దీపాల నిర్వహణలో ఏజెన్సీ విఫలం గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాలను నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీ పనితీరుపట్ల మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వీధిదీపాలకు చెల్లిస్తున్న విద్యుత్ బిల్లును తగ్గించాలనే లక్ష్యంతో జగనన్న పల్లెవెలుగు కింద రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బులను ఏర్పాటుచేశామని.. అయితే వీటి నిర్వహణలో కాంట్రాక్టింగ్ ఏజెన్సీ విఫలమయ్యిందన్నారు. పట్టపగలు కూడా వీధి దీపాలు వెలుగుతుండడంపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని పెద్దిరెడ్డి అన్నారు. వీటి నిర్వహణలో ఎనర్జీ అసిస్టెంట్లను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. ఇక పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ప్ సీఈఓ ఎన్ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్: గ్రామ కంఠాల్లోని ఆస్తులకు సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా గ్రామ కంఠాల్లో ఇల్లు లేదా ఖాళీ స్థలమున్న వారికి ఆస్తి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న వీటిని పంపిణీ చేయనుందని సమాచారం. దాదాపు 100 గ్రామ కంఠాల్లో 20 వేల నుంచి 25 వేల వరకు ఆస్తులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ధ్రువీకరణ పత్రాలు అందజేయించాలని పంచాయతీరాజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 241 గ్రామాల్లోని ఆస్తులకు మ్యాప్‌లలో మార్కింగ్.. గ్రామ కంఠాల్లో ప్రజలకు సంబంధించిన ఇళ్లు, ఖాళీ స్థలాలకు ఇప్పటిదాకా అధికారిక ధ్రువీకరణ పత్రాల్లేవు. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా ఇళ్లు, ఖాళీ స్థలాలను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో భాగంగా ఇప్పటిదాకా 753 గ్రామాల్లో సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తయ్యిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 241 గ్రామాల్లోని ఇళ్లు, ఖాళీ స్థలాలకు మ్యాప్‌లలో మార్కింగ్ చేశారు. వీటిని పంచాయతీరాజ్ శాఖకు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ సంబంధిత గ్రామాలకు వీటిని పంపిస్తోంది. గ్రామ పంచాయతీ సిబ్బంది క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతంగా ఒక్కొక్క ఆస్తిని ధ్రువీకరించుకుంటారు. ఇవి కాకుండా క్షేత్ర స్థాయిలోని అధికారులు ఏవైనా ఆస్తులను గుర్తిస్తే.. వాటి వివరాలను మ్యాప్‌కు జత చేసి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తారు. ఈ వివరాలను పరిశీలించి మళ్లీ కొత్త మ్యాప్‌లను తయారు చేస్తారు. తుది మ్యాప్‌లో గ్రామ పరిధిలోని ఒక్కొక్క ఆస్తికి ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు. పంచాయతీరాజ్ శాఖ ఒక్కొక్క ఆస్తికి.. దాని యజమాని వివరాలతో ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది. ఈ పత్రాల్లో ఆ ఆస్తికి సంబంధించిన మ్యాప్ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. 16 గ్రామాల్లో 3,170 ఆస్తుల వివరాలు సిద్ధం ఇప్పటివరకు 16 గ్రామాల పరిధిలో ఆస్తి ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ 16 గ్రామాల పరిధిలో ఉన్న 3,170 ఆస్తులకు సంబంధిత యజమాని వివరాలతో పాటు మ్యాప్‌లు సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఇతర గ్రామాల్లోనూ ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పారు. కృష్ణా జిల్లా బూతుమిల్లిపాడు పరిధిలోని గ్రామ కంఠంలో ఉన్న ఆస్తుల గుర్తింపు ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ పరిశీలించారు. -
‘ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోండి’
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార వ్యాజ్యాల్లో హైకోర్టు ప్రామాణిక రూపంలో జారీచేసే ఫాం–1 నోటీసులో అదనపు వాక్యాలు చేరుస్తూ ఇద్దరు హైకోర్టు అధికారులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ప్రామాణిక రూపానికి అదనపు వాక్యాలు చేర్చడం న్యాయస్థాన రాజ్యాంగ విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టంచేసింది. ఇందుకు బాధ్యులైన ఆ ఇద్దరు అధికారులపై సుమోటో కింద కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. పరిపాలనాపరంగా వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రార్ జనరల్‌కు స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సర్వీసు క్రమబద్ధీకరణకు పిటిషన్.. తన నియామకం జరిగిన నాటి నుంచి బిల్ కలెక్టర్‌గా తన సర్వీసును క్రమబద్ధీకరించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఎస్. భైరవమూర్తి 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. భైరవమూర్తి సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. ఈ ఆదేశాలను అధికారులు అమలుచేయకపోవడంతో వారిపై భైరవమూర్తి 2020లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్, జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఎస్వీ నాగేశ్వర నాయక్‌లను ప్రతివాదులుగా చేర్చారు. చివరకు 2021 మే 31న అధికారులు కోర్టు ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలుచేశారు. కోర్టు ఆదేశాల అమలులో జాప్యానికి డీపీఓ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ కారణమని న్యాయస్థానం తేల్చింది. కానీ, ఇందులో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదంటూ అతని పేరు తొలగించింది. అనంతరం డీపీవో, ద్వివేదీలు కోర్టు ఆదేశాల అమల్లో జాప్యానికి క్షమాపణ కోరి భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటామన్నారు. దీంతో హైకోర్టు వారిపై కోర్టు ధిక్కార కేసును మూసివేసింది. ఆ ఇద్దరు అధికారులు బాధ్యులు ప్రామాణిక రూపంలో ఉండే ఫాం–1 నోటీసులో అదనపు వాక్యాలు చేర్చడాన్ని న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తీవ్రంగా పరిగణించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులెవరో గుర్తించాలని రిజిస్ట్రార్(జ్యుడీషియల్)ను ఆదేశించారు. విచారణ జరిపిన రిజిస్ట్రార్.. ఇందుకు ఇద్దరు అధికారులను బాధ్యులుగా తేల్చారు. వారిపై పాలనాపరమైన చర్యల నిమిత్తం ఈ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రార్ జనరల్‌ను జస్టిస్ దేవానంద్ ఆదేశించారు. -
పట్టణాలకు దీటుగా పల్లెలు
సాక్షి, అమరావతి: పట్టణాలకు దీటుగా పల్లెల్ని కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్‌లు ముందుండి పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8 నుంచి వంద రోజులపాటు చేపట్టే ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాల్లో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచి వారిని భాగస్వాములను చేయాలన్నారు. ఆ రోజు ఈ స్వచ్ఛ సంకల్పం యజ్ఞాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సన్నాహక శంఖారావం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర ఎండీ సంపత్‌కుమార్, జగనన్న స్వచ్ఛ సంకల్పం ఓఎస్డీ దుర్గాప్రసాద్‌లు తాడేపల్లి కమిషనర్ కార్యాలయం నుంచి పాల్గొనగా.. ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆయా మండలంలో సర్పంచులందరూ ఈ ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి గ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలని సీఎం వైఎస్ జగన్ తపిస్తున్నందున ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకువస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 567 పల్లెలు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందడం విశేషమని పెద్దిరెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని 13,371 పంచాయతీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని విజయవంతం చేయాలని కోరారు. పరిశుభ్రతతో 95 శాతం అంటువ్యాధులు తగ్గాయి గత ఏడాది కాలంగా పంచాయతీరాజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమాలతో గ్రామాల్లో అంటువ్యాధులు 95 శాతం తగ్గినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇంటిని ఎలా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో, గ్రామాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువకావాలని సర్పంచ్‌లకు సూచించారు. 11,412 మంది సర్పంచులకు చెక్ పవర్.. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 11,412 మంది సర్పంచులకు సోమవారం నాటికి చెక్ పవర్ బదలాయింపు ప్రక్రియ పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. మరో 1,680 మందికీ ఒకట్రెండు రోజులలోనే బదలాయించనున్నట్లు తెలిపారు. అలాగే, పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,704 కోట్లను పంచాయతీల ఖాతాల్లో జమచేశామన్నారు. మంచి ఫలితాలను సాధించిన సర్పంచ్‌లు, అధికారులను ప్రభుత్వం సన్మానిస్తుందని తెలిపారు. కాగా, వైఎస్సార్ జిల్లా ఆదినిమ్మాయపల్లి సర్పంచ్ ఇందిరెడ్డి స్వాతి, కర్నూలు జిల్లా ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష, నెల్లూరు జిల్లా జమ్మలపాలెం సర్పంచ్ బి. శ్రీదేవి, ప్రకాశం జిల్లా జువ్వలేరు సర్పంచ్ ఎస్. సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. రీచ్‌ల నుంచే నేరుగా జగనన్న కాలనీలకు ఇసుక విజయవాడలో మంత్రి పెద్దరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నేరుగా రీచ్‌ల నుంచే జగనన్న కాలనీల్లో కడుతున్న ఇళ్ల వద్దకు ఇసుకను పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల రవాణా చార్జీలు తగ్గడంతోపాటు డిపోల నుంచి ఇసుకను తీసుకెళ్లే హ్యాండ్లింగ్ చార్జీలు కూడా ఆదా అవుతాయన్నారు. లేనిపక్షంలో వీటిని ప్రభుత్వమే భరించాల్సి వస్తుందన్నారు. కడుతున్న ప్రతి ఇంటికీ 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పారు. కాగా, వర్షాకాలంలో ఇసుకకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని.. నెలాఖరులోపు ఈ సీజన్‌కు అవసరమైన ఇసుకను సిద్ధం చేస్తామన్నారు. -
సర్పంచ్‌లతో నేడు మంత్రి పెద్దిరెడ్డి సమావేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ సర్పంచ్‌లతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జూలై 8 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించనున్న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమం అమలుపై ఆయన సర్పంచ్‌లతో చర్చిస్తారు. ప్రతిధ్వని పేరుతో పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున 26 మంది సర్పంచ్‌లు మంత్రితో మాట్లాడనున్నారు.